03 మార్చి 2011

ఎన్ని ప్రేమలో...


.
.
కయల్విళి : అబ్బాయిలందరూ నా వెనుక పడుతుంటే నేనేంటి వీడెనక పడి చస్తున్నాను?

నేను : అదేనేమో ప్రేమంటే

కయల్విళి : వాడికెందుకు అర్థం కాదు నా మనసు?

నేను : First నువ్వు వాడికి ఐస్-క్రీం కొనివ్వడం‌ మానుకో. వాడొప్పుకుంటే నువ్వు ఐస్-క్రీం షాపుకు తీసుకెళ్ళడం ఎక్కడ మానేస్తావో అని భయమేసి చెప్పడంలేదు.

కయల్విళి : జోకులొద్దు, భస్కర్. చూసేవారందరికీ అర్థమౌతుంది నాకు వాడంటే ఇష్టం అని. వాడికి ఎందుకు తెలియడం లేదు?

నేను : ప్రేమ గుడ్డిది అంటారు; నీ విషయంలో ప్రేమకాదు నీ ప్రేమికుడు గుడ్డివాడు.

కయల్విళి : నా తరఫున నువ్వు అడుగుతావా శివకి నామీదున్న అభిప్రాయం ఏంటో?

నేను : ఎవరిప్రేమ సంగతి వాళ్ళే కనుక్కోవాలి. ఏ విషయానికైనా మధ్యవర్తులు ఉండవచ్చుగాని, ప్రేమవిష్యంలో మధ్యవర్తులు కొంపలు ముంచే ప్రమాదం ఉంది. దయచేసి నన్నడగకు.

మధ్యవర్తిగా నన్ను ఒప్పించింది కయల్విళి. నేను కనుక్కున్నాను.
శివ : "నాకు అలాంటి ఉద్దేశం‌లేదు, భాస్కర్!"

నేను : తను నిన్ను ఇష్టపడుతుంది అన్న విషయం కూడా నీకు అర్థం కాలేదా?
(ఇలా కొన్ని ప్రశ్నలతో నిలదీస్తే)

శివ : నేనూ కయల్ నాలుగేళ్ళు కలిసి చదువుకున్నాము. తనకలాంటి భావాలు ఎందుకు కలిగాయో నాకు తెలియదు. నాలో మాత్రం స్నేహా భావమే కయల్ అంటే (అనీ ఓ పెద్ద లెక్చర్ ఇచ్చాడు)

కొన్ని రోజులు కయల్విళి ఆడ దేవదాసులా ఉండేది. ఆ బాధలోనుండి కొన్నాళ్ళకు మామూలు మనిషైంది.
.
.
.
.
2002 సెప్టెంబర్లో, కయల్విళి-సుందర్ జంటగా ఆఫీసులో అందరికీ శుభలేఖలు పంచారు. ఈ రెండో ప్రేమ గురించి ఎవరికీ అనుమానమైనా రాలేదు. సుందర్ వేరే టీం, 2యేళ్ళు సీనియర్ కూడా. వీరి మధ్య ప్రేమ ఎప్పుడు, ఎలా పుట్టిందో కూడా ఎవరికీ తెలియదు. అందరూ షాక్ అయ్యారు. పెళ్ళి సేలంలో, కయల్ వాళ్ళ ఇంట్లోనే. ఆ పెళ్ళికి మేమో పెద్ద గ్యాంగ్ వెళ్ళాం(శివ కూడా ఉన్నాడు).  బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఏదో మినిస్టర్ ఇంట్లో పెళ్ళిలా అనిపించింది. అప్పటివరకు  ఎవరికీ తెలియదు, కయల్విళి బాగ కలిగినవారి ఇంటీ అమ్మాయని. రిసెప్షన్ అయిపోయాక మళ్ళీ విడిది గ్రహాలకు వెళ్ళాము. అందరు నిద్రపోయారు. మర్నాడు ఉదయం ముహూర్తం. ఆ రాత్రంతా శివ నిద్రపోలేదు. ఏడుస్తూనే ఉన్నాడు. డాబాపైకి వెళ్దాం అన్నాడు.  "మనం ముహూర్తానికి అటెండ్ అవ్వద్దు, భాస్కర్. బెంగుళూరు వెళ్ళిపోదాం... ప్లీస్. " అని వాడి గోడు మొదలుపెట్టాడు. "నేను ఈ పెళ్ళి చూడ్లేను" అన్నాడు. నాకర్థం అయింది. ఆ నిమిషం ఇది సినిమా అయ్యుంటే ఎంత బాగుండు? శివకి-కయల్ కీ పెళ్ళైయేది చివరిలో...
నేను : మరి ఆ పిల్ల అంతలా వెంటపడిందిగా అప్పుడెందుకు చెప్పలేదు?

