14 అక్టోబర్ 2011

కాలం నేర్పిన బ్రతుకు ప్రయాణం...


భాస్కరుడు :
కాలమా, కాసేపు ఆగు కబుర్లు చెప్పుకుందాం.


కాలం :
భాస్కరా, మనమిద్దరం ఆగితే విశ్వమంతా ఆగిపోతుంది! నడుస్తూ మాట్లాడుకుందాం.


భాస్కరుడు :
సరే. చిరున్నవ్వు చెదరకుండా, ఎక్కడా ఆగకుండా బ్రతుకు నడక సాగిస్తున్నావే అలసటా, విసుగూ అనిపించదా నీకు? ఆ రహస్యం మాకూ చెప్పరాదూ?


కాలం :
బ్రతుకు ప్రయాణం వెన్నెల కాచే నందవనంలోనే సాగదు, బాటలో చిమ్మచీకట్లుకమ్మిన కారడవులొస్తాయి. పరాగ్గావిహరిస్తూ నందనవనంలో ఉన్న సౌందర్యాలను ఎలా ఆస్వాదిస్తానో అలాగే, ఏకాగ్రతగా నడుస్తూ కారడవుల్లో ఉన్న సవాళ్ళనూ ఆస్వాదిస్తాను.


భాస్కరుడు :
ఇదెలా సాధ్యమయ్యింది?


కాలం :
ఆ సౌందర్యాలమీదా, ఈ సవాళ్ళమీదా భావావేశమైన అనుబంధం(Emotional Attachment) పెంచుకోలేదు కాబట్టి.


భాస్కరుడు :
అయితే నువ్వే సుఖ జీవివి!


కాలం :
అది సుఖమా? అలా ఉండేందుకు దేవుడలా వదిలేస్తాడా?


భాస్కరుడు :
నిన్ను వదిలేశాడుగా?


కాలం :
లేదు, నందనవనం మీద అనుబంధం పెంచుకున్న సహబాటసారిమీద అనుబంధం పెంచెళ్ళిపోయాడు.


భాస్కరుడు :
సహబాటసారిని నీలా మార్చేసుకో.


కాలం :
మార్చిన రోజు, "మీతో తీసుకెళ్ళండి" అని మరో బాటసారిమీద మాకిద్దరికీ అనుబంధం అంటగట్టి వెళ్ళాడు.


భాస్కరుడు :
పెద్ద కష్టమొచ్చిందే బ్రతుకు ప్రయాణంతో! అయితే సహబాటసారి మీద అనుబంధం పెంచుకోకుండా ఉండే ఉపాయమేదో నేర్చుకో.


కాలం :
ఆ ఉపాయం చెప్పమని దేవుణ్ణే అడిగాను.


భాస్కరుడు :
ఏమన్నారు?


కాలం :
సహబాటసారిమీద అనుబంధం పెంచుకోలేని ప్రయాణం విరక్తినే మిగుల్చుతుంది అందువళ్ళ ఇలాగే కొనసాగించమని సెలెవిచ్చాడు.

----XXX----

7 వ్యాఖ్యలు:

Srikanth Eadara చెప్పారు...

"సహబాటసారిమీద అనుబంధం పెంచుకోలేని ప్రయాణం విరక్తినే మిగుల్చుతుంది"........

నిజమే కదా...!

వనజ వనమాలి చెప్పారు...

"సహబాటసారిమీద అనుబంధం పెంచుకోలేని ప్రయాణం విరక్తినే మిగుల్చుతుంది"
నిజమే కదా...! idhi nijam.naaku ardhamaina nijam koodaa!

రసజ్ఞ చెప్పారు...

సహబాటసారిమీద అనుబంధం పెంచుకోలేని ప్రయాణం విరక్తినే మిగుల్చుతుంది అక్షర సత్యం! చక్కగా వ్రాశారండీ!

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

శ్రీకాంత్, వనజ వనమాలి గారూ & రసజ్ఞ గారూ,
ధన్యవాదములండీ :)

కొత్త పాళీ చెప్పారు...

ఘంటసాల పాట బహుదూరపు బాటసారీ గుర్తొచ్చింది

kiran చెప్పారు...

అదేంటో..మీరు చెట్టు..పుట్ట..కాలం అన్నిటితో మాట్లాడేస్తారు..good one :)

Meraj Fathima చెప్పారు...

అద్భుతమైన భావ సంపద మీ సొంతం