30 జూన్ 2011

180 "ఈ వయసిక రాదు" - తెలుగు సినిమా విశేషాలు!


నిన్న రాత్రి, 180 అనే తెలుగు సినిమాకెళ్ళాం.  ఈ సినిమాని ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో తీశారు.  ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం. 
 

సిద్ధార్థ్, నిత్యా మేనన్, ప్రియ ఆనంద్, గీత, మౌళి, తనికెళ్ళ నటించారు. జయేంద్ర దర్శకత్వం.  సభ్యమైన సినిమా. మొదలైన కొన్ని నిముషాలకే కథ మొత్తం ఊహించేయొచ్చు. కథ తెలిసిపోయింది ఇక కుతూహలం ఏముంటుంది అనుకోడానికి లేదు. యువతకు తప్పక నచ్చే ప్రేమ కథ. యువతకు నచ్చుతుంది అన్నానని ఇది కుర్రకారు మాత్రమే చూడతగ్గ సినిమా ఏం కాదు. పెద్దవాళ్ళుకూడా హాయిగా నవ్వుకోగలరు. సంభాషణల్లో శ్లేషార్థాలూ లేవు, ముఖంమొత్తే దృశ్యాలూ లేవు. పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు.

సమయం ఎలా గడిచిందో తెలిసేముందే అర్ధం సినిమా నవ్వుల మధ్య అయిపోతుంది. రెండో సగంలో కథ అమెరికాకి వెళ్ళిపోతుంది.  ఇంతకన్నా ఎక్కువగా రాసేందుకు కథలేదు. చిన్న కథని రెండున్నర గంటలు ఎలా చూపారు? 180 అని పేరెందుకు పెట్టారు. ఆ 180 కి అర్థం ఏంటి ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడవలసిందే.

సిద్ధార్థ్ :
కథంతా ఇతని చుట్టూనే తిరుగుతుంది. ఎప్పట్లాగా బాగనే నటించాడు.

మౌళి :
సంభాషణలను తనగళంతోనే పలికించారు. మంచి హాస్యం ఒలికించారు. ఒకప్పుడు ఈయన ఎన్నో గొప్ప హాస్య చిత్రాలను తీశారు. మంచి దర్శకుడు.

గీత : 
బాలచందర్ బడిలో నటన నేర్చిన ఈమెకు ఇదేం కష్టమైన పాత్రకాదు. బాగ చేశారు. ఈమెకూడా స్వయగళంలోనే సంభాషించారు.

నిత్యా మేనన్ :
అల్లరి పిల్ల పాత్రలో అల్లరి చేస్తూ, నవీన దుస్తుల్లో నవ్వుతూ నటించింది.  ఈ మళయాళపు కుట్టి కొంచం సన్నగా ఉంటే బాగుండేది. పొట్టివల్లనో ఏమో చీరలో వచ్చే (ఒకేయొక) సన్నివేశంలో అంత బాగా అనిపించలేదు.  ఈమెకి ఇంకా ఇంకా సినిమాలు చెయ్యాలనే ఉద్ధేశం ఉంటే ఒకటి సన్నబడాలి, లేకుంటే ఇంక కాస్త లావెక్కాలి. సన్నబడితే తెలుగు సినిమాలు! లావెక్కితే తమిళ సినిమాలు :P


ప్రియ ఆనంద్ :  
హమ్మయ్యా, ఎంత బాగుందో ఈ అమ్మాయి. అమెరికా అమ్మాయి పాత్రకు బాగా ఇమిడింది. పాత్రకు కావలసిన భావాలను సహజంగా ప్రదర్శించింది. దుఃఖకర సన్నివేశంలో ఎక్కడ అతి చేస్తుందో అనుకున్నా, అసలు లేదు. సహజంగా నటించింది.  సినిమా మొదటి సగంలో నిత్య ని చూసిన ప్రభావం వల్ల రెండో సగంలో వచ్చే ప్రియ ఆనంద్ అందంగా, సన్నగా కనబడుతుందేమో అని పొరబడేరు. అలాంటిదేమీ లేదు. నిజంగానే ప్రియ ఆనంద్ సన్నగా బాగుంది.  ఇంక కొంతకాలం మన తెలుగు యువకులకి ప్రియ జ్వరం ఉంటుంది. సంగీతం :  
శరత్ సంగీతం అందించారు. మళయాళపు వ్యక్తి కాబట్టో ఏమో పాటల్లో ఎక్కడా తెలుగుదనం కనబడలేదు. సాహిత్యం తెలుగే అయినా అరవంలాగా వినబడుతుంది. ఈ సినిమాకు సంగీతం పాటల పరంగా ఒక ఊనమే (మైనస్ పాయింట్?) అయింది.  నేపద్య సంగీతం బాగనే ఉంది. ఈ సినిమా పాటల గురించి రెణ్ణెళ్ళ క్రితం V B  సౌమ్యా గారన్న మాటలు గుర్తు తెచ్చుకుందాం  “ఏవిటో, ఈ సంగీత దర్శకుడి బాధ... దారి తెలీక వెదుక్కుంటున్నప్పుడు కలిగే అయోమయం గుర్తొస్తోంది నాకు. ఎంతో గొప్ప పుణ్యం చేసుకుంటే గానీ, అలాంటి సంగీత దర్శకుడూ, గాయకుడూ రారు - తెలుగుకు. భావి తరాలకి గొప్ప ఆదర్శ జీవి ఆ గాయకుడు మాత్రం.”

