09 డిసెంబర్ 2011

పరమార్థం – తెంచుకోవడంలోనే!


పదహారో వసంతంలో పుట్టే  పరువపు ఆకర్షణ కాదిది!
ఒకరి శ్వాసలు మరొకరికి తగిలేంతదూరాల్లో దగ్గఱైనవేళ
మైమరచి పరవశించే పాతిక వయసూ కాదిది!
బ్రతుకు సూరీడు పడమటికి పరుగులు తీస్తున్న ప్రాయమిది!

పిలవని చుట్టంలా -
ఏదీకాని ప్రాయంలో ఎందుకొచ్చినదో తెలియని బంధమిది!

జీవితాన్ని సుప్తావస్థలో జీవించిన మన మనసులను
హఠాత్తుగా జాగృతస్థితిలోకి చేర్చిన నిముషమేదో.

ఏడాదంతా వేసంగితో శపించబడిన జీవితాల్లోకి
నిత్య శీతాకాలం చొరబడిన నిముషమేదో తెలియదు.

చీకట్లు నిట్టూర్చిన జీవితాల్లోకి - పండు వెన్నెలలు!
కలతల మేఘాలు కమ్మిన ఆకాశానికి - అరుణతేజం!

అభిరుచులు కలవడంతో ఇది ఆరంభం!

మన ఇద్దరికీ లింగభేదంలేకుంటే -
ఈ బంధం చిక్కటి స్నేహమై ఆదర్శమయ్యేది
ఇప్పుడిది స్నేహమైతే కాదు; ప్రేమ అంతకంటే కాదు
రెంటికీమధ్య పేరులేనిది!

జంటకట్టుకుని స్వతంత్రపు ఆకాశాన్ని ఆస్వాదించలేము
చెట్టాపట్టాలేసుకుని ప్రపంచం మరచి పరుగిడలేము
సంప్రదాయపు పంజరాల్లో బంధింపబడ్డ పక్షులం!

నా జీవితవీణలో నీ రాక ఏ తీగను మీటిందో
నిత్యం నాకు ఆనందభైరవి రాగాలే!
నీ బ్రతుకు ఎడారిపై ఏ అమృత చినుకులు కురిపించానో
నిత్యం నీ మనోవనంలో వసంతాలే!

నువ్వుమీటిన రాగాలతో నా జీవితమూ
నా ప్రవాహంతో నీ జీవితమూ - పరమార్థమైనవి!

కాలం పదేళ్ళు ఆలస్యం చేసింది,
మనల్ని పరిచయం చేయడంలో!
మన కుటుంబాలకొరకు ఈ బంధాన్ని
తెంచుకోడానికి మనం ఆలస్యం చెయ్యొద్దు!

==============================

P.S ఏడాది క్రితం రాసిన కవిత ఇది. తెలిసిన ఒక పెద్దాయన చెప్పిన తన కన్నీటి కథను కవితగా రాశాను.

23 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

నీ బ్రతుకు ఎడారిపై ఏ అమృత చినుకులు కురిపించానో
నిత్యం నీ మనోవనంలో వసంతాలే!

చాలా బాగుందండీ! మంచి భావుకత!

Unknown చెప్పారు...

పదాలను అల్లిన తీరు..భావాలను నేసిన తీరు అద్భుతంగానే ఉన్నాయి. మనసుకు హత్తుకునే విధంగా ఉంది కవిత

Manasa Chamarthi చెప్పారు...

beuatifully done, Bhaskar

అజ్ఞాత చెప్పారు...

ఒప్పుకుంటున్నాను భాస్కర్.... పక్కవారి జీవితాలను చూసి ప్రభావితమయ్యి కూడా కవితలు రాయవచ్చు. నీతో వాదించిన తర్వాత నేను ప్రయత్నించి చూశాను. కాకుంటే ఎంతయినా అవి నేను రాసిన కవితలు కదా నా ప్రభావం లేకపోలేదు. పదాల అల్లిక ఎవరు నేర్పారో చెబితే నేనూ నేర్చుకుందునూ!

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

రసజ్ఞ గారూ,
ధన్యవాదములండి.

అంతర్ముఖుడు గారూ,
ధన్యవాదములు :-)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

మానస, అవునా? థ్యాంక్స్.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

అరుణ్,
ఈ కవితలో అచ్చుతప్పులుంటే దిద్దమని నీకు పంపిస్తే, నువ్వు కవితలోని భావం/అంశం అనైతీకం, పోస్ట్ చెయ్యొద్దు అని అప్పుడు చెప్పావు. అయినా పోస్ట్ చేశాను, ఈ పోస్ట్ చూడగానే నీకు బాగ కోపమొస్తుందనుకున్నాను. ;-) నీకు చెప్పే పోస్ట్ చేద్దామనుకున్నాను, చెప్తే వద్దనే అంటావని చెప్పలేదు. ఆ పెద్దాయన కన్నీళ్ళే నా గుండెను పిండి కవితగా రాయించింది. కన్నీళ్ళూ నాది కాదు; కవిత మాత్రమే.

