17 జూన్ 2011

శ్రీపురము – నిజమైన సిరినివాసము…


తమిళనాడులో, వేలూరు సమీపానున్న శ్రీపురం బంగారు గుడికి వెళ్ళాలన్నారు ఆషా వాళ్ళ పెద్దమ్మ. ఆ శ్రీమహాలక్ష్మి గుడి సాయంత్రంపూట చూస్తే బాగుంటుందని శుక్రవారం సాయంత్రం నాలుగున్నరకు బెంగుళూరునుండి నిర్గమించాం.  బెంగుళూరు-చెన్నై రహదారి బాగుంటుంది. బెంగుళూరు నుండి 210 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బెంగుళూరు సిల్కుబోర్డు సిగ్నల్ నుండి  కారులో వెళ్తే మూడున్నర, నాలుగు గంటల్లో శ్రీపురం చేరుకోవచ్చు. వేలూరు చేరే ముందే పళ్ళెకొండ అనే ఊరుదగ్గర ఒక సుంకగవను(Toll Gate) వస్తుంది, ఆ సుంకగవనుండి ఒక కిలోమీటర్ వెళ్ళాకా కుడివైపుకు వెళ్ళే రోడ్డు తీసుకోవాలి(Sign boards చాలానే ఉన్నాయి). ఆ రోడ్డులో 14 కిలోమీటర్లు వెళ్తే శ్రీపురం వస్తుంది.


ఆ రోడ్డు నాకు బాగ అలవాటు, 3 గంటల్లో చేరుకోవచ్చనుకున్నాను. మధ్యలో ఓ 30 నిముషాలు అల్పాహారానికి అడయార్ ఆనంద భవన్ వద్ద ఆపాము. శ్రీపురం చేరేటప్పటికి మాకు 7:55 అయింది. గుడిలోపలికి ప్రవేశం ఎనిమిదింటివరకే. ఆపైన ప్రవేశం లేదు. లోపలికి వెళ్ళాక 10:00 వరకైనా ఉండచ్చు గుడిలో. మేము హడావిడిగా కారు పెట్టేసి వరుసలో నిలుద్దామని వెళ్ళాము(Queue-ని తెలుగులో "క్యూ" అని రాయాలా?). అక్కడ రెండు ప్రవేశద్వారాలున్నాయి. ఒకటి ఉచిత దర్శనానికి, మఱొకటి మూల్య దర్శనానికి (తిరుమలలోని త్వరిత (Quick) దర్శనంలాంటిది కాదు). అక్కడున్న సిబ్బందిని “రెంటికీ ఏం తేడా?” అని అడిగితే, అతను “తేడా పెద్దగా ఉండదండి, మూల్య దర్శనమైతే ఒక 10 నిముషాలు గర్భగుడి ముందు కూర్చోవచ్చు. ఉచిత దర్శనం అలా అమ్మవారిని దర్శిస్తూ వెళ్ళిపోవాలి. నడవవల్సిన వరస(Queue) మాత్రం అందఱికీ ఒకటే.” అన్నారు. ఎలాగూ చీటీ ఇస్తున్నారు, డబ్బులు గుడినిర్వాహులకే వెళ్తుంది కదా అని ఆష వాళ్ళ మామ చీటీలు తీసుకుందాం అన్నారు.

గుడిలోకి నడవడం మొదలు పెట్టాము. ఆ దారి 15 అడుగుల వెడల్పుతో  గర్భగుడి చుట్టూ  నక్షత్ర (శ్రీచక్రం) ఆకారంలో ఉంది. ప్రతిఒకరూ ఆ నక్షత్ర ఆకారంగల ఆ దారిలోనే వెళ్ళాలి. ఆ దారి పొడవునా ఇరువైపులా నునుపురాతిబండలతో తిన్నెలు అమర్చారు, భక్తులు నడిచి అలసినప్పుడు కూర్చోడానికి. పైన కప్పుకూడా ఉంది. పచ్చిగడ్డి, అందమైన పూలచెట్లూ, అలంకారపుమొక్కలూ ఉన్నాయి ఇరువైపులా.  మధ్యలో బంగారు గుడి కనబడుతూ ఉంటుంది. రాత్రిపూటకాబట్టి  విద్యుత్తుదీపాలకాంతిలో కనకమలా మెఱుస్తూ రమ్యంగా కనబడుతుంది. అక్కడ నడుస్తున్నప్పుడు ఆ దృశ్యము కలిగించే అనుభూతిని మాటల్లో చెప్పడం అలవికాదు. వెళ్ళి నడిస్తేనే తెలుస్తుంది.

