15 మే 2012

Chrysanthemum...

కొత్త క్లాసుని కొత్త స్టేషనరీతో మొదలుపెడదామని అంగటికెళ్ళి పెన్నులు పెన్సిళ్ళు కొనుక్కుని వచ్చి గేట్ తీసి సైకిల్ని లోపలపెట్టి స్టాండ్ వేశాను. ఈ ఇనుప గేట్ చప్పుడు వినగానే అమ్మ ఇంటి లోపల్నుండి వచ్చి, 

"నాన్నా, కృష్ణాంతిమం ఫ్లవర్ అంటే ఏంట్రా?"

"ఎక్కడ విన్నావమ్మా? అంతిమక్రియలకి పువ్వులు వాడుతారుగానీ అంతిమాలనీ, ఆరంభాలనీ పువ్వులకు పేర్లుండవు. ఈ మెడ్రాస్ లో ఏ నర్సరీలోనూ లేనన్ని పువ్వులు మన ఇంట్లో ఉన్నాయి. ఉన్న పువ్వుల మొక్కలతో తృప్తిపడమ్మా. కొత్త కొత్త పువ్వుల పేర్లు చెప్పి నర్సరీల చుట్టూ తిప్పకు! ఇదివరకులా కాదు +1, +2 చాలా కష్టపడి చదవాలి. ఈ రెండేళ్ళు నీ పువ్వుల మొక్కలకు సాయపడమని అడక్కు" ఏ మాత్రమూ దయా దాక్షిణ్యమూ లేకుండా, భయంతో కూడిన కోపంతో అన్నాను.

నా బుజ్జి మేనల్లుణ్ణి చూసుకోవడానికని గత నెలలో ఓ ఇరవై రోజులు అక్క వాళ్ళ ఇంటికెళ్ళింది అమ్మ. ఆ ఇరవై రోజులూ  మొక్కలన్నింటికీ నీళ్ళుపోసే పని నాకప్పగించింది. సెలవులే కదా అని ఒప్పుకున్నాను. అన్ని మొక్కలకీ నీళ్ళు పట్టాలంటే దాదాపు మూడుగంటలుపడుతుంది. ఈ మండే వేసవిలో ఇరవైరోజులు నీళ్ళు పోసే సరికి నాకు నిజంగా చుక్కలు కనబడ్డాయి. ఇప్పుడేదో కొత్త పేరు చెప్తోంది. మరో పాదు చేసి ఈ కృష్ణాంతిమం మొక్కలెక్కడ నాటేస్తుందోనన్న భయం వల్ల కలిగిన కోపం నాది.

ఈ పట్నంలో ఇంత పెద్ద ఇంటి స్థలం ఎందుకు సంపాదించాడో అని వైకుంఠానున్న మా తాతని తిట్టుకుంటూ నీళ్ళు పోశాను. ఖాళీ స్థలం ఉండబట్టేగా అమ్మ ఇన్ని రకాల పూల మొక్కలు పెంచుతోంది? ఇంటి చుట్టూ ఖాళీలేకుండా పాదులు కట్టేసి రకరకాల పూలచెట్లు నాటేసింది అమ్మ. అవి సరిపోవని, మెట్లమీద, మిద్దెపైన, మిద్దె పిట్టగోడమీదకూడా తొట్లలో మొక్కలు. ఏంటమ్మా నీకీ మొక్కల పిచ్చి అనడిగితే "పట్నంలో పుట్టిన మీ నాన్నకీ, నీకూ వీటి విలువ తెలియదు! మొక్కలు పెంచుకోడంలో ఉన్న ఆనందమూ అర్థం కాదు. నాలా రైతు కుటుంబమైయుంటే మీకూ అర్థమయ్యేది మట్టి గొప్పతనం" అని నిష్ఠూరాలాడేది.

"అదికాదురా, మొన్న మన ఇంటికి వచ్చారు కదా ఎదిరింటిలో కొత్తగా వచ్చిన ఆంటీ? వాళ్ళ అమ్మాయి ఇవాళ వచ్చిందిరా. పువ్వులను చూస్తూ కృష్ణాంతిమం ఫ్లవర్స్ ఎంతబాగా పెంచానో అని మెచ్చుకుంది. ఆ పిల్ల పేరులానే ఆ పిల్ల మెచ్చిన పూల పేర్లు కూడా వింతగా ఉన్నాయి!" అని ఆశ్చర్య పోయింది అమ్మ.

"నిన్న సాయంత్రం చూశాను; వాళ్ళ డాబాపైన బట్టలారేస్తోంది. ఇంతకీ ఆ పిల్ల పేరేంటి?"

"నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఏదో మర్సి అట!"

"మర్సి నా? అదేం పేరమ్మా!  సరే ఏ మొక్కల్ని చూసి చెప్పింది?"

ఈశాన్యంలో ఉన్న పాదులు చూపించి "వీటిని చూస్తూ అందిరా".

అటు చూస్తే రెండుపాదులున్నాయి; కనకాంబరం, టేబుల్ రోజ్, మరో మూల గోడ పక్కనేమో పెద్ద మందారం చెట్లు. పాదుల చుట్టూ నిండుగా పూచిన వివిధ రంగుల చామంతి, తురకచామంతి(బంతిపూలు), డెయ్సీ పూల మొక్కలు. నాకేమీ అర్థం కాలేదు!

"ఆ పేరేంటో పోల్చుడం నా వల్ల కావడం లేదమ్మా! ఆ పిల్లనే అడగాల్సింది కదా?" అన్నాను.
 
"ఆ పిల్లనేం అడగుతాంలే; నువ్వొస్తే కనుక్కుందాం అని ఊరుకున్నా రా"

"ఈ సారి వస్తే నేనడిగి కనుక్కుంటాన్లే" అన్నాను.

"వద్దులేరా, నేను మీను కి ఫోన్ చేసి కనుక్కుంటాను"

మా అమ్మకు ఈగో ఎక్కువ; పరాయి వారిముందు అసలు తగ్గాలనుకోదు. అన్నీ తెలిసినట్టే భలే నటించేస్తుంది.  మా అక్కయ్యకి ఫోన్ చేసి కనుక్కుంటుందట. మా అక్కయ్య బాటనిస్ట్, బాటనీలో పీహెచ్‌డి.

