17 అక్టోబర్ 2012

మారాకు వేసిన జీవితం

మా ఊళ్ళో ఉన్నవి రెండు వీధులే; ఎగవీధి, దిగవీధి. బస్సు రోడ్డు నుండి ఊరు ఒక ఫర్లాంగు దూరం లోపలికి ఉంటుంది. దక్షణంగా ఒక మైలూ, పడమటి దిశలో రెండుమైళ్ళ వరకు పొలాలు! పొలాలకానుకుని కొండలు. కొండలు ఆంధ్ర రాష్ట్రానికి చెందినవి. అవే ఊరికి పొలిమేరలయ్యాయి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనుకునున్న మా జిల్లాలో చాలా ఊళ్ళు తెలుగు వారివే! కొన్ని ఊళ్ళలో తెలుగువారూ తమిళవారూ కూడా ఉన్నారు. మా ఊళ్ళో మొత్తం ముప్పై ఇళ్ళున్నాయి. అందరూ తెలుగువారే. ఒకప్పుడు "గోగినేనివారిపల్లె" గా ఉన్న ఊరు ప్రస్తుతం "గోగినపల్లి" అయిపోయింది.

అందరికీ సమృద్ధిగా పొలాలున్నందువల్లనో ఏమో నిన్నటి తరంలో ఐదుగురు తప్ప మిగిలినవారెవరూ ఉద్యోగాలు చెయ్యలేదు. అందరూ వ్యవసాయం చేసుకుండిపోయారు. ఇప్పటి తరంవాళ్ళలో ఒకరిద్దరు మాత్రమే సేద్యం చేసుకుంటున్నారు. మిగిలినవారందరూ ఏ ప్రభుత్వ ఉద్యోగమో, మెడ్రాస్, బంగుళూరు పట్టణాలలోనో, విదేశాల్లోనో ఉద్యోగాలు చేస్తున్నారు. నేను పుట్టిపెరిగింది ఇక్కడే. ప్లస్ టూ వరకు ఇక్కడే ఉండి చదువుకున్నాను. ఊళ్ళో అందరూ అందరికీ బంధువులే. అందర్నీ వరసలుపెట్టి పలకరించుకుంటారు.

ఊరికి ఆగ్నేయంగా కొంత దూరంలో పొలాల మధ్య ఏటిగట్టుకానుకుని ఒక ఇల్లుంది. కొబ్బరి, మావిడి, చింత, సీమతంగేడు, బాదం, సీమచింత, కానుగ, వేప మాన్ల మధ్యనుంటుందాయిల్లు. ఆ ఇంట్లో సుశీలత్త ఒక్కత్తే ఉంటుంది. సుశీలత్త కొడుకూ, కూతురూ హాస్టల్ లో చదువుకుంటున్నారు. ఊళ్ళో ఎవరూ ఆ ఇంటికెళ్ళరు. ఎవరూ ఆమెతో మాట్లాడరు. అత్త అక్కడికి వచ్చిన కొత్తలో ఊళ్ళో జనం "కొంపలు కూల్చిన ముండ" అని గుసగుసలాడుకునేవారు. క్రమేణా అదే ఆమె పేరుగా మారిపోయింది.

సుశీలత్త గురించి తెలుసుకోవాలంటే ఇరవైయేళ్ళు వెనక్కెళ్ళాలి.

***

అప్పుడు నాకు ఆరేళ్ళు. తిరుమల నెల మూడో శనివారం తళిగ కోసం అమ్మా, పిన్నమ్మా పూజకు వంటలు తయారు చేస్తున్నారు. తెల్లవార్నుండి ఒకపొద్దుండటంవల్ల అందరికీ ఆకలి. తాత స్నానానికి మంగమ్మవ్వ నీళ్ళు తోడిపెట్టింది. ఎగవీధినుండి జనాలు అరుస్తున్న కేకలు వినబడ్డాయి. స్నానానికి వెళ్ళకుండ తాత పెరటి దారిలో ఎగవీధివైపు పరుగుతీశాడు. వెనకనే నేను పరుగెత్తుకుంటూ వెళ్ళాను. జగడం ఎక్కడో కాదు అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందే! ఎవరో కొత్తవాళ్ళు కొందరు కట్టెలు పట్టుకుని కనబడినవాళ్ళందర్నీ కొడుతున్నారు. అప్పటికే నాన్న మరోవైపునుండి వచ్చి వాళ్ళను అడ్డుకుని వెనక్కి తోశాడు. వచ్చినవాళ్ళలో ఒక పెద్దాయన గట్టిగా బూతులు తిడుతున్నాడు. తాతయ్యా, నేనూ వెళ్ళేసరికి నాన్న వచ్చిన వారి చేతి కర్రలు పీకి పడేశాడు.

వచ్చినవాళ్ళలోని పెద్దాయన తాత దగ్గరికి వేగంగా వచ్చి, "వెంకటప్పా, నీ అల్లుడు ఏం ఘనకార్యం చేసినాడో అడుగు? మా ఇంటి పరువు తీసినాడు. పెళ్ళయింది, పిల్లాజల్లున్నారు, బంగారంలా భార్యుంది; సరిపోదని నా కోడలు కావలసొచ్చిందా వీడికి?" అని అరిచాడు. 

అక్కడ ఏం జరుగుతుందో అర్థమయ్యే సరికి కొంత సమయం పట్టింది తాతకి. అప్పటికే ఊళ్ళో జనమంతా పోగయ్యారు. అమ్మా, పిన్నమ్మ కూడా వచ్చేశారు; వాళ్ళు నేరుగా ఇంట్లోపలికెళ్ళిపోయారు. అమ్మమ్మా, అత్తా గట్టిగా ఏడుస్తున్నారు. అమ్మ వాళ్ళను ఓదారుస్తూ, "ఇంతకీ రమేషెక్కడ?" అని అడిగింది. "చదువుకున్నోడు ఉద్యోగానికి పోతున్నాడనుకుంటే ఇలా ఉంపుడుగత్తెను చూసుకుంటాడని ఎవరికి తెలుసు? ఈ మనిషికి ఏం తక్కువ చేశాను నేను?" అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది రేవతత్త.

కొద్దిసేపట్లో జీప్ లో ఇద్దరు పోలీసు వాళ్ళూ, రమేష్ మామా దిగారు. పోలీసులను చూడగానే వచ్చినవాళ్ళు కొంచం భయంగా నిల్చున్నారు. "కొడుకూ కొడుకూ అని నెత్తిమీద పెట్టుకుని పెంచి చదివించి పెద్ద చేస్తే నువ్వు చేసే యవ్వారం ఇదారా?" అని కోపంగా అరుస్తూ లోపల్నుండి పొరక్కట్ట తీసుకుని అమ్మమ్మ బయటికొచ్చి మామని కొట్టింది. అమ్మా, తాతా అడ్డుకున్నారమ్మమ్మని. మామ ఏమీ మాట్లాడలేదు. గమ్మున నిల్చున్నాడు. రేవతత్త మామని బూతులు తిట్టడం మొదలుపెట్టింది.

పోలీసు వాళ్ళు వచ్చినవారితో ఏదో పంచాయితీ చేస్తున్నారు. తాత, ఊళ్ళోని మిగిలిన మగాళ్ళూ అందరూ చేరి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. తాతా, అమ్మా, నాన్నా అమ్మమ్మ వాళ్ళింటి అరుగుమీదే కూర్చున్నారు. అక్కనీ, నన్నూ పిన్ని ఇంటికి తీసుకొచ్చేసింది. తళిగ వేసి పూజలేవి చెయ్యకనే మాకు అన్నంపెట్టి తానూ తిని మమ్ముల్ని మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండమంది. సాయంత్రం చిన్నాన్న వచ్చాడు. ఆయనతో జరిగినదంతా గుసగుసా చెప్పింది. కాసేపట్లో చిన్నాన్నకూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారేమో. రాత్రి భోజనాల సమయానికి అందరూ తిరిగొచ్చారు. ఎవరూ ఏం మాట్లాడలేదు. ఇల్లు నిశబ్ధంగా ఉంది.

