29 సెప్టెంబర్ 2011

ఈ యుద్ధం ఓటమికోసమే...

ఇంతకాలం నా దారిలో యే అడ్డంకులూలేవు
ఏ దేవత పంపిందో నిన్ను,
నా దారిపొడవునా తీపి అడ్డంకివై వ్యాపించావు!

"నా దారి తప్పుకో" -
మదిలోని ఈ మొగ్గ భావాన్ని
పెదవుల్లో పూయించాలనుకున్నా!
నీ మోహనరూపు మహత్యమేమో
నా పెదవులు చేరగానే
నీ పూజకోసమే అన్నట్టు
చిరునవ్వుగా వికసించింది!

నిముషానికి వందసార్లనుకుంటాను
దురమైపోవాలని - అదేంటో
క్షణానికి లక్ష సార్లు దగ్గరైపోతున్నాను!

వద్దనుకుంటూనే కావాలనుకునే ఈ వింత
నువ్వు నేర్పిన ఓ కొత్త విద్య!

మామూలు పదములు తీయనవుతాయనీ,
బరువైన భావాలను తెస్తాయనీ - అవి
నా చిత్తాన్ని చిందరవందర చేస్తాయనీ
నీ పెదవుల దాటేవరకు తెలియదు నాకు!

ఎలా నవ్వితే నా నిష్ట కరిగిపోవునో
ఎలా చూస్తే నా వైరాగ్యం హద్దుదాటునో
నీకు బాగా తెలిసిపోయింది!
నా అణువణువును కలవరపెట్టే
ఆ లేత నవ్వులనుండీ, కోంటె చూపులనుండీ
కాపాడుకునే ఉపాయమొకటి ఇప్పటికిప్పుడే కనుక్కోవాలి!

నన్ను ముక్కలుముక్కలుగా కాకుండా
మొత్తాన్ని ఒకేక్షణంలో వశపరుచుకోవలసింది!
ఇప్పుడుచూడు, నీవశంకాకుండా శేషమున్న ముక్కలు
నీమాయలోనుండి తప్పించుకోడానికీ,
నీవశమైన ముక్కల్ని విడిపించుకోడానికీ
నీకెదురుగా గూడుపుఠాణీలు చేస్తున్నాయి!


"వశమయినదే ఎక్కువ -
శేషమున్నది తక్కువేలే" అని సంబరపడకు!
గుర్తుందిగా కురుక్షేత్రం?

అబ్బా, అంతలోనే మొహమలా పెట్టేసి
కలవరపడిపోకు - ఇవి పైపై మాటలే!

రహస్యం చెప్తాను - శేషమున్న ముక్కలు
యోధుల్లా యుద్ధరంగంలో గర్జించినా
అంతరంగంలో అర్థించేది నీపొందుకోసమే
ఈ ఓటమంతా ఆ గెలుపుకోసమే!

25 సెప్టెంబర్ 2011

ఆంధ్ర రాష్ట్ర విభజన : అవినేని భాస్కర్ - "అరవ" భాస్కరన్ అయిన కథ...

మనదేశ స్వాతంత్రానికి ముందువరకు చిత్తూర్ జిల్లాకీ, నెల్లూర్ జిల్లాకీ దక్షిణంగా ఆనుకునియున్న తమిళనాడు జిల్లాల్లో తెలుగువారి సంఖ్యే ఎక్కువగా ఉండేదిట. మదరాసు ప్రెసిడెంసిగా ఉన్నప్పుడుకూడా అదే పరిస్థితిట. కొన్ని అనివార్య కారణాలవలన, ఉన్నతమైన ఉద్ధేశంతో, ఉత్తమ నాయకులు కొందరు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుకున్నారు. జిల్లాలో ఎక్కువగా తెలుగువారుంటే ఆ జిల్లాని ఆంధ్ర రాష్ట్రంలోనూ, తమిళులుంటే తమిళనాడులోనూ కలిపేశారు. అప్పట్లో మదరాసు పట్టణము, ధర్మపురి, ఆర్కాడు, చెంగల్పట్టు జిల్లాల్లో ఎక్కువగా తెలుగువారే ఉన్నప్పటికీ కొందరు తమిళ నాయకులు తమ రాజకీయ లబ్ధికోసం కొన్ని ఎత్తుగడలేసి ఈ జిల్లాలను తమిళనాడులో కలిపేశారట. 


