27 మార్చి 2012

What to Expect "నవ మాసాల కష్టాలు" - భర్త కోణంలో... - భాగం 2

ఏ తల్లి తండ్రయినా తమకు పుట్టబోయే శిశువుమీద 2-3 నెలలనుండే అనుబంధం పెంచుకుంటూ, కలలుకంటూ ఉంటారు. తీక్ష్ణమైన వాంతులతో(Hyperemesis gravidarum) బాధపడుతున్న మేము మొదట నాలుగు నెలలవరకు (16-17 వారాలు)  శిశువుతో పెద్దగా కనెక్ట్ అవ్వలేదు! కన్నీళ్ళ నడుమ కలలేం కంటాం? 


వాంతులు తగ్గకపోయినా వాటికి అలవాటు పడటంమూలంగా అప్పుడప్పుడే మెల్లగా మా శిశువుతో అనుబంధం పెంచుకోడం మొదలుపెట్టాము. Anomaly scanning చేసిన రేడియాలజిస్ట్, అన్ని అవయవాలనూ స్కాన్ చేసి అన్ని బాగున్నాయని చెప్తూ, హృదయంలో చిన్న ఇష్యూ ఉందన్నారు. Ventricular Septal Defect (VSD)అన్నారు. వినగానే కలవరపడిపోయాము. ఇది చాలా సహజం అనీ, మరో రెండు వారాల్లో Fetal Echo (స్కాన్) చేసి చూస్తే ఈ హోల్ ఉండకపోయే అవకాశాలూ ఉన్నాయనీ చెప్పారు. ఒకవేళ Fetal Echo లో కూడా హోల్ ఉందని చెప్పినా భయపడనక్కర్లేదనీ, ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ సహాయంతో వాటికి సులభమైన చికిత్సలు ఉన్నాయనీ అవసరమైనంత counselling ఇచ్చారు. 


బాధపడనక్కర్లేదన్నప్పుడు ఆ విషయం రేడియాలజిస్ట్ మాకు చెప్పకుండా ఉండియుండచ్చుగా అన్న మీ సందేహం మాకూ కలిగింది. మేము అడగకముందే, VSD విషయం ఎందుకు చెప్తున్నారో, ఎందుకు counselling ఇస్తున్నారోకూడా చెప్పారు. "ఈ రిపోర్ట్ మీరు ఇంటికి తీసుకెళ్తారు; రిపోర్ట్ చదువుతారు. అందులో VSD డీటెయిల్స్ చూసి ఇంటర్నెట్లో వెతికి సగంసగం జ్ఞానంతో మథనపడతారు. అందుకే నేనే అన్నీ చెప్పేస్తున్నాను. విషయంతో పాటు అవసరమైనంత counselling కూడా ఇస్తున్నాని" క్లియర్ గా తేల్చారు. ఇలా చెప్పడం నాకు బాగా నచ్చింది. మరుసటి రోజు ఆ రిపోర్ట్ తో గైనక్ ని కలిస్తే సరైన సలహాలిస్తారు, నిశ్చింతగా వెళ్ళిరమ్మన్నారు. ఆ క్షణాల్లో కొంత సంతృప్తికరంగానే అనిపించినా, గైనకి ని కలిసేందుకు ఇంకా దాదాపు పదహారు గంటల సమయం ఉంది. ఆ రోజు మాకిద్దరికీ అసలు ఏమీ తోచలేదు! అన్నం తినబుద్ధిపుట్టలేదు; నిద్రపోలేదు.


మరుసటి రోజు అందరికన్నా ముందెళ్ళిపోయాము. గైనకాలజిస్ట్ ని కలిశాము. VSD గురించి బొమ్మలు అవి గీసి మాకు ఎక్స్‌ప్లేన్ చేశారు - రెండు వారాలు ఆగి Fetal Echography చేయిస్తే అది నిజంగా సమస్యో కాదో తెలుస్తుందిట. ప్రస్తుతం ఉన్న రిపోర్ట్ ప్రకారం అసలు అది సమస్యే కాకపోవచ్చు - రెండు వారాల్లో అదే కన్‌ఫార్మ్ అవ్వచ్చన్నారు. ఒకవేళ సమస్య అయినా, నిశ్చింతగా ఉండమన్నారు. చికిత్సలు సులువైయ్యాయి, అందుబాటులోనే experts ఉన్నారని కూడా ధైర్యం చెప్పారు. 


