11 ఏప్రిల్ 2014

ప్రేమ డైరీ - 004

నల్లోడా,

వస్తూ వస్తూ ఏం తీసుకొచ్చావని 

వెళ్తూ ప్రతిసారీ నా ప్రాణాలు తీసుకెళ్తావ్?
ఈ కొండంత విషాదం కన్నీళ్ళుగా కరిగేదెప్పుడో!
తిరిగి నే మనిషినయ్యేదెపుడో!
 

రెండురోజులింత తొందరగా గడిచి పోతాయి అనుకోలేదు. ఈ కొన్ని జ్ఞాపకాలను మళ్ళీ నువ్వు వచ్చేంతవరకు పదిలపరుచుకోవాలి. 

సోమేశ్వరుడు గుళ్ళో దణ్ణం పెట్టుకున్నప్పుడు నీ పక్కన నిల్చున్నాను. బొట్టుపెట్టాలని చేయి తెగ ఆరాటపడిపోయింది. ప్రదక్షిణం చేసేప్పుడైనా నిన్ను దాటుకునే వంకతో అలా తాకించి వెళ్ళిపోవాలనుకున్నాను. కుదర్లేదు... నువ్వూ కుదుర్చుకోవాలనుకోవు... మొద్దు రాచ్చిప్పవి... కొండదిగేప్పుడు పిలవని చుట్టంలా వచ్చిన వాన చినుకుల్లో తడిసిపోయాము. వర్షని గుండెలకు హత్తుకుని వాళ్ళమ్మ దాని తల తుడుస్తుంటే నిన్ను కూడా అలా లాక్కుని నీ తల తుడవాలనిపించింది. నువ్వు వేళ్ళతో తల తుడుచుకుంటుంటే నేను చున్నీ చేతబట్టుకుని మౌనంగా చూస్తూ ఉండిపోయాను. నీ తలనుండి చెదిరిన చుక్కలు నా మొహంమీద పడ్డాయి. నువ్వే తాకినంత పులకింత! 

తెలుసా వర్షకి అన్నీ నీ పోలికలే. మేనమావ పోలికలెక్కడికి పోతాయిలే! రంగు మాత్రమే వాళ్ళ నాన్నది. కళ్ళూ, ముక్కూ, నుదురు, పొడవాటి వేళ్ళూ, బుగ్గలూ, పెదవులూ... దానికి ఎన్ని ముద్దులు పెట్టేశానో! నిన్నెప్పుడు ముద్దు పెట్టుకుంటాను?


* * * 

1 కామెంట్‌:

Meraj Fathima చెప్పారు...

భావుకత మళ్ళీ,మళ్ళీ చదివించింది.