కథ, మాటలు, దర్శకత్వము :
పెద్ద కథేం కాదు. కథ మొత్తం నాలుగు మాటల్లో చెప్పేయచ్చు. అంత చిన్న కథని రెండున్నర గంటలసేపు విసుగెత్తించకుండ చూపడంలోనే దర్శకుడి ప్రతిభ తెలిసిపోతుంది.  కథనమూ (స్క్రీంప్లే), తమిళ మాటలూ ప్రముఖ తమిళ రచయితలు సుబా (స్రేష్ & బాలకృష్ణన్) గార్ల ది. తెలుగు మాటలు రాసినది ఉమర్జి అనురాధ, సుబా గార్ల క్లుప్త(crispy) సంభాషణా శైలీలోనే తెలుగుపదాలు రాశారు! బాగున్నాయ్.  చిత్రీకరణలో బాగా శ్రద్ద తీసుకున్నట్టున్నారు.

చివరి మాట : సమయం ఉంటే ఒక సారి చూడచ్చు. తప్పక చూడవలసిన చిత్రమైతే కాదు.  

28 జూన్ 2011

Vairamuthu / వైరముత్తు - అరవకవికి ఆరోసారి జాతీయ ఉత్తమ గేయరచయిత పురస్కారం... 2011


ఆరోసారి జాతీయ ఉత్తమ గేయరచయిత పురస్కారాన్ని అందుకున్నారు తమిళ గేయ రచయిత కవిరారాజు వైరముత్తు గారు. ఆయన రచనలు తెలియని తమిళవారుండరు. తెలుగువారిక్కూడా చాలామందికి ఈయన పరిచయం. తమిళంలో ఈయన రాసిన పాటల్ని తెలుగులోకి డబ్బింగు చేసినప్పుడు అక్కడక్కాడా ఈయన రచించిన కొన్ని గొప్ప భావాలు తెలుగువారినీ అలరిస్తూనే ఉంటాయి. 

ఎన్ని రాజికీయాలున్నా, ఎందరు సిపారుసులు చేసినా ఒక్కసారి వస్తుందిగానీ ఆరుసార్లు ఒకే కవికి జాతీయ ఉత్తమ గేయరచయిత పురస్కారాలు(National Award) రావు కదా? సత్తా ఉన్నట్టేకదా?

భారతదేశంలో యే గీతరచయితకీ, కవికీ ఇదివరకు దొరకలేదు ఇంతటి అదృష్టం. ఈయన భాష, భావము తమిళ సాహిత్యానికి ఇంకా ఎన్నెన్నో కీర్తులను కట్టబెడుతుందని ఆశిస్తున్నాను.

ఆయనకి అరోసారి అవార్డు తెచ్చిపెట్టిన ఆ పాటను తెలుగులోకి అనువదిస్తున్నాను. కరువుప్రాంతంలో ఓ పల్లెటూరి తల్లి బాల్నీ, కష్టాల్నీ పాటగా రాశారు. ఇలాంటి తల్లులు ఎందరో ఉన్నారు మన దేశంలో. బిడ్డను పెంచేందుకు తల్లిపడే కష్టాలనూ, ఆమె జీవితాన్ని  మాటల్లో పొడిగించారు కవి. ఆయన అరవంలో రాసిన గొప్పభావాన్ని నాకు తెలిసిన పదాలతో అనువదించాను.