ఇంటికి వచ్చాక ఈ విషయమే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేది ఆష. ఇప్పుడు VSD మీద రిసర్చ్ మొదలుపెట్టింది. నాకు మాత్రం ఎటువంటి భయమూ, బాధా లేక ధైర్యంగానే ఉన్నాను. అయినా తను బాధపడుతుండటంవల్ల కొంత కలవరపడుతూనే ఉన్నాను. నేను ధైర్యం చెప్పినప్పుడు బాగనే ఉండేదీ! మళ్ళీ తను ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చేది. 


"మనకే ఎందుకు ఇలా?" అని వాపోయేది ఆష.
"మనకెందుకు జరగకూడదు? మనమేంటి గొప్ప? ప్రతిసారి కష్టమొచ్చినప్పుడూ మనం ఇంకా కాస్త ధర్యవంతులవుతాము; మెచ్యూరిటి వస్తుంది. మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని ఇలా జరుగుతుంది అనుకో. ఇలాంటివాటికి చికిత్సలు లభించే టెక్నాలజీ యుగంలో ఉన్నందుకూ, ఆ చికిత్సలను భరించే ఆర్ధికస్తోమతా కలిగుయున్నందుకు ఆనందించు", అని నేను ధైర్యం చెప్పేవాణ్ణి.

"మనం అందర్లా దేవుణ్ణి పూజించం కదా? అందుకే దేవుడు ఇలా పాఠం నేర్పుతున్నాడేమో!" అనేది మళ్ళీ.

"ఏ దేవుడూ నన్ను నిత్యం పూజిస్తూ ఉండు. నాకు అది చేయి; నీకు ఈ మేలు చేస్తానని చెప్పడు. మనమేంటో ఆయనకు తెలుసు. తెలిసి ఎవరికీ ఎటువంటి హానీ చెయ్యలేదు; వీలైనప్పుడల్లా మంచే చేస్తున్నాం - ప్రతిఫలం గూర్చి ఆలోచించకుండనే! నువ్వు నిశ్చింతగా ఉండు." అని చెప్పేవాణ్ణి.
"అందరి పిల్లలూ బాగా హ్యాపీగా ఆడుతూ, పాడుతూ ఉంటే మన బిడ్డ మాత్రం అలా మూలకూర్చోవాలేమో కదా?" అని విలపించేది.
ఇలా బాధపడుతున్న ఆష ని చూసి మాత్రం నాకు కొంత కంగారు కలిగేది. ఈ విషయం మా ఇంట్లోగానీ, వాళ్ళ ఇంట్లోగానీ ఎవరికీ చెప్పలేదు; చెప్పి వాళ్ళను కూడా బాధపెట్టడం ఇష్టంలేక ఊరుకున్నాము.

రెండు వారాల తర్వాత Fetal Echo చేస్తే అన్నీ నార్మల్ గా ఉంటాయని నాకు బాగా అనిపించేది. అయితే ఈ రెండు వారాలు ఆష ని ఎలా ధైర్యంగా ఉండమని చెప్పాలో తెలియక తికమకపడ్డాను. మరో హాస్పిటల్ కి తీసుకెళ్ళి ఇంకో డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ చెప్పిద్దాం అనుకుంటుండగానే బ్లాగర్ మానస చామర్తి వాళ్ళ అక్కయ్య గారు రేడియాలొజిస్ట్ అని తెలిసింది. అక్కయ్యతో మాట్లాడటం కుదురుతుందా అని అడిగితే ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడమన్నారు (మానస కి విషయం చెప్పలేదు)

డాక్టర్ మాధవి చామర్తి గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆమె చాలా నెమ్మదిగా, ఆప్యాయతగా, ఒక కుటుంబ సభ్యురాలిలా మా రేడియాలజిస్టూ, గైనకాలజిస్టూ చెప్పిన విషయాన్నే చెప్పారు. మాకు కొంత ధైర్యం కలిగింది. 

