18 అక్టోబర్ 2011

దయ్యాన్ని చూడాలన్న నా అపేక్ష...

[మీకు దయ్యలన్నా, దయ్యాల కథలన్నా భయమేసినా పరవాలేదు; చదవండి]

చిన్నప్పుడు zoo, సర్కస్ల లోని కొత్త జంతువుల గురించి చూసినవాళ్ళు చెప్తుంటే వాటిని నేనూ చూడాలని ఎలా ఆశపడేవాణ్ణో అలగే దయ్యాన్ని కూడా చూడాలని ఆశపడేవాణ్ణి. నాకు చీకటంటే ఎంత ఇష్టమో! రాత్రి వేళల్లో టార్చ్ లైట్ సాయంతో మా తాతా, మా నాన్నా పొలం దగ్గరకు వెళ్తుంటే నేనూ వెళ్ళాలని తెగ ఆరాటపడేవాణ్ణి. అయినా తీసుకెళ్ళరు! చీకట్లో గనిమలమీద పురుగుపుట్ర అవి ఉంటాయి వద్దు అనేవారు.


ఈ దయ్యాలు చీకట్లోనే, అదీ కొన్ని చోట్లే కనబడతాయనీ చెప్పేవారు. వాళ్ళూ, వీళ్ళూ దయ్యం చూశాము అంటే ఎంతో ఆసక్తితో వినేవాణ్ణి. నన్నూ తీసుకెళ్ళి చూపమని ప్రాదేయపడేవాణ్ణి. ఒక్కరూ తీసుకెళ్ళేవారు కాదు. మా నాన్ననో, తాతనో అడిగితే "దయ్యాలూ లేవు, భూతాలూ లేవు! జనాలలా పొద్దుపోక ఏవో అంటారు" అని నిష్కర్షగా చెప్పేసేవారు. ఎవరేమనినా, దయ్యాన్ని చూసేందుకు నేను చేస్తున్న ప్రయత్నం మాత్రం ఆపుకోలేదు. రోజూ రాత్రి భోజనం అయ్యాక, ఎక్కడైతే దయ్యాలను, కొరివి దయ్యాలను చూసినట్టు చెప్పారో ఆ దిక్కుకేసి చూస్తూ నిలుచుండేవాణ్ణి. ఒక దయ్యమైనా కనబడడేది కాదు :(

ఇలా ఉండగా ఓ సారి, వేరుశనక ఒబ్బిడి చేసిన కాలంలో మా తాత గారు పొలంలోని కళ్ళము[harvest ground] దగ్గర కాపలాకి వెళ్ళడానికి తయారవుతున్నారు. ఆ పొలం మా ఇంటినుండి కొంచం దూరంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళే దారిలోనే శ్మశానముండేది. ఆ శ్మశానం దగ్గర దయ్యాలను చూసినట్టు చాలా మంది కథలు చెప్పేవారు. ఇదే మంచి అవకాశం అనుకుని తాత గారితో, "నేనూ వస్తాను" అని మొండికేసుకున్నాను. వద్దని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. బాగా గుర్తుంది ఏడ్చాను కూడా. నాకు అప్పుడు ఆఱో, ఏడో సంవత్సరాల వయసు. ఇక లాభంలేదని అమ్మ, నాన్న ఇద్దరూ తీసుకెళ్ళమని తాతతో చెప్పారు. మా పొలంలో పనిచేసే గుండేలు(గుండు+వేలు) కూడా అప్పుడే వచ్చారు. కప్పుకోడానికి నాకో దుప్పటి అందుకుని ముగ్గరం నడవడం మొదలుపెట్టాము. టార్చ్ లైట్ పెద్దగా అవసరం రాలేదు. కొంత వెన్నెల వెలుగుంది.


