23 ఏప్రిల్ 2014

ప్రేమ డైరీ - 005

డియర్ చెల్లం,

"నీ పలుకుల తొలి కిరణాలు సోకకుంటే  మనసుకి పొద్దు పొడవదు." - ఫోటో వెనుక నువ్వు రాసిన మాటల్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ నిన్ను చూస్తూ ఉన్నాను.

నా చీకటి జీవితాన్ని వెలుగులతో నింపేసినవి ఈ కళ్ళేనా? ఈ చిన్ని పెదాలేనా నా ప్రాణాన్ని తాగేయాలని తహతహలాడేవి? ఆ చూపులు చూడు! నాకంటూ నన్ను మిగల్చకుండ దోచుకెళ్ళాలనే ఆత్రం! హృదయాన్ని తాడుకట్టి "భావ"సాగరం చిలికేస్తున్నది నీవేనా? 

పూర్వ కవులెందరో రాసిన ప్రణయ భావాలన్నీ వట్టి మాటలుకావని నేర్పావు. లేని నా రాకుమారికై ఏకాంతంలో నేను అల్లుకున్న కలలహారాలు నీకెలా దొరికాయి? హారాలకు మరింత అందం చేకూరేలా అలంకరించుకుని నా వలపు వాకిట ఎదురొచ్చావు!

మనం పరిచయం అయిన తొలి రోజులు - అలా అలా మాయమాటలేవో చెప్తూ కంటికి కనబడే దూరంలోనే ఆగిపోతావు. అచ్చంగా బయటపడనేపడవు! చున్నీతో ఎదను కప్పేసినంత సులువుగా మొండితనంతో మనసుని కప్పేసుకుంటావు. ఇంత ఆత్మనియంత్రణనెలా అలవరుచుకున్నావో! ఇలాంటప్పుడే అనిపిస్తుంది.. నువ్వు చెప్పినవాటివల్లకన్నా, దాచిన వాటివల్లే నీ మనసునెక్కువగా అర్థంచేసుకున్నాను. నీ మాటలకంటే నీ మౌనాలే ఎక్కువ చెప్తాయి నీ భావాలేంటో అని! 

మంచుముద్ద అమ్మాయిరూపందాల్చినట్టు ఉంటావు. గాఢనిద్రసమయం మినహాయించి మిగిలిన అన్ని క్షణాల్లోనూ ఏదో ఒకరకంగా నిండిపోయుంటావు. ఏకాంతంలో చిలిపితలపులుగా, ప్రేమపొంగినపుడు భావాల తరంగాలపై ఉయ్యాలూపే చిరుగాలిగా, మనోవికార సమయాల్లో జోలలుపాడే తల్లిగా!  

పవలూ, రేయీ తేడా లేదు నీ మాయలో. కళ్ళు తెరుచున్నంతసేపూ చుట్టూ కాంతే తప్ప చీకటికి తావేలేదు.

నడిచే దారుల్లో ఊగే కొమ్మల్లోని లేత ఆకులన్నీ నీ బుగ్గల్ని గుర్తుచేస్తాయి. పువ్వులమ్మే ముసలావిడ తట్టనెత్తినబెట్టుకుని వస్తుంటే తొంగి చూసేమల్లెపూలు నీ కురులను తలపిస్తాయి. తొలిచినుకులు నేలతాకగానే వచ్చే మట్టివాసన నీ చేతులుపట్టుకున్న జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. నీ నవ్వులు విన్నప్పుడల్లా అప్పటికప్పుడు నా చుట్టూ రోజావనం! రంగురంగుల గులాబీలు.

నా పాలిట వరానివా? శాపానివా?

వరాలుగా ఎన్నో తీయని క్షణాలున్నాయి, అలరించే జ్ఞాపకాలున్నాయి.

కొన్ని శాపాలు తప్పవా? ఇన్నీ ఉన్నా... దగ్గరగా తీసుకుని నీ పెదాలలో నా ప్రాణంపోసి, పులకించిపోయే క్షణం రాదు. ఒడిజేర్చుకుని నీ ఏడుపుని నా కళ్ళతో ఏడ్చి నీ వేళ్ళతో ఓదార్పుని అందుకోవడం కుదరదు. నా చేతి రేఖలు నీ వంపుల్లో ముద్రలుగా నిలిచిపోయే తారీఖెప్పుడూ?


* * * * * * * * * * * * * * * * * * * * * * * 

2 వ్యాఖ్యలు:

Narayanaswamy S. చెప్పారు...

ముచ్చటగా ఉంది. చెల్లానికి మళ్ళీ డియరనే విశేషణం అవసరమా? :)

అజ్ఞాత చెప్పారు...

బుచికోయమ్మ బుచికి. ఏమిటీ వెర్రిప్రేమ ?