రేపు  Fetal Echo కి వెళ్ళాలనగా ఇవాళ రాత్రి ఆష కి పొట్టలో విపరీతమైన నొప్పి మొదలైంది; లైట్ గా ఫీవర్ వచ్చింది. రాత్రంతా ఏదోలా మేనేజ్ చేసి, ఉదయం గైనిక్ దగ్గరకెళ్ళాము. ఆమె యూరిన్ ఇన్‌ఫెక్షన్ అయుండచ్చని యూరిన్ సాంపిల్స్ తీసుకుని టెంప్రరీ రిలీఫ్ కోసం ట్యాప్లెట్స్ ఇచ్చి Fetal Echo సెంటర్కి వెళ్ళి రమ్మన్నారు(మేము ఎంచుకున్న సెంటర్లో అపాయింట్మెంట్ అంత ఈజీగా దొరకదు అందువల్ల తీసుకున్న అపాయింట్మెంట్ సమయానికి వెళ్ళక తప్పలేదు). దారిలో రెండుమూడు సార్లు వాంతులయ్యాయి. కార్లో ఎప్పుడూ ప్లాస్టిక్ కవర్లు రెడిగా పెట్టుకునేవాళ్ళం. కవర్ తీసుకునేలోపే వామిట్ వచ్చేసింది. కార్ పక్కకి ఆపి వెనక సీట్లో కూర్చోమని; ముందర సీట్ క్లీన్ చేసి ఎలాగోలా Bangalore Fetal Medicine సెంటర్ చేరుకున్నాము. 

డాక్టర్ వీణ ఆచార్య గారు రిపోర్ట్‌లవి చూసి, Echo మొదలుపెట్టారు. మాలాంటి వారిని ఎంతోమందిని చూసుంటారు కదా? శిశువు బాగా కదులుతూ ఉంది, very active baby అన్నారు. శిశువు హార్ట్‌ని స్కాన్ చేసి 100% Alright అన్నారు :-) మాకు మిక్కిలి సంతోషం. శిశువుయొక్క మిగిలిన అవయవాలు, తల ఎంత పరిమాణంలో ఉంది, లివర్, లంగ్స్ ఫార్మేషన్ ఎలా ఉంది వంటివి స్కానింగ్ స్క్రీన్ లో చూపించారు. "చూడండి, మీ బేబి 'హాయ్' చెప్తోంది" అని చేతుల కదలికనూ, ఎన్ని వేళ్ళున్నాయనీ కవుంట్ చేయమంటూ, ఇలా బాగా ఇంట్రాక్టివ్గా ముగించారు స్కానింగ్. మేము ఫుల్ హ్యాపీ :-)
పొట్ట నొప్పి మళ్ళీ మొదలైంది. సాయంత్రం Fetal Echo రిపోర్ట్‌లు అవి పట్టుకుని మా డాక్టర్ దగ్గరకెళ్ళాము. చూసి సంతోషించారు. యూరిన్ ఇన్ఫెక్షన్ వల్లవచ్చిన పొట్టనొప్పికి ట్రీట్మెంట్ మెదలుపెట్టారు. మళ్ళీ అడ్మిట్ అయ్యాము. రెండు రోజులు హాస్పిటల్ లో ఉండి వచ్చాము.

మనిషి ఆరోగ్యానికి గాలీ, నీరూ, ఆహారమూ ముఖ్యం కదా? ఇందులో ఏది తగ్గినా సమస్యే. ఈ VSD గురించి తప్ప మరో ద్యాసలేక అవసరమైనంత నీళ్ళు తాగకపోవడంవల్లో లేక Fibroid వల్లో నొప్పి వచ్చింది! సో, కారణాలేమున్నా ప్రెగ్నెన్సీ టైంలో మామూలుగా తాగడంకంటే ఎక్కువ నీళ్ళు తాగాలి.

