20 మార్చి 2014

ప్రేమ డైరీ - 003

చిన్నా,

నువ్వు కేవలం ఒక గొంతువా?
 
నాకు నేను కల్పించుకున్న భ్రమవా, మాయవా?

అచ్చం నిజంలా అనిపించే ఒకట్రొండు రోజుల కలల్లో మాత్రం సరిగా చూసేలోపే కనుమరుగయ్యే రూపానివా?

నేన్నిన్ను చూడటం, నేరుగా మాట్లాడ్డం అన్నీ కల్పనలు, ఊహలు కదా?
 
ఏ లోకం నుండో నన్ను రోజూ పలకరించే ఆకాశవాణివా? ఇంతకీ నువ్వు అబద్ధమా, నేనా?


నీ ఫోటోని పదే పదే చూసుకుంటూ ఉన్నాను. జలజల రాలిపోయే కన్నీళ్ళనేం చేసుకోను? నీ వేళ్ళెక్కడ?

ఈ ఫోన్ స్క్రీన్ ఏం పుణ్యం చేసుకుందో? నీకివ్వాల్సిన వాటా అంతా నా పెదవులు అప్రయత్నంగా ఈ ఫోన్ స్క్రీన్ మీద కుమ్మరించేస్తున్నాయి.

నిన్నెప్పుడు చూస్తాను? నిన్నెప్పుడు దగ్గరకి తీసుకుంటాను?

* * *
 
తంగమ్మా,
నువ్వూ అబద్ధం కాదు, నేనూ అబద్ధం కాదు. భౌతికమైన దూరం అలాంటొక భ్రమని, మాయనీ కలిగిస్తుంది. ఈ వీకెండ్ మేము ఊరికి వస్తున్నాము. ఈ శనివారం నీ స్కూల్ కి సెలవుంటే బాగుండు. ఇక్కణ్ణుండి నీకు ఏం తీసుకురమ్మంటావు? 

* * * 


చిన్నా
నిజమా? నువ్వొస్తున్నావా? వచ్చినా ఏంలాభం? మనకి ఏకాంతం దొరకదుగా? అందుకే అంటాను నిజమైన నువ్వు నాకు అబద్ధం అని. నీ అబద్ధమే నాకు నిజం. నువ్వు నిజంగా ఇక్కడికొస్తే I miss your అబద్ధాలు which are relatively true and permanent for me. అందుకే భయం అన్నాను నిన్న.

నువ్వు రావడంకంటే నాకేం కావాలి? అయినా ఒకటి కావాలి నాకు... మొన్న మెరినా బీచ్ లో ఆడుకుంటూ వర్ష నీ ఒడిలో పోసిన ఇసుక తీసుకురా దాచుకుంటాను.

* * *

10 మార్చి 2014

ప్ర్రేమ డైరీ - 002

బుజ్జి బంగారూ,
ఏం చేస్తున్నావు? నిన్నట్నుండి సరిగ్గా మాట్లాడటం వీలు కుదరలేదు. ప్రాణాన్నేదో తొలిచేస్తున్నట్టు ఉంది.

లోలోపల ఏదో జ్వరం వచ్చినట్టు ఉంది ఈ బెంగ. నీ ఒడిలో తలవాల్చి కాసేపు ఏడవాలనిపిస్తుంది. ఎందుకంటావా? నీ వేళ్ళతో తల నిమురుతావని.

కళ్ళలోకి చూస్తూ కాసేపు కబుర్లు చెప్పుకోవాలనుంది! ఫొన్ లో మాట్లాడటానికే కుదరదాయే ఇక ఇవన్నీ కూడానా? అని నవ్వొస్తుంది నా పిచ్చికి.

ఈ పాటికి నిద్రలోకి జారుకుని ఉంటావు. నిద్రపోయేప్పుడు నువ్వెలా ఉంటావో! పెదవులమీది చిరునవ్వు చీకట్లోకూడా మెరుస్తూనే ఉంటుందా? మేలుకుని ఉన్నప్పుడైతే నా తలపులవల్ల పూసిన మెరుగనుకుంటాను. మరి నిద్రలో? ఓ నా గురించి కలలుకంటున్నావా? ఎలా ఉంటుంది నీ కలలప్రపంచం? నన్ను కాస్త తొంగిచూడనివ్వవూ?