కొన్నిరోజులకి ఆ విషయం పాతబడిపోయింది. ఒకరోజు సాయంత్రం అందరం భోజనాలు చేసి తాత రోజూ చెప్పే భారతం కథ వినడానికి సిద్ధమవుతున్నాము. రమేష్ మామ కొడుకు, సతీష్ ఇంటికొచ్చి, "తాతా! మా నాన్నమ్మ నిన్ను తీసుకు రమ్మంది" అన్నాడు. "ఎందుకట్రా?" అని అమ్మవాణ్ణి అడిగితే "నాకు తెలియదత్తా. నాన్న ఎవరినో తీసుకొచ్చాడు. అమ్మా, నాన్నమ్మా ఏడుస్తున్నారు" అన్నాడు. వెంటనే తాతా, అమ్మా, నాన్నా వెళ్ళారు. పిన్ని సతీష్ ని పట్టుకుని, "ఏమైనా తిన్నావారా?" అనడిగింది. వాడు అడ్డంగా తలూపాడు. "సరె, తినిక్కడే పడుకో" అని అన్నం పెట్టింది. చిన్నాన్న నేనూ వెళ్తానన్నాడు. పిన్ని వెళ్ళద్దు అని గట్టిగా చెప్పేసింది. మంగమ్మవ్వ అరుగుమీద కూర్చుని తనలోతానే ఏవో మాట్లాడుకుంటోంది. మేము నిద్రపోయాము. వెళ్ళినవాళ్ళు ఎప్పుడొచ్చారో తెలియదు.

మర్నాడు సతీష్‌తోపాటు అమ్మమ్మవాళ్ళ ఇంటికెళ్తే కొత్తగా ఒకావిడున్నారు. అక్కడ వాతావరణమంతా నిశబ్ధంగా ఉంది. రేవతత్త ఎప్పట్లా కాకుండ ఏడుపుముఖంతో కనబడింది. ఎప్పుడూ అలా చూళ్ళేదు రేవతత్తని. పల్లెటూర్లో మనిషిలా ఉండదస్లు. ఏ సినిమా నటో అన్నంత అందంగా ఉండేది. చెదిరిన జుట్టు, ఉబ్బిన కళ్ళతో ఏదోలా ఉంది. ఎవర్నో తిడుతూ సతీష్ ని గుండేలకేసి హత్తుకుంది. అక్కడుండలేక కాసేపటికి సతీష్ ని తీసుకుని ఇంటికి వచ్చేశాను.

అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కొత్తగా వచ్చినామెగురించి ఊర్లో ఏవేవో అంటున్నారు. ఒకరోజు "ఆ మొగుణ్ణి విడిచిపెట్టిన దాన్ని  తరిమేయకుండా, ఇక్కడే కొంపేసి మా తమ్ముడితో కాపురంపెట్టిస్తారా?" అని మా అమ్మ నాన్నతో గొడవపడింది. నాన్న ఏవో చెప్పి సమాధానపరుస్తున్నాడు. "మీరు బయటెళ్ళి ఆడుకోండి" అని పిన్ని మమ్ముల్ని అక్కణ్ణుండి పంపించేసింది. కొన్ని రోజుల్లో రమేష్ మామ ఊరికి అవతలున్న పొలంలో గుడిసె వేసి కొత్తామెను అక్కడ పెట్టాడు. మా పొలానికి వెళ్ళాలంటే ఆ గుడిసె దాటెళ్ళాలి. వెళ్ళేప్పుడు నేను ఆ గుడిసె వైపు చూస్తూ వెళ్ళేవాణ్ణి. ఒక్కోసారి ఆ కొత్తామె ఏవో పనులు చేస్తూ గుడిసె బయట కనిపించేది. దూరంనుండి ఆమెను చూస్తూ వెళ్ళేవాణ్ణి. ఒకవేళ ఆమె నన్ను చూస్తే నేను తల తిప్పుకుని వెళ్ళిపోయేవాణ్ణి. 

దసరా సెలవులప్పుడు ఒక రోజు బోర్‍వెల్ వేస్తున్నారు ఆ గుడిసె దగ్గర. పిల్లలందరూ ఆ బోర్‌వెల్ లారి దగ్గర చేరారు; నేనూ టిఫిన్ తిని వెళ్ళాను. అక్కడ నాన్నా, రమేష్ మామ నిల్చుని మాట్లాడుకుంటున్నారు. నేను అక్కడికి వెళ్ళాను. మామ నన్ను పిలిచి ఆ గుడిసె వైపు చెయిచూపి తాగు నీరు తీసుకురమ్మన్నాడు. నాకు ఆశ్చర్యం! వెళ్ళాలో వద్దో తెలియక జంకుతున్నాను. నాన్న, "పో, నీళ్ళు తీసుకురా" అన్నాడు. వెళ్ళి ఆ గుడిసె ముందు ఆవిడని చూసి బెరుకుగా నిలబడ్డాను, 

"రా! కూర్చో" అని బల్ల వైపు చూపించింది.

"మామ నీళ్ళు తెమ్మన్నాడు" అన్నాను. లోనికెళ్ళి నీళ్ళచెంబుపట్టుకొచ్చి చేతికిచ్చింది. మామకి నీళ్ళిచ్చి ఖాళీ చెంబు పట్టుకుని మళ్ళీ గుడిసెదగ్గరకెళ్ళాను. ఈ సారి లోనికి రమ్మంది.

"నీ పేరు సూర్య కదూ? ఏం చదువుతున్నావు" అని వంగి నన్ను హత్తుకుని ముద్దుపెట్టుకుంది. బుగ్గలు తుడుచుకున్నాను. ఏవో ఇంటి పనులవి చేస్తూ నన్ను మాట్లాడిస్తూనే ఉంది. "బోర్ కొడితే ఇవి చదువు" అని కొన్ని చందమామ పుస్తకాలు తెచ్చి ఇచ్చింది. తీసుకుని "నాకు తెలుగు రాదు; బొమ్మలు చూస్తాను. 'అంబులిమామ' చదువుతాను" అన్నాను. (అంబులిమామ అరవ చందమామ). 

"కుమార్రాజుపేట స్కూలే కదా? మరెందుకు తెలుగు రాదు?"

"అవును! తెలుగు సెక్షన్ కాదు; నేను అరవ సెక్షన్ లో చదువుతాను. అక్క తెలుగు సెక్షన్" అన్నాను.

"తెలుగు నేర్పలేదా మీ తాత?"

"తాతే చదివి వినిపిస్తాడు; అర్థం అవుతుంది నాకు" 

"నేర్చుకోవా?"

"నువ్వు నేర్పుతావా?"

"నన్ను 'సుశీలత్త' అని పిలువు నేర్పుతాను"

"సరే"

కాసేపటికి అక్కణ్ణుండి బోర్‌వెల్ లారీ దగ్గరకొచ్చాను. బోర్‌వెల్ లో నీళ్ళు వస్తున్నాయి. మధ్యాహ్న వేళకు నాన్న వేలుపట్టుకుని ఇంటికొచ్చాను. అమ్మ కోపంగా ఉంది! రమేష్ మామ కి నాన్నవల్లే ఇంత ధైర్యం అనీ; బోర్‌వెల్ వేయడంలో నాన్న సపోర్ట్ చేస్తున్నారని నాన్నతో గొడవేసుకుంది. నాన్న ఏవో చెప్పాడు. అమ్మ సణుగుడు ఆపలేదు.

కొన్ని రోజుల్లో ఆ గుడిసె పక్కన మిద్దె ఇల్లు కట్టేపనులు మొదలుపెట్టాడు రమేష్ మామ. నేను ఖాళీ సమయాల్లో అక్కడికెళ్ళేవాణ్ణి. ఇల్లు కట్టేపనులవి చూస్తూ సుశీలత్తతో మాట్లాడుతు ఉండేవాణ్ణి. ఇల్లు పూర్తయింది. మా ఊళ్ళో ఎవ్వరికీ అంత కొత్త, అందమైన ఇల్లు లేదు. రమేష్ మామ అంత అందంగా కట్టాడు. ఆ ఇంట్లో అత్త ఒక్కత్తే ఉండేది. అప్పుడప్పుడు రమేష్ మామ వచ్చేవాడు. చదువుకోడానికి ప్రత్యేకంగా మేడపైన గది కట్టించాడు. రూమ్ మధ్యలో చెక్క ఉయ్యాల. అప్పుడర్థమయింది అత్త ఎన్ని పుస్తకాలు చదువుతుందో. ఇంగ్లీషు, తెలుగు, అరవ.. వందలకొద్ది పుస్తకాలు.

