22 ఫిబ్రవరి 2012

What to Expect "నవ మాసాల కష్టాలు" - భర్త కోణంలో...

భాగం -  1

ముఖ్య గమనిక / Disclaimer :ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యలకు వైద్యసలహాలివ్వడం కాదు ఈ టపా ఉద్దేశం. ప్రెగ్నెన్సీలో సమస్యలు సహజమే అనీ; వాటిని ఎదుర్కొనండి అనీ ధైర్యం చెప్పడం మాత్రమే.

దైవంకన్నా తల్లే గొప్ప అని ఎందుకంటారో అర్థం కావాలంటే తొమ్మిది నెలలు మోసి బిడ్డను కనాలి; లేకుంటే నవమాసాలు మోస్తున్న ఓ తల్లిని దగ్గరుండి చూడాలి. మా ఆవిడ గత తెమ్మిది నెలలుగా మోసింది; నేను దగ్గరుండి నావల్ల అయినంతవరకు తనని చూసుకున్నాను. ఆ అనుభవాలే యీ పోస్ట్. దీనివల్ల ఎవరికి ఉపయోగం అంటారా? మేము ఎదుర్కొన్న కొన్ని సమస్యలు మాకు కొత్త; అయితే, అవన్నీ గర్భకాలంలో సహజం అన్న విషయం స్వయంగా అనుభవించి తెలుసుకున్నాము. మీరు భవిష్యత్తులో ఇలాంటివి ఎదుర్కిన్నప్పుడు ఉపయోగపడచ్ని రాస్తున్నాను.

ప్రెగ్నెన్సి కన్ఫర్మ్ అవ్వగానే ఎంచుకోవలసినవి రెండు 
అ) డాక్టర్ (గైనకాలజిస్ట్ - Gynecologist) - పోస్ట్‌లో ముందుముందు "గైనక్" అని రాస్తాను
ఆ) హాస్పిటల్

మాకు ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే హాస్పిటల్ దగ్గరగా ఉండాలి; గైనక్ మంచి పేరుగలవారయ్యుండాలి. దగ్గరగా ఉన్న మంచి హాస్పిటల్ ని వెతికి ఎంచుకున్నాము - యషోమతి హాస్పిటల్ (Yashomati Hospitals). అందులో గైనకాలజిస్ట్‌లు ఎవరున్నారో, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమిటో అని హాస్పిటల్ వెబ్‌సైట్ లో చూశాము. లిస్ట్‌లో ఉన్నవారిలో ఇద్దరు ఇన్-హౌస్ డాక్టర్స్ మిగిలినవారు కన్సల్టింగ్. ఇద్దరిలో మేము "డాక్టర్ లలిత సుధ" [Dr. Lalitha Sudha A, MBBS, MS, MRCOG (UK)] గారిని ఎంచుకున్నాము. లలిత అన్న పేరు మాకు బాగా నచ్చింది. సాక్షాత్తు అమ్మవారి పేరు కదా? ఇంత గుడ్డిగా ఎవరూ డాక్టర్ని ఎంచుకోరనుకోండి! అయినా మేం చేశాము.

విషయం తెలియగానే మా కజిన్(cousin) సుజాత "What To Expect" అన్న పుస్తకం పంపించి చదువుకోమంది. వీలున్నప్పుడూ, అవసరమైనప్పుడూ చదువుకున్నాము. ప్రెగ్నెన్సీ సమయంలో ఉపయోగకరమైన పుస్తకం ఇది.

