13 ఆగస్టు 2011

అందరికన్నా ఆశలు ఉన్నా, హద్దు కాదనగలనా?

కాలమేదైనా ప్రేమ ఒకటే, ప్రేమికుల ఆలోచనా తీరొకటే... 

నీకు నేనంటే ఎంత ఇష్టమో అంతకన్నా నాకు నువ్వంటే ఎక్కువ ఇష్టం. నాకు అంత ఇష్టం ఉన్నా నువ్వు చెప్పినంత సులువుగా,  స్పష్టంగా, కుండ బద్దలు కొట్టినట్టు "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని చెప్పలేను!  నేను అమ్మాయిని.  నీ ప్రపంచంలా ఉండదు నా ప్రపంచం. ప్రతిక్షణమూ ఏవో భయాలతో మెదులుతూ ఉంటుంది నా మనసు.  నాకున్న హద్దులు దాటడం సులువేం కాదు. "I Love You" అన్న తీయని మాటలు నీకు వినిపించినపుడు నీలో వెలిగే ఆ ఆనందాన్ని కనులారా చూద్దామనే ఉంటుంది. అయినా చెప్పలేకున్నా! ఇంతలోనే నువ్వు నన్నపార్థం చేసుకుని నిందించకు... నన్నూ నా స్థితినీ అర్థం చేసుకో... అంటుంది ప్రియురాలు. ఆ ప్రేమికుల భావాన్ని ఎంత చక్కగా రాశారో మనసు కవి...

పెళ్ళికానుక సినిమాలోని ఈ పాట ఎంత హాయిగా ఉంటుందో వినడానికీ, వీక్షించటానికీ! సరోజా దేవి గారెంత అందంగా ఉన్నారు లంగా-వోణీలో, కుర్రప్రేమికుడి అమాయకత్వాన్ని అభినయాల్లో ఎంతబాగా చూపారో నాగేశ్వరరావు గారు. సాగరతీరాన వారు వ్యవరించే తీరుచూడండి... ప్రపంచంలో ప్రేమకన్నా ఆనందం కలుగజేసేది వేరేదుందా లోకంలో అనేటట్టులేదూ?

అతడు :
వాడుక మరచెదవేల, నను వేడుక చేసెదవేల?
నిను చూడని దినము నాకొక యుగము
నీకు తెలుసును నిజము
ఆమె :
వాడుక మరువను నేను, నిను వేడుక చేయగ లేను
నిను చూడని క్షణము నాకొక దినము
నీకు తెలుసును నిజము

చరణం 1
అతడు :
సంధ్య  రంగుల చల్లని గాలుల 

మధుర రాగము మంజుల గానము
తేనె విందుల తీయని కలలు 

మరిచిపోయిన వేళ?
ఇక మనకీ మనుగడ ఏలా?
నీ అందము చూపి డెందము వూపి 

ఆశ రేపెదవేలా? ఆశ రేపెదవేలా?

ఆమె :
ఓ ఓ ఓ...సంధ్య రంగులు సాగినా, చల్లగాలులు ఆగినా
కలసి మెలసిని కన్నులలోన, మనసు చూడగలేవా?
మరులు తొడగగ లేవా?

చరణం 2
అతడు :
కన్నులా ఇవి కలల వెన్నెలా,  చిన్ని వన్నెల చిలిపి తెన్నులా?
మనసు తెలిసీ మర్మమేలా?

ఆమె :
ఇంత తొందర ఏలా ఇటు పంతాలాడుట మేలా?
నాకందరికన్నా ఆశలు ఉన్నా హద్దు కాదనగలనా?
హద్దు కాదనగలనా?

వాడని నవ్వుల తోడ నడయాడెడు పువ్వుల జాడ
అనురాగము విరిసి లోకము మరిచి
ఏకమౌదము కలసి ఏకమౌదము కలిసి

రచన : ఆత్రేయ
చిత్రం : పెళ్ళి కానుక
సంగీతం : ఏ ఎం రాజ
గళం : ఏ ఎం రాజ, సుశీల
దర్శకత్వం : శ్రీధర్


నా ఫైనల్ టచ్ :
=======
ఎంత అద్భుతమైన భావాలున్నాయో ఈ పాటలో...
ఆమె అందానికి ఆయన గారి హృదయం ఊగిపోతుందట. డెందమన్న పదాన్ని ఎంతబాగ వాడారో ఆత్రేయ.

ఆవిడ ప్రశ్న వినండి,
"సంధ్య రంగులు సాగితేనేమి, చల్లగాలులు ఆగితేనేమి? కలిసి మెలిసి ఉంటూ, కన్నుళ్ళో నా మనసు గ్రహించుకోలేవా, మరులు తోడుకోలేవా?"
అందుకు ఆ ప్రియుని జవాబు ఇంకా బాగుంది చూడండి,
అవి కన్నులు కాదు, కలల వెన్నెలలు. ఈ వన్నెలకారి చిలిపి తెన్నులవి. నాకేం కావాలో నీకు తెలిసికూడా ఏం తెలియనట్టు నటిస్తున్నావ్ అంటున్నాడు.