శివ : గమనించావా? భోజనం రెండు చోట్ల వడ్డించారు?

నేను : లేదు, నేను చూడలేదు.

(డాబపైనుండి ఇంకో భోజనాల పందిరి కనబడింది!!!)

శివ : మెయిన్ పందిరికి దూరంగా మరొక్క చోట కూడా భోజనాలు పెట్టారు. అది ఈ ఊర్లో ఉన్న మా కులం వారికి. పెళ్ళి భోజనాలకే వేరే పందిట్లో వడ్డించారు మా కులంవారికి, అటువంటిది నేను వీళ్ళ ఇంటికి అల్లుణ్ణి ఎలా కాగలను?నాది కూడా ఈ ఊరైయుంటే నాకూ దూరంగా ఉన్న పందిట్లోనే భోజనాలు పెట్టుంటారు.

 నేనేం మాట్లాడలేదు. అలానే కూర్చుండిపోయాను. ఎప్పుడో నడిఝాము దాటాక కిందకొచ్చి పడుకున్నాము. తను చాలాసేపు మేలుకునే ఉన్నాడేమో. ఉదయం లేచినపుడు శివ నిద్రపోతున్నాడు. మేమందరం వెళ్ళి ముహూర్తం అటెండ్ అయ్యొచ్చాము. శివని లేపి పెళ్ళైపోయింది అంటే, కాసేపు విలపించాడు. అందరం బెంగుళురికి తిరిగొచ్చాము. ఆరు నెళ్ళకి  సుందర్ కి Canada లో జాబ్ వచ్చింది. సుందర్-కయల్విళి ఉద్యోగం మానేసి Canada వెళ్ళిపోయారు. శివ మరో సంవత్సరం ఉద్యోగం చేసి డబ్బులు కూడబట్టుకుని  పై చదువులకోసం అమెరికా వెళ్ళిపోయాడు.

ఇలా ఎన్ని  ప్రేమలో, కులమతాల సుడిగాలికి  మొగ్గలుగానే రాలిపోయేవి?

P.S కయల్విళి (Kayalvizhi) అంటే అర్థం మీనాక్షి  అని!


===============X==============

6 వ్యాఖ్యలు:

kiran చెప్పారు...

hmnnnnnnnnnnnnnn...................
ఆ ప్రేమికుల బాధ వర్ణనాతీతం కదా ..!!:(
ఇలా ఎన్ని ప్రేమలో, కులమతాల సుడిగాలికి మొగ్గలుగానే రాలిపోయేవి? (బోలెడు...:))

Avineni Bhaskar చెప్పారు...

@kiran - ఆ ప్రేమికుల బాధ వర్ణనాతీతం కదా ..!!:(
You are right! ఆ బాధను మాటల్లో అసలు రాయలేం!
ఏ కారణం చేతనైనా, ఇలా రాలిపోయే మొగ్గల్ని చూస్తే, ఆ మొగ్గలుపడే అంతే బాధ నాలోనూ ఆవహిస్తుంది...

భూమిపై మనుషులున్నంత కాలం ప్రేమా ఉంటుంది, అందులో కొన్ని ఏవేవో కారణాలవల్ల విఫలమైపోతూను ఉంటాయ్ :-(

కొత్త పాళీ చెప్పారు...

Wow - I think in the end, both of them are better off. I commend Siva's realistic outlook.

ఆ.సౌమ్య చెప్పారు...

hm how sad :(

వాళ్ళ ప్రేమ ఫైల్ అయినందుకు కాదుగానీ ఆ విడిగా పెట్టిన భోజనాలను చూసి ఆ అబ్బాయి మనసు ఎంత కష్టపడి ఉంటుందో ఊహిస్తుంటే చాలా బాధగా ఉంది. ఈ కాలంలో కూడా ఇటువంటివి...చ, దారుణం!

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

సౌమ్యా,
ఆ విడిగా భోజనాలు పెట్టిన విషయం నేను మొదట గమనించలేదండి.. అతను చూపించినప్పుడు మాత్రం చాలా బాధేసింది :(

అయితే ఆ అమ్మాయికి అలాంటి పట్టింపులు అసలు లేవ్వు!

అజ్ఞాత చెప్పారు...

ఏది కథో ఏది నిజమో అర్థం కావటం లేదు భయ్య,....ఇంతకి ముందు కొన్ని పోస్ట్లు నిజంగా జరిగిన సంఘటనలు అనుకున్నా ఇద్ కథ అనుకుంటే నిజమైన అనుభవం లా ఉందిరాయటం మాత్రం భలే రాస్తున్నారు ...మీ రచనా శైళి బాగుంది,ఈ పోస్ట్ లో శివ ప్రేమని దాచుకుని లాస్ట్ లో ఎడ్వటం బాద గా ఉంది ఇలాంటి విఫల ప్రేమలు అమరం అవుతాయి