మొదటిసారి గైనక్ దగ్గరికి వెళ్ళాం. గైనక్ తో మొదటి కన్సల్టింగ్ అవ్వగానే ఆవిడ మీద మాకు కలిగిన అభిప్రాయం....
  • బాగా స్ట్రిక్ట్ గా ఉంటారు
  • చదువుకునే రోజుల్లో ఈవిడ క్లాస్ ఫస్ట్ అమ్మాయయ్యుంటారు
  • సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ
  • అనవసరంగా మాట్లాడరు
మొదటి పాయింట్ తప్ప మిగిలినవన్నీ కరెక్టే అని కొన్నాళ్ళకే తెలిసిపోయింది. అనవసరమైన భయాలేవీ కల్పించలేదు; ఏ స్టేజ్‌లో ఎంత నాలెడ్జ్ అవసరమో అంతే చెప్పారు. మా ప్రశ్నలకి సమాధానాలవి క్రిస్ప్‌గా చెప్పారు. కొన్ని ట్యాబ్లెట్స్ రాసిచ్చారు. ఏడో వారంలో స్కానింగ్(scanning) తీసుకుని రమ్మన్నారు.

రెండువారాలాగి స్కానింగ్ చెయించుకుని రిపోర్ట్ తీసుకెళ్ళాం. రిపోర్ట్స్ చూసి పొట్టలోని శిశువు నార్మల్గా ఉన్నట్టు చెప్పారు - మొదటి స్కాన్ లో ముఖ్యంగా చూసేది హార్ట్-బీట్, ఒక శిశువా, ట్విన్సా, ట్రిప్లెట్సా లాంటివి. ఒక షాకింగ్ విషయం కూడా  చెప్పారు - గర్భసంచిలో ఫైబ్రాయ్డ్(Fibroid) ఉందని. ఫైబ్రాయ్డ్ వల్ల ఏమీ ఇబ్బందులు లేవని ధైర్యం చెప్పారు - అయితే కొంతమందికి ప్రెగ్నన్సీతోబాటు ఈ ఫైబ్రాయ్డ్ కూడా పెరుగుతుందట. అలా పెరిగితే పొట్టలో నొప్పి కలగవచ్చట - ఫైబ్రాయ్డ్ పెరుగుతుందో, ఇప్పుడున్నంతే ఉంటుందో తరువాయి స్కానింగ్లో తెలుస్తుందని చెప్పారు. అదో సమస్య కాదన్నప్పటికీ ఆష కి కొంత భయంగానే ఉండేది ఫైబ్రాయ్డ్ గురించి - ఎంత చెప్పినా వినకుండ బోలెడన్ని ఆర్టికల్స్ చదివేసేది ఫైబ్రాయ్డ్ మీద. [ఈ విసిట్లో తెలిసిన మరో విషయం డాక్టర్ తెలుగు వారేనని; చక్కగా తెలుగులోనే మాట్లాడారు. అఫ్‌కోర్స్ భాష ఒక ఇదే కాకపోయినా - అనారోగ్యమొచ్చినప్పుడు డాక్టర్లు మన మాతృభాషలో ధైర్యం చెప్తే ఎంతబలం వస్తుందో చెప్పలేం! అదో సౌకర్యం, అంతే]

వాంతులు అవ్వచ్చు అని హెచ్చరించారు; మార్నింగ్ సిక్నెస్(morning sickness & Nausea) ఉంటుంది Doxinate వేసుకోమని చెప్పారు. వాంతులెక్కువ వస్తే Emeset వేసుకోమని చెప్పారు. గైనక్ సూచించినట్టు వామిట్స్ ఏమీలేదుకదా అని మేము Emeset ట్యాబ్లెట్ కొనుక్కోలేదు. పట్టించుకోలేదు; అది ఎంత తప్పో తర్వాత రెండ్రోజులకే అర్థమైంది. 