"అత్తా, నువ్వేం చదివావు?"

"బీ.ఎస్సీ అగ్రీకల్చర్ చదివాన్రా; కోయంబత్తూర్లో."

అత్త పనివాళ్ళ చేత మామిడి మొక్కలు అంట్లు కట్టించేది. మామిడి అంటు కోసం ఎక్కడెక్కడి నుంచో ట్రాక్టర్లలో వచ్చి కొనుక్కువెళ్ళేవారు. ఎప్పుడూ సందడిగా ఉండే ఆ ఇంటి పరిసరాల్లో నాకు పొద్దు తెలిసేది కాదు.

సెలవు రోజుల్లో సుశీలత్తతో కబుర్లు చెప్తూ, వింటూ మధ్యాహ్న భోజనం వాళ్ళ ఇంట్లోనే తినేసేవాణ్ణి. అత్త చేతి వంట నాకు బాగా నచ్చేది. పత్రికల్లో వచ్చే వివిధరకాల కొత్త వంటకాలు చేసేది అత్త. ఒక రోజు సాయంత్రం ఇంటికి రాగానే "మరోసారి అక్కడకి వెళ్ళినా, భోంచేసినా చంపేస్తాన్రా" అని అమ్మ తిట్టింది. ఏడుస్తూ తాత దగ్గరకి వెళ్ళి చెప్పాను. 

"ఎందుకెళ్తావు అక్కడికి? ఊర్లో ఇంతమంది పిల్లలున్నారుకదరా; వాళ్ళతో ఆడుకోవచ్చుకదా?" అనడిగాడు.

"నాకు ఆటలిష్టంలేదు, తాతా! అత్త బోలెడు కథలు చెప్తుంది." అని మొరాయించాను.

"అమ్మ మాట వినాలి నాన్నా. అమ్మ వద్దన్నపనులు చేయకూడదు కదా?"

"నాకు ఈ అమ్మ నచ్చలేదు తాతా. ఎప్పుడూ నన్ను తిడుతూ ఉంటుంది." అని పరుగుతీశాను.

అప్పట్నుండి అమ్మకు తెలియకుండ వెళ్ళేవాణ్ణి. భోజనం సమయానికి ఇంటికి వచ్చేసేవాణ్ణి. సుశీలత్త తినమంటే వద్దనేసేవాణ్ణి. అత్త ఒకరోజు బలవంతంగా తినమని అడిగితే "మా అమ్మ ఇక్కడకి రాకూడదు, తినకూడదు అంది. తాతకూడా అమ్మ మాట వినమన్నాడు" అన్నాను.

"అవునా... నీకేమనిపిస్తుంది?"

"నాకు ఇక్కడికి రావాలనిపిస్తుంది"

"నీకనిపించినది నువ్వు చెయ్. ఇప్పుడే కాదు నీ జీవితమంతా అలానే ఉండు. నీకు చెడేది మంచేదని తెలుసుకాబట్టి నీకు నచ్చిన మంచిపనులే చెయ్; ఎవరికి నచ్చినా నచ్చకపోయినా! సరేనా?"

"అలాగే అత్తా" అని ఆ రోజు భోజనం అత్తతోనే తిన్నాను. సాయంత్రం ఇంటికొచ్చేసరికి రేవతత్త అమ్మతో ఏవో చెప్పి ఏడుస్తోంది. అమ్మ ఎవరినో గట్టిగా తిడుతూ అత్తని ఓదారుస్తోంది. నన్ను చూడగానే కోపంగా పిలిచింది. చెవ్వు పట్టుకుని పిండేస్తూ "చెప్పానా? అక్కడికి వెళ్ళకూడదని? ఎన్నిసార్లు చెప్పినా వినవా? అన్నీ మేనమామ బుద్ధులొచ్చాయ్ నీకు" అని తిట్టింది. నాకు బాధేసింది. ఈ రేవతత్తమీద చాలా కోపంవచ్చింది; ఈమేవచ్చి అమ్మతో ఏదేదో చెప్పుంటుందని. అమ్మదగ్గర్నుండి నన్ను బలవంతంగా విడిపించుకుని రేవతత్తవైపు ఎర్రగా చూసి "నువ్వు మా ఇంటికి రాకు; నీ వల్ల నేను దెబ్బలుతింటున్నాను" అన్నాను. నేను రేవతత్తపైన అరవడంవల్ల అమ్మకింకా కోపమెక్కువైందేమో "పెద్దంతరం చిన్నంతరం లేకుండ మాట్లాడ్తావా?" అని చెంపమీద గట్టిగా కొట్టింది. నాన్నా, తాతా ఇంట్లో లేరు. పిన్ని అక్క చేత హోమ్వర్క్ చేయిస్తుంది. ఇదంతా వంటగదిలోనుండి చూస్తున్న మంగమ్మవ్వ పరుగుపరుగునొచ్చి ఏడుస్తున్న నన్ను తిసుకెళ్ళిపోయింది. ఆరాత్రి తినలేదు. నాకింట్లో ఉండాలని లేదు. తాత రాగానే జరిగిందంతా చెప్పాను. వీధిచివరవరకు తాతచెయిపట్టుకుని వెళ్ళాను. రమేష్ మామ కనబడ్డారు. తాతకి చెప్పి మామతోబాటు సుశీలత్తవాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. రాత్రక్కడే తిని కథలు వింటూ నిద్రపోయాను.

మరుసటి రోజు పొద్దున నిద్రలేచేసరికి అత్తతో మాట్లాడుతున్న మంగమ్మవ్వ గొంతు వినిపించింది. నన్ను తీసుకెళ్ళడానికి వచ్చింటుంది. నిన్న మా ఇంట జరిగిన గొడవగురించి మాట్లాడుకుంటున్నారు.

"తాళికట్టించుకున్న నేనే ఒకపిల్లాడితో ఆపుకున్నాను ఉంచుకున్నది కడుపుచేసుకుంటుందా? సమచ్చరానికొకర్ని కని ఆస్తంతా దోచుకుంటుందేమో సిగ్గులేంది అని ఆడిపోసుకుంటుంది నిన్ను" అని చెప్పింది మంగమ్మవ్వ.

అత్త ఏం మాట్లాడలేదు. "సుశీలమ్మా, నీకు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే రేపు ఇవే మాటలు వేరేవాళ్ళెవరివల్లయినా నీ చెవిలోపడితే ఏడుస్తావేమోనని. ఇలాంటి మాటలేవీ నువ్వు పట్టించుకోకు. ఆ రేవతి గడ్డివాము దగ్గర కుక్కలాంటిది తాను తినదు; ఎవరినీ తిననీదు. మంచిగా కాపురంచేసుకుని పిల్లల్ని కంటే ఎవరొద్దన్నారు దాన్ని? మగాణ్ణి మగాడుగా చూసెరగదెప్పుడూ ఆ గయ్యాళి. ఎప్పుడూ పుట్టింటి గొప్పలు చెప్పుకోడమేగానీ తిన్నగా కాపురంచేసుకుందా?" అని మంగమ్మవ్వ రేవతత్తని తిడుతూనే "ఇవేవీ పట్టించుకోకుండ నువ్వు వేళకి మంచిగా తిని ఆరోగ్యంగా ఉండాలిప్పుడు" అని చెప్పింది. 

అప్పట్నుండి మంగమ్మవ్వకూడా తరచూ సుశీలత్తవాళ్ళింటికి వచ్చి పనులవి చేయడానికి అత్తకి సాయం చేసేది. మంగమ్మవ్వ మాకేం బంధువు కాదు. ఒంటరిది. తాతకి తోబుట్టువులాంటిది. మాయింటే ఉండిపోయింది.

