14 మార్చి 2013

కౌంట్‌డౌన్

పగటిని మింగేసి ఆవులిస్తున్న మసక సాయంత్రాలు
ప్రేయసి వీడ్కోలిస్తూ వదిలిన తడి - పెదవులపైనా, కళ్లలోనూ
ఉరుముల అరుపులతో నల్లటి మేఘాల కరకు మెరుపు
కడలిని చేరకుండానే ఇంకిపోతున్న కోర్కెల నది
మాటలు పోగొట్టుకుని చరిత్రలో పేరుగా మిగనున్న భాష

నిన్నటి చావుకి ఒకరోజు వాయిదా ఇచ్చిన రంగుసీసాలను
భక్తిగా చూస్తూ మరణశయ్య మీది ముసలి రోగి
మెడపైకి కత్తినెత్తే చేతిలో మేత ఉందేమోనని ఆశగా చూస్తున్న మేక
విసురుగాలికి చివరినరంతో వేలాడుతున్న పండుటాకు
వింటిని వీడిన శరానికి గురి తనేనని తెలియక కొమ్మపై ఆసీనమైయున్న పక్షి

ఏళ్ళ తరబడి పోగుచేసుకున్న ఆశలూ,
అంతేచిక్కని బరువైన ఆవేశాలూ - బూరుగ పత్తిలా గాల్లో తేలుతూ!