నక్షత్రాకార దారి చివర ఇంకో గుండ్రమైన దారిలో నడవాలి. మధ్యలో గర్భగుడి.  దారికీ గర్భగుడికీ మధ్యలో నీరు.  బంగారు స్తంభాలూ, వాటిమీదున్న గాలి గోపురమూ, దీపాలకాంతీ నీటిలో ప్రతిబింబిస్తుంటే చూస్తూ అక్కడే నిలిచిపోవాలనిపిస్తుంది.  నీటికొలను మధ్య  గుడి ఉన్నట్టు నిర్మించారు. చుట్టూతిరిగి వస్తే గర్భగుడి వాకిలి అక్కడ మూల్యదర్శన చీటీలు పనికొచ్చాయి. చీటీలున్నవారిని గర్భగుడిముందున్న చిన్న కూటములో కూర్చోబెట్టారు. మిగిలినవారు అలా నడుస్తూ దర్శనం చేసుకోవాలి. 
 
అక్కడ కూర్చుని అమ్మవారిని చూస్తుంటే చిన్నప్పుడు వినీవినీ కంఠోపాఠమైన “క్షీరసాగర మథనం” లోని కంద, సీస, తేటగీతి పద్యాలు మదిలో మెదిలాయి. పోతన వర్ణించిన  శ్రీదేవి ఇన్నాళ్ళూ మదిలో ఊహాచిత్రంగానే ఉండేది. పాలకడలిలో ఆవిర్భవించిన ఆ జలజాక్షి ఇక్కడ, ఇవాళ నాకు దృశ్యకావ్యమైనట్టుంది. చుట్టూ నీళ్ళు, మధ్యలో తొలకరితెచ్చిన మెఱుపుకాంతికి ఏమాత్రమూ తీసిపోని బంగారు భవనము. భవనము మధ్యలో వెలిసిన అతిలోకసుందరి!  శ్రీమహాలక్ష్మి! ఆమె సొబగు వర్ణనాతీతం. అలంకరించిన విధానం చూస్తుంటే, సముద్రుడు కన్యాదానం చేస్తూ  పుట్టినంటి కానుకగాయిచ్చిన స్వర్ణాభరణాలు, లాంఛనాలూ అన్నీ ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది.



దర్శనం అయ్యాక కొంచం అవతల నెయ్యిదీపాలు వెలిగించుతున్నారు. మా ఆవిడకూడా ఒక దివ్వె తీసుకుని వెలిగించింది.  దివ్వెపట్టుకుని వెళుతున్న మా ఆవిడకూడా ఓ క్షణం అమ్మవారిలా గోచరించింది నాకు! ఇవీ, మా శ్రీపురం యాత్ర విశేషాలు.

అదనంగా మఱికొన్ని విశేషాలు :
  • కోట్లు ఖర్చుతో, బంగారుపూతపూసి గుడి కట్టిస్తేగానీ మీ దేవుడో, దేవతో అక్కడ నివాసం చెయ్యరా? అని అడిగేవారికోసం (ఉషశ్రీ గారి శైలీలో) నా సమాధానాలు.
ఏ దేవుళ్ళ నివాసానికి కోట్లుఖర్చుపెట్టనక్కర్లేదు, గుళ్ళుకట్టనక్కర్లేదు. నిర్మలమైన మనసుతో నిశ్చలంగా ఉండగలిగినవారికి సర్వత్రమూ దేవతానివాసాలే.
  •  మఱెందుకు అంత ఖర్చుపెట్టి గుడికట్టించడం? నువ్వు వెళ్ళడం?