-భాస్కర్

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

పదాల ఎంపిక లోనే చాలా పరిణితి ఉంది భాస్కర్! పరిణితి చెందిన మనసుల భావాలని చాలా అందంగా హుందాగా ఒడిసిపట్టావు...

మధురవాణి చెప్పారు...

ఒకే ఒక్క మాట భాస్కర్ గారూ..
అద్భుతం!
అంతే.. ఇంకేం మాటల్లేవ్! :))

జ్యోతిర్మయి చెప్పారు...

భాస్కర్ గారూ చాలా బావుందండీ..

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

@దీపూ, :-)

@మధుర వాణి గారు, థ్యాంక్స్.

@జ్యోతిర్మయి గారు, ధన్యవాదములండి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కవిత లోని వస్తువు అనైతికమైనదా నైతికమైనదా అన్న విషయం ప్రక్కన పెడితే కవిత్వీకరించిన తీరు అద్భుతంగా ఉంది.

మన ఇద్దరికీ లింగభేదంలేకుంటే -
ఈ బంధం చిక్కటి స్నేహమై ఆదర్శమయ్యేది
ఇప్పుడిది స్నేహమైతే కాదు; ప్రేమ అంతకంటే కాదు
రెంటికీమధ్య పేరులేనిది!ఇక్కడ ఆకర్షణ లేని పరిణితి చెందిన వ్యక్తుల మనోభావాలని యెంత బాగా చెప్పారు!!! నాకు వస్తువు, కవిత్వీకరించిన తీరు బాగా నచ్చింది. ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబందాన్ని సమాజం + తనవాళ్ళు కూడా అపార్ధం చేసుకోగలగడం అన్నది సహజమే కదా!
వస్తువు ప్రతిది మన అనుభవంలోనుండే తీసుకోబడదు.ఇతరుల అనుభవాల నుండి తీసుకున్నపు డే..ఆ అనుభవాన్ని తన అనుభవంగా వ్యక్తీకరించ గల్గినప్పుడే కవి కవి కాగలడు.మంచి కవిత ..అభినందనలు ఈ లింక్ చూడండి ..
http://vanajavanamali.blogspot.com/2010/12/kavithwa-vanamlovanaja.html

శిశిర చెప్పారు...

ఆ పెద్దాయన మనసుని మీ అక్షరాల్లో చూపించారు. మీ వ్యక్తీకరణ చాలా బాగుంది.

అజ్ఞాత చెప్పారు...

భాస్కర్,
మనిషి తప్పు చేసినప్పుడు రెండు రకాలుగా బాధపడుతాడు. ఒకటి తను చేసిన తప్పు తెలుసుకుని రెండు తన తప్పు సమాజానికి తెలిసిపోయిందే అని! 'కుటుంబాల కోసం' 'పదేళ్ళ ఆలస్యం' ఈ రెండూ ఆ వ్యక్తికి ఇంతకుముందే ఒక స్వంత కుటుంబం ఉండొచ్చు అనే అవకాశానికి తావిస్తున్నాయి. కాబట్టి నేను అనైతికం అన్నది ఆ వ్యక్తి పెళ్ళినాటి ప్రమాణాలను మరచి లేదా సాధ్యం కాదని తెలిసీ మనసును కోరికలవెంట పరుగు పెట్టించటం. అలాగే 'నీ బతుకు ఎడారి' అన్నావు అంటే అది జాలితో కూడిన ప్రేమా? అలాగే 'పరమార్థమైనవి' ఇది కేవలం భార్యా-భర్తలకు మాత్రమే వర్తిస్తుంది అని నా అనుకోలు!

Manasa చెప్పారు...

@అచంగ గారికి,

"ఆ వ్యక్తి పెళ్ళినాటి ప్రమాణాలను మరచి లేదా సాధ్యం కాదని తెలిసీ మనసును కోరికలవెంట పరుగు పెట్టించటం" అని రాశారు;

ఈ కవితలో మీకంటువంటి భావం స్ఫురించకూడదు అనడం లేదు కానీ, కవిత ఆసాంతం, నాకు మాత్రం , మనసును కోరికల వెంట పరుగు పెట్టించిన తీరు కనపడలేదు. కుటుంబం పట్ల బాధ్యత, కోరికలకు ఆస్కారమే లేకుండా పక్క దారి పట్టక మునుపే దోవలు మార్చుకోవాలన్న స్పృహ కనపడ్డాయి.