ఏ పువ్వులవనంలో నా తలపుల సీతాకోకల వెంటబడి తిరుగుతుంటావో

ఏ ఏటివొడ్డునో తడి ఇసుకలో నిన్నాటపట్టిస్తూ పరుగుతీసిన నన్ను పట్టుకోవాలని నా వెనుక పరుగెత్తి అలసిపోయి గసపోస్తుంటావో

ఏ మసక సంధ్యవేళో నన్ను కలుసుకుని నీ వేళ్ళని నా వేళ్ళకిచ్చి, ప్రపంచాన్ని చీకట్లో వదిలెళ్ళిన సూరీడికి పోటీబడే నీ జత కళ్ళతో నా ప్రపంచాన్నిమాత్రం వెలుగుపరుస్తుంటావో

ఏ వానకాలంలోనో కోకిలలు మూగబోయాయని తియ్యని గొంతుతో ప్రియరాగాలాలపిస్తూ నాకు వీనుల విందులు చేస్తావో!
------------------

06 మార్చి 2014

ప్రేమ డైరీ - 001


నాలుగు రోజులైంది నీ గొంతు విని. ఎలా ఉందో చెప్పలేను. నీ ఎసెమ్మెస్ చూశాను కానీ నీకు రిప్లయ్ పంపలేదు. ఎప్పుడేమవుతుందో, ఎవరైనా చూస్తారేమో అని. చూసినా పెద్ద ఇబ్బంది కాదంటావు; కాంటాక్ట్ నేమ్ నళిని అని ఉండటంవల్ల. నాకైతే అదే ఇబ్బంది.
ఇవాళ సాయంత్రం హాస్పిటల్ లో వర్షకి సలైన్ పెట్టారు. అది చూసి అనుకున్నాను... నిన్ను ద్రవపదార్థంలా మార్చుకుని నా నరాల్లోకి ఎక్కించుకునే వీలుంటే ఎంత బాగుండో అని!

నీ గొంతువినక గుబులుగా ఉంది... అప్పుడొక రోజు ఫోన్ లో నువ్వు గుసగుసగా మాట్లాడుతుంటే ఆ మాటలెంత నచ్చాయో. తర్వాత చెప్పావు నువ్వు చీరమార్చుకుంటూ మాట్లాడావు అందుకే అలా అని. ఆ గుసగుస మాటల గొంతు కావాలి నాకు. నా చెపులకి దగ్గరగా నీ ఊపిరి తాకుతూ ఉండగా నీ మాటలు వినాలి - జీవితాంతం! 
పోయినాదివారం నేను ఊర్లో ఉన్నప్పుడు చీరలో చాలా బాగున్నావు. నలిగినా ఫరవాలెదు అనుకుని.. నిన్ను గట్టిగా కౌగిలించుకునుంటాను చుట్టూ జనం లేకుంటే! అందం నీదా ఆ చీరదా? నీదే కాబోలు. పండగ రోజు గుడి దగ్గర పువ్వులు గుచ్చుతూ మామూలు బట్టల్లో ఉన్నావుగా అందులోనూ ఎంతగానో నచ్చావు! అలంకారాలేవీ లేకుండ సాదాగా ఉంటావు ఎప్పుడూ. ఆ సహజత్వం వల్ల వచ్చిన అందమో,  మనస్పూర్తిగా నిమగ్నమై పువ్వులు గుచ్చేతీరు వచ్చిన కళో తెలీదు! నల్ల చున్నీ వల్లెవాటు వేసుకునున్నావు. ఒడిలో తలపెట్టుకోవాలనిపించింది. 
ఒకరికొకరం అందకుండ ఎందుకింత దూరంగా ఉంటాము? "పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా?" అని ఒక పాట ఉంది... అలా... ఆలస్యం చేసేకొద్దీ అపురూపమైన కాలం ఎన్ని ఏళ్ళు వృధాగా జారిపోతుందో మన దోసిట్లోనుండి! ఇలా దూరంగా ఇంకా ఎన్నేళ్ళు జారవిడుస్తానో నిన్ను. నిన్ను ఎత్తుకెళ్ళిపోడానికి మార్గాలు ఆలోచిస్తుంటే ఎన్ని విషయాలు భయపెడుతున్నాయో చెప్పలేను! 
ఆయుషైనా తగ్గిపోతే బాగుండు. ఇలా వేగలేకున్నాను కాలంతో....
---------------------
06 March 2014