18 ఆగస్టు 2011

కంటిచూపుతో వధించలేదు...

మెడ్రాస్ లో ప్రతి యేడాదీ, మార్గళి నెలలో "డిశంబర్ సీసన్" అని సాంప్రదాయ సంగీత కచేరీలు జఱుగుతూ ఉంటుంది. ప్రపంచ నలుమూలల్నుండీ విద్వాంసులు వచ్చి మైలాపూర్లోని వివిధ సభల్లో సంగీత విందులందిస్తారు. కుదిరినప్పుడూ, ప్రవేశ చీటీలూ(Entry passes)  దొరికినప్పుడూ వెళ్ళి సాంప్రదాయ సంగీతం ఆస్వాదించి వచ్చేవాణ్ణి. ఒక కచేరీకి నాకు కొన్ని ప్రవేశ చీటీలు దొరికితే ఒకటి నాకుంచుకుని, మిగిలినవి మిత్రులకిచ్చాను. ఓ స్నేహితుడు చివరి క్షణంలో వెళ్ళలేకపోవడంవల్ల ప్రవేశ చీటి తిరిగిచ్చేశాడు. అప్పుడు మా చెల్లి వస్తానంటే తీసుకెళ్ళాను. 

ఆ కచేరీలో గాయని సుబ్రమణ్య భారతి, పాపనాశంశివన్, వేంకటసుబ్బయ్యలు రచించిన అరవ కీర్తనలను భలేగా ఆలపించారు.  తెలుగు కీర్తనలు పాడకుంటే ఆ కచేరిని సాంప్రదాయ కచేరీగానే అరవోళ్ళు భావించరు. తెలుగు కీర్తనలు పాడని వారిని విద్వాంసులుగానే అంగీకరించరు. అందువలన తన ప్రతిభను చాటుకునేందుకు 3 తెలుగు కీర్తనలను మధ్యమధ్యలో ఆలపించారు ఆ గాయని.

ఇంటికొచ్చాక, “కచేరి ఎలా ఉనింది? ఏం కీర్తనలు పాడారమ్మా?” అని మా చెల్లిని అడిగారు. చెల్లికి సినిమా పాటలు పరిచయమేగాని సంప్రదాయ కృతులతో, కీర్తనలతో పెద్దగా పరిచయంలేదు. మా ఇంట పుట్టిన దోషంకొద్ది కొన్ని పాపులర్ కృతులవి పరిచయం! అంతే. అరవ, తెలుగు పాటల జాబితా చెప్తూ వచ్చింది. ఒక కీర్తనను చెప్తూ…
“మా జానకి జడబట్టగ మహరాజువైతివి…”  అని అమాయకంగా అన్నది.

వినగానే ఇంట్లో అందఱం గట్టిగా నవ్వేశాము. “నీ మొహం, అది జడపట్టగ కాదు, "చెట్టబట్టగ" అంటే, చెయ్యిపట్టుకోగా అని   అమ్మ వివరణ ఇచ్చారు. తప్పు మా చెల్లిది కాదు, పాడిన అరవ గాయని ఆ కీర్తనని ఎంతో భావోద్వేగంతో “మా జానకి జడ్డ పట్టక…” అనే పాడారు.
-X-X-X-


ఇది త్యాగరాజస్వాములవారి కృతి. అలమేలుమంగమ్మ ఎలాగైతే తాళ్ళపాకవారింటి ఆడపడుచో అలా, జానకి తిరువారూర్ త్యాగరాజులవారింటి ఆడపడుచు. 

మన ఇంటి ఆడపడుచుని ఒకడికిచ్చి పెళ్ళిచేస్తాం. ఆ అల్లుడు పెళ్ళి తరువాత  సాధించిన సాధనలన్నిటికీ, "మన అమ్మాయిని పెళ్ళిచేసుకున్నందువల్ల వచ్చిన అదృష్టం అదంతా" అని మన అమ్మాయి గొప్ప జాతకాన్ని పొగుడుకుని ఆనందిస్తాం. కొంతవఱకు అందులో నిజముండచ్చు. భార్యసహకారంలేకుండా పెళ్ళైన యే మగాడైనా సాధించడం సాధ్యముకాదుకదా! 

అలాగే త్యాగరాజుకూడా "రామా మా జానకిని పెళ్ళిచేసుకున్నావు కాబట్టే నీకు ఇన్ని కీర్తులు లభించాయ్, మహరాజువైనావు" అనే రీతిలో పాడుకుని మురిసిపోతున్నాడు. లేకుంటే రామచంద్రుడికి అంత కీర్తి వచ్చేది కాదట. కింద సాహిత్యం చదవండి అర్థం అయిపోతుంది.

========================
రాగం : కాంభోజి
రచన : త్యాగరాజు
========================
పల్లవి
మా జానకి చెట్టబట్టగ మహరాజు వైతివి
రాజరాజ వరరాజీవాక్ష విను
రావణారి యన రాజిల్లు కీర్తియు

చరణం
కానకేగి యాజ్ఞమీరక మాయాకార మునిచి శిఖిచెంతనేయుండి
దానవుని వెంటనేచని యశోక తరుమూల నుండి
వాని మాటలకు కోపగించి కంట వధియించకనే యుండి
శ్రీనాయక యశము నీకే కల్గుజేయ లేదా త్యాగరాజ పరిపాల

'రావాణాంతకుడ'నే కీర్తిని నీకు కట్టబెట్టాలని మా సీతమ్మ రావణుణ్ణి తనకంటితో వధించకుండ ఓరుపుతో నీవువచ్చేవరకు ఆగింది. లేకుంటే, అశోకవనంలో చేండాల రావణుడు ఆడిన మాటలువిన్న ఆ ఉత్తరక్షణాన తన కంటిలో కలిగిన అగ్ని చూపులతో అంతం చేసుండేది వాణ్ణి. 