ఆ రోజు సాయంత్రం నేనొక పార్టీకి వెళ్ళాను; పార్టీ ముగించుకుని నడిరేయిదాటి ఇంటికొచ్చేసరికి సాయంత్రం ఎనిమిదినుండి నాలుగైదుసార్లు వాంతులుచేసి నీరసపడి పడుకుంది ఆష. ఫోనైనా చెయ్యలేదు - నేను పార్టీనుండి త్వరగా  వచ్చేస్తానని. అదృష్టం బాగుండి అప్పుడు అష వాళ్ళ పెద్దమ్మ మా ఇంట్లోనే ఉన్నారు. ఆమెకు తెలిసిన కొన్ని ఇంటి వైద్యాలు చేశారు వామిట్ తగ్గించేందుకు; ఏంలాభంలేదు! అప్పటికప్పుడు మెడికల్ షాపులెతుక్కుంటూ వెళ్ళాను. గైనక్ ఫోన్ నెంబర్ కూడా లేదు. ఉన్నా ఆ సమయంలో చెయ్యొచ్చో కూడదో... మన డాక్టర్ కౌటిల్య (పాకవేదం బ్లాగర్) కి ఫోన్ చేస్తే తనుకూడా ఎమిసెట్(Emeset) నాలుగు ఎంజి ట్యాబ్లెట్ వేసుకోమన్నాడు. గంటలో వాంతులు, కడుపులో తిప్పడాలు అవి తగ్గి ప్రశాంతంగా పవళించింది. 

మరుసటి రోజు గైనక్ దగ్గరకెళ్ళి జరిగిన విషయం కంగారు కంగారుగా చెప్పాము. ఆమె ఏ మాత్రమూ ముఖకవళికలు మార్చుకోకుండా వామిటింగ్ ఎక్కువగా ఉంటేమాత్రం "Emeset" వేసుకోవచ్చు; ఏం పర్వాలేదన్నారు. మిగితాప్పుడు రోజూ ఉదయమూ, సాయంత్రమూ డాక్సినేట్(మార్నింగ్ సిక్నెస్) ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పారు. 

తర్వాత ఒకవారం రోజులు, రోజుకు ఒకసారో రెండు సార్లో వామిట్ అయ్యేది.  ఒకరోజు మాత్రం ఎక్కువ సార్లు వామిటింగ్స్ అయ్యాయి; Emeset వేసుకున్నా తగ్గలేదు. పైగా తిన్న ఆహారమంతా వామిట్ అయిపోగా చివరికి రక్తం వస్తోంది వాంతి చేస్తుంటే. ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇంటర్నెట్లో వెతికాను ఎందుకిలా ఉందో అని; బోలెడు డేటా ఉంది. ఏ డేటా మనకు ఉపయోగకరమో ఎలా తెలుసుతుంది? కౌటిల్యకి ఫోన్ చేశాను. Retching  వల్ల ఇలా వామిట్లో ఎర్రగా రక్తం రావడం మామూలే అన్నాడు. మామూలైనా ఎలా ఊరుకోగలం? ఇక లాభంలేదనుకుని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. కార్నుండి లిఫ్ట్ వరకు కూడా నడవలేకపోయింది! వీల్‌ఛెయిర్ పిలిచి తీసుకెళ్ళాను. ఏం భయపడకండి నేను చూసుకుంటానుగా అనే ఎక్స్‌ప్రెషన్‌ తో మా గైనక్ ప్రసన్నమయ్యారు. వాంతుల ప్రభావంతో నీరసపడియున్న ఆష పల్స్ అవి చూసి నాలుగు మాటలు మాట్లాడేసరికి అష కి కొంత ధైర్యం వచ్చింది. వంట్లో అసలు శక్తిలేదుగనుక అడ్మిట్ చేయమన్నారు. ఇరవైనాలుగు గంటలు సలైన్ అవి ఇచ్చి అబ్జర్వేషన్లో పెట్టారు.

హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిన విషయం వాళ్ళ ఇంటికి గానీ, మా ఇంటికిగానీ చెప్పలేదు; చెప్తే భయపడిపోతారని. అంత దూరంనుండి ఊరికే కంగారుపడుతూ వెంటనే టిక్కెట్లు దొరక్క ఇబ్బందులు పడిపోయి వచ్చేస్తారని ఊరుకున్నాను. బెంగుళూరిలోనే ఉన్న మా బావమరిదికి(ఆష వాళ్ళ తమ్ముడికి) మాత్రం రమ్మని ఫోన్ చేశాను. 