ఓ వ్యక్తి అంత డబ్బులు పెట్టి(చాలా వరకు స్వంత డబ్బేనట) ఒక గుడి నిర్మించాలని ఎందుకనుకున్నాడు? అన్నికోట్ల డబ్బులున్న మనిషి ఇంకా ఇంకా ఆస్తులు సంపాదించుకుంటూ హ్యాప్పిగా లైఫ్‌ని ఎంజాయ్ చేసుండచ్చు కదా? వచ్చిన భక్తులు కాసేపైనా ఆ గుడిప్రాంగణంలో ప్రశాంతత పొందాలనుకున్నాడు. అలా చెయ్యడంలో ఆయనకీ ప్రశాంతతకలిగుండచ్చు.  గుడికట్టించాలనుకున్న ఆయన భక్తిని మెచ్చుకోవాలి.


=================================================
పైన చెప్పిన బమ్మెర పోతన గారి భాగవత పద్యాలు(పుస్తకం చూసే రాశాలెండి) : 
తొలుకారు మెఱుగుకైవడి తళతళ మని మేను మెఱవ ధగధగ మనుచు
గలుముల నీనెడుచూపుల చెలువంబుల మొదలిటెంకి సిరి పుట్టె నృపా

పాలమున్నీటి లోపలిమీది మీగడ మిసిమిజిడ్డున చేసి మేను వడసి
క్రొక్కారు మెఱుగుల కొనలక్రొత్త తళుకుల మేనిచే గలనిగ్గు మెఱుగు నేసి
నాటీనాటికి బ్రోదిసవకంపుదీవల నునుబోదనెయ్యంబు నూలుకొలిపి
క్రొవ్వరు కెంవమ్మికొలకున బ్రొద్దున బొలసినవలపున బ్రోది వెట్టి

పసిడిచంపకదామంబుబాగుగూర్చి, వాలుక్రొన్నెల చెలువున వాడి దీర్చి
జాణతనమున చేతుల జడ్డు విడిచి నలువ యీ కొమ్మ నొగిచేసినాడు నేడు.

కెంపారెడు నధరంబును, జంపారెడినడుము సతికి శంపారుచుల
సొంపారు మోముకన్నులు, బెంపారుచు నొప్ప గొప్పపిఱుదును గుచముల్.
బాబూ, ఒక్కముక్కకూడా అర్థంకాలేదు ఈ పద్యాలకు అర్థం చెప్తావా అంటున్నారా? త్వరలో రాస్తాలెండి!

=================================================
Search words : Sripuram, Vellore, Golden Temple, Narayani peedam / peetham, mahalakshmi temple, ksheerasagara mathanam, telugu
=================================================

3 కామెంట్‌లు:

వేణూశ్రీకాంత్ చెప్పారు...

Wonderful narration Bhaskar గారు చాలా బాగుంది..

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మిత్రులు చెప్పగా విని.. నేను కూడా..ఇటీవల సిరిపురం అమ్మవారిని ధర్శించుకున్నాను.. చాలా..అద్భుతం అనిపించింది. అలా గుడి కట్టాలనే ఆలోచన రావడమే..ఒక విశేషం. అమ్మవారి దర్శనం తర్వాత గజ దర్శనం లభిస్తే మంచిదట అని కూడా అన్నారు. ఏదైనా గుడికి వెళ్ళే అంత సేపు ఒక ప్రశాంత వాతావరణం.అమ్మవారిని దర్శించడం మరపురాని అనుభూతి.ఆశ్చర్యం.. అలాటి నిర్వహణ అభినందనీయం.కానీ..నడక దారిలో..ఉన్న దుకాణాలలో.. ఉన్న వస్తువులు కొనాలంటే.. చుక్కలనంటే ధరలే..అనిపించాయి. అవును..పొటోలు ఎలా సంపాదించారు.? బాగుంది..మీ దర్శనం విశేషాలు.

పసుపులేటి చరణ్ రాజ్ చెప్పారు...

నాకు ఆ పద్యలకు భావాన్ని తెలియ చేస్తారా..?