29 సెప్టెంబర్ 2011

ఈ యుద్ధం ఓటమికోసమే...

ఇంతకాలం నా దారిలో యే అడ్డంకులూలేవు
ఏ దేవత పంపిందో నిన్ను,
నా దారిపొడవునా తీపి అడ్డంకివై వ్యాపించావు!

"నా దారి తప్పుకో" -
మదిలోని ఈ మొగ్గ భావాన్ని
పెదవుల్లో పూయించాలనుకున్నా!
నీ మోహనరూపు మహత్యమేమో
నా పెదవులు చేరగానే
నీ పూజకోసమే అన్నట్టు
చిరునవ్వుగా వికసించింది!

నిముషానికి వందసార్లనుకుంటాను
దురమైపోవాలని - అదేంటో
క్షణానికి లక్ష సార్లు దగ్గరైపోతున్నాను!

వద్దనుకుంటూనే కావాలనుకునే ఈ వింత
నువ్వు నేర్పిన ఓ కొత్త విద్య!

మామూలు పదములు తీయనవుతాయనీ,
బరువైన భావాలను తెస్తాయనీ - అవి
నా చిత్తాన్ని చిందరవందర చేస్తాయనీ
నీ పెదవుల దాటేవరకు తెలియదు నాకు!

ఎలా నవ్వితే నా నిష్ట కరిగిపోవునో
ఎలా చూస్తే నా వైరాగ్యం హద్దుదాటునో
నీకు బాగా తెలిసిపోయింది!
నా అణువణువును కలవరపెట్టే
ఆ లేత నవ్వులనుండీ, కోంటె చూపులనుండీ
కాపాడుకునే ఉపాయమొకటి ఇప్పటికిప్పుడే కనుక్కోవాలి!

నన్ను ముక్కలుముక్కలుగా కాకుండా
మొత్తాన్ని ఒకేక్షణంలో వశపరుచుకోవలసింది!
ఇప్పుడుచూడు, నీవశంకాకుండా శేషమున్న ముక్కలు
నీమాయలోనుండి తప్పించుకోడానికీ,
నీవశమైన ముక్కల్ని విడిపించుకోడానికీ
నీకెదురుగా గూడుపుఠాణీలు చేస్తున్నాయి!


"వశమయినదే ఎక్కువ -
శేషమున్నది తక్కువేలే" అని సంబరపడకు!
గుర్తుందిగా కురుక్షేత్రం?

అబ్బా, అంతలోనే మొహమలా పెట్టేసి
కలవరపడిపోకు - ఇవి పైపై మాటలే!

రహస్యం చెప్తాను - శేషమున్న ముక్కలు
యోధుల్లా యుద్ధరంగంలో గర్జించినా
అంతరంగంలో అర్థించేది నీపొందుకోసమే
ఈ ఓటమంతా ఆ గెలుపుకోసమే!

15 కామెంట్‌లు:

బంతి చెప్పారు...

బాగుందండి

Manasa Chamarthi చెప్పారు...

Brilliant!
మీరు తమిళంలో ఆలోచించి తెలుగులో రాస్తారన్నది గుర్తొచ్చిన ప్రతిసారీ, మీరంటే ప్రత్యేకమైన అభిమానం కలుగుతుంది. తెలుగుని కాపాడుకోవడానికి మీరు పడే తాపత్రయం నిజంగా చాలా ఆశ్చర్యాన్నిస్తుంది.
ఈ కవితలోనూ, కొన్ని పదాలో వ్యక్తీకరణో, మాములు తెలుగు కవుల భాషకు పూర్తిగా దగ్గరగా లేదు, కానీ, బహుశా ఆ కాస్త వ్యత్యాసమే, ఈ కవితను ప్రత్యేకం చేసింది. ముగింపు అద్భుతంగా ఉంది. అభినందనలు.

MURALI చెప్పారు...

అన్నయ్యా నిజంగానే తమిళంలో ముందు వ్రాసుకున్నదాన్ని తెలుగులో మార్చావేమో అనుకున్నాను. భావాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి.

"నన్ను ముక్కలుముక్కలుగా కాకుండా
మొత్తాన్ని ఒకేక్షణంలో వశపరుచుకోవలసింది!"

"యోధుల్లా యుద్ధరంగంలో గర్జించినా
అంతరంగంలో అర్థించేది నీపొందుకోసమే
ఈ ఓటమంతా ఆ గెలుపుకోసమే!"

ఇవి నాకు బాగా నచ్చాయి.