ఎంతబాగుందో కదండీ సాహిత్యం?

============================================================
సుశీల, శ్రీనివాస్ ల గళంలో ఈ పాట


విజయ్ శివ గారు కచేరిలో పాడిన పాట వీడియోలో వినండి

ఈయనకూడా కొన్నిపదాలను సరిగ్గా పలకలేదు!
ఈ కీర్తనలోని అన్ని పదాలనూ సరిగ్గా పలికిన యే గాయకుని పాటా నేనిదివరకు వినలేదు :(( 


 ==========================================================


    rAgaM : kAMbhOji

    rachana : tyAgarAja

    ========================

    pallavi

    mA jAnaki cheTTabaTTaga maharAju vaitivi

    rAjarAja vararAjeevAksha vinu

    rAvaNAri yana rAjillu keertiyu


    charaNaM

    kAnakEgi yAj~nameeraka mAyAkAra munichi SikhicheMtanEyuMDi

    dAnavuni veMTanEchani yaSOka tarumUla nuMDi

    vAni mATalaku kOpagiMchi kaMTa vadhiyiMchakanE yuMDi

    SreenAyaka yaSamu neekE kalgujEya lEdA tyAgarAja paripAla
===============================================================

10 వ్యాఖ్యలు:

కొత్తావకాయ చెప్పారు...

ఆహా.. ఎంత మంచి కీర్తన!
అరవ గాయకుల నోళ్ళలో పడి ఇలా ఎన్నో తెలుగు పదాలు ఇబ్బందికరంగా మారిపోయాయి. బహుశా తెలుగువారు తమిళ పాశురాలను, కీర్తనలను పాడితే వారూ అలాగే అనుకుంటారేమో కానీ!

లలితా స్రవంతి పోచిరాజు చెప్పారు...

mana telugu movie lO undi ee song. movie pEru teliyadu. seetaakaLyaaNam bapu title song idE anukunTAnu. adi clear ga unTundi, meerannaTTu ee song clear ga caalaa mandi paaDaru.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

"రామా మా జానకిని పెళ్ళిచేసుకున్నావు కాబట్టే నీకు ఇన్ని కీర్తులు లభించాయ్, మహరాజువైనావు"

నిజమే మరి అందుకే అయ్యవారు కరుణించాలన్నా అమ్మద్వారానే "నను బ్రోవమనీ చెప్పవే సీతమ్మతల్లీ" అంటూ సిఫార్సు చేయించాడు రామదాసు కూడా.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

కొత్తావకాయగారూ,
//అరవ గాయకుల నోళ్ళలో పడి ఇలా ఎన్నో తెలుగు పదాలు ఇబ్బందికరంగా మారిపోయాయి.//
నిజమేనండి! అయితే మనోళ్ళకన్నా వాళ్ళే మన కీర్తనల్ని ఎక్కువగా ఆరాధిస్తున్నారు.
మనవాళ్ళు తమిళ పాశురాలను పాడుతారు - అయితే ఇది చాలా తక్కువ.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

లలితా, అవును. మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఈ పాట కొన్ని లైన్స్ వస్తుంది. అయితే ఫుల్ పాట ఎప్పుడూ వినలేదు నేను. నీ వద్దనుంటే పంపించు. థ్యాంక్స్.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

శ్రీనివాస్ పప్పు గారూ, అవునండి! అమ్మవారు చెప్తే దానికి తిరుగుంటుందా? అందుకే రామదాసూ, అన్నమయ్యా వీళ్ళంతా వేగవంతంగా పనులు జరగాలనుకున్నప్పుడు అమ్మవారికి మొరపెట్టుకున్నారు! :D

మనం పిల్లలుగా ఉన్నప్పుడు కూడా అమ్మతో చెప్పి నాన్నదగ్గర పనులు చేయించుకునేవాళ్ళం కదా?

సీత చెప్పారు...

Bavundi!

అజ్ఞాత చెప్పారు...

ఈ తమిళుల తెలుగు ఉచ్చారణవల్ల నేను నవ్వుకున్న సందర్భం ఒకటుంది. అదీ త్యాగరాజ కృతితోనే. "ఎందరో మహానుభావులు" అనే దానికి మా అరవ స్నేహితుడొకడు "ఎందరో మగానుబావులు" అని పాడాడు. నవ్వాలో ఏడవాలో నాక్కాసేపు అర్థంకాకున్నా చివరాఖరికి నవ్వేశాను!

kiran చెప్పారు...

wowwwww..sooooper...:)
jai seethamma talli...:)
mee explanation asusual keka :)

కొత్తపాళీ చెప్పారు...

Nice. సీత మా ఆడపడుచే అన్న ఫీలింగ్ వాల్మీకి మహర్షితోనే మొదలైందని నా అనుమానం. త్యాగరాజస్వామి ఆయన అవతారమే కదా. పది పన్నెండేళ్ల కిందట, ఫేసుబుక్కులూ బ్లాగులూ లేని కాలంలో సులేఖ అనే సైటులో ప్రవాస భారతీయులందరూ మూగి సొల్లేసుకునే వేళల్లో ఒకసారి ఈ కీర్తన గురించి రెండు పేజీల లెక్చరిచ్చాను ఆంగ్లంలో - good old days! :)