ప్రియుని మాటలకి ఆవిడ ఓదార్పుగా ఇలా అంటుంది,
ఊరకే ఎందుకు పంతాలాడుతావు, నీమీద పంచప్రాణాలుపెట్టుకు జీవిస్తున్నాను. అందుకని హద్దుకాదనగలనా? అని ఓదార్చుతుంది.

ఇద్దరు కలిసి ఇలా శుభం పలుకుతున్నారు చివర,
ఎన్నటికీ వాడిపోని చిరునవ్వులతో, నడిచే పువ్వుల్లా ఇద్దరి అనురాగాలతో లోకంలో మనమిద్దరమే ఉన్నట్టు భావిస్తూ కలిసి బ్రతుకుని ఆనందంగా సాగిద్దాం అంటున్నారు.

ఇలాంటీ గీతాలను వింటూ రోజుని మొదలుపెడితే ఆ రోజంతా చాలా పాసిటివ్ గా, active గా గడిచిపోతుంది. 


======================
Lyrics in RTS format
======================
   pallavi 
 

    ataDu :
    vADuka marachedavEla, nanu vEDuka chEsedavEla?
    ninu chUDani dinamu nAkoka yugamu
    neeku telusunu nijamu
    Ame :
    vADuka maruvanu nEnu, ninu vEDuka chEyaga lEnu
    ninu chUDani kshaNamu nAkoka dinamu
    neeku telusunu nijamu

    charaNaM 1
    ataDu :
    saMdhya  raMgula challani gAlula
    madhura rAgamu maMjula gAnamu
    tEne viMdula teeyani kalalu
    marichipOyina vELa?
    ika manakee manugaDa ElA?
    nee aMdamu chUpi DeMdamu vUpi
    ASa rEpedavElA ASa rEpedavElA

    Ame :
    O O O...saMdhya raMgula sAginA, challagAlulu AginA
    kalisi melisi kannulalOna, manasu chUDagalEvA?
    marulu toDagaga lEvA?
 
    charaNaM 2
    ataDu :
    kannulA ivi kalala vennelA,  chinni vannela chilipi tennulA?
    manasu telisee marmamElA?

    Ame :
    iMta toMdara ElA iTu paMtAlADuTa mElA?
    nAkaMdarikannA ASalu unnA haddu kAdanagalanA?
    haddu kAdanagalanA?

    vADani navvula tODa naDayADeDu puvvula jADa
    anurAgamu virisi lOkamu marichi
    Ekamaudamu kalasi Ekamaudamu kalisi
 
rachana : AtrEya
chitraM : peLLi kAnuka
saMgeetaM : E eM rAja
gaLaM : E eM rAja, suSeela
darSakatvaM : Sreedhar

====================================

5 వ్యాఖ్యలు:

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

మంచిపాటను చక్కగా పరిచయం చేశారు..

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

నెనర్లు వేణూ! నాకు ఇష్టమైన 10 పాటలు(మాత్రమే ఉన్న) లిస్ట్ తయారుచేస్తే ఈ పాట 2వ స్థానంలో ఉంటుంది :)

వనజ వనమాలి చెప్పారు...

భాస్కర్..చాలా మంచి పాట.. పోస్ట్ చూసి ఆనందం తో..డెందం ఊగినది. చాలా రోజుల తర్వాత మీ పోస్ట్ సంతోషం. మీ కిష్టమైన తతిమా పాటలు త్వరగా చెప్పేయండి.

Phanindra చెప్పారు...

మంచి పాటని గుర్తు చేశావ్ సోదరా. ఇంతకీ పల్లవిలో "వాడుక" అన్న పదానికి అర్థమేమిటి? వాడుక మరిచెదవేల అంటే ఏమిటి?

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

సోదరా, వ్యాఖ్యకు నెనర్లు.

వాడుక :
ఈ పదం ఇక్కడ "ధర్మము" అనే అర్థముతో వాడబడి ఉంది. ప్రియురాలుగా నీ ధర్మము మరిచిపోయి నను ఆట పట్టిస్తున్నావు అంటున్నాడు ప్రియుడు.

దీనికి మరో అర్థం "అలవాటు".

ఈ పదము తమిళంలోకూడా ఉంది. తమిళంలో కూడా అలవాటు అనే అర్థంలోనే వాడుతారు.

ఈ పాట/సినిమా తమిళంలో కూడా ఉంది. ఈ పదాలతోనే మొదలైతుంది. సినిమా మొదట తెలుగులో వచ్చింది, ఆ పైన తమిళం అనుకుంటా.