ఆరోనెల మొదలైనా వాంతులైతే తగ్గలేదు. రెగ్యులర్ చెకప్పులకు వెళ్ళొస్తూ ఉన్నాము. ప్రతి స్కానింగ్లోనూ Expected Delivery Date predict చేస్తారు. March మొదటవారమో, లేకుంటే ఫెబ్రవరి చివరి వారమో డెలివెరి కావచ్చు అని డేట్ ప్రెడిక్ట్ చేశారు. డెలివెరికి ఆషని  వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పారు మా అత్త-మామలు. ఆషకి వెళ్ళడం ఇష్టంలేదు; నాకూ పంపించడం ఇష్టంలేదు. పైగా హెల్త్ కూడా అలాగే ఉండేది. డెలివెరి రోజు వరకు వాంతులయ్యాయి. పెరగాల్సినంత వెయిట్ పెరగలేదు. అందుకని ఏదేమైనా వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాము.

ఏడో నెలనుండి పొట్టలో పెరుగుతున్న పాపకి రోజూ ఒక పంచతంత్రం కథో, పిట్ట కథో చెప్పేవణ్ణి. అదో సరదా. ఇద్దరికీ పాపే కావాలన్న కాంక్షవలనేమో మాకు పాపే పుడుతుందని డిసైడ్ అయిపోయాము. "మీను" అని పేరుపెట్టుకున్నాము.  మా సాయంత్రాలంతా మీను కబుర్లే, మీను కలలే, మీను ఊహలే!
ఏడో నెల చివర్లో పొట్టమీదా చేతులమీదా Rash లాగా వచ్చింది. ఇదికూడా కొందరికే వస్తుందట. దీన్ని PUPPP అంటారట. ఈ ర్యాషస్ విపరీతమైన దురద కలుగజేస్తుంది! 
 
ఉన్న కష్టాలు సరిపోదనక, మరో ప్రషర్ కూడా యాడ్ అయింది.  బంధువులు శ్రీమంతం చెయ్యాలన్నారు. కాదని స్ట్రిక్ట్‌గా చెప్పేశాము. రోజూ ఏదో ఒక సమస్య ఉంటుంటే సంబరాలు చేసుకునే మైండ్‌సెట్ ఉండదు కదా? 

డెలివెరికీ వాళ్ళ ఇంటికి రాలేదనికూడా వాళ్ళ నాన్నా, బాబాయ్ లు కొంత unhappy!

మనపనులు మనమే చేసుకోవాలి, పనులుచేయించుకోడానికోసం తల్లి-తండ్రులను వాడుకోకూడదన్నది మా పాలిసి. వాళ్ళంతట వాళ్ళేవచ్చి మనతో ఉంటే పరవాలేదుగానీ, మనకు అవసరంగనుక వాళ్ళని రమ్మని పిలవడంకూడా సరికాదనేది మా ఉద్దేశం. 

ఇల్లు తుడవడానికి మాత్రం పనిమనిషి ఉండేది మాకు. మిగిలినవన్నీ మేమే చేసుకునేవాళ్ళం. పనిమనిషిచేత గిన్నెలవి కడిగించడం, వంటలు చేయించడం ఇష్టం ఉండేది కాదు మాకు. అప్పుడనంగానే మా ఆఫీసులో కొంత రిసోర్స్ షార్టేజ్ వచ్చింది. నేను ఆఫీసులో మరింత ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోక తప్పలేదు. చాలా సమయం ఆఫీసులోనే సరిపోయేది. ఇంట్లో పనీ, ఆఫీసులో పనీ! నేను ఇంట్లో ఉండే టైం తక్కువైంది! తనొక్కత్తే ఇంట్లో ఉండటం నన్ను కలవరపెట్టేది. అయినా తప్పలేదు. ఫుల్ టైం(ఉదయం తొమ్మిదినుండి సాయంత్రం ఐదు వరకు) పనిమనిషిని పెట్టుకుంటే పగలంతా ఇంట్లో ఒక మనిషి తోడుంటుంది కదా అని పని మనిషిని చేర్చుకున్నాము. 

మా అదృష్టంకొద్ది ఆ పనామె వంటలవి బ్రహ్మాండంగా చేసేది. ఆ అదృష్టం నెల్రోజులే! సడన్గా ఒకరోజు పనికి రాలేదు; ఆరోగ్యం బాలేదని. పదిరోజులైనా ఆ పనామె ఆరోగ్యం కుదటపడలేదట. సంక్రాంతి పండుగ వస్తుందని తమ్ముళ్ళ సాయంతో ఇల్లు క్లీనింగ్, మాపింగ్ చేసింది. అలవాటు తప్పాక ఈ పనులు చెయ్యడంవల్లో, డస్ట్ వల్లో జ్వరం, జలుబు, దగ్గు వచ్చింది. ప్రతిపూటా వంటలవి చేసేందుకు కుదరక బయటనుండి భోజనం తెచ్చేవాణ్ణి. పనులెక్కువయ్యేసరికి నాకు బాగా frustaration అనిపించింది. పండగ తర్వాత రావలన్న ప్లాన్ లో ఉన్న మా అత్తయ్యని వెంటనే పంపించారు మా మావయ్య.

ప్రెగ్నెన్సీ టైంలో స్ట్రాంగ్ మందులులివ్వలేరుకదా?. డాక్టరిచ్చిన మైల్డ్ ట్యాబ్లెట్స్ తో జ్వరం, జలుబు తగ్గిందిగానీ, దగ్గు తగ్గలేదు. మామూలుగానే దగ్గు నరకం. ఇక ప్రెగ్నెంట్ గా ఉన్నవారి పరిస్థితి చెప్పాలా? వాంతులూ+దగ్గు. ఎప్పుడు మార్చ్ వస్తుందా అని రోజులు లెక్కపెట్టేవాళ్ళం. అత్తయ్యగారున్నారు కదా అని ఇంటి పనంతా ఆమెతో చెయించలేం కదా?  ఆ పాత పనామె రాలేనని చెప్పి వేరే వాళ్ళను చూసుకోమన్నారు. మరో పదిరోజులకు కొత్త పనామె దొరికారు. 

జనవరి గడిచిపోయింది! హమ్మయ్యా ఇంక ఒక నెలేలే అనుకుని ఆనందించాము. ఈ శుక్రవారం షాపింగ్ కి వెళ్ళి పుట్టబోయే బిడ్డకు కావలసినవి, హాస్పిటల్ కి తీసుకెళ్ళవలసిన బట్టలు, టవల్లు అవి కొని ప్యాక్ చేసి బ్యాగ్ లో రెడీగా పెట్టుకుందాం అనుకున్నాము. గురువారం రాత్రి రోజూలా మీనుకి కథలు, మీనూ కబుర్లూ చెప్పుకుంటుండగా, "మనమేమో ఇలా అమ్మాయని ఫిక్స్ అయిపోయాము! ఒక వేళ అబ్బాయి పుడితే ఎలా రిసీవ్ చేసుకుంటాం? అలా ఫిక్స్ అవ్వడం కరెక్ట్ కాదు" అని డిస్కస్ చేసుకునాము.

మరుసటి రోజు(ఫెబ్రవరి 3) ఉదయం ఏడింటికి వాటర్ బ్యాగ్(ఉమ్మ నీరు) బ్రేక్ అయ్యి ఉంటుందని అనుమానం కలిగి, డాక్టర్ కి ఫోన్ చేస్తే వెంటనే హాస్పిటల్ కి వెళ్ళండి నేనూ వస్తానని చెప్పారు. 40 వారాలకు వాటర్ బ్రేక్ అయితే పరవాలేదుకానీ, 36 వారలకు బ్రేక్ అయితే ఏమవుతుంది?  కంగారు కంగారుగా హాస్పిటల్ కి వెళ్ళాము, డ్యూటీ డాక్టర్ పరిక్షించి ఏం ప్రాబ్లం లేదన్నారు. మా డాక్టర్ లలిత సుధ గారొచ్చి చెక్-అప్ చేసి వాటర్ బ్రేక్ అయిందని కన్ఫర్మ్ చేశారు. స్కానింగ్ చేసి చూశారు. అమినో ఫ్లూయిడ్ లెవల్ తగ్గుతున్నట్టు తెలిసింది. "హెడ్ పొసిషన్ కరెక్ట్ గా ఉంది,  pains induce చేసి సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం నార్మల్ డెలివెరి అయితే వెల్ అండ్ గుడ్ లేకుంటే సిసేరియన్ చెయ్యాల్సుంటుంది" అన్నారు.

ఈ లోపు ఆష వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి రమ్మన్నాను. మెడ్రాస్ కీ, తిరుపతికీ ఫోన్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన విషయం చెప్పాను. మా కజిన్ సుజాత కి ఫోన్ చేసి హాస్పిటల్ కి రమ్మన్నాను - తనొచ్చాక షాపుకెళ్ళి కావలసినవి కొనుక్కొచ్చాము. 

రాత్రి 8 వరకు అన్ని రకాలుగానూ మానిటర్ చేస్తూ వచ్చారు ఆష ని. పెయిన్స్ రాకపోవడంతో ఆపెరేషన్ కి సిద్ధం చేశారు. 8:20 కి ఆపెరేషన్ థియేటర్ కి తీసుకెళ్ళారు. కరెక్ట్ గా పదిహేను నిముషాల్లో ఆపరేషన్ ముగించి బిడ్డను మాత్రం బయటికి తీసుకొచ్చారు.బాబు! మరో పదిహేను నిమిషాల్లో ఆషని తీసుకొచ్చారు. డాక్టర్ లలిత గారూ, ఆమె ఫ్రెండ్ డాక్టర్ కవిత గారూ ఆపెరేషన్ చేశారు.


ఇక పైన  విశేషాలను కిందటి లింక్ లో (కొన్నాళ్ళ తరువాత చదవగలరు).
http://avinenichinnu.blogspot.in/


Our sincere thanks to -
Dr. Lalitha Sudha Alaparthi
Dr. Kavitha Kovi
Dr. Ravikiran S
Dr. Koutilya Chowdary Maddineni
Dr. Veena Acharya
Dr. Madhavi Chamarthi
And
All our friends and family members who helped us during the tough times.

13 కామెంట్‌లు:

శేఖర్ (Sekhar) చెప్పారు...

మీరు పడ్డ కష్టం,కంగారు మీ రాతలలో కనిపించింది...చివరికి అభినందనలు అంతా బాగా జరిగినందుకు

ఆ.సౌమ్య చెప్పారు...

అబ్బ చదువుతుంటే భలే కంగారేసిందండీ...ఆశ గారిని తలుచుకుంటే బాధనిపించింది. ఎలా పడ్డారో పాపం! ఏమైతేనేం మొత్తానికి కథ సుఖాంతం. బుల్లి బుల్లి గా బాబు చేతుల్లోకి వచ్చేసరికి కష్టాన్నంతా మర్చిపోయుంటారు కదూ :)

స్నేహ చెప్పారు...

"మనపనులు మనమే చేసుకోవాలి, పనులుచేయించుకోడానికోసం తల్లి-తండ్రులను వాడుకోకూడదన్నది మా పాలిసి. వాళ్ళంతట వాళ్ళేవచ్చి మనతో ఉంటే పరవాలేదుగానీ, మనకు అవసరంగనుక వాళ్ళని రమ్మని పిలవడంకూడా సరికాదనేది మా ఉద్దేశం. "

ఇంకా అంతా చదవలేదు. పైన కోట్ చేసిన వాక్యం చదవగానే ఎంత మంచి ఆలోచన అనిపించింది. మీలాంటి వాళ్ళు ఎక్కువమంది తయారవ్వాలండి.

