సూర్యనారాయణకి పదోతరగతిలో
జ్వరం
వచ్చింది...
సంఘటనా
కాలం: 1992-93
మన
భారతదేశంలో విద్యార్థులకు పదవతరగతిలో వచ్చే ఫలితాలనుబట్టి వాళ్ళ
బ్రతుకు మలుపు తిరుగుతుంది. బడికెళ్ళకపోయినా
మంచి మార్కులు వస్తాయేమోగానీ, ప్రైవేటు ట్యూషన్కువెళ్ళి చదువుకోకుంటే మార్కులు రావు అన్నది జనం
విశ్వాసం. అందులోనూ నేను చదువుకున్నది ప్రభుత్వ
పాఠశాల! మంచి ఉపాధ్యాయులున్నా బడిలోచెప్పే
చదువులు ఏం సరిపోతాయిలే అనే
భావం ఉండేది తల్లిదండ్రులకు. అందరూ తమ పిల్లల్ని
ప్రైవేటు ట్యూషన్లకు పంపుతున్నారు, మనం పంపకుంటే మార్కులు
రావేమోనన్న భయంతో నన్నుకూడా ట్యూషన్లో
చేర్చాలని నిర్ణయించుకున్నారు మా అమ్మా నాన్నలు.
నాకు ప్రైవేటూ క్లాసులు అవసరంలేదు, బడిలో చేప్పేది చాలు
ఎంత చెప్పినా వినిపించుకోలేదు.
మా
స్కూల్లో పదవతరగతి వరకు అమ్మాయిలు, అబ్బాయిలు
ఒకే క్లాసులోనే ఉంచేవారు. పది రాగానే “ఏ”
మరియూ “బీ” సెక్షన్లలో ఉన్న
అబ్బాయిలందరినీ ఒక క్లాస్‌గానూ,
అమ్మాయిలందరినీ మరొక క్లాస్‌గానూ
విడదీసి "బాయ్స్" సెక్షన్, "గర్ల్స్" సెక్షన్ గా పెట్టేశారు మా
బడి హెడ్మాస్టర్ గారు! అమ్మాయిలు, అబ్బాయిలు
ఒకే క్లాస్‌లో ఉంటే సరిగ్గా
చదువుకోరు అనుకున్నారో ఏంటో మరి! లెక్కలూ(మ్యాథ్స్), విజ్ఞాన శాస్త్రమూ(సైన్స్) అబ్బాయిలకు కేశవన్ మాస్టారు, అమ్మాయిలకి వేంకటేశరెడ్డి మాస్టారు నేర్పేవారు. ఇద్దరూ బడిలో నేర్పడమే కాకుండా
తమ తమ ఇంటి వద్ద
డబ్బులు తీసుకుని ప్రైవేటు ట్యూషన్లు నేర్పేవారు. వెంకటేశరెడ్డి గారు మా నాన్నకి
బాగా పరిచయం. వాళ్ల పిల్లలు పుట్టినప్పుడు
జాతకాలు రాయించుకోడానికీ, బారసాల చెయ్యడానికీ, వాహనం కొనడానికి మంచిదినం
చూసుకోడానికీ, తన నక్షత్రానికి ఏ
రంగు వాహనమైతే మంచిదో తెలుసుకోడానికీ ఇలా అన్నిటికీ మా
నాన్న జ్యోతిష్యం చూసి చెప్పందే ఏ
పనీ చెయ్యరు వెంకటేశరెడ్డి మాస్టారు.
అబ్బాయిలు
కేశవన్ మాస్టారు దగ్గరా, అమ్మాయిలు వెంకటేశరెడ్డి మాస్టారు దగ్గరా ప్రైవేటు ట్యూషన్‌కి చేరారు. ఈ
వెంకటేశరెడ్డి గారు మా నాన్నకి
పరిచయస్తుడు గనుక నాకు తప్పలేదు.
అక్కడ అందరూ అమ్మాయిలే. ఒక్కణ్ణే
అబ్బాయిని. ఇరవైనాలుగుమంది అమ్మాయిల గోల; రెండురోజులకే చిరాకనిపించింది.
మూడోరోజు నా ఫ్రెండ్ కొల్లి
మూర్తి గాణ్ణి ఏదోక విధంగా ఒప్పించి
నాతోబాటు ప్రైవేటుకి చేర్పించేశాను.