శ్మశానం దగ్గరౌతుంటే నాలో పట్టలేని ఆనందం. ఏటి గట్టు దాటగానే శ్మశానం వైపుకేసి చూస్తూ నడుస్తున్నాను. నేను వస్తున్నట్టు దయ్యాలకు తెలిసిపోయిందేమో, ఒకటైనా కనబడదు. శ్మశానం దగ్గరకు కూడా వచ్చేశాము. దయ్యమే కనబడదు. ముందు తాత, వెనక గుండేలు, ఆ వెనక నేను. శ్మశానానికి నేరుగా వచ్చినా దయ్యం కనబడదు. నేను అక్కడే ఆగిపోయాను! కొంత ముందుకెళ్ళిన గుండేలు తిరిగిచూసి


"అక్కడే నిల్చుకున్నావే? రా, నైనా?" అన్నాడు.


"నడిపి రెడ్డి మామ మొన్న ఇక్కడే దయ్యాన్ని చూశారట. నేనుకూడా చూసేసి వస్తాను. మీరు పొండి" అన్నాను.


"ఇప్పుడు అవేవీ కనబడవు. మనం పదాం రా" అని వచ్చి లాక్కుని వేళ్ళాడు గుండేలు.


కాసేపటికి మా పొలంలోని కళ్ళము చేరుకున్నాము. రాశిబోసిన పచ్చి వేరుశనగ కుప్పమీద గోతము పట్టలు కప్పి, చుట్టూ రాళ్ళు పెట్టున్నారు. పక్కనే తాతకోసం ఒక నులక మంచం. ఇవతల వైపు గుండేలు పడుకోడానికి పచ్చి వేరుశనగ తీగలను పరుపులా పరచియున్నారు. ఈ ఏర్పాట్లు మా నాన్న సాయంత్రం ఇంటికొచ్చేముందు చేసిపెట్టినవి. నేను వస్తానని మా నాన్నకు తెలియదు గనుక మరో మంచం ఏర్పాటు చెయ్యలేదు. ఆ నులక మంచం మీద నేనూ తాతా కూర్చున్నాము. ఇక్కడ్నుండి శ్మశానం బాగా కనబడుతుంది. నేను మాత్రం శ్మశానం ఉన్న వైపుకి తిరిగి కూర్చుని, నాకోసం ఓ దయ్యమయినా కరుణించి దర్శనమివ్వదా అనే రీతిలో చూస్తున్నాను. వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. గాలికి కొమ్మలు ఊగడమూ, వెన్నెలా, చుక్కలూ తప్ప నా కంటికి ఒక దయ్యమూ కనబడలేదు :(


కాసేపటికి పడుకోమని చెప్పి మంచంమీదనుండి లేచి పక్కనున్న వేరుశనగతీగల పరుపుమీద తన శాలువా పరచి పడుకున్నారు తాత. గుండేలు కొన్ని వేరుశనగ తీగలు తీసుకొచ్చి మంచం పక్కనే పరుపులా పరిచి తన దుప్పటి పరచాడు. నేనింకా పడుకోకుండా శ్మశానానికేసి చూస్తుండడం గమనించి,


"పడుకో, నైనా! ఈపొద్దింక దయ్యాలు కనబడవు" అన్నాడు.


"ఇంకా టైమ్ అవ్వలేదేమో. నువ్వుపడుకో, నేను ఇంకోంచేపు చూసి పడుకుంటాను" అన్నాను.


"నువ్వెంతసేపు చూసినా ఈపొద్దవి బయటికి రావ్వు, పడుకో"


"ఈ పొద్దు ఎందుకు రావ్వు?"


"పెద్దాయన ఉన్నాడు కదా, ఆయనంటే వాటికి భయం కదా, అందుకే రావ్వు"