ప్రెగ్నెన్సీలో వాంతులు సహజమే అయినా అతికొందరికి మాత్రం తీక్ష్ణమైన రీతిలో(సివియర్గా) వాంతులవుతాయని గైనిక్ వివరణలిచ్చారు. దీన్ని మెడికల్ టెర్మ్స్ లో Hyperemesis gravidarum అంటారట. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండ ఉండాలని సలైన్ ఇస్తే సరిపోతుందట. మూడోనెల దాటాక తగ్గిపోతాయనీ అంతవరకు ఆహార విషయాల్లో జగ్రత్తలు తీసుకోమన్నారు. బాగుంది అని నమ్మకం కలిగాక డిస్చార్జ్ అయ్యాము.

నిజానికి ఈ వాంతులు/వేవిళ్ళు సినిమాలో చూపించేంత ఆనందకరమైన విషయాలు కావు. ఒక్కోసారి వామిట్ అయినప్పుడూ ఎంత హైడ్రోక్లోరిక్ యాసిడ్ (HCL) ఫుడ్ పైప్(గొట్టం) ద్వారా వస్తుందో; ఫుడ్ పైప్, గొంతూ అంతా మంట కలిగిస్తుంది ఈ యాసిడ్. వామిట్ చేస్తున్నప్పుడు తనని చూస్తే నాకు కళ్ళలో నీళ్ళు తిరిగేవి; నేను బాధ పడటం చూస్తే తనింకా నీరసపడిపోతుందేమో అని కంట్రేల్ చేసుకునేవాణ్ణి! రోజుకు రెండుమూడు సార్లు క్రమం తప్పక వామిట్స్ చేసేది. ఈ వాంతుల ప్రభావంవల్ల ఆ మూణ్ణెల్లలో దాదాపు ఆఱేడు కేజీల తగ్గిపోయింది :-( ఇలా చిక్కిపోతే పొట్టలో శిశువుకు ఏమవుతుందో అని ఆందోళనపడేవాళ్ళం. మొదట మూణ్ణెల్లు బరువు తగ్గడంవల్ల ఏమీ నష్టంలేదని గైనక్ ధైర్యం చెప్పారు.

మామూలుగా ప్రెగ్నెన్సీ సమయంలో ఏవైనా పుల్లగా తినాలని ఇష్టపడతారు. తనకెందుకో ఏదీ తినేందుకే ఇష్టం ఉండేదికాదు. పుల్లనివి అసలు నచ్చలేదు. వంటలవి చెయ్యలేకపోయేది. అన్నం ఉడికే వాసనవస్తేనే కడుపులో తిప్పేసేది! ఉదయం ఆఫీసుకు వెళ్ళేలోపు కూరలవి చేసేవాణ్ణి. పదకొండుగంటలకు బియ్యం కడిగి నానబెట్టమని, పన్నిండు గంటలకళ్ళా ఆఫీసునుండొచ్చి కుక్కర్లో అన్నం పెట్టి కూరలు వేడి చేసేవాణ్ణి. ఫోన్ చేరువలోనే పెట్టుకోమని చెప్పి ఆఫీస్కి వెళ్ళేవాణ్ణి. నాకు ఆఫీసు ఐదు నిముషాల దూరం కావడంవల్ల అవసరమైనప్పుడు ఇంటికి వచ్చేసౌకర్యం ఉండేది. మధ్యమధ్యలో ఫోన్ చేసేవణ్ణి ఎలా ఉంది అని; ఒక్కోసారి ఫోన్ తీయకుంటే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవాణ్ణి. వచ్చే ఈ ఐదునిముషాల్లో ఏవోవో ఊహించుకుంటూ - అయినా నా భయాలేమీ తనకి చేప్పేవాణ్ణి కాదనుకోండి. నా రూంలో చిందవందరగా ఉన్న పుస్తకాలను సర్దేందుకో, బట్టలు మడిచిపెట్టేందుకో పైకేమైనా వెళ్ళి మెట్లమీదనో; వామిట్ ఎక్కువయ్యి నీరసపడి వాష్బేసిస్ దగ్గరో కళ్ళుతిరిగేమైనా పడిపోయిందా? అని రకరకాలుగా ఆలోచించుకుంటూ వచ్చి హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న తనని చూస్తే ప్రాణం వచ్చేది. ఫోన్ తీయనందుకు కొంచం సన్నగా కోపపడేవాణ్ణి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను లేనప్పుడు పైన రూమ్స్ కి వెళ్ళొద్దు అని గట్టిగానే చెప్పేవాణ్ణి. వీలున్నప్పుడెల్లా ఆఫీసుకెళ్ళకుండా ఇంటినుండే వర్క్ చేసేవాణ్ణి.