* * *

సాయంత్రమయింది. అమ్మేదో వంట చేస్తోంది. గేట్ చప్పుడు విని బయటికొచ్చి చూశాను. ఎదురింటమ్మాయి! నన్ను కంగారుగా చూసి,

"ఆంటీ లేరా?"

"ఉన్నారు, రా" అని అక్కడే నిలబడ్డాను.

ఇరువైపులూ ఉన్న పూలమొక్కలకేసి చూస్తూ నడిచి వచ్చింది. దగ్గరికొచ్చాక,

"హలో, నా పేరు సూర్యా. పొద్దున వచ్చావట కదా? అమ్మ చెప్పింది!"

"అవును. మీ గార్డెన్ భలే వుంది. నాకు క్రిశాంతిమం ఫ్లవర్సంటే చాలా చాలా ఇష్టం. ఇన్ని రకాల క్రిశాంతిమం ఫ్లవర్స్ ఇదివరకెక్కడా చూళ్ళేదు. పొద్దున వచ్చి చూస్తూ ఉంటే మా అమ్మ పిలిచారని సరిగ్గా చూడకుండానే వెళ్ళిపోయాను, అందుకే మళ్ళీ వచ్చా" అంటూ వంగి పెద్దగా పూచిన ఓ బంతి పువ్వుని మునివేళ్ళతో తాకింది.

ఈ అమ్మాయి Chrysanthemum అంటే అమ్మ 'కృష్ణాంతిమం' అని విన్నదా అని నవ్వొచ్చింది. నవ్వుని ఆపుకుంటూ,

"Marie Gold ఫ్లవర్స్ ని క్రిశాంతిమం అంటావేంటి? క్రిశాంతిమం అంటే చామంతి పువ్వులు కదా?" అని అడిగాను.

"Daisy, Marie Gold, చామంతి అన్నిటినీ Chrysanthemum అనే అంటారు; ఒక ఫ్యామిలీకి చెందినవే. ఈ ఫ్యామిలీలోని అన్ని రకాల పువ్వులూ బాగుంటాయి. ఒత్తుగా ఇన్నేసి రేకులు వేరే ఏ పువ్వుల్లోనూ ఉండవు; అందుకే ఇవంటే నాకు ఇష్టం" అని మరో చేత్తో ఇంకో పువ్వును పట్టుకోబోయింది.

"అవునా? నువ్వేం చదువుతావు?" అడిగాను.

"+1. సోమవారంనుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. వివేకానందా స్కూల్."

"ఓ! నువ్వూ +1 ఆ? నేనుకూడా! డాన్ బోస్కో స్కూల్; మీ స్కూల్ కి వెళ్ళే దార్లోనే"

"దట్స్ నైస్. నేను మెడ్రాస్ కి కొత్త. పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా శ్రీరంగంలో. మా నాన్నకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చింది. నువ్వు ఏ గ్రూప్? నేను మ్యాత్స్, ఫిజిక్స్, కెమిస్ట్రి, బయాలజి."

"నేనూ సేమ్ గ్రూప్. డాక్టర్ అయిపోదామనా?"

"అలా ఏం ఫిక్స్ అవ్వలేదు. మెడిసిన్ దొరికితే డాక్టర్, ఇంజనీరింగ్ దొరికితే ఇంజనీర్. అందుకే ఈ గ్రూప్ తీసుకున్నాను" అంది.

మళ్ళీ గేట్ చప్పుడు వినబడింది. పువ్వులను చూస్తూ మాట్లాడుకుంటున్న మేము తలెత్తి చూశాము. ఈ సారి చప్పుడు మా గేట్ ది కాదు. ఎదిరింటి గేట్ ది.

"నాన్న ఆఫీసునుండి వచ్చారు. నేను మళ్ళీ వస్తాను" అని వేగంగా మా గేట్ కి చిలుకైనా వెయ్యకుండా వెళ్ళిపోయింది. నేనెళ్ళి  గేట్ ని దగ్గరికి లాగి చిలుకుపెట్టాను. ఈ సారి చప్పుడు విని అమ్మ బయటకు వచ్చింది.

"ఎవరొచ్చార్రా"

"ఆ కృష్ణాంతిమం పువ్వు వచ్చెళ్ళింది" అని ఇందాకాపుకున్న నవ్వుని ఇప్పుడు కంటిన్యూ చేశాను.

"ఆ పువ్వు ఏంటో కనుక్కున్నావ్రా?"

నేను నవ్వుతూనే, "అది కృష్ణాంతిమం కాదమ్మా. క్రిశాంతిమం! అంటే చామంతి, బంతి, డెయ్సీ పూవులట" అన్నాను.

"అవునా?" మా అమ్మ ముఖంలో ఓ పెద్ద అసంతృప్తి. "ఆ అమ్మాయి పేరేమిటట?"

"అడగలేదు! క్రిశాంతిమం గురించే మాట్లాడాము. పేరు తనూ చెప్పలేదు; నేనూ అడగలేదు. ఏముందిలే! ఆ పిల్లకి క్రిశాంతిమం అన్న పేరే బాగా నప్పుతుంది; దానికే ఫిక్స్ అయిపోదాం" అన్నాను.

* * *

మరుసటి రోజు పొద్దున వచ్చింది.

"నీ పేరేంటి"

"సారీ! నిన్న ఉన్నట్టుండి వెళ్ళిపోయాను. నా పేరు మెర్సి"

"Mercy! క్రిష్టీయన్ పేర్లా ఉందే? మీరు క్రిష్టియన్సా?"

"కాదు, హిందువులమే. మా నాన్నకి ఆ పేరంటే ఇష్టమని నాకు పెట్టారు"

"మెర్సి - నైస్ నేమ్" అన్నాను.

"నీకు గార్డెనింగ్ ఇష్టమా?"

"మా అమ్మకు ఇష్టం" అన్నాను.

"ఎన్ని వెరైటీస్ ఉన్నాయో!"

"ఇంకా ఉన్నాయి చూద్దువురా" అని ఇంటికి దక్షిణంలో ఉన్న పూల మొక్కల్ని చూపించాను.