ధర్మపురి & కృష్ణగిరి జిల్లాలు :

ఇది అప్పటి కాంగ్రస్ నాయకులు రాజాజీ అనబడే రాజగోపాలాచారి గారి సొంత జిల్లా! ఆయన అప్పటికే తమిళుల మధ్య పలుకుబడిగల నాయకుడు. తన సోంత ఊరూ, జిల్లా ఆంధ్రాలో కలిసిపోతే ఇటు తమిళనాడు రాజకీయాల్లోనూలేక, అటు ఆంధ్ర రాజకీయాల్లోకీ వెళ్ళలేక అయోమయం అవుతాడుగనుక తమ జిల్లాను తమిళులు ఎక్కువవున్న జిల్లాగా ప్రకటించి తమిళనాదులోకి కలిపేశారు. ఇప్పటికీ ఇక్కద గ్రామాలపేర్లు తీసుకుంటే తమిళ, కన్నడ పేర్లకన్నా తెలుగు పేర్లే ఎక్కువ. 


చెంగల్పట్టు (ఇప్పుడు తిరువళ్ళూర్ & కాంజిపురం) జిల్లా :

అప్పటి మదరాసు ప్రెసిడెంసీ రాజధాని మదరాసే. ఈ మదరాసు(చెన్నై) చెంగల్పట్టు జిల్లా మధ్యభాగాంలో ఉంది. చెంగల్పట్టు జిల్లాని తెలుగు జిల్లాగా గుర్తిస్తే ఇక మదరాసుపట్టణం కూడా ఆంధ్రాకే ఇవ్వాలికదా? మదరాసుని కోలిపోడానికి ఇష్టంలేని నాయకులు చెంగల్పట్టు జిల్లాని తమిళజిల్లాగా కల్పించారు. 


ఆర్కాడు జిల్లా (ఇప్పుడు వేలూర్ జిల్లా) :

పడమటిదిశలోని ధర్మపురినీ, తూర్పుగాయున్న చెంగల్పట్నీతమిళనాడులోకి కలిపేశాక మధ్యలో ఉన్న ఆర్కాడుని ఆంధ్రాలోకి కలిపితే ధర్మపురి జిల్లాకి దారెలా? అందుకని ఈ జిల్లా పొలిమేరలుకూడా తమిళంతోనే గీసేశారు. ఈనాటికీ  జ్యోతిష్యులు చాలావరకు వాడేది ఆర్కాడు తెలుగు పంచాంగాలే. 

మిగిలిన తమిళనాడు జిల్లాల్లోకూడా తెలుగువారున్నారు. సంఖ్య తక్కువ అంతే. 
అధికారభాష

మొదట్లో ఈ ప్రాంతాలలో ఎక్కువగా తెలుగు బళ్ళుండేవి. బళ్ళుంటే చాలా? బల్లలమీదకూడా తెలుగే ఉండాలికదా? ఈ ప్రాంతాల్లో  అధికార భాష తమిళం గనుక ప్రతిచోటా తమిళంలోనే రాయబడ్డాయి. ఇది కొంతవరకు యుక్తిపూర్వకంగానే చేశారు. ఉద్యోగాలకోసమనో, మరికొన్నిసౌకర్యాలకోసమనో తమపిల్లల్ని తమిళం చదివించక తప్పలేదు ఈ ప్రాంతంలోని తల్లి తండ్రులకి. అక్కడితో ఆగలేదు - ఉద్యోగాలివ్వడంలోకూడా తెలుగుపేర్లున్నవారిని వెనక్కిపెట్టేవారట. తమ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యకర్తలు అందరూ తమిళులే ఉంటే ఇక ఇక్కడ తెలుగువారికి తమిళం నేర్చుకోడం తప్పనిసరైయింది. తెలుగుబళ్ళకు పిల్లలులేక క్రమేనా మూతబడుతున్నాయి తెలుగు స్కూల్లు. అందులోని ఉపాద్యాయులుకూడా ఉద్యోగం అవసరంగనుక 10వ తరగతి తమిళ పేపర్ పరిక్షరాసి తమిళ స్కూల్లలో పనిచెయ్యడానికి వెళ్ళిపోయారు. మా బంధువుల్లో ఎందరో ఉపాద్యాయులు ఇలా చేశారు పాపం.

ఇక్కడ బడిపంతులు మొదలుకొని, విలేజ్ ఆఫీసర్ వరకు తమిళులే. వీరికి అనధికారంగా ఏమైనా ఉత్తరవులిచ్చారో ఏమో మరి. వీలైనంతవరకు ఇక్కడవాళ్ళను తమిళవారుగా చేసిపడేశారు. ఎలా?