'నీ బతుకు ఎడారి' - అన్న దానిపై మీ స్పందనలో - జాలితో కూడిన ప్రేమ అన్న వ్యాఖ్య సబబు కాదేమోననిపించింది. మరొక వ్యక్తితో సుఖపడలేనందుకది ఎడారి బతుకవ్వదు. కొన్ని సార్లు చక్కని స్నేహాలు, అభిరుచులు పంచుకునే నేస్తాలు లేనప్పుడు, జీవితం కష్టాలేవీ లేకుండా సాగిపోతున్నా, అందులో వసంతాల జాడ లేకపోవచ్చు. ఇక్కడ సమస్య - జీవిత సహచరునితో(సహ ధర్మచారిణితో) ఏ మాత్రమూ కాకపోవచ్చు. కవితలోనే ఒక చోత చెప్పినట్టు, లింగ బేధం లేకుంటే ఆ స్నేహం ఆదర్శమయ్యేదేమో. బహుశా, ఇక్కడ కవి అన్యాపదేశంగా చెప్పదలచినది ఆ లోటేనని అనుకుంటున్నాను.

అనేకానేక అర్థాలను స్పృశింపజేయడం కవితల్లో తఱచుగా కనపడే విన్యాసమే. తప్పొప్పుల తాకిడి(హద్దులు దాటకుండా) కనపడినా ఆఖరుకు మంచిని, మంచి మార్గాన్ని ఎన్నుకోవడంలోనే కవిత సందేశం బయల్పడుతుండని నా భావన.

కవిత చదవగానే నాకీ విథమైన స్పందన కలిగింది అని పంచుకోవడం - ఈ భిన్నాభిప్రాయాలు సహజమేనన్న ధోరణిని వెల్లడి చేస్తుందని ఇంత బారు రాశాను. కవిత వెనుక అసలు కథ నాకు తెలీదు కనుక, ఈ వ్యాఖ్యానం కేవలం కవితా పరంగా భావ్యమైనదేననుకుంటున్నాను.
-Manasa Ch

అజ్ఞాత చెప్పారు...

మానస గారూ,
ముందుగా మీ వివరణకు ధన్యవాదాలు.

'అనేకార్థాలు స్ఫురింపజేయటం........' నూటికి నూరుపాళ్ళూ మీ ఈ వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను. కానీ,
మొదటి లైనులోనే 'పదహారో వసంతములో పుట్టే ఆకర్షణ కాదిది', 'ఇప్పుడిది స్నేహమైతే కాదు' ఈ రెండు పదబంధాల వల్ల అది కచ్చితంగా స్నేహం మాత్రమే కాదు అని స్పష్టమవుతున్నది కదా! అలాగే అది ప్రేమా కాదంటున్నారాయె! 'అభిరుచులు కలవడంతో' దీన్ని నేను కేవలం అభిరుచులు కలసినంతమాత్రాన అంత దుఃఖపడాల్సిన అవసరము లేదు కదా అని అనుకుంటున్నాను.

కవిత ఆసాంతం పరికించినా కానివయసులో మనసు మరోదానివైపు పరుగు పెట్టడమో లేదా అలాంటి ఆలోచన వచ్చి విరమించుకోవటమో జరిగిందనేది విస్పష్టంగానే తెలుస్తున్నది.

'సాంప్రదాయపు పంజరాల్లో' కేవలం వయసు తేడా వల్లే (ఆయనకు అంతకు మునుపే పెళ్ళి కాకుంటే) ఈ పదం వాడారంటే నమ్మబుద్ధికాదు. అందుకే ముందటి వ్యాఖ్యలో చెప్పినట్టు 'తన తప్పు సమాజానికి తెలుస్తుందనో లేదా తెలిస్తే బాగోదనో' అనే కోణములోనే ఆయన అంతరంగం ఉన్నట్లు అర్థమవుతున్నది.

ఇక 'నీ బతుకు ఎడారి' మీరు చెప్పిన అర్థములో సరే కాని వయసులో ప్రేమ/స్నేహం అనే కోణములో సరైన జస్టిఫికేషన్ లేదనే అనుకుంటున్నాను.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

వనజ వనమాలి గారు,
కవిత్వీకరించిన తీరుని, వస్తువునీ ముచ్చుకున్నందుకు ధన్యవాదములండి.