"రియల్లీ నైస్" అంది.

"ఇంటి వెనుకాల ఇంకా ఉన్నాయి. ఇలా దాటగలవా? లేకుంటే అటువైపునుండి వెళ్దాం" కాంపుండ్ గోడకీ ఇంటి గోడకీ మధ్య గుబురుగా వాలిపోయున్న కాగితపుపూల(బోగన్-విల్లా) చెట్టు కొమ్మలను చూపించి అడిగాను.

"ఓ యెస్; దాటేయగలను" అంది.

కింద వంగి అటువైపుకెళ్ళి "ఈ కొమ్మల్లో ముళ్ళుంటాయి జాగ్రత్తగా వంగి రా" అని తన చేయి పట్టి దాటించాను.

యింటి వెనకనున్న కూరగాయల మొక్కల్నీ, గోడపక్కనున్న కొబ్బరి మాన్లనీ, జామ చెట్లనీ, మామిడి మాన్లనీ, మునగ చెట్లూ చూసి

"మీ ఇంటి వెనుక కూడా ఇంత పెద్ద గార్డనుందా? ఎంత బాగుందో!" అని మరోసారి ఆశ్చర్యంగా ముఖం పెట్టింది.

"చూసేవాళ్ళకు బానే ఉంటుంది; నీళ్ళు పట్టే వాళ్ళకు కదా కష్టాలు!" అన్నాను.

"ఈ సారి నీళ్ళు పట్టేప్పుడు నాకు చెప్పు; నేను వచ్చి హెల్ప్ చేస్తా" అంటూ మావిడి మాను కొమ్మకు కట్టియున్న పీట ఊయలలో కూర్చోబోయింది.

"ఉయ్యాలూగకు. మామిడి కాయలు రాలిపోతాయు" అని ఆపాను. పైకి చూసింది. చివరి విడత కాయలు ఇంకా మాన్లోనే ఉన్నాయి.

"అర్రే! నాకది కోసివ్వవా?" అంది.

గోడకు ఆనించున్న దోటందుకుని తను చూపించిన మావిడి కాయని కోసాను. కిందపడిపోకుండా మామిడి కాయని పట్టుకుంది.

మావిడికాయ తింటూ అన్ని చెట్లూ చూసుకుంటూ ఇంటిముందుకొచ్చేశాము.

"ఇంటి వెనక్కు మనం ఇటువైపునుండి వెళ్ళుండాల్సింది కదా?" మోచేయి తడుముకుంటూ. ఇందాక కాగితాలపూల కొమ్మ గీసుకుందేమో!

"అరే ముల్లేమైనా తగిలిందా? సారీ...  నీకు కొత్తకదా...! అసలైతే అందరూ ఇలానే వెళ్తారు. నేను మాత్రమే అదో అడ్వెంచర్ లాగా కాగితపుపూల కొమ్మల్ని దాటెళ్తాను" అన్నాను.

ఇంతలో వాకిట్లోకి ఆటో వచ్చాగింది. సావిత్రవ్వకి ఆరోగ్యం బాగలేదని చూడ్టానికి అమ్మా నాన్న వెళ్ళారు. అమ్మని ఆటో ఎక్కించి నాన్న ఆఫీసుకెళ్ళినట్టున్నారు. రెండు బ్యాగులు తీసుకుని అమ్మ ఆటో దిగింది. వెళ్ళి పెద్ద బ్యాగ్ తీసుకున్నాను. మెర్సి అమ్మను పలకరించింది.

వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వంట గదిలోకెళ్ళిపోయారు. నేను డాబా మీదుండే నా స్టడీ రూంకెళ్ళి లైబ్రరీకి రిటర్న్ ఇవ్వాల్సిన పుస్తకాలు తీసుకుని సైకిలెక్కి లైబ్రరీ దారి పట్టాను.

* * *

స్కూల్ కి సైకిల్ వేసుకుని  వెళ్ళేవాణ్ణి. మెర్సీ కూడా అంతే. స్కూల్స్ వేరే అయినా క్లాసూ, గ్రూపు ఒకటే కావడంతో మాకు మాట్లాడుకోవడానికి బోలెడు విషయాలుండేవి. ఒకోసారి ఇద్దరమూ ఒకే సమయంలో బయల్దేరేవాళ్ళం స్కూల్ కి. మాట్లాడుకుంటూ వెళ్ళి, మా స్కూల్ రాగానే నేను సెలవు తీసుకునేవాణ్ణి. సాయంత్రాల్లోనూ తను వచ్చేంతవరకు మా స్కూల్ గేట్ దగ్గరే వెయిట్ చేసేవాణ్ణి. తనొచ్చాక ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇంటికొచ్చేవాళ్ళం. ఒక రోజు స్కూల్ కి వెళ్తుండగా మా స్కూల్ దగ్గర్లో తన సైకిల్ పంక్చర్ అయిపోయింది. తన సైకిల్ మా స్కూల్లో పెట్టేసి నా సైకిల్లో తనని వదిలిపెట్టి మళ్ళీ సాయంత్రం స్కూల్ అయిపోగానే వెళ్ళి తనని సైకిల్ మీద తీసుకొచ్చి, సైకిల్ కి పంచర్ సరిచేయించుకుని వచ్చాము. ఇద్దరం బాగా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం.

సాయంత్రం వచ్చి చామంతి, తురకచామంతి, డెయ్సీ మొక్కల్లో ఉన్న పువ్వులను మునివేళ్ళతో స్పృశించేది. "అంత ఆశగా ఉంటే ఆ పువ్వులు కోసుకోవచ్చుగా?" అని ఎంత చెప్పినా ఒక బంతిపూవునైనా కోసుకునేది కాదు. "ఏ పువ్వునైనా కోసుకుంటానుగానీ క్రిశాంతిమాల్ని మాత్రం కోయను. వీటిని మొక్కల్లోనే ఆస్వాదించాలి. కోస్తే మొక్క ఎంత బోడిగా కనుబడుతుందో" అని అంటూండేది. అమ్మ కూడా ఈ పిల్ల మాటలకు ప్రభావితురాలై ఈ పువ్వులను మినహాయించి మిగిలిన పువ్వులతో మాత్రమే మాలలుకట్టేది.