ఊర్ల పేర్లు :

ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఊరిపేర్లలో జాతిపేర్లుండేటివి. జాతిపేర్లను తొలగిస్తాం అంటూ వాటిని తమిళ ఊర్లుగా మార్చేశారు...
నరసింహరాజు పేట --> నరసిమ్మన్ పేట్టై
మునసామి నాయుడు కండిగ --> మునసామి కండిగై
బుచ్చిరెడ్డి పల్లె --> పుచ్చిపల్లి
గొర్రెదాటుబెట్ట --> కేత్తాండన్ పట్టి
గొల్లకుప్పం --> కొళ్ళిక్కుప్పం
కావేరిరాజులుపేట --> కావేరికారిపేట్టై
సూరరాజపట్టెడ --> సూరాజిపట్టడై
ఇలా చాలా తెలుగుళ్ళుకు తమిళులు నామాలేశారు!


వ్యక్తుల పేర్లు :

జనాబ సంఖ్యలెక్కరాసే అధికారీ, రేషన్ కార్డిచ్చేవాడూ, ఎలక్టోరల్ అధికారీ వీరందరూ కూడా ఇలా రాసేసేవారు...
సుందరమ్మ --> సుందరామ్బాళ్
దేవకమ్మ --> దేవగి అమ్మాళ్
చిన్నబ్బ --> చిన్నప్పన్
కుప్పయ్య --> కుప్పన్ / కుప్పయ్యన్
శ్రీనివాస్ --> శ్రీనివాసన్
కేశవులు --> కేసవన్
రామకృష్ణ --> రామకిరుష్ణన్
జ్యోతి --> జోది
రాఘవులు --> రాగవన్
రాహుల్ --> రాగుల్

రేషన్ కార్డులోనో, వోటర్ కార్డులోనో అచ్చయి వచ్చాక చూసుకుని బాధపడేవారు ఉన్నారు, అసలు వాటిగురించి అసలు ఆలొచించని వారూ ఉన్నారు. మార్చుకోవాలని ఆశవున్నా ఆ గవర్నమెంటు ఆఫీసులు చుట్టు తిరిగాలన్న భయంతో ఇప్పుడు పేరిలా ఉంటే వచ్చే నష్టం ఏముందిలే అని సర్దుకునేవారూ ఉన్నారు.

ఇలా తమిళనాట ఎందరో తెలుగువారు తమ ఐడెంటిటీని కోలిపోయారు. 

ఇది కేవలం ఐడెంటిటి కోలిపోవడంమాత్రమే కాదు, తెలుగుతనానికి దూరమవ్వడం, తెలుగు సాంప్రదాయాలు తెలియకపోవడం, భాష మరిచిపోవడం వంటి పెద్ద నష్టాలూకూడా జరిగిపోయాయి. ఎందరో తెలుగువారి ఇళ్ళల్లో పాతికేళ్ళలోపున్నవారు తెలుగు మాట్లాడ్టంలేదు. తెలుగు నాలుకలమీద తమిళ సరస్వతి సింహాసనమేసుకుంది. వారి మాతృభాష తమిళమే అన్న పరిస్థితి తయారైంది.

=================================================

తెలుగుభాషాభిమానంగల కుటుంబంలోపుట్టిన నాపేరుకూడా ఇలానే చెలామని అవుతుందంటే ఆ తమిళీకరించే తీవ్రత ఎంతగా ఉంటుందో ఆలోచించండి. 

1989 వరకు బర్త్ సర్టిఫికేట్ కంపల్సరి కాదు మనదేశంలో. పదో తరగతి మార్కు షీట్లో ఏముందో అదే పేరు. నేను అంతకుముందే పుట్టానుగనుక నా పదవతరగతి నార్కుషీటులో ఓ తమిళుడు నా పేరుకు అరవరంగేసేశాడు.  ఇంట్లో నాకు భాస్కర్ అని పేరుపెట్టారు. బళ్ళో రాయగా "A BHASKAR" అని రాశారు. పదవ తరగతి పరీక్షలకు మునుపు ఫార్మఫిల్ చెయ్యాలి...