రమేష్ మామ ఎక్కువ సమయం సుశీలత్త వాళ్ళ ఇంట్లోనే గడిపేవాడు. సుశీలత్తకి పురుటిరోజులని మంగమ్మవ్వ సుశీలత్తతోనే ఉండిపోయింది. సుశీలత్తకి పాప పుట్టింది. చిన్న చిన్న చేతులు, కాళ్ళతో ఆ పాప ఎంత అందంగా ఉందో! నాకు తెగ నచ్చేసింది. ఎప్పుడూ కాళ్ళు, చేతులు గాల్లోకి ఎగరవేస్తున్నట్టుగా అలా ఆకాశానికేసి చూసేది. పాపని ఎత్తుకోవాలని తెగ ఆరాటపడిపోయేవాణ్ణి. నన్ను కాళ్ళు చాపమని పాపని టవల్లో చుట్టి నా ఒడిలో కొన్ని నిముషాలు ఉంచేది.

ఇంటికి వచ్చి పాపముచ్చట్లు అక్కతో చెప్తే తనకీ పాపని చూడాలనిపించి మొట్ట మొదటిసారిగా నాతో సుశీలత్తవాళ్ళ ఇంటికి వచ్చింది. అక్కకి కూడా పాపా, సుశీలత్త ఇద్దరూ నచ్చేశారు. ఆతర్వాత తనుకూడా వస్తూ ఉండేది. మరోరోజు సతీష్ ని కూడా తిసుకొచ్చాము. వాడికీ పాప బాగా నచ్చేసింది. పాపకి నామకరణం చేసిన రోజు నాన్న, తాత, పిన్ని మాత్రం వచ్చారు. అమ్మ రాలేదు. ఇంటికి వచ్చాక అమ్మ అడిగింది పిన్నిని "పాపెలా ఉంది, ఎవరి పోలికలొచ్చాయి, రంగెలా ఉంది" లాంటివి! ఆమెకీ పాపని చూడాలనిపించుండచ్చు.

పాపని ఐదో తరగతి వరకు పక్కూర్లో స్కూల్లో చదివించారు. ఆ పైన తననికూడా రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చేశారు. అన్నా-చెల్లీ సెలవులకి ఇంటికి వచ్చేవారు. వాళ్ళతో నాకు చాలా సరదాగా గడిచేది.  పాఠ్యపుస్తకాలేకాకుండ సాహిత్యం, సైన్సు పుస్తకాలుకూడా చదవమని అత్త ప్రోత్సహించేది. ఆవిడ కలెక్షన్ లో ఉన్న అరవ, ఇంగ్లీషు, తెలుగు పుస్తకాలు నాచేత చదివించేది. శ్వాసించడం ఎలాగైతే ప్రాణమున్నంతకాలం మానమో; పుస్తకపఠనమూ అలా మానకూడదు అని అత్త చెప్పేది. శని, ఆదివారాల్లో పల్లిపట్టు టౌన్ లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం. అత్తకున్న అపార జ్ఞానంతోనూ, పుస్తకాలతోనూ నా ప్రపంచం విశాలమైంది. ప్లస్ టూ అయ్యాక నేను కాలేజీ చదువుకి మెడ్రాస్ వెళ్ళిప్పుడు ప్రతి వారమూ ఉత్తరాల్లో అత్తా నేనూ చాలా విషయాలే మాట్లాడుకునేవాళ్ళం. మాస్టర్స్ కోసం నేను విదేశాల్లో ఉన్నప్పుడు అత్త కంప్యూటర్ కొనుక్కుని ఇంటర్నెట్ వాడకం కూడా నేర్చుకుని ఈ-మెయిల్ రాస్తే నేను ఆశ్చర్యపోయాను. కొత్తవిషయాలు నేర్చుకోవడంలో ఆమెకున్న ఆసక్తి ఇంకా బాగా అర్థమయింది.

 ***

"సూర్యా, చదువులైపోయాయి. ఉద్యోగంచేస్తున్నావు; పెళ్ళి గురించేమైనా ఆలోచించావా?"

"అప్పుడే నాకు పెళ్ళేంటత్తా? పాతికేళ్ళేగా?"

"సరైన వ్యక్తిని నువ్వు చూసుకునియుంటే చేసేసుకోవచ్చు. మీ అమ్మ నీకు సంబంధాలు చూస్తూ ఉందట. మామ చెప్పాడు."

"నిజమా? నాకు చెప్పకుండానే? నన్నడగకుండానే?" నేను ఆశ్చర్యపోయాను.

"హాహాహా... పిచ్చోడా... గొర్రెనడిగి గొంతుకోస్తారా? చెరుకూరి మునస్వామి నాయుడు తరచూ మీ ఇంటికి వస్తున్నాడట. ఒకే కూతురు; బోలెడాస్తి."

"ఆస్తికోసం, అమ్మకోసం పెళ్ళిచేసుకోవాలా? నాకు పెళ్ళొద్దత్తా"

"పెళ్ళేవద్దా? మునస్వామి కూతురొద్దా?"

"రెండూ వద్దు"

"పెళ్ళొద్దనకు. ఇలా వాళ్ళూ, వీళ్ళూ చూసిన అమ్మాయినికాకుండ నీ యంతట నువ్వే చూసి చేసుకో. ఎవరినైనా ఇష్టపడుతున్నావా?"

"ఇంజినీరింగ్లో ఉండగా ఓ అమ్మాయిని ఇష్టపడ్డానుకానీ మాకిద్దరికీ సరిపడదని విడిపోయాం. ఆ తర్వాత ప్రేమ, పెళ్ళి గురించి ఆలోచించలేదు; నన్ను అటువైపులాగేంత సరైన ఆడపిల్లని కలవలేదు."

"గుడ్. కీప్ యువర్ హార్ట్ ఓపెన్. అప్పుడు కలుస్తావు ఆ ఆడపిల్లని. మనకులమమ్మాయిమాత్రమే అనో, తెలుగమ్మాయి మాత్రమే అనో నిర్బంధాలు పెట్టుకోకు. దొరికితే దొరసానిని చూసుకో" అని నవ్వింది.

"అప్పటిక్కానీ మా అమ్మ నన్ను చంపి పాతరెయ్యదు... అయినా, ఇలాంటి విప్లవాలు చదివే సాహిత్యంకొరకే కానీ; నిజజీవితంలో కూడా అన్వయించాలంటావా అత్తా?"

"కాదురా! విప్లవం అసలు కాదు. సైన్స్ బాబూ సైన్స్! కొన్ని వందల సంవత్సరాల నుండీ ఇదే కులంలో మళ్ళీ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని అదే రక్తంతో ఒకేలాంటి గుణగణాలు, ఆలోచనలు గల మనుషులని తయారు చేస్తున్నాము. పండించే పయిరులో ఎక్కువ దిగుబడులు ఇచ్చే విత్తనాలెన్నుకుంటాం. కొత్తకొత్త రుచులిచ్చే పళ్ళుకోసం మొక్కల్ని అంటుకట్టుకుంటాం. ప్రకృతి సహజసిద్ధంగా పూయించే పూలరంగులూ, ఆకారాలుకూడా మనకళ్ళకి బోరుకొట్టేసి క్రాస్-బ్రీడ్ చేసి కొత్త రంగుల పూలు పూయిస్తున్నాం. రవాణాకి సౌకర్యంగా ఉండాలని పుచ్చకాయల్నికూడా స్క్వేర్ షేప్ లో పండించుకుంటున్నారట. మనుషుల దగ్గరకొచ్చేసరికి మనకులంలోనే, బంధువుల్లోనే పెళ్ళిచేసుకుంటే మేలైన పిల్లలెలా పుడతార్రా? ఈ వింత మన దేశంలో మాత్రమే. వేరే దేశాల్లో కులాలులేవు. ఎంచక్కా వేరే రేస్ వాళ్ళనికూడా పెళ్ళి చేసుకుంటారు. మనం రేస్ కాదు కదా కులం, ప్రాంతంనుండికూడా బయటికి రావట్లేదు"

"వేల సంవత్సరాలుగా మనదేశంలో వివాహాలిలానే జరుగుతున్నాయ్ అత్తా"

"నిజమే వేల సంవత్సరాలుగా ఇలా జరుగుతున్నాయ్.  వేల సంవత్సరాలుగా ఇలా ఉందికాబట్టి ఇప్పుడూ అలానే ఉండనివ్వాలా? మిగిలినవాటిల్లో మార్పునంగీకరించిన మనం మనువులో ఎందుకు పాటించకూడదు? ఆస్తికాపాడుకోడానికి అయినవారిమధ్య పెళ్ళిళ్ళు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అలాంటి అవసరాలేం లేవుకదా? కనీసం నీవరకు!"