క్రిశాంతిమం ఆస్వాదించడమయ్యాక కొంతసేపు డాబాపైన కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. పాఠాల్లో ఏవైనా సందేహాలుంటే పరస్పరం క్లారిఫై చేసుకునేవాళ్ళం. తను మా ఊరికి కొత్తకాబట్టి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏమైనా పుస్తకాలవీ కొనుక్కోవాలన్నా నేను తోడుగా వెళ్ళేవాణ్ణి.

నేను శని, ఆదివారాల్లోనూ, సెలవురోజుల్లోనూ మొక్కలకి నీళ్ళు పట్టేవాణ్ణి. మొక్కలకి నీళ్ళు పట్టేంతసేపూ నాతోనే ఉండి నీళ్ళు పడుతూ, హోస్-పైప్ లాగుతూ, మోటర్ ఆన్ చేస్తూ అని ఇలా ఏదో ఒకరకంగా సాయం చేస్తూ ఉండేది. తనవల్ల నాక్కూడా కొంత గార్డెనింగ్ ఇంట్రస్ట్ కలిగిందన్నదే నిజం. ఖాళీ సమయాల్లో అమ్మకు సాయంగా మేమిద్దరం పాదులు తవ్వడం, ఎరువు పెట్టడం వంటివి కూడా చేసేవాళ్ళం.

నేను అబ్బాయి, తను అమ్మాయి అన్న భేదం అసలు ఉండేదికాదు మా స్నేహంలో.  అంత చక్కని స్నేహం! వాళ్ళ అమ్మా మా అమ్మా కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు.

మా మీనాక్షక్కతో కూడా బాగా కలిసిపోయింది మెర్సి! అక్క యింటికొచ్చినప్పుడు మెర్సీ ఎక్కువ సమయం మా యింట్లోనే గడిపేది. నా మేనల్లుడు, కార్తీక్‌ను ఆడిస్తూ, స్నానం చేయిస్తూ బాగా కాలక్షేపం అయ్యేది తనకి. అక్కా, మెర్సీ కలిసి సాయంత్రంపూట పువ్వుల మాలలు కట్టేవాళ్ళు. ఒకటిరెండు సార్లు పువ్వులు కట్టడం నాకు నేర్పించే ప్రయత్నాలుకూడా చేశారు; అదేంటో పువ్వులు కట్టడం నాకు అబ్బలేదు.

ఇద్దరూ కలిసి చదువుకోవడంవల్లనో ఏమో మాకు పరీక్షల్లో మార్కులుకూడా ఇంచుమించు ఒకేలా వచ్చేవి. అందువల్ల ఎవరు ఎక్కవ, ఎవరు తక్కువ అన్న పోటీకూడా ఉండేది కాదు. +1 పూర్తయింది; విడిగా సబ్జెక్ట్‌లలో ఒకట్రెండు మార్కులు తేడా వచ్చాయి కానీ ఇద్దరికీ టోటల్ మార్కులు ఒకటే.

పై చదువులకు +2 మార్కులే ముఖ్యం గనుక మరింత శ్రద్ధగా చదువుకోవాలని నిర్ణయించుకున్నాము. సాయంత్రాల్లో ఎక్కువసేపు కలిసి చదువుకునేవాళ్ళం. నాకు బొమ్మలుగీయడం అంత చక్కగా రాదు. నా రికార్డు నోట్స్‌లలో బొమ్మలన్నీ తనచేత గీయించుకునేవాణ్ణి. పరీక్షలవ్వగానే ఎంట్రన్స్ టెస్ట్ కోచింగ్ కి ఎక్కడ జాయిన్ అవ్వాలో అని రిసర్చ్ చేసి ఒక ఇన్స్‌టిట్యూట్ లో జాయిన్ అయ్యాము. ఈ ఇన్స్‌టిట్యూట్ సైకిల్లో వెళ్ళేంత దగ్గర కాదు; లోకల్ ట్రైన్ లో 20 నిముషాలు వెళ్ళాలి. ఇద్దరం కలిసి వెళ్ళొచ్చాము. ప్రవేశ పరీక్షలు కూడా పూర్తయ్యాయి.

ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న రోజులవి. వాళ్ళింటికెవరో బంధువులొచ్చారు. మధ్యాహ్న సమయాన నేను ఎప్పట్లాగానే మిద్దె మీదున్న పూల మొక్కలకి హోస్-పైప్ తో నీళ్ళు పడుతున్నాను. కిందనుండి "సూర్యా" అన్న పిలుపు వినబడగానే పిట్టగోడదగ్గరకొచ్చి కిందకి చూశాను. చేతిలో ఉన్న హోస్-పైప్ లో నీళ్ళు మెట్ల మీద వస్తున్న మెర్సీ మీద పడ్డాయి. నేను తేఱుకునేలోపే మెర్సీ సగం తడిసిపోయింది పాపం. పైపు వదిలేసి కొలాయి కట్టేశాను. తను పైకి రాగానే,

"సారీ, మెర్సీ! చూళ్ళేదు. ఐయాం ఎక్స్‌ట్రీమ్లీ సారీ" అని చెప్తూనే టవల్ కొరకు వెళ్ళాను.

"పరవాలేదు, సూర్యా! ఐ అండర్‌స్టేండ్. నువ్వు కావాలని పొయ్యలేదుగా" అంది.

నేను టవల్ తెచ్చి కంగారు కంగారుగా తడిచిన తనని తుడవడం మొదలుపెట్టాను. ఒకటి రెండు క్షణాలు పట్టింది నేను ఇలా తుడవకూడదని తెలుసుకోడానికి! తనలా నిలిచిపోయింది. నేను టవల్ తన చేతికిచ్చి దూరంగా వచ్చేశాను.

కాసేపటికి శుభ్రంగా తుడుచుకుని నా దగ్గరకొచ్చింది. బాధగా సారీ ఫీలింగ్‌తో తలవంచుకు కూర్చున్న నా చుబుకం పట్టుకుని, "ఇప్పుడేం కొంపలంటుకున్నాయని ఇలా కూర్చున్నావు?"