మాస్టారు
వాళ్ళ ఇంటి డాబామీద ఒక
పెద్ద షెడ్ ఉండేది. అక్కడ
ఉదయం 7:30 మొదలవుతుంది ప్రవేటు క్లాసు. 9:30 వరకు జరిగేది. 10కి
బడి. బడి నాలుగునిముషాల నడకదూరమే.
మళ్ళీ సాయంత్రం 4:30 కి బడి అవ్వగానే
5:30కి ప్రైవేటు క్లాసు మొదలైయ్యేది; 6:30 వరకు ఉండేది. ప్రైవేట్‌లో
ఈయన ఒక్కరే ఒక్క తమిళం తప్ప
మిగిలిన అన్ని సబ్జక్ట్లూ (లెక్కలు,
సైన్సు, సోషల్ సైన్సు, ఇంగ్లీష్
గ్రామర్) నేర్పేవారు. శని-ఆదివారాల్లో ప్రైవేటు
క్లాసు ఉదయం 8:00 నుండి 11 వరకు ఉండేది. అవసరమయితే
మళ్ళీ సాయంత్రం ఉండేది. మాస్టారు మా నాన్నకు ఫ్రెండ్
గనుక నాకు ఎక్కువ చనువు
ఉండేది. చదువు చెప్పడమే కాకుండా
కొన్ని సమయాల్లో వాళ్ళ ఇంటి పనులు
కూడా చెప్పేవారు నాకు(అంటే అంగటికెళ్ళి
ఏదైనా కొనుక్కురావడం వంటివి).
ఇలా
సాగుతుండగా త్రైమాసిక పరీక్షల అనంతరం ఒకరోజు ఉదయం మాస్టారు పాఠాలు చెప్తున్నారు. ఒక అమ్మాయి వాళ్ళ
నాన్న గారు వచ్చారు. ప్రైవేటు
చదివిస్తున్నా వాళ్ళ అమ్మాయికి లెక్కల్లో
మార్కులు ఎందుకు తక్కువగా వచ్చాయో కనుక్కోడానికి. ఆయన ఆ ఊరి
టెలిఫోన్ ఎక్చేంజ్ లో(ఇప్పటి B.S.N.L) అసిస్టంట్
ఇంజినీరు. వాళ్ళ అమ్మాయి పేరు
స్వప్న. చదువుల్లో ఆవరేజ్(Average) స్టూడంట్. మాస్టారు ఏదో నాలుగు మంచి
మాటలు చెప్పి, ప్రైవేటు క్లాసులో మరో అర్థగంట ఎక్కువ
సమయం స్వప్న కి లెక్కలు నేర్పించి
తరువాయి పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చి పంపించారు.
ఆ రోజు ప్రైవేటు క్లాసు
అవ్వగానే నన్ను ఆగమన్నారు. అందరూ
వెళ్ళగానే, "సూర్యా, రేపట్నుండి రోజూ 7కి వచ్చి
స్వప్న కి లెక్కలు నేర్పించు"
అని కొత్త డ్యూటీ అంటగట్టారు.
అన్ని కష్టాలూ నాకే వచ్చిపడ్డాయి; తప్పలేదు
నాకు! రోజూ తొందరగా వచ్చి
ఆ ఇంజినీర్ గారి అమ్మాయి స్వప్న
కి లెక్కలు నేర్పించేవాణ్ణి.
ఇలా
కాలం నడుస్తుండగా మధ్యసంవత్సర పరీక్షలు కూడా అయిపోయాయి. పరీక్షలు
అయిన మరుసటి రోజు శనివారం. ప్రైవేట్
క్లాస్ అవ్వగానే, మాస్టారు "సూర్యా, నువ్విప్పుడే ఇంటికి వెళ్ళకు. ఇక్కడే ఉండు. నువ్వు లేట్
గా ఇంటికి వస్తున్నట్టు మూర్తీతో మీ ఇంటికి కబురు
పంపించు" అన్నారు. అందరూ వెళ్ళాక ఆన్సర్
పేపర్ల కట్ట చేతికిచ్చి "ఇవన్నీ
దిద్దేసి వెళ్ళు. మధ్యాహ్నం ఇక్కడే భోంచేసేయ్" అన్నారు.