"నువ్వు చెప్పేవి వినడానికి బానే ఉన్నాయి కానీ అమలుపరచడం సాధ్యమా? ఇంత కచ్చితమైన ఆలోచనలూ, సిద్ధాంతాలూ ఉన్న నీకే ఏటికెదురీదటం ఎంత కష్టమైందో నాకు తెలుసు. నావల్ల అవుతుందా? పైగా మా తాతైనా లేరిప్పుడు"

"..."

"ఇంతకీ అత్తా ఎప్పట్నుండో అడగాలనకుంటున్నాను. ఏం జరిగిందసలు? ఊరంతా నీ గురించి చెడుగానే మాట్లాడుతారు. ఊళ్ళో ఎవరూ నీతో మాట్లాడరు; ఎవరూ మీ ఇంటికైనా రారు. నీకు కష్టంగా అనిపించలేదా?"

"ఎప్పుడో చెప్పుండాలి నీకు; సందర్భం రాలేదు"

***

పెరుమాళ్‌రాజుకుప్పం తక్కిలపాటి కుటుంబంలో పుట్టాను. ఆడపిల్లనైనా చదువు బాగా వస్తుందని పై చదువులకుకూడా అడ్డు చెప్పలేదు. వ్యవసాయ కుటుంబం కావడంవల్ల స్వతహాగానే నాకు అగ్రికల్చర్ మీద ఆసక్తి కలిగి అగ్రికల్చర్ బీ.ఎస్సీ చదువుకున్నాను. డాక్టరేట్ చెయ్యాలని ఉండేది. మూడేళ్ళు చదువైపోగానే బలవంతాన మా మేనబావకిచ్చి పెళ్ళి చేసిపెట్టారు. ఆ పెళ్ళొద్దని పెద్ద యుద్ధమే చేశాను; నెగ్గలేకపోయాను. పెళ్ళికి ముందే నాకు తెలుసు చంద్రశేఖర్ లాంటి మనిషి నాకు సరికాడు అని. చెడ్డవాడుకాదు; అలా అని నా అభిరుచికి తగినవాడు కాదు అంతే. నాకున్నట్లు ఆయనకి సాహిత్యం పిచ్చిలేదు; వ్యవసాయమంటే మక్కువలేదు. దేశంలో జరిగే పెళ్ళిళ్ళన్నీ అభిరుచులు కలిసినవారిమధ్యే జరగట్లేదుకదా అని సర్దుకుపోవడానికి ప్రయత్నించాను.

ఎప్పుడైనా చదువుతు కూర్చుంటే ఓర్వలేడు. పొలానికి కూడా వెళ్ళడసలు. పొద్దస్తమానం ఏవో గాలి తిరుగుళ్ళు. పిల్లాడు పుట్టాక రెండేళ్ళకి పల్లిపట్టు టౌన్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టి కాపురం అక్కడికి తరలించాడు. పల్లిపట్టు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వెనకవైపున్న బంగళాలో ఉండేవాళ్ళం. రమేష్ ఆ ఆఫీసులో చేసేవాడు. రమేష్ చంద్రశేఖర్ కి బంధువుకూడా. మేము అక్కడే ఉన్నాం కాబట్టి మధ్యాహ్న భోజనం రోజూ మా ఇంట్లోనే తినమన్నాడు. అప్పుడే తెలిసింది మేము చదువుకున్నది ఒకే కాలేజీ అనీ. ఆయనా నాలాగే కోయంబత్తూర్ కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్ అని. సాహిత్యం అంటే అభిమానం అనీ. సమయం దొరికినప్పుడు సాహిత్యం గూర్చీ వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల గురించీ మాట్లాడుకునేవాళ్ళం. మా ఇద్దరి మధ్య ఏ కల్మషంలేని స్నేహం ఏర్పడింది. 

ఫ్రెండ్స్ తో నడిరేయి వరకు కాలక్షేపం చేసి వచ్చినా నేను చంద్రశేఖర్ ని ఏమీ అడగకూడదుకానీ రమేష్ తో నేను సాహిత్యం గురించి మాట్లాడితే మాత్రం ముఖమెర్రచేసుకునేవాడు. చంద్రశేఖర్ తన ఫ్రెండ్స్ తో ఇంట్లో కూర్చుని తాగుతుంటే ఇలాంటి వాతావరణంలో కొడుకుని పెంచడం ఇష్టంలేక మా అమ్మదగ్గర వదిలిపెట్టాను. రమేష్‌తో నేను చనువుగా ఉండటం ఓర్వలేక ఎన్నెన్నో మాటలనేవాడు. ఇవన్నీ నాతో అనేవాడుకానీ రమేష్ తో బానే మాట్లాడేవాడు. భార్యని అనుమానిస్తున్నాని మరో మగాడితో ఎలా చెప్తాడు. అప్పుడు రమేష్ కి తిరుత్తణి ఆఫీస్ కి ట్రాన్స్‌ఫర్ అయి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకి అర్థమైందేంటంటే సమస్య రమేష్ రావడం కాదు; చంద్రశేఖర్ కి ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని. అన్నిటికీ సర్దుకుపోతూ కాపురం చేస్తూ వచ్చాను.

అప్పట్లో నాకు నచ్చిన తెలుగు రచయిత్రి మెడ్రాస్ తెలుగు అకాడెమీకి వస్తున్నారు ఆ సభకి వెళ్ళాలని అడిగితే అవసరంలేదన్నాడు. ఆ రచయిత్రిని కలవాలన్నది చిరకాలంగా నా కోరిక. అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలో అర్థం కాలేదు. అందుకని ఎదిరించయినా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. శనివారం ఉదయం బస్ స్టాండ్ లో మెడ్రాస్ బస్ కోసం కూర్చున్నాను. అటుగా వచ్చిన రమేష్ పలకరించాడు. ఇంతలో నన్ను వెతుక్కుంటూ వచ్చిన చంద్రశేఖర్ మమ్ముల్ని అపార్థం చేసుకున్నాడు. అక్కడికక్కడే నన్ను కొట్టబోతే రమేష్ అడ్డుకున్నాడు. అప్పటివరకు అతనికి నా కాపురం గురించీ, చంద్రశేఖర్ అనుమానాలగురించీ ఏమీ చెప్పలేదు. రమేష్ ని బజార్ లో అవమానించాడు చంద్రశేఖర్. నన్ను ఇంటికి లాక్కొచ్చి వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాడు. ఆయన మనుషులూ, కర్రలతో మీ ఊరొచ్చిందారోజే.

ఏమీలేని మా మధ్య అక్రమసంబంధం అంటగట్టారు. అప్పటివరకు నా కాపురం గురించి నేనెలా బయటపడలేదో అలాగే రమేష్ కూడా ఏవీ చెప్పలేదని తెలిసింది. నేనొక మగవాడిచేత వేదింపడుతున్నట్టు రమేష్ ఒక ఆడదాని చేత వేదింపబడుతున్నాడన్నది తెలిసింది. ఆ తర్వాత మాకర్థమైందేంటంటే మేమిద్దరం సోల్మేట్ ని వెతుక్కోగల స్వాతంత్రమున్న సమాజంలో జీవించుంటే పెర్ఫెక్ట్ కపుల్ అయుంటాం అని.

ఇంతదాకా వచ్చాక ఈ పెళ్ళితో కాంప్రమైజ్ అయి, వ్యక్తిత్వం కోల్పోయి కాపురం చేసి సమాజాన్ని మెప్పించడంకంటే సమాజాన్ని పక్కనపెట్టి మేం కలిసి జీవించడం మంచిదని నిర్ణయించుకున్నాం. అప్పుడు మీ తాతతో ఈ విషయమంతా చెప్పాడు రమేష్. ఆ తర్వాత జరిగినవన్నీ ఆయన సమ్మతంతోనే.