"ఐయాం సారీ, మెర్సీ"

"సూర్యా, సారీలు చెప్పడం ఆపు. నేను వెళ్తున్నాను. మళ్ళీ సాయంత్రం వస్తాను. మామూలుగా ఉండు" అని వెళ్ళిపోయింది.

* * *

ఆ రోజు రాలేదు. మరుసటి రోజొచ్చింది. బంధువులు ఉన్నారు కాబట్టి నిన్న రాలేదని చెప్పింది. బంధువులు వెళ్ళిపోయాక ఎప్పట్లాగే వచ్చేది మా యింటికి. వచ్చినా మా ఇద్దరి మధ్య ముందున్న ఆ క్లోజ్‌నెస్ లేదు. ఏదో ఒక అడ్డుగోడపడిందన్నట్టు అనిపించింది. బయటికి బానే ఉన్నట్టున్నా లోపల మదిలో ఏదో మార్పులొచ్చాయన్నది ఇద్దరికీ తెలుస్తూనే ఉంది. ఒకరితో ఒకరం ముందులా అలమరికలు లేకుండా మాట్లాడుకోలేకున్నాము; నేను అబ్బాయి, తను అమ్మాయి అన్న తేడా బహుశా మాకు అర్థమైందనుకుంటా! అలాగని ఒకరినొకరు అవాయిడ్ చేసుకోవాలనీ అనుకోలేదు. ముందులానే ఉండే ప్రయత్నాలు చేస్తున్నాము. 

పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఇంచుమించు ఇద్దరికీ మార్కులు ఒకేలా వచ్చాయి. ప్రవేశ పరీక్షల ఫలితాలూ వచ్చాయి. 

మార్కులు చూస్తే ఎంబీబీఎస్ కి తక్కువ ఇంజినీరింగ్ కి ఎక్కవ అన్నట్టు వచ్చాయి. బీ.ఫార్మసి సీట్ కూడా వస్తుంది. లాంగ్ టర్మ్ తీసుకుని ఇంకో ఏడు వెయిట్ చేస్తే నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తుందనిపించింది. అయితే నాన్న ఇంజినీరింగ్ అని నిర్ణయించారు.

నాన్నతోబాటు ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ సెంటర్‌కు  వెళ్ళాను. మెడ్రాస్‌లోనే మంచి కాలేజీలో ఇంజినీరింగ్ సీట్ వస్తుంది నా మార్కులకి. మా నాన్నకి ఏమనిపించిందో ఏమో కోయంబత్తూర్ లోని టాప్ కాలేజ్ లో సీట్ ఎన్నుకోమన్నారు. "మెడ్రాస్ కాలేజీలోనే చేరతానని" కౌన్సిలింగ్ సెన్టర్ లో అక్కడికక్కడ నాన్నతో వాదించి నెగ్గలేనని అర్థమైంది. ఆయన చెప్తే దానికి మారుమాట్లాడకూడదు అంతే. ఇదివరకెప్పుడూ కూడా మాట్లాడలేదు. కోయంబత్తూర్ కాలేజీకొరకు అడ్మిషన్ లెటర్ తీసుకున్నాము. 

ఇంటికొచ్చేప్పుడు కార్లో ముందు సీట్లో ఆయన పక్కన కూర్చోవాలనిపించలేదు. వెనక సీట్లో కూర్చుని ఏడుస్తూ వచ్చాను. ఇంటికొచ్చాక అమ్మ సపోర్ట్ తో నాన్నతో గొడవపడాలనిపించింది! నన్ను మెడ్రాస్ నుండి ప్లాన్ చేసి కోయంబత్తూర్‌లో జాయిన్ చేయించారని అమ్మతో చెప్పి ఏడ్చాను. ఇప్పుడున్నంతగా సెల్‌ఫోన్ లూ, వీడీయో చాటింగ్‌లూ లేని రోజులవి. ఇంతవరకు ఎప్పుడూ ఇల్లు వదిలి దూరంగా వారం రోజులైనా ఉండలేదు. అలాంటిది నెలలు తరబడి దూరంగా ఉండి చదువుకోవాలంటే ఎలా? అమ్మ ఏమాత్రమూ బాధపడుతున్నట్టు అనిపించడంలేదు. "నీ చదువు కోసమే కదా నాన్నా? నాలుగేళ్ళే కదా? మధ్యలో సెలవులకి వస్తూనే ఉంటావు కదా?" అంటుంది అమ్మ. అమ్మకూడా నాకు సపోర్టివ్ గా లేదని అర్థమైంది. రెండురోజులు ఏమీ తోచలేదు.

మెర్సీ వాళ్ళ ఇంటికెళ్ళాను. కౌన్సిలింగ్‌లో మెర్సీ వాళ్ళ నాన్న మేడ్రాస్ లోనే బీ.ఫార్మసి సీట్ ఎన్నుకున్నారట; తనకి బీ.ఫార్మసి ఇష్టమే అని చెప్పింది.

నేను కోయంబత్తూర్ బయలుదేరేరోజు మెర్సీ, మెర్సీ వాళ్ళ అమ్మా, నాన్నా వచ్చి బాగా చదువుకోమన్నారు. అక్కా, బావా రైల్వే స్టేషన్ వరకూ వచ్చి సాగనంపారు. నాన్న ఎందుకిలా చేశారని అక్కనడిగాను. తనకి కూడా అంతుచిక్కలేదన్న విషయం అర్థమైంది. అడిగి కనుక్కోమన్నాను. కనుక్కుంటానంది.

సెలవులకి మెడ్రాస్ వచ్చినప్పుడు ఎప్పట్లాగే నేనున్నన్ని రోజులు మెర్సీ మా ఇంటికి వచ్చేది. నా కాలేజీ కబుర్లూ, తన కాలేజీ కబుర్లతో సెలవురోజులు వేగంగా గడిచిపోయేవి! 

ఒక సారి ఫైనల్-యియర్ లో సెలవులకొచ్చినప్పుడు అక్క నాతో

"నాకెందుకో ఈ మెర్సీ క్రిశాంతిమం పువ్వుల కోసం రావట్లేదనిపిస్తుంది రా"

నేను వినిపించుకోనట్టు మాటమార్చేశాను.