(తమిళంలో ఉన్న ప్రత్యేక "ళ" అక్షరం మనభాషలో లేదుకాబట్టి అక్షరాన్ని "zha" అని రాశాను. "zha" ఉన్న చోట తమిళ "ళ" పలకాలి)

==================================
==================================

పల్లవి
    కళ్ళి కాట్టిల్ పెఱంద తాయే - ఎన్న
    కల్లొడచ్చి వళత్త నీయే!
    ముళ్ళు కాట్టిల్ మొళచ్చ తాయే - ఎన్న
    ముళ్ళు తక్కె విడల నీయే!
నాగుతాళి(జెముడు) అడవుల్లో పుట్టిన తల్లీ - నన్ను రాళ్ళు కొట్టి పెంచావు
నువ్వు ముళ్ళ అడవిలో పుట్టినా నన్ను మాత్రం ముల్లంటకుండా పెంచావు.

    కాడైక్కుం కాట్టుకురువిక్కుం ఎండంపుదరుక్కుళ్ ఎడముండు
    కోడక్కుం అడిక్కుం కుళురుక్కుం తాయి ఒదుంగత్తాన్ ఎడముండా
కోలంకి పిట్టకీ, అడవి గువ్వకీ రేగుపొదల గూడున్నది
ఎండకీ, వణికించే చలికీ తలదాచుకుందుకు చోటుందా?
(నివసించేందుకు సరైన ఇల్లుకూడా లేదు ఈ పేద తల్లికి)
    కెరట్టు మేట్టైయే మాత్తునా - అవ
    కల్ల పుళింజి కంజి ఊత్తునా
మెరక నేలని దిద్దినది - ఆమె రాళ్ళుపిండి గంజి పోసినది.
(తల్లి బిడ్డను బాగా పెంచాలని ఎంత కాయకష్టమైనా చెయ్యగలదన్నది భావం)

    చరణం 1
    ఒzhaవు కాట్టుల వెద వెదప్పా
    ఓణాన్ కెరట్టుల కూzh కుడిప్పా
    ఆవారం కుzhaiయిల కై తొడప్పా
    పావమప్పా.....

దున్నేందుకే వీలులేని మిట్టనేలలో పంటచేస్తుంది
(ఆమెకు మాగాని పొలాలు లేవు)
తొండలు తిరిగే నేలలో అంబలి తాగేను!
(తింటున్నప్పుడుకూడా హాయిగా నీడలో కూర్చుని తినే సౌకర్యము లేదు - నీడనిచ్చే చెట్లుకూడా లేనటువంటి మెరక భూమి)
తంగేడు ఆకులతో చెయి తుడుచుకుంటుంది!
(తిన్నాక చెయ్ కడుక్కునేందుకుకూడా నీళ్ళు ఉండవు)
ఎంత కష్టమో జీవనం...

    వేలి ముళ్ళిల్ అవ వెఱగెడుప్పా
    నాzhi అరిసి వెచ్చి ఉలై ఎరిప్పా
    పుళ్ళ ఉండ మిచ్చం ఉండు ఉసుర్ వళప్పా
    త్యాగమప్పా...
కంచ కంపల్లో పొయ్యికి కట్టెలు ఏరుకుంటుంది
నూకలబియ్యముతో ఎసరు పెట్టుకుంటుంది!
(నాణ్యమైన బియ్యముకూడా లేని పరిస్థితి)
బిడ్డ కడుపునిండా తిన్నాక మిగిలిన ఆహారంతో సరిపెట్టుకుంటుంది!
ఎంత త్యాగశీలో...

    కిzhaక్కు విడియుమున్న ముzhiక్కిఱా
    అవ ఉలక్క పుడిచ్చిత్తాన్ పెఱుక్కుఱా
    మణ్ణక్ కిండిత్తాన్ పొzhaiక్కిఱా
    ఒడల్ మక్కిపోవుమట్టుం ఉzhaiక్కిఱా
తూరుపు దిక్కుకన్నా ముందే లేస్తుంది,
రోకలిలాంటి పరకతో(చీపురుతో) ఇల్లూ వాకిలి ఊడుస్తుంది
(చీపురు కొనలు బాగా అరిగిపోయి రోకలిలా అయిపోయింది!)
మట్టిపిసుక్కుంటూ జీవిస్తుంది; ఒడలు మగ్గిపోయేలా శ్రమిస్తుంది!

    చరణం 2
    తంగం తనిత్ తంగం మాసు ఇల్ల
    తాయ్ పాల్ ఒణ్ణు మట్టుం దూసు ఇల్ల
    తాయ్ వzhi సొందం పోల పాసమిల్ల
    నేసమిల్ల...