సరే
అని ఆ లెక్కల(Mathematics) ఆన్సర్ పేపర్లు
దిద్దటం మొదలుపెట్టాను. దిద్దుతుండగా మధ్యలో ఈ స్వప్న ఆన్సర్
పేపర్ వచ్చింది. నేను నేర్పినవేమి సరిగ్గా
రాయలేదు. గ్రాఫ్ కూడా గియ్యలేదు. ఎంత
కష్టపడి మార్కులు వేద్దామన్నా 45 మార్కులకు దాటడంలేదు! ఈ సారీ మార్కులు
తక్కువొస్తే వాళ్ళ నాన్న ఇక్కడికొచ్చి
మాస్టార్ని సంజాయిషీ చెప్పమంటాడు అనుకొని ఒక ఉపాయం కనిపెట్టాను.
ఆన్సర్ పేపర్లలో ఖాళీగా ఉన్న పేజీలలో ఆ
అమ్మాయి రాయని లెక్కల ప్రశ్నలకు
నేను జవాబు రాసి మార్కులేసేశాను!
అంతటితో ఆపకుండా నా నోట్ బుక్
నుండి ఒక గ్రాఫ్ పేపర్
తీసి, గ్రాఫ్ గీసి ఆ ఆన్సర్
పేపర్‌తో జతకలిపి, 65 మార్కులదగ్గరకు తీసుకొచ్చేశాను. ఆ సాయంత్రానికి 30 పేపర్లూ
దిద్ది ఇంటికెళ్ళాను. మరుసటి రోజు ఆదివారం ప్రైవేటు
క్లాసులో మాస్టారు అక్కడున్న 24 మంది అమ్మాయిలకు మాత్రం
వాళ్ళ ఆన్సర్ పేపర్లు అందించారు.
అందరూ
వాళ్ళ వాళ్ళ మారుకులు చూసుకుని,
దిద్దడంలో ఏమైనా పొరపాట్లున్నాయేమో చూసుకుని
పేపర్ తిరిగిచ్చేస్తున్నారు. మన జీనియస్ స్వప్న
నిజాయితీగా మాస్టార్ దగ్గరకు వెళ్ళి "సార్, నేను గ్రాఫ్
గియ్యలేదు, సార్. నా పేపర్లతోబాటు
ఈ గ్రాఫ్ పేపర్ కూడా ఉంది.
ఇది నాది కాదు" అంది.
నాకు పైప్రాణాలు పైపైనే పోయాయి. గుండె సెకండుకే వందసార్లు
కొట్టుకోడం మొదలుపెట్టింది. ఇక నేను అయిపోయాను
అనుకున్నాను. మాస్టారు ఆ గ్రాఫ్ పేపర్
చూశారు. ఆ అమ్మాయిని “వెళ్ళి
కూర్చో నేను చూస్తాలే” అని
పేపర్ తీసిపెట్టేసుకున్నారు. ఆ రోజు క్లాస్
అవ్వగానే త్వర త్వరగా వెళ్ళిపోవాలని
చూస్తున్న నావైపుచూసి "సుర్యా, నువ్వు ఆగు" అన్నారు.
నాకు
గుండెలో దడ ఇంకా ఎక్కువైపోయింది.
అందరూ వెళ్ళాక ఆ పేపర్ తీసుకుని
"ఏంటీ పని? మీ నాన్నకోసం
నిన్ను అమ్మాయిలు చదివే ప్రైవేటు క్లాసులో
చేర్పించుకున్నాను. బాగా చదువుతావు, మంచి
గుణాలుకూడా ఉంటాయి అనుకుంటే నువ్వు చేసిన పని ఇదా?
ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఈ
ఊళ్ళో ఇంజినీరు. ఇళ్ళకు ఫోన్ కనెక్షన్లు రావాలంటే
ఆయన సంతకంలేందే రాదు" అని లింకులులేకుండా మాట్లాడుతున్నారు.
నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆ గ్రాఫ్ పేపర్
తీసేసి ఆ ఆన్సర్ పేపర్లో
5 మార్కులు తగ్గించి 60 మార్కులుగా దిద్ది పక్కన పెట్టారు. నేను
అప్పటికీ నుల్చుని చూస్తూనే ఉన్నాను. "త్రైమాసిక పరీక్షలో 40 మార్కులు తెచ్చుకున్న అమ్మాయి నీ వల్ల 60 మార్కులు
తెచ్చుకుంది. ఫైనల్ పరీక్షలో 80 మార్కులు
తెచ్చుకోవాలి అలా నేర్పించు పో"
అన్నారు.
మరుసటి
రోజు స్వప్న కి నిన్న జరిగిన
కథంతా చెప్పాను. నేను మాస్టారి దగ్గర
తనవల్ల తిట్లు తిన్నానని తెలిసి చాలా ఫీలయ్యి కంటతడికూడా
పెట్టుకుంది. నేనీ విషయం తనకి
ముందే చెప్పియుంటే ఇలా చేసేదాన్ని కాను
అని కాసేపు విలపించింది. యథావిధిగా రెండువారాలు సాగాయి. ఒక రోజు స్వప్న
కొత్త లంగా వోణీలో వచ్చింది.
మనిషి కొంత కంగారుగా కనిపించింది.
ఏమైంది అని అడిగితే, ఏమిలేదంది.
నేను పాఠం మొదలుపెట్టాను. ఉన్నట్టుండి
దగ్గరగా వచ్చి నా చేయి
లాక్కుని ముద్దుపెట్టేసింది! నాకు వళ్ళంతా చెమట్లు
పట్టేశాయి. చేయి విదిలించుకున్నాను. "ఐ లవ్
యూ, సూర్యా" అని అందోళనపడుతూ చెప్పేసింది!
నాకు ఈ అమ్మాయి చేసిన
పనీ, చెప్తున్న మాటలూ అర్థంకాక స్తంభించిపోయాను.
అక్కడితో ఆపకుండా ఇంకా "నువ్వంటే నాకు చాలా ఇష్టం,
సూర్యా! నాకోసం నువ్వు ఎంత పని చేశావు.
గ్రాఫ్ షీటుకూడా గీసిపెట్టావు. నేనే పిచ్చిదాన్లా..." అని ఏవేవో
చెప్తూ ఏడవడం మొదలు పెట్టింది.
నాకు నోట్లో మాటలు రాలేదుకానీ, భయముతో
కూడిన కోపమైతే వచ్చింది. సినిమాల్లో నాగేశ్వర రావూ, సావిత్రీ డూయట్లో
డ్యాన్స్ చేస్తుంటేనే ఏంటో ఈ పిచ్చి
గోల అని ముఖం తిప్పుకునే
నాకు ఒక అమ్మాయి ఐ
లవ్ యూ చెప్తుంటే ఎలా
ఓర్చుకోగలను?
కోపంగా
తిట్టేసి డాబామీదనుండి కిందకు వెళ్ళిపోయాను. ఎవరైనా పిల్లలు క్లాస్ కి వచ్చేంతవరకు కిందే
కాసేపు ఉండి ఆ పైన
పైకి వెళ్ళాను. ఆ అమ్మాయి వంక
చూస్తే వేరేవాళ్ళతో మాటల్లో పడిపోయింది. అప్పటికిగానీ నాలో వణుకు సగానికి
తగ్గలేదు. ఆ రోజు ప్రైవేటు
క్లాస్ అవ్వగానే మూర్తీతోకూడా మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయాను. అప్పటికే నాకు జ్వరం వచ్చేసింది.
అమ్మ చూసి "ఒళ్ళంతా కాలిపోతూ ఉంది" అని డాక్టర్ దగ్గరకు
తీసుకెళ్ళారు. ఆ రాత్రంతా నిద్రలో
ఉలికులికిపడి ఏదేదో మాట్లాడానట. అమ్మ
భయపడిపోయారు. వెళ్ళి చేంబ్రోలు మంగమ్మ అవ్వ గార్ని తీసుకొచ్చారు.
ఆ అవ్వ నా నుదుట
చేయిపెట్టిచూసి, "ఇది మామూలు జ్వరం
కాదు. ఏదో చూసి భయపడడంవల్లో,
ఏ దయ్యమో సోకడంవల్లో వచ్చిన జ్వరం" అని పక్కూరిలో ఉన్న
మంత్రీకుణ్ణి పిలిపించి వేపాకుతో మంత్రమేసి, నుదుట వీభూతి రాశారు.