ఆ రోజు సాయంత్రం మెర్సీ ఇంటికి వచ్చినప్పుడు అడిగాను, "మెర్సీ, నేను లేనప్పుడు నువ్వు క్రిశాంతిమం పువ్వులకోసం రావట్లేదా మా యింటికి?"

"మొదట్లో ఇక్కడికొచ్చినప్పుడు క్రిశాంతిమం పువ్వులకోసమే వచ్చేదాన్ని మీ ఇంటికి. ఇప్పుడు మాత్రం నీకోసమే వస్తున్నాను. నువ్వులేనప్పుడు రోజూ ఇక్కడికి రావాలనిపించడంలేదు, సూర్యా. నువ్వున్నప్పుడే ఆ పువ్వులను చూడాలనిపిస్తుంది."  మెల్లిగా చెప్పింది మెర్సి.

రెండురోజుల్లో మళ్ళీ కోయంబత్తూర్ ప్రయాణం. మొదటిసారి కోయంబత్తూర్ వెళ్ళినప్పటికన్నా ఎక్కువ బాధగా ఉంది ఇప్పుడు. రైల్వే స్టేషన్ లో బావ అడిగారు. 

"సూర్యా, ఎందుకు డల్ గా ఉన్నావు? వాట్స్ గొయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్?"

"ఏమీ లేదు, బావా"

"ఏమీ లేకపోతే ఆల్‌రైట్. ఏమైనా ఉంటే మాత్రం మేము హెల్ప్ చెయ్యగలమనిపిస్తే చెప్పు. చెప్పకుంటే ఎవరికి మాత్రం ఎలా తెలుస్తుంది నీ బాధ?"


నేనేమీ మాట్లాడలేదు. ట్రైన్ కదిలింది.

* * *

[ పదేళ్ళ తర్వాత ]

"నాన్నా, నిద్రలే!! నీకో సర్ప్‌రైజ్ చూపించాలి" 

"ఏంటమ్మా? ఆదివారంపూటకూడా తొందరగా లేవాలా? కాసేపు పడుకోనివ్వు."

"నా సర్ప్‌రైజ్ ఏంటో చూసొచ్చి మళ్ళీ నిద్రపోదువు రా నాన్నా" 

లేచి వెళ్తే బాల్కనీలో చిన్న ప్లాస్టిక్ పూల కుండీలో పూచిన ఓ డెయ్సీ పూల మొక్కని తన మొహానికి దగ్గరగా పెట్టుకుని,

"నాన్నా, ఎలా ఉంది?"

"క్రిశాంతిమంలా ఉంది"

"అయ్యో నాన్నా నీకేం తెలియదు! ఎలా ఉందంటే బాగుందనో, నచ్చిందనో, థ్యాంక్యూ అనో అనాలికానీ; క్రిశాంతిమాన్ని క్రిశాంతిమంలా  ఉందంటారా ఎవరైనా?"

"పూవు పూసిన రోజు నాన్నకి గిఫ్ట్ గా ఇవ్వాలని నెల రోజులుగా ఆ మొక్కని నీ కంటపడకుండా పెంచింది నీ కూతురు" అని వెనకనుండి వచ్చి నా భుజం మీద తలవాల్చి నన్ను హత్తుకుంది మెర్సి.

"నాన్నా, మనం ఇండియా వెళ్ళిపోదాం. అక్కడ నాన్నమ్మ గార్డెన్ లో బోలెడన్ని క్రిశాంతిమాలున్నాయి. ముందులా నాన్నమ్మ ఇప్పుడు గార్డెనింగ్ చెయ్యలేకపోతుందట. నిన్న చాటింగ్ లో చెప్పింది. పాపం కదా నాన్నమ్మ! మనం ఇండియా వెళ్ళిపోతే నేను నాన్నమ్మ కి హెల్ప్ చేస్తాను"  అంటూ నా చిన్నారి తల్లి క్రిశాంతిమం కుండీ నాకందించింది.


-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

  చామంతి / Chrysanthemum indicum
డెయ్సీ పూలు / Daisy Flowers
తురకచామంతి / బంతి

కాగితపు పూలు / Bougan villa

49 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

మీ కథ చదివాక వెంటనే ప్రేమించాలి అనిపిస్తుంది....
అవినేని గారు....సూపర్...
కొన్ని కథలు చదివేటప్పుడు మాత్రమె మన లో కలిగే ఫీలింగ్స్ మనకు తెలుస్తూ ఉంటాయి.అటువంటి కథ లో ఇది ఒకటి.
నచ్చింది....:)))
Finally loved it :))

శశి కళ చెప్పారు...

మెల్లగా సాగే సెలయేరు లా అందంగా సాగింది కధ.
అభినందనలు

Shivani చెప్పారు...

సుతి మెత్తని భావలహరి ... అందంగా చెప్పారు..కథ లా అనిపించలేదు.. కృతఙ్ఞతలు

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

శేఖర్, మీ స్పందనకి ధన్యవాదములు.

శశి కళ్ గారూ, :-))))

Shivani గారూ, కథలా అనిపించకపోయిందంటే ఈ కథ నెగ్గినట్టే. ధన్యవాదములండి!

నిరంతరమూ వసంతములే.... చెప్పారు...

కథ...క్రిసాంతిమం పువ్వంత స్వచ్చంగా వుంది భాస్కర్ గారు!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పదేళ్లకు ముందు ఏం జరిగిందో.. పూల మనసులని అడగాలి అన్న మాట.
ఎన్ని పూల కబుర్లు.!!.. చాలా బాగున్నాయి. పూల కథగా మారినవైనం ఏమిటో..అని ఆలోచిస్తున్నాను.
పాఠకుడి ఊహ కి వదిలేసారు అన్నమాట. ఇది ఇంకా బావుంది.
వేరి నైస్ ..భాస్కర్ గారు.

రసజ్ఞ చెప్పారు...

చాలా బాగుందండీ! మంచి ఫీల్ ఉంది! బాగా వ్రాశారు! మీరు తురక చామంతి అని పెట్టిన బంతిని మేము ఊకబంతి అంటాము.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

@నిరంతరమూ వసంతములే గారూ,
థ్యాంక్యూ సో మచ్ అండి!

