26 జులై 2011

తీరం చేరుకోలేని అలలు...


నిద్రపోనివ్వని రాత్రులెన్నో
పనిచేసుకోనివ్వని పగళ్ళెన్నో!

కాలాలు నీ జ్ఞాపకాల నెమరుతో కరిగిపోతున్నాయ్...

భూమి ఆకశదుప్పటి కప్పుకున్నా,
తూట్లుపెట్టుకుని తొంగిచూసే కోట్లాది నక్షత్రాలవలే
మనసుకెందరు ఓదార్పు దుప్పట్లు కప్పినా దూసుకొచ్చే నీ జ్ఞాపకాలు!
చేరువలో గారమైన మనసు; దూరములో భారమైనది!

నీ పరిచయము పంచిన
లెక్కలేని తీపి అనుభవాలూ
చేసిన ఏకైక మధురగాయమూ - ఈ జన్మకు ఒకసారే!

ఇకపైనా తీపి అనుభవాలు రావచ్చు;
మధుర గాయాలు తగలవచ్చు - వాటి ఆధిక్యత ఇంతలా ఉండదు.

సున్నితత్వాన్ని అమ్ముకోలేక, దృఢత్వాన్ని కొనుక్కోలేక
బ్రతుకువాణిజ్యం ఎలాకొనసాగించాలో?

నా శ్రేయోభిలాషులు అంటున్నారు -
నీ జ్ఞాపకాలను దూరం చేసుకుంటే హాయిగుంటానట...
వాళ్ళకెలా చెప్పను?
నిన్ను మరవడమూ, మరణించడమూ ఒకటే నాకు అని?

నాలాంటి మంచి మనిషిని నువ్వే పోగుట్టుకున్నావట -  అందరు ఓదారుస్తున్నారు.
నిజానికి నిన్ను నేనో; నన్ను నువ్వో కాదు కదా పోగుట్టుకున్నది?
బ్రతుకు క్యాన్వాస్పై మనమిద్దరం కలిసి గీసుకోవాలనుకున్న
స్వచ్ఛమైన ఊహా చిత్రాన్ని పోగుట్టుకున్నాం!

నన్ను కావాలనుకున్నప్పుడు ఎందుకని అడగలేదు!
నన్నొద్దనుకున్నప్పుడు ఎలా అడగను?
నీ నిర్ణయాన్ని మనస్పూర్తిగా అంగీకరించడమే
నేను నీకు ఇవ్వగల చివరి కానుక!

ప్రతి అలకూ ధ్యేయం తీరం చేరడమే -
అయితే ప్రతి అలా తీరం చేరుతుందా?
తీరం చేరేముందే మఱో పెద్ద అల మింగేసిన చిన్న కెరటంలా
మరణానికి గురైనవి మన ఆశల కెరటాలు!

 ఆ కెరటాలు నిజం; వాటి ధ్యేయం నిజం;
తీరం చేరే ముందే వాటిని చేరిన మరణం కూడా నిజమే!
=============================================