Name : BHASKAR
Initials : A

నేనిలా రాసిస్తే, చివరికి మార్కుషీట్లో "BHASKARAN N" అని వచ్చింది. తమిళులకి ఇంటిపేరుండదు, పేరుకు చివర తమ తండ్రిపేరు మొదటి అక్షరాన్ని అంటించుకుంటారు. నాకూ అలానే మా నాన్న పేర్లోని 'N' తీసి అంటించేశారు. నా రిజిస్టర్ నెంబర్, మార్కులు అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి.  ఏజుకేషన్ డిపార్త్మెంట్ లోని వెర్రి క్లెర్కు చూపిన తమిళ అభిమానాన్ని చూసి నేను గోలుగోలుమని ఏడ్చాను! పేరు మార్చడానికి అప్లై చేస్తే రాడానికి 3 నెలలవుతుందన్నారు. పైన చదవాలంటే మార్కుషీటు కావాలి కదా? అంతవరకు ఎలా ఆగడం? తెలిసిన ఒక మాస్టారుని సలహా అడిగితే,

"ఉండిపోనీలేవయ్యా, ఇలా ఉంటే ప్రభుత్వ ఉద్యొగాలకు అప్లై చేసినప్పుడు పక్కనపెట్టరు" అని సెలవిచ్చారు.

 ఇలా ఎందరో తెలుగువారు తమిళులుగా చెలామనియవుతున్నారు!

04 సెప్టెంబర్ 2011

చెల్లాయికి...


ఈ కార్తీకమొస్తే ఇరవైరెండు వసంతాలొస్తాయి నీకు.
దారిన వెళ్ళే కొత్త జంటలూ,
పట్టుచీరల, నగల కొట్లవారి భారీప్రకటనలూ
గుర్తుచేస్తున్నాయి - నీకు వరుడ్నిచూడాలన్న నా బాధ్యతను!

చక్కగా చదువుకున్నావు
ఉద్యోగం చేస్తున్నావు
చేతినిండా సంపాదిస్తున్నావు
నీకు సరితూగే వరుడ్ని కనుక్కోవాలి!
ఎక్కడ వెతకాలి మంచివారిని?
ఆ మంచివారిలో సరైన వరుడెవరనని ఎలా తెలియాలి?
కనుపాపలా నిను కాచుకునే పురుషోత్తముణ్ణెలా గుర్తించాలి?

ఎవరినైనా వలపించావా అనడిగాను
నువ్వు వలపించేంత గొప్ప పురుషపుంగవులెవ్వరినీ
ఇదివరకు కలుసుకోలేదన్నావు.

నా స్నేహితుళ్ళో ఎవరికీ
నిను వరించే యోగ్యత లేనట్టే అనిపిస్తుంది!
నీ స్నేహితులను పరిశీలిద్దామనుకున్నాను
ఎవరూ నెగ్గరు!

కోట్లూ, కనకాభరణాలూ అడిగేవాళ్ళను
మగవారిగా పరిగణించలేకున్నాను

నేనుకోరుకునే గుణసంపదలుకలిగిన ఒకరిద్దురు పురుషశ్రేష్టులు
దైనికభత్యంతో పూటగడిపే దశలో ఉన్నారు
అంటే నిను రాణిలా చూసుకోడం వారికి వీలుకాదు!
నువ్వు పేదలింట కష్టాలు పడటం
ఓర్వలేను నేను!

మన ఇంటేమీ కనకపుకంచంలో తినేంత సిరుల్లేవు
నూలుబట్టలూ, రాగియంబిలితోనే పెరిగావు
మెట్టినింటైనా నువ్వు సుఖపడాలనే కోరుతుంది నా మనసు!

అందుకే వెతకాలి
అనురాగంలోనూ, గుణములోనూ, సిరిసంపదలోనూ
మేలిమైన వరుడికోసం!

రాముడే మళ్ళీ జన్మెత్తివచ్చినా తిరస్కరిస్తాను!
చిన్నితల్లీ వద్దు - 
సీతలా నిత్యం శొకిస్తుంటే చూళ్ళేను నిన్ను!

"బ్రతుకు నిత్యపోరాటం
వెనుతిరగక పోరుసాగించు -
అప్పుడే జీవితం ఆనందాల వేడుకవుతుంది"
నా మాటలను నాకే గుర్తుచేస్తున్నావా?
అది నీక్కాదు - నాకూ, నన్ను అనుసరించేవారికీ మాత్రమే!


===========================================================
 2001 ఆగస్టు 19 న తిణ్ణై తమిళ పత్రికలో ప్రచురించబడిన నా తమిళ కవితయొక్క తెలుగు అనువాదం ఇది. 
===========================================================

తమిళ కవిత లింకు...