@వనజ గారూ,
ఆ పదేళ్ళలో ఏం జరిగిందోనన్నది పాఠకుల ఊహకే వదిలేశానండి. చివరి భాగం చదివితే సులువు అర్థమైపోతుంది కదా అని రాయలేదు. ధన్యవాదాలు :-)

@రసజ్ఞ మంచి మాటలు చెప్పినందుకు ధన్యవాదములు. "ఊకబంతి" - బాగుందండి వినటానికి. ఏ ప్రాంతంలో అంటారు ఇలా?

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

@రసజ్ఞ గారూ, మంచి మాటలు చెప్పినందుకు ధన్యవాదములండి. "ఊకబంతి" - బాగుందండి వినటానికి. ఏ ప్రాంతంలో అంటారు ఇలా?

Surabhi చెప్పారు...

చాలా బాగుంది భాస్కర్ గారు.
నాకు కూడా క్రిసాంతిమం జాతి పూలు అంటే చాలా ఇష్టం.కధ చదువుతున్నంతసేపు బాక్ గ్రౌండ్లొ ఒక చేమంతి కనిపిస్తూనే వుంది నాకు. మీ కధ చామంతి అంత అందంగా వుంది.

సురభి

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

సురభి గారూ,
కథ చదువుతున్నంతసేపు బ్యాక్ గ్రౌండ్లో చామంతులు కదిలాయంటే మీకు ఆ పువ్వులంటే ఎంత ఇష్టమో ఊహించగలనండి.

కథ చదివి మీ సంతోషాన్ని వ్యాఖ్య రూపంలో వ్యక్త పరిచినందుకు ధన్యోస్మి అండి :-)

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

చదువు తున్నంత సేపు' క్రిసాంతికమ్ము '
చెంపలకు చేరి ,తన కథ చెప్పు చున్న
హాయితో కూడు భ్రమ గల్గె - అద్భుతమ్ము !
యెచట నేర్చితి వవినేని ? హృదయ మలరె .

బ్లాగు సుజన-సృజన

kiran చెప్పారు...

చాల బాగుంది భాస్కర్ గారు :)
creative గా అనిపించింది...అండ్ క్యూట్ :)

రాజ్ కుమార్ చెప్పారు...

బాగుందండీ..!
ఇంటర్ లవ్ స్టోరీనా? అనుకున్నా మొదట.
కానీ మీ శైలి వల్ల ఆ ఫీల్ రాకుండా హాయి గా అనిపించింది.
సడెన్ గా పదేళ్ళు దాటించేశారు. లెంగ్త్ ఎక్కువయినా పర్లేదు ఇంకోంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది. ;) ;)

MURALI చెప్పారు...

ప్లెజెంట్ రీడ్ అన్నయ్యా. ఏ హంగూ, ఆర్భాటం లేకుండా సహజంగా స్వచ్చంగా ఉంది. చదువుతున్నంత సేపూ హాయిగా ఉంది.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కధ బాగుంది. చివరి దాకా ఒక్క లైను వదలకుండా చదివించింది.

నాకూ చేమంతులు, బంతులు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా ఇంట్లోను ఉండేవి. మా వీధిలో అమ్మాయిలు చాలా మందే కోసుకునేవారు. ప్చ్ నాకు ఏ మెర్సీ మెరవలేదు.

చాణక్య చెప్పారు...

ఇప్పుడే చదివాను భాస్కర్‌గారూ కథ! ఏమాత్రం ఇబ్బంది లేకుండా హాయిగా సాగిపోయింది. మీ నుంచి ఇలాంటి మంచి కథలు మరిన్ని రావాలి. :)

Phanindra చెప్పారు...

చాలా చక్కని కథ. ఎంతో మనసు ఉంది. అభినందనలు.

తృష్ణ చెప్పారు...

ఫోటోలో చామంతులంత అందంగా ఉందండి కథ..:)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

వెంకట రాజారావు లక్కాకుల గారూ,
పద్యం రాసి మరీ అభినందించినందుకు మా హృదయమలరినదండి. ధన్యవాదములు. ఈ పద్యం ఏ కోవలో వస్తుందో చెప్పగలరా? [కందము, సీసము, మత్తేభం, ఇలాంటిదా?]

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

పనీంద్ర, ధన్యవాదములు సోదరా.

Manasa Chamarthi చెప్పారు...

అందరూ చామంతులంత అందంగా ఉందనడంలోనే ఈ కథ ప్రత్యేకత మొత్తం తెలుస్తోంది.
తొడుగులు విడువని అమాయకత్వాన్ని అక్షరాల్లో బంధించగలిన ఉపాయమేదో మీరు మనసారా అందిపుచ్చుకున్నట్లు అర్థమైంది.
ఇలాంటి ఆహ్లాదకరమైన రచనలు, సెలయేరు గుసగుసల్లా మెల్లగా మనసును తాకగల్గిన కథలు మీరు మరిన్ని రాయాలనీ, రాసే ప్రతి కథతోనూ భాష మరింతగా తెలుగుతనాన్ని సంతరించుకోవాలనీ కోరుకుంటూ - అభినందనలు!

మధురవాణి చెప్పారు...

భాస్కర్ గారూ,
కథ కన్నా కథనం చాలా బాగుంది. చాలా సున్నితంగా రాస్తారు మీరు భలేగా.. :) నిజ జీవితంలో అయితే ఆ పదేళ్ళ సీన్ ముందు కథ ఆగిపోతుందేమో లేదా ఒక వేళ పాపాయి క్రిసాంతిమం చేతబట్టుకువచ్చినా పాపాయి వాళ్ళమ్మ మెర్సీ అయ్యుండేది కాదేమో అన్న ఊహ వచ్చింది నాకు. అప్రయత్నంగా అలా అనిపించేసిందిలెండి.. మీ కథ మాత్రం జస్ట్ స్వీట్.. :)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

మధురవాణి గారూ,
ప్రశంసలకు ధన్యవాదాలు.