***

"చాలా సాహసమే చేశావత్తా! నీకు ఎప్పుడైనా గిల్టీ ఫీలింగ్ కలిగిందా?"

"దేనికి గిల్టీ ఫీలింగ్?"

"రేవతత్తకి సొంతమైన మనిషిని నువ్వు తీసేసుకున్నావని? వాళ్ళ కాపురం ఇలా అయిందనీ"

"నిజంగా మీ రేవతత్త ఆ మనిషి విలువతెలిసుకుని కాపురం చేసుకుంటూ ఉండుంటే నేను మంచి స్నేహితురాలుగానే మిగిలుండేదాన్ని. రమేష్ జీవితంలోకి ఇలా వచ్చుండేదాన్నే కాదు"

"అంత కచ్చితంగా ఎలా చెప్పగలవత్తా?"

"వాళ్ళ మధ్య అంత అన్యోన్యతే ఉండుంటే నేను పరిచయం అయిన తొలిరోజునుండే నాగురించి రేవతత్తతో చెప్పుండేవాడు. నాకు సమస్య వచ్చినప్పుడు నాకొచ్చిన సమస్య గూర్చికూడా చెప్పుండేవాడు. అప్పుడు ఇద్దరు కలిసి నాకు సాయపడేందుకు ముందుకొచ్చుంటారు కదా? ఎవరో వచ్చి గొడవ చేశారనగానే తన భర్త ఎలాంటివాడు అన్న ఆలోచనేమీ లేకుండ అరిచేసి చెప్పుతో కొట్టేస్తుందా?"

"ఊ"

"నేను రమేష్ మామ లైఫ్ లోకి రాకుముందు విషయాలు నీకేమయినా గుర్తున్నాయా?"

"నేను అప్పుడు చాలా చిన్నపిల్లాణ్ణి! అయినా నాకు రేవతత్త ఎందుకో నచ్చేది కాదు. ఎప్పుడూ ఎవర్నో తిడుతూ, చిటపటలాడుతూనే ఉండేది. అంత అందానికి కాస్త సున్నితత్వం ఉంటే బాగుండని అనిపించేది. నాకు ఇంకెవరైనా అత్తగా ఉండచ్చుకదా అనిపించేది. మా అమ్మమ్మని బాగ చూసుకునేది కాదు. పాపం అమ్మమ్మ వేరేగా వంట చేసుకుని తినేది. నిజానికి నువ్వొచ్చాకే వాళ్ళిద్దరు కొంత ఐక్యతగా ఉన్నారు అని అమ్మ అప్పుడప్పుడూ అనేది కూడా!"

"అవును; రమేష్ అప్పుడప్పుడూ చెప్పి నవ్వుకునేవాడు నువ్వొచ్చి ఇంట్లో ఆత్తా-కోడలు గొడవల్ని నిర్మూలించావు అని."

"మరి నీకు బాధనిపించదా అత్తా? మామ నీతో ఎక్కువ సమయం ఉండడనీ, రేవతత్త ఉన్న ఇంట్లో ఎక్కువ సమయం ఉండాడనీ? రమేష్ మామని నువ్వు మరో స్త్రీతో పంచుకోవాలనీ?"

"నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఆమె ఉన్న ఇంట్లో ఉంటాడంతే"

"నీది నిజంగానే ప్రత్యేకమైన వ్యక్తిత్వం అత్తా! ఎన్ని సర్దుబాట్లు చేసుకోవలసి వచ్చినా మామా, నువ్వు జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడానికి రెండో అవకాశం వెతుక్కోగలిగారు; అదృష్టవంతులు." మనస్పూర్తిగా చెప్పాను.

"ఇలాంటి రెండో అవకాశం అందరికీ రాదు; వచ్చినా సాహసించలేరు కూడా! ప్రతి మోడూ మారాకు వేస్తుందని చెప్పలేంకదా! నువ్వు ఆ అవసరంలేకుండా తొలియడుగే జాగ్రత్తగా వేయమని నా సలహా. అర్థమవుతుంది కదూ!"

సుశీలత్త నా కళ్ళకి ఇంకా స్పష్టంగా కనబడింది.

23 వ్యాఖ్యలు:

నిరంతరమూ వసంతములే.... చెప్పారు...

చాలా బాగుంది..బాగా వ్రాశారు భాస్కర్ గారు...నేరేషన్ సూపర్! అభినందనలు!

సీత చెప్పారు...

:)

mahesh చెప్పారు...

చాలా బాగుంది..
మాదీ తమిళనాడులోని పళ్ళిపట్టు తాలూకానే ఒక వేళ మీరు ఈప్రాంతంవారే ఐతే, తమిళనాడు నుండి ఒకరు తెలుగు బ్లాగు వ్రాయడం చాలా సంతోషంగా ఉంది.

కొత్తావకాయ చెప్పారు...

బాగుందండీ. నచ్చింది. అభినందనలు!

మీ భాషలో తమిళం ఛాయ కథకి కొత్త అందం తెచ్చింది. పట్టున్న కథనం. కథ పాతదే అయినా చెప్పిన విధానం ఆద్యంతం ఆసక్తిగా చదివించింది.

ముగింపు మరింత నచ్చింది. ప్రత్యేకవ్యక్తిత్వాలను ఎవరికి తోచిన పధ్ధతిలో అర్ధం చేసుకోవడం తప్పదు కదా! అయితే ఆమె తనను తను ఎంతవరకూ సమర్ధించుకుందో చివరి పేరాలో బాగా నేర్పుగా చెప్పగలిగారు. బాగుంది. సుశీల వ్యక్తిత్వాన్ని చిన్నపిల్లాడి చేత ఎలా చెప్పిస్తారా అని ఆసక్తిగా చదివాను. గెలిచారు. :)

వనజవనమాలి చెప్పారు...


కథ చాలా బావుంది.

ముఖ్యంగా .. ఈ వాక్యాలు బాగా నచ్చాయి . లోతైన విశ్లేషణ. చాలా బాగా వ్రాసారు. అభినందనలు."నీకనిపించినది నువ్వు చెయ్. ఇప్పుడే కాదు నీ జీవితమంతా అలానే ఉండు. నీకు చెడేది మంచేదని తెలుసుకాబట్టి నీకు నచ్చిన మంచిపనులే చెయ్; ఎవరికి నచ్చినా నచ్చకపోయినా! సరేనా?"

అజ్ఞాత చెప్పారు...

కధంతా ఎక్కడా కుదుపులు లేకుండా చివరివరకూ సాఫీగా చదివించింది!!
ఒక ప్రముఖ రచయిత అన్నారు, 'భార్యాభర్తల మధ్య సంబంధం గురించి వాళ్ళల్లో ఒకరు చెప్పడం ఎప్పట్నించో వస్తున్నది.. కధ మొత్తం అదే అయినా వేరే వ్యక్తి దృష్టిలోనించి చెప్పినప్పుడే ఆ కధకో కొత్త కోణం వస్తుంది!' అని..
చిన్న పిల్లవాడితో సుశీలత్త కారెక్ట‌ర్‌ని బిల్డ్ చేయించడం కష్టమైన ప్రక్రియ అని నా ఉద్దేశ్యం.. అదీ అతను ఎంత వయసులో ఎలా మాట్లాడాడూ.. ఆ వయసు ఆలోచనాపరిధిని స్పష్టంగా చూపించగలగడం అనేది చాలా నచ్చింది!
కధ పూర్తయ్యేసరికి సుశీలత్త చేతిని ఆత్మీయంగా తడమాలనిపించింది.. కానీ భార్య ఎంత గయ్యాళిదైనా, ఆమెలో సకల లోపాలూ ఉన్నా... అవన్నీ తనకుతానుగా ఒప్పేసుకుని, చూస్తూ చూస్తూ భర్తని పంచుకోలేదు!!

ఒకటే పాతగా అనిపించిన విషయం.. సుశీలత్త కధలోకి రావడానికి కారణం, సేమ్ అర్ధం చేసుకోని భర్త, గయ్యాళి భార్య కాన్స్పెప్ట్... బట్, కధాకాలం బట్టి చూస్తే అదీ సబబే అనిపిస్తోంది!