నాలుగు రోజులకు జ్వరం తగ్గింది. మళ్ళీ
ప్రైవేటుకు వెళ్ళాలా? అని భయమేసింది. మరో
ఉపాయం కనిపెట్టాను.
ఆ
రోజు ఉదయం ప్రైవేటుకు వెళ్ళకుండా
బయట తిరిగేసి స్కూల్ కి వెళ్ళిపోయాను. సాయంత్రం
త్వరగా ఇంటికి వచ్చేశాను. నాన్న "ప్రైవేట్ క్లాసుకు వెళ్ళలేదా?" అని అడిగితే "ఫైనల్
ఎగ్జాంస్ దగ్గరపడుతున్నాయి; ఇక ప్రైవేట్ అవసరంలేదు,
ఇంట్లోనే చదువుకోమన్నారు నాన్నా మాస్టారు" అని చెప్పేశాను. అంతటితో
సమస్య తీరిందనుకున్నాను. ఒక వారం రోజుల
తర్వాత వెంకటేశరెడ్డి మాస్టారు మా క్లాసుకి వచ్చి
నన్ను బయటకి రమ్మని పిలిచారు.
"ఎందుకు ప్రైవేట్ క్లాస్ కి రావడంలేదు?" అని
అడిగారు. "ఫైనల్ ఎగ్జాంస్ దగ్గరపడుతున్నాయి;
ఇక ప్రైవేట్‌కి వెళ్ళొద్దు, ఇంట్లోనే చదువుకోమన్నారు మా నాన్న గారు"
అని చెప్పేశాను.
పరీక్షలకి
ఇంకా ఒక నెలే ఉంది.
ఓ రోజు సాయంత్రం మా
నాన్న గారు కోపంగా ఇంటికి
వచ్చారు.
"ఎక్కడ
వాడు?" అనియడిగారు. ఇంత వరకు మా
నాన్నకి కోపం వచ్చి నేను
చూళ్ళేదు. మా అమ్మ వచ్చి
ఏమైంది అని అడిగితే,
"వెంకటేష్
ఇందాక బజార్లో కనబడ్డాడు. మీ అబ్బాయిని ఎందుకు
ప్రైవేట్ క్లాసుకి మానిపించేశారు అని అడిగాడు. నేను
తిరిగి మీరే వద్దన్నారటగా అని
అడిగుంటే ఏమయ్యేది? ఏదో సర్ది చెప్పి
వచ్చాను. వీడు ఇలా అబద్ధాలు
చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నాడు?" అని కోపంగా నాకేసి
చూశారు. నేను మరోసారి వణికిపోయాను.
"మొదట్నుండి
వాడికి ప్రైవేట్ క్లాస్ కి వెళ్ళడం ఇష్టంలేదు.
అయినా మనమే బలవంతంగా పంపించాము.
ఇంట్లో స్వయంగా చదువుకుంటున్నాడుగా? వదిలేయండి. ఆ వెంకటేశరెడ్డి గారికి
ఇంట్లో పనులంతా చేసిపెట్టడంకన్నా మనింట్లో కూర్చుని శ్రద్ధగా చదువుకోనివ్వండి" అని అమ్మ నాకు
మద్దతు పలికారు.
నాన్న
శాంతించి, "చదువుకుంటే ఎవరు కాదన్నారు. అదేదో
నిజం చెప్పేసి చదువుకోవచ్చుగా? అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నాడు?" అన్నారు.
కథ
సుఖాంతంగా ముగిసింది అనుకుంటున్నారా? లేదు. స్కూల్లో ఆ
అమ్మాయి చూపులకు తగలకుండా తప్పించుకున్నాను. చివరగా పరీక్షల టైం కి హాల్
టిక్కెట్ పట్టుకుని ఎగ్జాం హాల్ దగ్గరకు వెళ్తే
నా వెనకాలుంది ఆ అమ్మాయి. ఆల్ఫబెటికల్
ఆర్డర్ లో రిజిస్టర్ నెంబర్లిచ్చారు.
నా పేరు "Surya Narayana"
ఆ అమ్మాయి పేరు "Swapna " కదా?