స్వచ్ఛమైన బంగారంలో ఎలాగైతే మలినముండదో
అలా ప్రపంచంలో తల్లిపాలు మాత్రమే దూషితములేనిది!
అమ్మలేగే, అమ్మతరపు బంధువులు చూపే ఆప్యాత వేరే బంధువులు చూపలేరు.

    తాయి కైయిల్ ఎన్న మందిరమో
    కేప్ప కలియిల్ ఒరు నెయ్ ఒzhuగుం
    కాయంజ కరువాడు తేన్ ఒzhuగుం
    అవ సమైక్కైయిలే...

తల్లి చేతిలో ఏమి మంత్రముందో తెలియదు; 
ఆమె చేసే రాగి సంగటిలో నెయ్యి కారుతుంది,
ఎండు చేపకూరలో తేనె రుచుంటుంది!
అమ్మ వంటలోనే సాధ్యమిది...
(అమ్మ చేతి వంట రుచి అటువంటిది)
    సొందం నూఱు సొందం ఇరుక్కుదే
    పెత్త తాయిపోల ఒణ్ణుం నెలైక్కుదా?
    సామి నూఱు సామి ఇరుక్కుదే
    అడ తాయి రెండు తాయి ఇరుక్కుదా?
బంధాలు వంద బంధాలున్నాయి
కన్న తల్లి ప్రేమకు సరివచ్చునా?
దేవుళ్ళు వందలకొద్ది ఉన్నారు
అయితే, తల్లి మాత్రం ఒక్కరేగా?కవిరారాజు వైరముత్తు గారికి అభినందనలు. 
ఈయన కవితలకు త్వరలో Nobel Prize వస్తుందని ఆశిస్తున్నాను...


-------------------------------------------------------------------------
చిత్రం : తెన్మేఱ్కు పరువక్కాట్ఱు (నరృతి ఋతుపవనము)
సంగీతం : రఘునందన్
గళం : విజయ్ ప్రకాష్
దర్శకత్వం : సీను రామస్వామి
================================================================
జెముడు-jemuDu / నాగుతాళి-nAgutALi / నాగుదాళి-nAgudALi

కోరంకిపిట్ట - kOraMki piTTa /  పూరేడుపిట్ట - pUrEDupiTTa


===================================================================
Search words : vairamuthu, vairamuttu, national award lyrics, tamil, telugu translation, meaning,
then merku paruvakkarru, thenmerku paruvakatru, paruvakarru, image, picture
===================================================================

20 జూన్ 2011

Home-work రాయని దేవుడు, ఆ శ్రీవెంకటేశుడు…కొన్నేళ్ళక్రితం నేను ఏకాకిగా బెంగుళూరిలో ఉన్నప్పుడు మా అమ్మ నాన్నలు వచ్చి కొన్ని నెలలు  నాతోపాటు ఉండి వెళ్ళేవారు. వారితోబాటు మా అన్నయ్య గారి అబ్బాయి కూడా వచ్చేవాడు. వాడికి అప్పుడు 3 యేళ్ళుండేవి. చిన్నప్పట్నుండే మా అమ్మ నాన్నలు వాణ్ణి నిద్రపుచ్చేందుకు పాటలు పాడేవారు.  వాడు ఆ పాటలువింటూ నిద్రపోయేవాడు. “రామా లాలీ, మేఘశ్యామా లాలీ…”, “కస్తూరి రంగ రంగ…” వంటి పాటలు అడిగి మఱీ పాడించుకునేవాడు.

బెంగుళురికొచ్చినపుడేల్లా, నన్నుకూడా పాడమని ఏడిపించేవాడు. నాకు పాడటం చేతకాదన్న వినేవాడు కాదు. అప్పుడు నేను సెల్ ఫోన్ లో కొన్ని పాటల్ని ప్లే చేసేవాణ్ణి. అవి వింటూ  నిద్రపోవడమో, లేక నేర్చుకోవడమో చేసేవాడు. అలా నా దగ్గర అలవాటుపడినపాటల్లో కొన్ని “చందమామ రావే…” అన్న సిరివెన్నెల పాటా, “కొండలలో నెలకొన్న…” అన్న అన్నమాచార్య కీర్తన వంటివి.

“చందమామ రవే…” లో “గోగుపూలు అంటే ఏంటి, బాబాయ్?” అని అడిగేవాడు. “కొండలలో నెలకొన్న…” పాటకి అర్థం అడిగేవాడు. “కొండలలో నెలకొన్నవాడు అంటే శ్రీవెంకటేశుడు, దేవుడు!” అని చెప్పి ఆ పాట నేర్పించాను. వాడు చెన్నై వెళ్ళాక కూడా ఆ పాటలు ఆల గుర్తుపెట్టుకుని పాడుకుంటూ ఉండేవాడట. నేను వెళ్ళినప్పుడెల్లా పాడమనేవాడు.