ఇంకా, కుటుంబంలో అందరిమధ్యా ఉన్న రిలేషన్‌షిప్స్ ని కరెక్ట్‌గా ఎస్టాబ్లిష్ చేయడం బావుంది.. లైక్, సతీష్ మొదటిసారి ఆమె వచ్చిందని చెప్పడానికి వచ్చినప్పుడు పిన్ని 'అన్నం తిన్నావా?' అని అడగటం! ఆ గొడవలో, గందరగోళంలో ఇంట్లో పిల్లల తిండి గురించి పట్టించుకునే మనఃస్థితి అక్కడి వారికి ఉండదని పిన్ని పట్టించుకోవడం!

కధ చివరి చివరికి వస్తుంటే కాస్త భయమేసిన విషయం -- ఎక్కడ సుశీలత్త కూతుర్ని పెళ్ళి చేసుకుంటానంటాడో అని!! థాంక్ గాడ్, ఆ ఎండింగ్ ఇవలేదు! అందుకే ఇంకాస్త ఎక్కువ నచ్చేసింది :-)

డౌట్లు...
తిరుమల నెల మూడో శనివారం తళిగ కోసం -- తిరుమల నెల, తళిగ అంటే??

kri చెప్పారు...

చాలా బాగుంది !

Narayanaswamy S. చెప్పారు...

బావుంది. రిఫ్రెషింగ్ గా ఉంది.

lakshman చెప్పారు...

"కాదురా! విప్లవం అసలు కాదు. సైన్స్ బాబూ సైన్స్! కొన్ని వందల సంవత్సరాల నుండీ ఇదే కులంలో మళ్ళీ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని అదే రక్తంతో ఒకేలాంటి గుణగణాలు, ఆలోచనలు గల మనుషులని తయారు చేస్తున్నాము. పండించే పయిరులో ఎక్కువ దిగుబడులు ఇచ్చే విత్తనాలెన్నుకుంటాం. కొత్తకొత్త రుచులిచ్చే పళ్ళుకోసం మొక్కల్ని అంటుకట్టుకుంటాం. ప్రకృతి సహజసిద్ధంగా పూయించే పూలరంగులూ, ఆకారాలుకూడా మనకళ్ళకి బోరుకొట్టేసి క్రాస్-బ్రీడ్ చేసి కొత్త రంగుల పూలు పూయిస్తున్నాం. రవాణాకి సౌకర్యంగా ఉండాలని పుచ్చకాయల్నికూడా స్క్వేర్ షేప్ లో పండించుకుంటున్నారట. మనుషుల దగ్గరకొచ్చేసరికి మనకులంలోనే, బంధువుల్లోనే పెళ్ళిచేసుకుంటే మేలైన పిల్లలెలా పుడతార్రా? ఈ వింత మన దేశంలో మాత్రమే. వేరే దేశాల్లో కులాలులేవు. ఎంచక్కా వేరే రేస్ వాళ్ళనికూడా పెళ్ళి చేసుకుంటారు. మనం రేస్ కాదు కదా కులం, ప్రాంతంనుండికూడా బయటికి రావట్లేదు"

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

@నిరంతరమూ వసంతములే.. ధన్యవాదములండి.

@సీత - థ్యాంక్స్ సీతమ్మా :-)

@మహేష్ గారు,
నేను పుట్టి పెరిగింది, కొన్నాళ్ళు చదువుకుంది పల్లిపట్టు తాలూకానేనండీ. మా ఊరు కుమార్రాజుపేటండి. నాకు మెయిల్ రాస్తారా ప్లీజ్. ధన్యవాదాలు.

@కొత్తావకాయ గారు,
నా రాతల్లోని తమిళ ఛాయ నచ్చినందుకు ధన్యవాదాలండి. సుశీల వ్యక్తిత్వాన్ని చిన్నపిల్లాడి చేత చెప్పించడంలో పెద్ద సాహసమే చేశానండి.

@వనజవనమాలి గారు,
కథ నచ్చినందుకూ, మీ అభినందనలకీ ధన్యవాదములు. భయపడ్డాను కథని ఎలా రిసీవ్ చేసుకుంటారో పాఠకులు అని :)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

@అజ్ఞాత గారూ,
కథని ఇంత లోథుగా విశ్లేషించి వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదము. మీ పేరైనా రాసుంటే ఆనందించుండేవాణ్ణి!

__ఒక ప్రముఖ రచయిత అన్నారు, 'భార్యాభర్తల మధ్య సంబంధం గురించి వాళ్ళల్లో ఒకరు చెప్పడం ఎప్పట్నించో వస్తున్నది.. కధ మొత్తం అదే అయినా వేరే వ్యక్తి దృష్టిలోనించి చెప్పినప్పుడే ఆ కధకో కొత్త కోణం వస్తుంది!' అని..__
నిజమేనండీ. భర్థదొక వర్షన్, భార్యదొక వర్షన్ గా ఉంటాయ్ కదూ?

__కధ పూర్తయ్యేసరికి సుశీలత్త చేతిని ఆత్మీయంగా తడమాలనిపించింది..__
మీ హృదయాన్ని సుశీలత్త ఎంతగా ఆకట్టుకుందో అర్థమైందండి.

__కానీ భార్య ఎంత గయ్యాళిదైనా, ఆమెలో సకల లోపాలూ ఉన్నా... అవన్నీ తనకుతానుగా ఒప్పేసుకుని, చూస్తూ చూస్తూ భర్తని పంచుకోలేదు!!__
నిజమే; లోలోపల మథన పడుతూ అలా పంచుకునే వారిని చూస్తుంటాం కదండీ?

__ఒకటే పాతగా అనిపించిన విషయం.. సుశీలత్త కధలోకి రావడానికి కారణం, సేమ్ అర్ధం చేసుకోని భర్త, గయ్యాళి భార్య కాన్స్పెప్ట్... బట్, కధాకాలం బట్టి చూస్తే అదీ సబబే అనిపిస్తోంది!__
అవునండీ.

___ఇంకా, కుటుంబంలో అందరిమధ్యా ఉన్న రిలేషన్‌షిప్స్ ని కరెక్ట్‌గా ఎస్టాబ్లిష్ చేయడం బావుంది.. లైక్, సతీష్ మొదటిసారి ఆమె వచ్చిందని చెప్పడానికి వచ్చినప్పుడు పిన్ని 'అన్నం తిన్నావా?' అని అడగటం! ఆ గొడవలో, గందరగోళంలో ఇంట్లో పిల్లల తిండి గురించి పట్టించుకునే మనఃస్థితి అక్కడి వారికి ఉండదని పిన్ని పట్టించుకోవడం!___
ఐయామ్ హానర్డ్!! ఎంత క్షుణ్ణంగా చదివారసలు?!

___డౌట్లు...
తిరుమల నెల మూడో శనివారం తళిగ కోసం -- తిరుమల నెల, తళిగ అంటే??____

తిరుమల(పురట్టాసి) నెల :
తమిళ నెలల్లో ఇది ఆరో నెల. తమిళంలో పురట్టాసి అంటారు. చిత్తూరు, నెల్లూరు, చెంగల్పట్టు జిల్లాలలోని ప్రజలు ఈ నెలలోని శనివారాలు వెంకన్న కోసం ఒకపొద్దు ఉంటారు. పిండివంటలు, పప్పన్నం, పంచామృతం అవి వండి ఏడుకొండలవాడికి నైవేద్యంగా పెడతారు. ఈ నైవేద్యాన్ని తళిగ అంటారు.

తిరుమలగిరిపైన బ్రహ్మోత్సవాలు ఈ నెలలోనే జరుగుతాయండీ!

అజ్ఞాత చెప్పారు...

ఇలాంటి కధలు కానీ, సినిమాలు కానీ సమాజం ఒప్పుకోదు..... నిజ జీవితాల్లో ఇలాంటివి ఎన్నో జరుతుంటాయి... మనము ప్రత్యక్షంగా ఆ వ్యక్తుల తో ఉండి చూస్తే కానీ సుశీలత్త , రమేష్ మామయ్యలని అర్ధం చేసుకోలేము. .......ఎన్ని డిఫ్ఫ్రెన్సెస్ ఉన్నా, పెళ్ళి అనే బంధానికి గౌరవం ఇచ్చి ఆలూమగలు కలిసి ఉండటానికి ప్రయత్నించాలి అంటాను నేను... కానీ కలిసి ఉన్న ప్రతీ క్ష్నణం, నిప్పుల మీద కుంపటి లా భావించేవాళ్ళు దూరమవటమే మేలేమో...... ఇండివిడూల్ పర్స్‌పెక్టివ్ లో చూస్తే వాళ్ళు చేసింది కరెక్ట్ అనిపిస్తుంది....

సూర్యా వాళ్ళ నాన్న గారిని ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కాలేదు... సుశీలత్త వచ్చాక కూడా రమేష్ మామయ్య రేవత్తత్త ఇంట్లో ఎందుకుండాలో అర్ధం కాలేదు.
పిన్ని భలే నచ్చింది నాకు... సినిమాళ్ళో సావిత్రి పాత్ర లా అనిపించింది. ( పిల్లల్ని పట్టించుకునే విధానం )

కధ చాలా చక్కగా వ్రాసారు.... భాస్కర్ గారూ.

అజ్ఞాత చెప్పారు...

చదివినంత సేపూ....మీ జీవితం లో నిజంగా జరిగిన సంఘటన ని రాసారు అనుకున్నా,భలే రాశారండీ. సుశీలత్త బాగా నచ్చింది,రేవతత్తని తప్పు పట్టలేము(విలన్ కాదని నా అభిప్రాయం), మొత్తం మీద నచ్చింది.అసలు కథ అంటే నమ్మేలా లేదు,నిజమైన అనుభవం లా ఉంది .

UG SriRam చెప్పారు...

కథ బాగుంది భాస్కర్ గారు. సుశీల పాత్ర మొదట ముదల్ మరియాదై సినేమా లో రాధ పాత్ర లాగా అనిపించినా చివరికి శ్రీకృష్ణుడి భార్య రుక్మిణి దేవి ని గుర్తుకు తెచ్చింది. గట్టి వ్యక్తిత్వం,భర్త పైన ప్రేమ ఉన్న వ్యక్తి.

SriRam

kiran చెప్పారు...

claps.........

UG SriRam చెప్పారు...

"మరి నీకు బాధనిపించదా అత్తా? మామ నీతో ఎక్కువ సమయం ఉండడనీ, రేవతత్త ఉన్న ఇంట్లో ఎక్కువ సమయం ఉండాడనీ? రమేష్ మామని నువ్వు మరో స్త్రీతో పంచుకోవాలనీ?"
"నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఆమె ఉన్న ఇంట్లో ఉంటాడంతే"

పని ఉండటం వలన ఇంతక్రితం పూర్తిగా వ్యాఖ్య రాయలేకపోయాను. రుక్మిణి దేవితో పోల్చటానికి కారణం పైన సుశీల పాత్ర చెప్పిన ఈ జవాబు. ఇది మీరు తెలుగులో రాసిన కథనా లేక తమిళ అనువాదమా? మీకథలో తిరుత్తణి పేరు వింటే చాలా పాత జ్ణాపకాలు గుర్తుకు వచ్చాయి. అక్కడ చిన్నపటినుంచి ఇప్పటి వరకు చాలాసార్లు గుండు కొట్టించు కొన్నాను.
_____________________________

* కొన్ని వందల సంవత్సరాల నుండీ ఇదే కులంలో మళ్ళీ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని అదే రక్తంతో ఒకేలాంటి గుణగణాలు*

ఒకప్పుడు మీలాగే అనుకొనేవాడిని, కాని మా పక్కింట్లొ ఉండే ఒక బ్రాహ్మణ డాక్టర్, అబ్రామ్హణ మ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు. ఆమేకి పెళ్లి అయిన ఆరునెలలోపే అత్తామామలతో పడేది కాదు. ఆమే పుట్టింటి తరపు వారు చాలా వ్యాపారాలు చేస్తూండేవారు. వారితో ఆవిడకి పోటి. బ్రాహ్మణ డాక్టర్ మరీ అత్యాశకు పోకుండా ప్రైవేట్ ప్రాక్టిస్ చేసేవాడు. అది కూడా బాగా జరుగుతుండేది. కాని ఆమే పెళ్లైన అతి కొద్ది కాలంలోనే మొగుడితో డబ్బుల విషయం లో(రోగుల కన్సల్టేషన్ ఫీజ్ పెంచమని ) గొడవపడేది. భర్త ఇంట్లో లేనపుడు అత్తమామల ని ఆస్థి పంచమని ఒత్తిడి తెచ్చెది. ఆ అత్తామామలు కొత్తగా పెళ్లైన కొడుకుకు, కోడలి గురించి ఫిరాయదు చేయటం ఇష్ట్టంలేక నలిగి పోతుండేవారు. ఇక అత్తామామలని వేధించటానికి ఆవిడ వినుత్న పద్దతులు అవలంబించేది. ఈవిడ మేడపైన ఉండేది.అత్తామామలు కింద ఉండేవారు. భర్త ఇంట్లో లేని సమయంలో, ఈవిడ మేడపైన నుంచి వీళ్లు నడిచేదారిలో కోడి గుడ్డు,వాటి పెంకులు, మాసంపు ముక్కలు వేసేది. అవి చాలా సార్లు మా ఇంట్లో వచ్చి కూడా పడేవి. పాపం! ఆ వృద్ద దంపతులు కోడలి దెబ్బకి ఊరు విడిచి వెళ్లి పోయారు. కులాంతర వివాహాలు చేసుకొన్న బ్రాహ్మణుల లో ఇటువంటి వాటి అనుభవాలు చూసిన తరువాత వాటి వలన సమాజం లో మార్పు వస్తుందనే నమ్మకం పోయింది. పైపెచ్చు ఈ వివాహాల వలన వాళ్లు కూడా పూర్తి కమర్షియల్ గా మారిపోవలసిన అవసరం ఏర్పడుతుంది. లేకపోతే తెలిసిన కథే కోర్ట్టులు,కేసులు,విడాకులు అంట్టూ అన్ని రూపాల లో మగవారు నష్టపోతారు.

భావకుడన్ చెప్పారు...

Bhaskargaaru,

Apparently the comment was longer than permitted. So posted it as http://drbr1976.blogspot.co.uk/2012/11/for-post-httpparavallu.html

Regards

ఆ.సౌమ్య చెప్పారు...

చాలా బాగా రాసారు. కథ ని తమిళనాడు లో నడిపించడం వల్ల మీ భాషకు వన్నె వచ్చింది. కథనం కొత్తగా ఉంది. చెప్పలనుకున్న విషయాన్ని చాలా సున్నితంగా చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. చాలా సంయమనం కనిపించింది మీ కథనంలో. మొదటి అజ్ఞాత రాసిన కామెటులో పాయింట్లన్నీ నేననుకున్నవే. అందుకే మళ్ళీ రాయట్లేదు ఓసారి అవే మళ్ళీ చదివేసుకోండి :)

ఆ.సౌమ్య చెప్పారు...

విప్లవం కాదు సైన్స్ అని రాసిన పేరా చాలా బాగుంది. కొత్త ఆలోచన. నచ్చింది.

ప్రవీణ చెప్పారు...


చాలా బాగుంది . సూర్య (ఆరేళ్ళ పిల్లాడి నుంచి పెళ్లి వయసు వరకు) దృష్టిలో సుశీలత్త వ్యక్తిత్వం తెలుసుకుంటూ కధ సాగటం...

Liked certain in depth things. " నిజానికి నువ్వోచ్చాకే వాళ్లిద్దఋ కొంత ఐక్యతగా వున్నారు"...

అజ్ఞాత చెప్పారు...

Nothing wrong, except, that guy should have grown some balls and taken a divorce before following his heart! Being in a relationship and following one's heart is called 'Cheating'.

Krishna

అజ్ఞాత చెప్పారు...

test

Sujata చెప్పారు...

So nice. Nice narration.