MURALI చెప్పారు...

"నా దారి తప్పుకో" -
మదిలోని ఈ మొగ్గ భావాన్ని
పెదవుల్లో పూయించాలనుకున్నా!
నీ మోహనరూపు మహత్యమేమో
నా పెదవులు చేరగానే
నీ పూజకోసమే అన్నట్టు
చిరునవ్వుగా వికసించింది!

ఈ పాదాల్లో నువ్వు చెప్పిన భావం చాలా బాగుంది. కానీ తమిళంలో ఆలోచించి తెలుగులో వ్రాయటం వలన కాస్త సరళంగా లేదేమో అనిపించింది. సూటిగా అర్ధంకావటంలేదు.

MURALI చెప్పారు...

మొత్తంగా నీ కవితకు మాత్రం జేజేలు, నీకు వీరతాళ్ళు.

ఆ.సౌమ్య చెప్పారు...

నిముషానికి వందసార్లనుకుంటాను
దురమైపోవాలని - అదేంటో
క్షణానికి లక్ష సార్లు దగ్గరైపోతున్నాను!

బావుంది కవిత!

Unknown చెప్పారు...

నిముషానికి వందసార్లనుకుంటాను
దురమైపోవాలని - అదేంటో
క్షణానికి లక్ష సార్లు దగ్గరైపోతున్నాను!

వద్దనుకుంటూనే కావాలనుకునే ఈ వింత
నువ్వు నేర్పిన ఓ కొత్త విద్య!

భాస్కర్ గారు చాలా బావుంది.

Sandeep P చెప్పారు...

అన్నయ్యా

నీ వచనకవిత్వం అద్భుతంగా ఉంది. ఎంతో భావగాంభీర్యంతో పాటు పదలాలిత్యం కూడా ఉంది. అభినందనలు. ఏ వాక్యం బాగుంది అని అడిగితే అన్నీ చెప్పవలసిందే. స్వానుభవంతో కొన్ని వాక్యాలలోని లోతుని నేను అర్థం చేసుకోగలగుతున్నాను. అద్భుతంగా వ్రాశావు.

సందీప్

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

వ్యాఖ్యలురాసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు :)

Phanindra చెప్పారు...

chakkani kavita. maanasa gaaru cheppinaTTu style consistency inkaa maintain cheyyaali.

e.g:

ఎలా నవ్వితే నా నిష్ట కరిగిపోవునో
ఎలా చూస్తే నా వైరాగ్యం హద్దుదాటునో

ikkaDa "karigipOvunO" anaDam konta old fashioned gaa undi. migataa kavita style ki saripadadu

జ్యోతిర్మయి చెప్పారు...

మదిలోని ఈ మొగ్గ భావాన్ని
పెదవుల్లో పూయించాలనుకున్నా!
నీ మోహనరూపు మహత్యమేమో
నా పెదవులు చేరగానే
నీ పూజకోసమే అన్నట్టు
చిరునవ్వుగా వికసించింది!

చాలా చాలా బావుంది.

రసజ్ఞ చెప్పారు...

మదిలోని ఈ మొగ్గ భావాన్ని
పెదవుల్లో పూయించాలనుకున్నా!
నీ మోహనరూపు మహత్యమేమో
నా పెదవులు చేరగానే
నీ పూజకోసమే అన్నట్టు
చిరునవ్వుగా వికసించింది!

నిముషానికి వందసార్లనుకుంటాను
దురమైపోవాలని - అదేంటో
క్షణానికి లక్ష సార్లు దగ్గరైపోతున్నాను!

వద్దనుకుంటూనే కావాలనుకునే ఈ వింత
నువ్వు నేర్పిన ఓ కొత్త విద్య! అద్భుతమయిన పదజాలం చక్కని రచన!

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

ప్రశంసలకు ధన్యవాదములు, రసజ్ఞ గారూ

అజ్ఞాత చెప్పారు...

chala baga rasaru bhaski abinandanalu.....itu vantive chala mee nunche pondagoruchunnam......

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

డియర్ అజ్ఞాత గారూ,
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు :-)
నాకు ఇలాంటివి తప్ప వేరేవి రాయడం చేతకాదులెండి! ప్రేమ కవితలు రాయడం చదవడంలోని ఆనందమే వేరుకదూ ;-)

P.S. ఇంతకీ మీ పేరేంటి? భాస్కి అన్న పేరు కొందరికే తెలుసు, మీకెలా తెలిసింది? మీరెవరు?