గుండేలు చెప్పిన కారణం ఆ వయసులో నాకు కొంత నమ్మశక్యంగా అనిపించింది. ఎందుకంటే తాతగారికి ఆధ్యాత్మికవ్యక్తిగా పేరుండేది! ఊర్లోవాళ్ళు తమ సమస్యలను చెప్పేవారు. కొందరు జ్యోతిషము చెప్పించుకునేవారు. శాస్త్రాలూ అవి చెప్పించుకునివెళ్ళేవారు. చిన్నతనంలోనే వేదపఠశాలలో చేరి వేదపఠనం, పౌరోహిత్యం నేర్చుకున్నారు. సంస్కృతము, తెలుగు, తమిళం, ఇంగ్లీష్ నాలుగు భాషల్లోనూ పాండిత్యం పొందినవారాయన! [బ్రిటీష్ ఇండియా పాస్పోర్ట్ కూడా ఉండేది. అప్పట్లో నాకు దాని విలువ తెలియలేదు; లేకుంటే భద్రపరచి ఉండేవాణ్ణి :( ]


గుండేలు మాటలతో కాసేపటికి నిద్రలోకి జారుకున్నట్టున్నాను. ఏ నడి జాము వేళో, నిద్రలో తాత "గుండేలూ, గుండేలూ" అని పిలుస్తున్నట్టు వినిపించింది. క్షణాలలో వారిద్దరూ బావి దగ్గరకు పరిగెడుతున్నారు. వాళ్ళు పరిగెడుతున్నది గమనించి వారి వెనుకే నేనూ దుప్పటలా విసిరేసి పరుగుతీశాను. నేను నిద్రలేచాననీ, వారి వెనకే వస్తున్నానీ తెలియదు వారికి. బావి దగ్గరున్న మోటర్-పంప్ షెడ్ అవతల వైపు  గుండేలూ, తాతా కాకుండా మరో వ్యక్తి పరిగెడుతున్నాడు. గుండేలు క్షణాల్లో వెళ్ళి వాణ్ణి పట్టేసుకున్నాడు. మోటర్ దొంగతనంకోసం వచ్చిన ఓ దొంగ వెధవ! అప్పటికే నట్లూ, బోల్ట్ లూ ఊడపీకేశాడు. ఏదో గట్టి శబ్ధం తాతకి వినబడగానే వచ్చి పట్టేశారు. టవల్ తో వాడి రెండు చేతులూ కట్టేసి షెడ్ పక్కనున్న ఓ మానికి కట్టారు ఆ దొంగని. తెల్లారాక పోలీసు స్టేషన్ కి కబురుచేసి వాణ్ణి అప్పగించారు. ఆ దొంగ ఇదివరకే చాలా బావుల దగ్గర మోటర్లనూ, పైపులనూ దొంగిలించాడని ఆపైన తెలిసింది.


కొన్నాళ్ళ తర్వాత మరో సందర్భంలో తాతతో మాట్లాడుతుంటే, [ఆ నాటి మాటలు యథావిధిగా నాకు గుర్తులేదు - ఇప్పటిమాటల్తో ఆ భావాన్ని ఇక్కడ రాస్తున్నాను]


"తాతా, నువ్వుండే చోట దయ్యాల అవి రావట, కదా?" అనడిగాను.


"నేనున్న చోటికే కాదు, ఎవరున్న చోటికీ రావ్వు. అసలు దయ్యాలు ఉంటే కదా వచ్చేది?"


"దయ్యాలు లేవ్వా? మరి నడిపిరెడ్డి మామా, కేశవుల్నాయుడు మామా, శంకరన్నా వీళ్ళంతా ఆయుస్సు తీరకుండానే ఉరేసుకుని సచ్చిపోయిన 'గద్దే'వాళ్ళ అవ్వ దయ్యంగా తిరుగుతూ ఉంది, మాకు కనబడింది అని చెప్పారూ?"


"ఆయుస్సు తీరకుండ ఎవరూ చావరు. ఉరేసుకున్నా, మందుతాగినా, వేరేవాళ్ళచేత చంపబడినా ఆయుస్సు తీరాకే చావడం అన్నది జరుగుతుంది. ఏ ఒక్క మనిషి ఆత్మా దయ్యంగా తిరగదు. దయ్యం, భూతం అన్నది చీకటి ముసుగులో దొంగపనులు చెయ్యాలనేవారు సృష్టించిన కల్పన."


"కల్పన అయితే వీళ్ళ కంటికి ఎలా కనబడింది?"