నన్ను
చూడగానే ఒక చిరునవ్వు చిందించి
"సారీ, సూర్యా! ఆ రోజు నేను
నీతో అలా ప్రవర్తించుండకూడదు. నీకు జ్వరమొచ్చిందట
కదా? మూర్తి చెప్పాడు. ఆల్ ది బెస్ట్,
పరీక్షలు బాగా రాయి" అంది.
అప్పటికిగానీ నేను తేరుకోలేదు. రోజూ
పరీక్షలు అవ్వగానే ఎలా రాశామో అని
రెండు మాటలు మాట్లాడుకుని, తరువాయి
పరీక్షకు ఆల్ ది బెస్ట్‌లు
చెప్పుకుని అలా అయిపోయాయి నా
పదవ తరగతి పరీక్షలు.
ఫలితాలు
వచ్చాక సర్టిఫికేట్లు తీసుకోడానికి స్కూల్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ
పలకరించుకున్నాము.
"నేను మెడ్రాస్ వెళ్ళిపోతున్నాను +1, +2 చదువుకోడానికి" అని చెప్పేసి సెలవు
తీసుకున్నాను. ఆ పైన రెండేళ్ళ
తర్వాత మూర్తీని కలిసినప్పుడు… (అది ఇంకొక కథగా
రాయచ్చులెండి). ఇప్పటికి శుభం.
-----------------XXXX-----------------
12 కామెంట్లు:
చిన్నప్పుడెప్పుడో చదువుకున్న పర్యాయపదాలు ఇంతలా అక్కరకొస్తాయనుకోలేదు. :)
భాస్కరా==సూర్యా??
చిన్నప్పటి అమాయకత్వం, పంతం , అమలిన స్నేహాలు చాలా అందంగా రాసారు. భాష సరళంగా చదివించేదిగా ఉంది. మీ కథలు చదవడం ఇదే మొదలు నాకు. English బ్లాగ్‌లో చదివాననుకోండీ...!
పొడిగింపు లేకుండా ఇంకాస్త చిక్కటి ముగింపు ఉండుంటే, ఈనాడు ఆదివారం కథంత (నాకవనటే చాలా ఇష్టం) హాయిగా ఉండేది. ఇప్పుడు మిగతా భాగం కోసం ఎదురు చూస్తామిక! :)
నా అనుమానం నిజమైతే ఆ అమ్మాయి పేరు భావన
ఏమిటో ఈ మధ్య జనానికి గాలి ఇటు మళ్ళింది?!!
చేతిమీద ముద్దు పెడితేనే ఇంత కంగారు పడితే.....
తం సూర్యం ప్రణామామ్య హం.
"తం సూర్యం ప్రణామామ్య హం. "
అంటే ఏంటి సుబ్రహ్మణ్యం గారూ? నాకు వివరించరూ?
-భాస్కర్
మానస,
ఈ సారి రాసేప్పుడు నువ్వు చెప్పిన సూచనలను దృష్టిలో ఉంచుకుని రాసతాను.
గెల్లి పణీంద్ర గారూ,
మీకు అలాంటి అనుమానమెందుకు వచ్చిందో ఇట్టే అర్థమైపోయింది. అయితే అవేవీ కావులేండి...
చదివి వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదములండీ :)
అచంగా,
గాలికి దిక్కులేం తెలుస్తుందిలే. అందుకే అటూ ఇతూ మళ్ళుతూ ఉంటుంది :)
భలే రాశారండీ.. కళ్ళ ముందు కనిపించింది కథ.. అర్జెంటుగా మీరు సీక్వెల్ రాసెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం.. :)
హహహ భలే వుంది భాస్కర్ వెంటనే తరువాయి భాగం కూడా రాసేయండి మరి :-)
మరీ ఇంత జాలి పడితే..జ్వరాలు వస్తాయి. పైత్యాలు కలుగుతాయి. అమ్మాయిలంటే ఏమనుకున్నారు!? మొత్తానికి + ౨ కి జంప్ అయి రక్షించు కున్నారన్నమాట. కథనం చాలా బాగుంది. .
మీరు కంప్లన్ బాయ్ అనుకున్నాము..చాల complicated బాయ్ అన్నమాట..:D
చాల బాగుంది...నవ్వుకున్నాను :)...మధుర చెప్పినట్లు కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి