09 డిసెంబర్ 2011

పరమార్థం – తెంచుకోవడంలోనే!


పదహారో వసంతంలో పుట్టే  పరువపు ఆకర్షణ కాదిది!
ఒకరి శ్వాసలు మరొకరికి తగిలేంతదూరాల్లో దగ్గఱైనవేళ
మైమరచి పరవశించే పాతిక వయసూ కాదిది!
బ్రతుకు సూరీడు పడమటికి పరుగులు తీస్తున్న ప్రాయమిది!

పిలవని చుట్టంలా -
ఏదీకాని ప్రాయంలో ఎందుకొచ్చినదో తెలియని బంధమిది!

జీవితాన్ని సుప్తావస్థలో జీవించిన మన మనసులను
హఠాత్తుగా జాగృతస్థితిలోకి చేర్చిన నిముషమేదో.

ఏడాదంతా వేసంగితో శపించబడిన జీవితాల్లోకి
నిత్య శీతాకాలం చొరబడిన నిముషమేదో తెలియదు.

చీకట్లు నిట్టూర్చిన జీవితాల్లోకి - పండు వెన్నెలలు!
కలతల మేఘాలు కమ్మిన ఆకాశానికి - అరుణతేజం!

అభిరుచులు కలవడంతో ఇది ఆరంభం!

మన ఇద్దరికీ లింగభేదంలేకుంటే -
ఈ బంధం చిక్కటి స్నేహమై ఆదర్శమయ్యేది
ఇప్పుడిది స్నేహమైతే కాదు; ప్రేమ అంతకంటే కాదు
రెంటికీమధ్య పేరులేనిది!

జంటకట్టుకుని స్వతంత్రపు ఆకాశాన్ని ఆస్వాదించలేము
చెట్టాపట్టాలేసుకుని ప్రపంచం మరచి పరుగిడలేము
సంప్రదాయపు పంజరాల్లో బంధింపబడ్డ పక్షులం!

నా జీవితవీణలో నీ రాక ఏ తీగను మీటిందో
నిత్యం నాకు ఆనందభైరవి రాగాలే!
నీ బ్రతుకు ఎడారిపై ఏ అమృత చినుకులు కురిపించానో
నిత్యం నీ మనోవనంలో వసంతాలే!

నువ్వుమీటిన రాగాలతో నా జీవితమూ
నా ప్రవాహంతో నీ జీవితమూ - పరమార్థమైనవి!

కాలం పదేళ్ళు ఆలస్యం చేసింది,
మనల్ని పరిచయం చేయడంలో!
మన కుటుంబాలకొరకు ఈ బంధాన్ని
తెంచుకోడానికి మనం ఆలస్యం చెయ్యొద్దు!

==============================

P.S ఏడాది క్రితం రాసిన కవిత ఇది. తెలిసిన ఒక పెద్దాయన చెప్పిన తన కన్నీటి కథను కవితగా రాశాను.