నీజజీవితం కాదు కాబట్టే సౌకర్యంగా మార్చేశానండి. నిజానికి నాకు ప్రేమకథల్లొ విషాదము నచ్చదు - అందుకే హ్యాపీ ఎండింగ్ ఇచ్చాను :)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

@కిరణ్, Thanks :)
@రాజ్, :)
@మురళీ, థ్యాంక్స్ :)

@బులుసు గారు,
మెర్సీ మెరవకపోవడం పూర్వజన్మలో మీరు చేసుకున్న పుణ్యం గురువు గారూ! అందుకే మీకు ఇలియానా మెరిసింది :)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

తృష్ణ గారూ, కథను మెచ్చుకున్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలండి :)

@చాణక్య, నెక్స్ట్ ఏ ఫ్లవర్ మీద రాయాలో చెప్పవా :P

అజ్ఞాత చెప్పారు...

cute puppy love story

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

puranapandaphani garu, thank you :)

జ్యోతిర్మయి చెప్పారు...

పువ్వులాంటి ప్రేమ కథ....తుది మెరుగులు బావున్నాయి. అన్నట్టు భాస్కర్ గారూ...మీ పూల చిత్రాలు కూడా చాలా అందంగా ఉన్నాయండోయ్..

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

జ్యోతిర్మయి గారూ,
పువ్వులాంటి ప్రేమకథకి సువాసనలాంటి వ్యాక్య రాసినందుకు నెనర్లండి :)

BTW, ఆ చిత్రాలన్ని ఇంటర్నెట్లో వెతికి పట్టుకున్నవండి :)

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

అవినేని గారూ ,
తేటగీతి పద్యమండి . మనలో మాట . కథనంలో మీ శ్రీమతి కలం ?

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

వెంకట రాజారావు గారూ,
తేటగీతా? అందుకే ఇంత తేటగా ఉంది :)

కథనంలో నా శ్రీమతి కలమేమీలేదండి. మీకెందుకలా అనిపించింది?

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

వెంకట రాజారావు గారూ,
తేటగీతా? అందుకే ఇంత తేటగా ఉంది :)

కథనంలో నా శ్రీమతి కలమేమీలేదండి. మీకెందుకలా అనిపించింది?

Murthy Ravi చెప్పారు...

బావుంది క్రిషాంతిమయ కథన కథా కేళి విలాసం..

Subrahmanyam Mula చెప్పారు...

బావుందండోయ్.. :)

Sree చెప్పారు...

chaala bavundi andi kadha.... haayi saagipoyindi

Kottapali చెప్పారు...

Beautiful.
నువ్వు మంచి భావుకుడివని తెలుసుగానీ మంచి కథకూడివికూడానని ఇప్పుడే తెలియడం.

నాకుమాత్రం క్రిశాంతమం అనే పేరు వింటే P.G. Wodehouse novel Leave it to Psmith మాత్రమే గుర్తొస్తుంది. :)

పీఎహ్‌డి - వెటకారమా? అచ్చుతప్పా??

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

నారాయణస్వామి అన్నయ్య గారూ,
:)))

తెలుగులో రాసేప్పుడు "క్రిశాంతమం" అని రాయాలా? [అన్ని చోట్లా మార్చనా ఇలా?]

పీహెచ్‌డీ - వెటాకారం కాదు; అచ్చుతప్పు.

Kottapali చెప్పారు...

క్రిశాంతమం అని రాస్తే పలికే దానికి దగ్గరగా ఉంటుందని నా భావన.

కొత్తావకాయ చెప్పారు...

హాయిగా సాగిపోయింది కథ. చాలా బాగా రాసారు భాస్కర్ గారూ! అభినందనలు!

sunita చెప్పారు...

బాగుందండి. మీరు ఇంతకుముందు రాసినవి కూడా చదివాను గానీ కామెంట్ రాయడానికి బద్దకించేదాన్ని. ప్రతిసారీ పోస్ట్ పోను చెయ్యడం ఎందుకని ఇప్పుడు చెప్పేస్తున్నా. మీరు కధ చెప్పే పద్దతిలో ఏదో మృదుత్వం వుంది:)))

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

Sunita గారూ, కథలోని మృదుత్వాన్ని అభినందించినందుకు ధన్యవాదములండి :)

Vajra చెప్పారు...

assalu emanna cheppara..Nijanga sekhar garu chepinattu naku ippude prmeinchalani ani anipistundi..Kani ammayini kadhu kani krisnthimam poolanu premistha...:) :).Hariprasad churasia flute vayincinattu..godavari nadhi selayeru laga abdutham ga rasaru kadhani...

నిషిగంధ చెప్పారు...

"అయ్యో నాన్నా నీకేం తెలియదు! ఎలా ఉందంటే బాగుందనో, నచ్చిందనో, థ్యాంక్యూ అనో అనాలికానీ; క్రిసాంతిమాన్ని క్రిసాంతిమంలా ఉందంటారా ఎవరైనా?"

కధ మొత్తం చదువుకుంటూ ఇక్కడివరకూ వచ్చి, ఈ వాక్యం చదవగానే వెంటనే వెనక్కి వెళ్ళి మళ్ళీ మొత్తం ఇంకాస్త నెమ్మదిగా చదివాను! కధ ప్రత్యేకతనంతా ఈ ఒక్క వాక్యం చూపిస్తుంది!ప్రేమకధే అయినా నేపధ్యం దీన్ని ప్రత్యేకం చేసింది.. చాలా బావుంది, భాస్కర్ గారు :-)

సీత చెప్పారు...

Wow.. beautiful!!!

అజ్ఞాత చెప్పారు...

Nijamga chala bagundi bhaski , chadutunnatha sepu edho teliyani anamdam , atrutha tharwatha emi avutundho ani , malli malli chadavali ane la raasaru.....

Unknown చెప్పారు...

Krisanthimam la andhamga undhi mee katha...so nice

రాధిక(నాని ) చెప్పారు...

ఏవో బంతిపువ్వుల జ్ఞాపకాలు అనుకుంటూ మొదలుపెట్టానండీ చదవడం .ఇంట్రెస్టింగ్ గా వుంది.కానీ సడన్ గా ఆపినట్టయింది . బావుంది

ప్రవీణ చెప్పారు...

కృష్ణాంతిమం అంత బాగుంది. పూరేకులంత సున్నితంగా, చేమంతులంతా అందంగా ఉంది.