"వీళ్ళ మదిలో ఉన్న భయమే అక్కడ దయ్యంగా దృశ్యావతారం ఎత్తుతుంది. మన మనసులోని దయ్యమే అది. అంతా భ్రమ. ఆ దోంగల సృష్టికి వీళ్ళ భయాలు ప్రాణం పోస్తాయి."

============ XXXXXXXXX===========

12 కామెంట్‌లు:

రాజ్ కుమార్ చెప్పారు...

అయితే దెయ్యాలు లేవాండీ? ;( ;( ప్చ్...
నేను కూడా దెయ్యాన్ని చూడటానికి వచ్చేను ;౦

నైస్ పోస్టండీ

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నేను దయ్యాన్నై మీకు కనిపిస్తాను లెండి. ఈ లోపుల కొంచెం భయపడడం నేర్చుకోండి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

దెయ్యాలు లేవు అని అంటాను నేను. మనుషుల్లో ఉన్న వికృత స్వభావాలే దెయ్యం కన్నా భయంకరమైనవి. తాతయ్య గారి గురించి ఇంకా చాలా విషయాలు చెబుతారు అనుకున్నాను. మొత్తానికి మీరు దెయ్యం చూడకుందానే దెయ్యం లేదనెస్థాయికి యెదిగిపోయారన్నమాట.:)))))))))))))))

ఆ.సౌమ్య చెప్పారు...

:))) బావుంది!

Disp Name చెప్పారు...

మీరలా కనిపిస్తెనే చాలండి, 'దయ్యంగా మారీ అని ఆ ప్రొలొగ్ ఎందుకు సుమండీ?

Phanindra చెప్పారు...

ఆసక్తికరంగా ఉంది రచన. బాగుంది.

formless beings ఉండడం నిజమే అని కొందరు ఆధ్యాత్మిక గురువులు చెప్పారు. అయితే వారు కనిపించాలన్నా మనలో కొంత spiritual sensitivity ఉండాలి. మామూలు కళ్ళకి అవి కనిపించవు. మన experience లో లేనివాటి గురించి ఒక అభిప్రాయం ఏర్పరుచుకోవడం అనవసరం. కాబట్టి ఈ దెయ్యాల గొడవ వదిలెయ్యొచ్చు.

kiran చెప్పారు...

అమ్మో భాస్కర్ గారు మీలో ఈ angle కూడా ఉందా...దయ్యాన్ని చుడాలనుకున్నార?? :O ...కనిపిస్తే ఏం చేసుండేవాళ్ళు?

మాలా కుమార్ చెప్పారు...

ఐతే మీరు దయ్యాన్ని చూడలేదన్నమాట :)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

@మాలా కుమార్ గారు,
దయ్యాలు ఉంటేకదండి వాటిని చూసేది?

దేవుళ్ళనీ, దయ్యాలనీ సృష్టించింది మానవులే అన్నది నా విశ్వాసము. ఈ మానవుల్లో రెండు రకాలవారున్నారు; మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు. మంచివారు దేవుళ్ళు, చెడ్డవారు దయ్యాలు. అంతే!

నీహారిక చెప్పారు...

Very Nice Post !!!

శోభ చెప్పారు...

హమ్మయ్యా.. మీ తాతగారు దయ్యాలు లేవని తేల్చేశారు. చాలా రిలీఫ్‌గా ఉందండీ. మావాడు నన్ను మా యింట్లోనే దెయ్యాలు తిరుగుతున్నాయని ఎంతగా భయపెట్టాడో. ఏం చేసినా అవి పక్కనే ఉన్నాయన్న ఫీలింగుతో గత కొన్నిరోజులుగా భయపడుతున్నా.

పోస్టు చాలా బాగుందండీ. అభినందనలు.

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...... :)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

మీ అబ్బాయికి చెప్పండీ అసలు దయ్యాలు ఎక్కడా లేవు అని :-)

ధన్యవాదములు, శోభ గారు.
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు :-)

-భాస్కర్