కొన్నాళ్ళకి బళ్ళో(School) వేశారు. LKG, UKG లు అయ్యాయి. ఒకటో తరగతప్పుడు, ఒకానొక రోజు వాళ్ళ అమ్మ (మా వదిన గారు) ఫోన్ చేశారు. వాడు హోం-వర్క్ నోట్స్ రాయనంటున్నాడని! ఎందుకు అని అడిగితే “దేవుడే హోం-వర్క్ రాయడు. నేను మాత్రం ఎందుకు రాయాలి?” అంటున్నాడట. అలా ఎవరు చెప్పరని అడిగితే “బాబాయ్ నేర్పించాడు” అన్నాడట. నేను షాక్ అయ్యాను.

“కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు” పాటలోని “రాయడు వాడు” కి ఇలా “హోం-వర్క్ నోట్స్ రాయడం, చదవడం” లాంటి అర్థాలు వెతుక్కున్నాడు ఈ పిల్లాడు.  అందుకే అన్నమయ్య ఇలా అన్నారేమో “ఎంత మాత్రమున యెవ్వరు తలచిన అంతమాత్రమే నీవు”

17 జూన్ 2011

శ్రీపురము – నిజమైన సిరినివాసము…


తమిళనాడులో, వేలూరు సమీపానున్న శ్రీపురం బంగారు గుడికి వెళ్ళాలన్నారు ఆషా వాళ్ళ పెద్దమ్మ. ఆ శ్రీమహాలక్ష్మి గుడి సాయంత్రంపూట చూస్తే బాగుంటుందని శుక్రవారం సాయంత్రం నాలుగున్నరకు బెంగుళూరునుండి నిర్గమించాం.  బెంగుళూరు-చెన్నై రహదారి బాగుంటుంది. బెంగుళూరు నుండి 210 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బెంగుళూరు సిల్కుబోర్డు సిగ్నల్ నుండి  కారులో వెళ్తే మూడున్నర, నాలుగు గంటల్లో శ్రీపురం చేరుకోవచ్చు. వేలూరు చేరే ముందే పళ్ళెకొండ అనే ఊరుదగ్గర ఒక సుంకగవను(Toll Gate) వస్తుంది, ఆ సుంకగవనుండి ఒక కిలోమీటర్ వెళ్ళాకా కుడివైపుకు వెళ్ళే రోడ్డు తీసుకోవాలి(Sign boards చాలానే ఉన్నాయి). ఆ రోడ్డులో 14 కిలోమీటర్లు వెళ్తే శ్రీపురం వస్తుంది.


ఆ రోడ్డు నాకు బాగ అలవాటు, 3 గంటల్లో చేరుకోవచ్చనుకున్నాను. మధ్యలో ఓ 30 నిముషాలు అల్పాహారానికి అడయార్ ఆనంద భవన్ వద్ద ఆపాము. శ్రీపురం చేరేటప్పటికి మాకు 7:55 అయింది. గుడిలోపలికి ప్రవేశం ఎనిమిదింటివరకే. ఆపైన ప్రవేశం లేదు. లోపలికి వెళ్ళాక 10:00 వరకైనా ఉండచ్చు గుడిలో. మేము హడావిడిగా కారు పెట్టేసి వరుసలో నిలుద్దామని వెళ్ళాము(Queue-ని తెలుగులో "క్యూ" అని రాయాలా?). అక్కడ రెండు ప్రవేశద్వారాలున్నాయి. ఒకటి ఉచిత దర్శనానికి, మఱొకటి మూల్య దర్శనానికి (తిరుమలలోని త్వరిత (Quick) దర్శనంలాంటిది కాదు). అక్కడున్న సిబ్బందిని “రెంటికీ ఏం తేడా?” అని అడిగితే, అతను “తేడా పెద్దగా ఉండదండి, మూల్య దర్శనమైతే ఒక 10 నిముషాలు గర్భగుడి ముందు కూర్చోవచ్చు. ఉచిత దర్శనం అలా అమ్మవారిని దర్శిస్తూ వెళ్ళిపోవాలి. నడవవల్సిన వరస(Queue) మాత్రం అందఱికీ ఒకటే.” అన్నారు. ఎలాగూ చీటీ ఇస్తున్నారు, డబ్బులు గుడినిర్వాహులకే వెళ్తుంది కదా అని ఆష వాళ్ళ మామ చీటీలు తీసుకుందాం అన్నారు.