మూణ్ణెళ్ళు గడిచినా వామిట్స్ మాత్రం తగ్గడంలేదు. వెయిట్ తగ్గిపోతూ ఉంది. నిజంగా ఈ ప్రెగ్నెన్సీ అవసరమా మనకి అని కూడా చాలాసార్లు ఆవేదనపడ్డాం. అయినా నేను మాత్రం "This too shall pass" అని ధైర్యం చెప్తుండేవాణ్ణి. నిజానికి అదేకదా జరుగుతుంది? ఏ సమస్యా శాశ్వతం కాదు కదా? "ఈ వాంతులు తగ్గిపోతే చాలు; గండం గట్టెక్కినట్టే" అంటుండేది ఆష.

డిస్చార్జ్ అయి వచ్చిన వారంలో మరోసారి వాంతుల ఉగ్రత ఎక్కువయింది. అప్పుడు వాళ్ళ అమ్మ ఉన్నారు మాయింట్లో. మళ్ళీ హాస్పిటల్‌ లో అడ్మిట్ అవ్వవలసివచ్చింది. మా అమ్మా, వదినా వచ్చారు. ఈ సారి నాలుగురోజులుకు పైగానే ఉన్నాము. నాలుగు రోజులున్నా హాస్పిటల్లో ఉంటున్నామన్న ఫీలింగే కలగలేదు. హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్లు అందరుకూడా బాగా చూసుకున్నారు. 

మా అమ్మ ఒక నెల రోజులు మాతోనే ఉన్నారు, అష ని చూసుకోడానికి. 20 వారలప్పుడు ఒక స్కానింగ్ ఉంటుంది. ఈ స్కానింగ్‌లో శిశువు పెరుగుదల, మిగిలిన ఆర్గన్స్ యొక్క పెరుగుదల వంటివి కొన్ని తెలుస్తాయి. ఈ స్కానింగ్ మొదలుపెట్టగానే రేడియాలజిస్ట్ ఒక శుభవార్త చెప్పాడు, కిందటి స్కానింగ్‌లో చెప్పిన ఫైబ్రాయ్డ్(Fibroid) పెరగలేదు అదే పరిమాణంలో ఉంది అని. స్కానింగ్ అయ్యాక మరొక షాకింగ్ విషయంకూడా చెప్పాడు శిశువుకి Ventricular Septal Defect (VSD) సస్పెక్ట్ చేస్తున్నట్టు - అంటే హృదయంలో ఓ చిన్న రంధ్రం ఉండచ్చేమోనని!

హార్ట్‌లో హోల్  ముందు వామిట్ సమస్య అసలు సమస్యగానే తోచలేదు మాకు. మథనపడటానికి మరో పెద్ద సమస్య వచ్చేసిందిగా? ఈ సమయంలో మా మనసుల్లో ఎంత బాధ ఉండియుంటుందో కదా?
కష్టం వస్తేనే కద గుండెబలం తెలిసేది?
దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది?  
అన్న 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి గారి మాటలే మాకు ఓదార్పునిచ్చాయి.