May God bless you and your family

సిరిసిరిమువ్వ చెప్పారు...

"మనకే ఎందుకు ఇలా?" అని వాపోయేది ఆష.
"మనకెందుకు జరగకూడదు? మనమేంటి గొప్ప? ..నిజం చెప్పారు...నేనూ ఇలానే అనుకునేదాన్ని!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అమ్మయ్య !టెన్షన్ గా చదువుతూ.. ఆఖరికి :)..

మీను కి
ఒక పంచతంత్రం కథో, పిట్ట కథో చెప్పేవణ్ణి..బాగుంది. చిన్నుకి ..ఇప్పటినుండి చెప్పండి.

మధురవాణి చెప్పారు...

అబ్బ.. ఎన్ని కష్టాలు పడ్డారండీ.. భలే దిగులేసింది ఇవన్నీ వింటుంటే.. :(
పోన్లెండి.. చిన్నూ వస్తూనే ఈ బాధాలన్నీటిని మరిచిపించేసి ఉంటాడు కదూ.. :))

శశి కళ చెప్పారు...

ఇలాటివి వ్రాయాలి.అందుకే ఇంటి గుట్టు...వ్యాది రట్టు అంటారు...ఇవి ఎవరికైనా అవసరమైన వాళ్ళు చదివితే ఓహో ఇలాగా కొందరికి ఉంటుంది అన్న మాటా అని ధైర్యం వస్తుంది.

Vasu చెప్పారు...

Firstly, Congratulations on your baby boy. You have to find a name now :)

I can relate to most of this. Its very strenuous to manage without parents' help.

Here (in US) its more lonely and sometimes it felt like a long wait for the baby. First few months that too if mom has Nausea its very difficult. Enjoyment starts when you start feeling the baby kick.

And when you finally see the baby, its an inexplicable feeling. You feel like its worth the wait and pain.

I used to read Ramayana (chandamama). Used to talk a lot to the baby. I feel that I used to spend more time with the baby before she is born.

Will post more soon!!!

Chinnu looks cute. Congratulations again!!

రాజ్ కుమార్ చెప్పారు...

చాలా శ్రద్దగా చదివానండీ.. ఈ సిరీస్.
చాలామందికి చాలా ఉపయోగకరమైన సమాచారం ఇచ్చారండీ. ఈ ఐడియాకి మీకు హ్యాట్సాఫ్.
అభినందనలు భాస్కర్ గారూ ;)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

వ్యాసంపైన మీ అబిప్రాయాలూ, మా చిన్ను కి ఆశిస్సులూ తెలిపిన
శేఖర్ (Sekhar) గారికీ,
ఆ.సౌమ్య గారికీ,
సిరిసిరిమువ్వ గారికీ,
వనజవనమాలి గారికీ,
మధురవాణి గారికీ,
శశి కళ గారికీ,
వాసు గారికీ,
రాజ్ కుమార్ గారికీ బోలెడన్ని దన్యవాదములు.

- భాస్కర్.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

స్నేహ గారూ, థ్యాంక్యూ అండి.

Maitri చెప్పారు...

చాలా బాగా రాసేరు భాస్కర్ గారూ, మీరు పడిన ఇబ్బందులన్నీ కళ్ళకి కట్టినట్లు చూపింఛేరు.
మీరు మీ ఉద్యోగం చేసుకుంటూ ఇలా ఆషగారినీ ఇంటినీ చూసుకోవడం ఇవన్నీ నిజంగా అభినందనీయమైనవి.
ఏదైనా all is well that ends well అంటారు కదా! మీ చిన్నుకి ఆశీస్సులు
క్రిష్ణవేణి

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

థ్యాంక్స్, కృష్ణవేణి గారు :-)