గుడిలోకి నడవడం మొదలు పెట్టాము. ఆ దారి 15 అడుగుల వెడల్పుతో  గర్భగుడి చుట్టూ  నక్షత్ర (శ్రీచక్రం) ఆకారంలో ఉంది. ప్రతిఒకరూ ఆ నక్షత్ర ఆకారంగల ఆ దారిలోనే వెళ్ళాలి. ఆ దారి పొడవునా ఇరువైపులా నునుపురాతిబండలతో తిన్నెలు అమర్చారు, భక్తులు నడిచి అలసినప్పుడు కూర్చోడానికి. పైన కప్పుకూడా ఉంది. పచ్చిగడ్డి, అందమైన పూలచెట్లూ, అలంకారపుమొక్కలూ ఉన్నాయి ఇరువైపులా.  మధ్యలో బంగారు గుడి కనబడుతూ ఉంటుంది. రాత్రిపూటకాబట్టి  విద్యుత్తుదీపాలకాంతిలో కనకమలా మెఱుస్తూ రమ్యంగా కనబడుతుంది. అక్కడ నడుస్తున్నప్పుడు ఆ దృశ్యము కలిగించే అనుభూతిని మాటల్లో చెప్పడం అలవికాదు. వెళ్ళి నడిస్తేనే తెలుస్తుంది.

నక్షత్రాకార దారి చివర ఇంకో గుండ్రమైన దారిలో నడవాలి. మధ్యలో గర్భగుడి.  దారికీ గర్భగుడికీ మధ్యలో నీరు.  బంగారు స్తంభాలూ, వాటిమీదున్న గాలి గోపురమూ, దీపాలకాంతీ నీటిలో ప్రతిబింబిస్తుంటే చూస్తూ అక్కడే నిలిచిపోవాలనిపిస్తుంది.  నీటికొలను మధ్య  గుడి ఉన్నట్టు నిర్మించారు. చుట్టూతిరిగి వస్తే గర్భగుడి వాకిలి అక్కడ మూల్యదర్శన చీటీలు పనికొచ్చాయి. చీటీలున్నవారిని గర్భగుడిముందున్న చిన్న కూటములో కూర్చోబెట్టారు. మిగిలినవారు అలా నడుస్తూ దర్శనం చేసుకోవాలి. 
 
అక్కడ కూర్చుని అమ్మవారిని చూస్తుంటే చిన్నప్పుడు వినీవినీ కంఠోపాఠమైన “క్షీరసాగర మథనం” లోని కంద, సీస, తేటగీతి పద్యాలు మదిలో మెదిలాయి. పోతన వర్ణించిన  శ్రీదేవి ఇన్నాళ్ళూ మదిలో ఊహాచిత్రంగానే ఉండేది. పాలకడలిలో ఆవిర్భవించిన ఆ జలజాక్షి ఇక్కడ, ఇవాళ నాకు దృశ్యకావ్యమైనట్టుంది. చుట్టూ నీళ్ళు, మధ్యలో తొలకరితెచ్చిన మెఱుపుకాంతికి ఏమాత్రమూ తీసిపోని బంగారు భవనము. భవనము మధ్యలో వెలిసిన అతిలోకసుందరి!  శ్రీమహాలక్ష్మి! ఆమె సొబగు వర్ణనాతీతం. అలంకరించిన విధానం చూస్తుంటే, సముద్రుడు కన్యాదానం చేస్తూ  పుట్టినంటి కానుకగాయిచ్చిన స్వర్ణాభరణాలు, లాంఛనాలూ అన్నీ ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది.దర్శనం అయ్యాక కొంచం అవతల నెయ్యిదీపాలు వెలిగించుతున్నారు. మా ఆవిడకూడా ఒక దివ్వె తీసుకుని వెలిగించింది.  దివ్వెపట్టుకుని వెళుతున్న మా ఆవిడకూడా ఓ క్షణం అమ్మవారిలా గోచరించింది నాకు! ఇవీ, మా శ్రీపురం యాత్ర విశేషాలు.

అదనంగా మఱికొన్ని విశేషాలు :
  • కోట్లు ఖర్చుతో, బంగారుపూతపూసి గుడి కట్టిస్తేగానీ మీ దేవుడో, దేవతో అక్కడ నివాసం చెయ్యరా? అని అడిగేవారికోసం (ఉషశ్రీ గారి శైలీలో) నా సమాధానాలు.
ఏ దేవుళ్ళ నివాసానికి కోట్లుఖర్చుపెట్టనక్కర్లేదు, గుళ్ళుకట్టనక్కర్లేదు. నిర్మలమైన మనసుతో నిశ్చలంగా ఉండగలిగినవారికి సర్వత్రమూ దేవతానివాసాలే.
  •  మఱెందుకు అంత ఖర్చుపెట్టి గుడికట్టించడం? నువ్వు వెళ్ళడం?

ఓ వ్యక్తి అంత డబ్బులు పెట్టి(చాలా వరకు స్వంత డబ్బేనట) ఒక గుడి నిర్మించాలని ఎందుకనుకున్నాడు? అన్నికోట్ల డబ్బులున్న మనిషి ఇంకా ఇంకా ఆస్తులు సంపాదించుకుంటూ హ్యాప్పిగా లైఫ్‌ని ఎంజాయ్ చేసుండచ్చు కదా? వచ్చిన భక్తులు కాసేపైనా ఆ గుడిప్రాంగణంలో ప్రశాంతత పొందాలనుకున్నాడు. అలా చెయ్యడంలో ఆయనకీ ప్రశాంతతకలిగుండచ్చు.  గుడికట్టించాలనుకున్న ఆయన భక్తిని మెచ్చుకోవాలి.


=================================================
పైన చెప్పిన బమ్మెర పోతన గారి భాగవత పద్యాలు(పుస్తకం చూసే రాశాలెండి) : 
తొలుకారు మెఱుగుకైవడి తళతళ మని మేను మెఱవ ధగధగ మనుచు
గలుముల నీనెడుచూపుల చెలువంబుల మొదలిటెంకి సిరి పుట్టె నృపా

పాలమున్నీటి లోపలిమీది మీగడ మిసిమిజిడ్డున చేసి మేను వడసి
క్రొక్కారు మెఱుగుల కొనలక్రొత్త తళుకుల మేనిచే గలనిగ్గు మెఱుగు నేసి
నాటీనాటికి బ్రోదిసవకంపుదీవల నునుబోదనెయ్యంబు నూలుకొలిపి
క్రొవ్వరు కెంవమ్మికొలకున బ్రొద్దున బొలసినవలపున బ్రోది వెట్టి

పసిడిచంపకదామంబుబాగుగూర్చి, వాలుక్రొన్నెల చెలువున వాడి దీర్చి
జాణతనమున చేతుల జడ్డు విడిచి నలువ యీ కొమ్మ నొగిచేసినాడు నేడు.

కెంపారెడు నధరంబును, జంపారెడినడుము సతికి శంపారుచుల
సొంపారు మోముకన్నులు, బెంపారుచు నొప్ప గొప్పపిఱుదును గుచముల్.
బాబూ, ఒక్కముక్కకూడా అర్థంకాలేదు ఈ పద్యాలకు అర్థం చెప్తావా అంటున్నారా? త్వరలో రాస్తాలెండి!

=================================================
Search words : Sripuram, Vellore, Golden Temple, Narayani peedam / peetham, mahalakshmi temple, ksheerasagara mathanam, telugu
=================================================

15 జూన్ 2011

శిరిడి విశేషాలు...

గతవారమంతా ప్రయాణాలతో బిసి బిసిగా ఉన్నాను.  ఆష వాళ్ళ పెద్దమ్మ వచ్చే నెల అమెరికా వెళ్తున్నారు. ఆమె అమెరికా వెళ్ళేలోపు శిరిడి సాయిబాబని దర్శించాలంటే నెలకు ముందే ప్లాన్ చేసుకున్నాం.  ఆష  వాళ్ళ పెద్దమ్మ, మామ, ఇద్దఱు తమ్ముళ్ళు, మేమిద్దఱం - మొత్తం ఆఱుగురం.  బెంగుళురు నుండి డైరెక్ట్ శిరిడికి ట్రెయిన్ ఉంది. వారానికి ఒకరోజే. మంగళవారం ఉదయం 7:30కి. మఱునాడు ఉదయం 8:30కి శిరిడి చేరుకుంటుంది.  చేరుకున్నాం. రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అఖిల భారత్ సంస్తాన్ ట్రస్టు వాళ్ళు నడిపే భక్తుల విడిదిలో రూం తీసుకున్నాం(ముందే బుక్ చేసుకోవాలి). బహు శుభ్రంగా ఉన్నాయి గదులు. ఆశ్చర్యమేసింది అందఱు వచ్చిపోయేచోట అంత నీట్నెస్ ఎలా మెయింటెయిన్ చేస్తున్నారా అని. ఎప్పుడూ రద్దీగానే ఉంటుందనిపించింది. అయినా అక్కడి సిబ్బంది మాత్రం బంధువులకు తొలిరోజు చూపే ఆత్మీయతను చూపుతూ అతిథి మర్యాదలు చేస్తున్నారు. వాళ్ళ సేవాభావానికి జోహార్లు.

ఆ విడిది భవనం నుండి మందిరం ఒక కిలోమీటర్ కన్నా తక్కువ దూరమే. నడవచ్చు. ఆటోలూ దొరుకుతాయి. మేము ఆటోలో వెళ్ళాము.  10:30కి దర్శనాని వరుసలో నిలుచున్నాము. పెద్ద వరుసే.  దర్శన వరుసలో నిలిచే ముందు అక్కడున్న ఒక కాపలా సిబ్బందిని హిందీలో "దర్శనానికి టిక్కెటేమైనా తీసుకోవాలా?" అని అడిగాను. "తెలుగువాళ్ళు టిక్కేట్ తీసుకోనక్కర్లేదు" అని హిందీలో చమత్కరించాడు. నవ్వుకుంటూ, "మనం తెలుగోళ్ళమని ఇతనికెలా తెలిసిందబ్బా?" ఆలోచిస్తూ ఉన్నా కాసేపు. ఆ గుడికి వచ్చే భక్తులను భాషవారిగా లెక్కపెడితే తెలుగువారే ఎక్కువ సంఖ్యలో ఊంటారు. ఒకటిన్నరగంట తర్వాత, మేము సాయిబాబ గర్భగుడి(సమాధి??) చేరుకున్నాం. మేము లోపలికి వెళ్ళేసరికి  సమయం 12:00 అయింది. అప్పుడు హారతి సమయమట. అందఱికి ఆనందం హారతి సమయానికి అక్కడికి చేరుకున్నామని. హారతి ఇచ్చే ఆ 45 నిముషాలు అక్కడే కూర్చున్నాము. బాగా కనబడుతుంది సాయిబాబ విగ్రహం. హారతిస్తుంటే అందఱూ భక్తి పారవశ్యంతో భజనచేస్తూ, జపిస్తూ, చప్పట్లుకొడుతూ ఊగిపోతున్నారు. అప్పటివరకు సాయిబాబా అనే పేరుతప్ప ఇంకేమీ తెలియని నాకు ఏం చెయ్యాలో అర్థంకాక అలా కూర్చున్నా.నాకు సాయిబాబా గురించి ఏమీ తెలియదు. కారణాలు, మా ఇంట్లో వారెవరికీ సాయిబాబా గురించి తెలియకపోవడమో, లేక మా తాతగారి రోజుల్లో సాయిబాబ ఇంత ఫేమస్ కాకపోవడమో, “విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, వైష్ణవమే సర్వంబును ” అనేరీతిలో నా బాల్యంలో మొదటి 10 యేళ్ళలోపే నా బ్రెయిన్ ని ప్రోగ్రాం చేసేయడమో, లేక 10వ యేట చోటుచేసుకున్న దుర్ఘటన ప్రభావంతో నాస్తికత్వానికి దగ్గరకావడమో కూడా కావచ్చు. మానవారాధనకు నా మనసు అంగీకరించకపోవడంకూడా కారణమయ్యుండచ్చు.

హారతి అయిపోగానే ఇంకకాస్త దగ్గఱికివెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనమయి భయటొచ్చేసరికి 1:20 అయింది. మళ్ళీ అఖిల భారత సంస్తాన్ విడిదికి వెళ్ళి భోజనాలకు కూర్చున్నాం. అద్భుతమైనా భోజనం పెట్టారు. ఉచితంగా! అక్కడ విడిది చేసినవారికి మాత్రమే. భోజనాలు చేసి మళ్ళీ మందిరానికి వెళ్ళి ప్రసాదం, విభూతి అవి తీసుకుని వచ్చి సాయంత్రం 6:30 ట్రెయిన్ కి బెంగుళూరు దారిపట్టాం. గురువారం రాత్రి 9:00కి ఇల్లు చేరుకున్నాం. అది మా శిరిడి ప్రయాణ విశేషాలు.

శుక్రవారం  సాయంత్రం తమిళనాడులో, వేలూరు దగ్గరున్న బంగారు గుడికి(Golden Temple or Sripuram) వెళ్ళాం. అక్కడి దేవత "శ్రీమహాలక్ష్మి". ఆ విశేషాలు మఱో టపాలో రాస్తాను.