మీరు చెప్పినట్టు, వారి అనుబంధాన్ని సమాజమూ, తన అనుకున్నవాళ్ళూ అపార్థం చేసుకున్నప్పుడే సమస్య మొదలైంది. అందుకని వారి అపార్థంలో న్యాయంలేదని కాదు! మన వ్యవస్థలోని లోటుగా నేను భావిస్తున్నాను.
ఈ కవిత మీద నా అభిప్రాయం కూడా రాస్తాను.

తర్వాత మీరు రాసిన కవితకూడా చదివాను. నా కవితా వస్తువుకూడా మీ కవితా వస్తువుకి దగ్గర్లోనే ఉంది! మీరిచ్చిన ముగింపు బాగా స్పష్టంగా అనిపించింది నాకు.

మీరన్నట్టు "ఇతరుల అనుభవాల నుండి తీసుకున్నపు డే..ఆ అనుభవాన్ని తన అనుభవంగా వ్యక్తీకరించ గల్గినప్పుడే కవి కవి కాగలడు" - మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

శిశిర గారూ,
ధన్యవాదములండి.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

అచంగ/అరుణ్,
పెళ్ళినాటి ప్రమాణాలు మరిచిపోవడం - అందరికీ, అన్ని వేళలా, అన్ని ప్రమాణాలూ గుర్తుంతుండవు కదా? ఒకటిరెండు క్షణాలైనా కొన్నిటిని మరచిపోతాము; లేక మరచిపోజేసేంతటి గాఢమైన పరిస్థుతులు ఎదురవుతాయి!

"మానవజీవితంలో కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు డీలాపడిపోకుండా, ఆత్మవిశ్వాసంతో వీటినుంచి గడ్డెక్కగలము అన్న నమ్ముకుంటూ స్తిమితంగా ఉండాలి" అన్న ఈ జీవన తత్వం అందరికీ తెలిసినదే కదా? మరెందుకు కష్టాలొచ్చినప్పుడు వణికిపోతాము? ఎందుకంటే ఆ పరిస్థితులు అలా క్రుంగదీస్తాయి. ఎంతదూరం ఆ పరిస్థితి ప్రభావాలకు బలైపోరారన్నది వారి వారి పరిపక్వతనుబట్టి ఉంటుంది. అలాంటిదే ఇది కూడా! ఎంత మంచివారికైనా పరిస్థితుల ప్రభావంచేత కొన్నిసార్లు అడుగులు తడబడే అవకాశాలున్నాయి. తడబడినప్పుడు బ్యాలన్స్ చేసుకుని అడుగునిలదొక్కుకుంటారా, లేక జారిపడతారా అన్నది ఆ మనిషులయొక్క మోరల్స్ మరియూ పరిస్థితులమీద ఆధారపడుతుంది.

ఈ కవితలో చెప్పినదెల్లా, పరిస్థితుల ప్రభావంతో తడబడినపుడు జారిపడిపోకుండా ఎలా బ్యాలన్సె చేసుకున్నారన్నదే.

నిషిగంధ చెప్పారు...

చాలా చాలా బావుంది, భాస్కర్.. నీకు కవిత్వంలో కూడా మంచి ఒడుపు ఉంది.. తరచూ రాస్తూండు :-)

"మన ఇద్దరికీ లింగభేదంలేకుంటే -
ఈ బంధం చిక్కటి స్నేహమై ఆదర్శమయ్యేది
ఇప్పుడిది స్నేహమైతే కాదు; ప్రేమ అంతకంటే కాదు
రెంటికీమధ్య పేరులేనిది!"

ఈ నాలుగు లైన్లు చాలు ఈ కవితా వస్తువు విలక్షణత తెలపడానికి!! There shouldn't be any more arguments! :-)

ఒక పాత సామెత ఉంది కదా.. కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్ళినా పర్వాలేదు కానే మనసు వెళ్ళినచోటికల్లా మనిషి వెళ్ళకుండా నియంత్రించుకోవడంలోనే అసలైన వివేకత్వం ఉంది అని! అది కవిత్వంలో ఇంత చక్కగా చెప్పవచ్చని ఇప్పుడే ఉంటుందని తెలిసింది. :))

అజ్ఞాత చెప్పారు...

అవును భాస్కర్, విచిత్రమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనం నమ్ముకున్న నైతికవిలువలే మనను కాపాడేవి. మొత్తమ్మీద చిన్నవారికి ఇదొక మంచి జీవితపాఠం.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా బాగుంది మీ కవిత . నిజంగా భాష కందని భాష్యం. అద్భుతం.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

ధన్యవాదములు, రాజేశ్వరి గారు.