-- తరువాయు భాగం ఇక్కడ చదవండి
http://paravallu.blogspot.in/2012/03/what-to-expect-2.html

=====================================================
Search Words : Pregnancy,  Hyperemesis gravidarum, Ventricular Septal Defect, Dr.Lalitha Sudha Alaparthi

24 కామెంట్‌లు:

Rajesh Devabhaktuni చెప్పారు...

భాస్కర్ గారు

సమయాన్ని వెచ్చించి ఈ వివరాలను ఇక్కడ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. పెళ్ళైన ప్రతివారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది...!

సుజాత వేల్పూరి చెప్పారు...

మీ కజిన్ పేరు చూసి నవ్వొచ్చింది. ఈ what to expect అనే పుస్తకం మా పాప కడుపులో ఉన్నపుడు నేను చదవడమే కాక, ఆ తర్వాత దాదాపు పది మందికి ఇచ్చాను. మొదటి బిడ్డ కాబట్టి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకీ కంగారు పడి పోయే వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఈ పుస్తకం.

అలాగే femina వాళ్లు గర్భ సంస్కార్ అని అప్పట్లో ఒక ఆడియో కాసెట్ వేశారండీ! అందులో పుట్టబోయే శిశువుని ఈ భూమి మీదకు ఆహ్వానిస్తూ, ఆశీర్వదిస్తూ వేదాల నుంచి శ్లోకాలను కలెక్ట్ చేసి శాస్త్రీయ సంగీత కళాకారుల చేత పాడించారు,. ఆ శ్లోకాలకు వ్యాఖ్యానం అమితాబ్ బచ్చన్. మంద్ర స్వరంతో అమితాబ్ శిశువుతో మాట్లాడుతూ ఉంటే నిద్ర వచ్చేసేది. ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఇది కూడా ఎంతో మందికి కాపీ చేసి ఇచ్చాను.

మీరు చెప్పినట్టు సినిమాల్లో చూపించినట్టు ఈ వాంతులు ఆనందకరమైనవి కానే కాదు. ఒక్కోసారి డిప్రెషన్ లోకి కూడా పంపిస్తాయి. ఐదో నెల వచ్చేదాకా నరకం చూపిస్తాయి. ఇంకా నయం, కొంతమందికి ఏడు నెలలు ఉంటాయిట.

మీ అనుభవం ఇలా రాయడం బాగుంది. తొమ్మిది నెలలూ ఎన్ని కష్టాలు పడినా, బిడ్డని చూశాక అవేవీ గుర్తుండవు. నిజ్జంగా!

Manasa Chamarthi చెప్పారు...

:( Very painful.

I still vividly remember your tensions and your low tone in email conversations.

Well, all is well that ends well. Really glad that the lil' kid could atlast bring loads of happiness your way.

అజ్ఞాత చెప్పారు...

Bhaskar,

ee bolg lo unna information kante mi caring was awsome.
Asha is really lucky person.....
May god bless you and your family

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

రాజేష్ దేవభక్తుని గారూ,
అవునండి ఈ తరంవాళ్ళకు ఈ తరవాళ్ళు చెప్తే అదో తృప్తికదండి. మాకు మా అమ్మలు, అత్తలు, అవ్వలుకూడా చెప్పారు కొన్ని సలహాలు, ఓదార్పులు. ఎంతైనా వాళ్ళ అనుభవాలు కొంత పాతబడ్డాయ్ కదండి. ఇప్పుడిప్పుడే ఈ సమస్యలు ఎదుర్కొంటున్నవారు చెప్తే ఆ ఓదార్పు కొంత దగ్గరగా అనిపిస్తుంది :-)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

సుజాత గారూ,
మా కజిన్ కి కూడా పుస్తకాలంటే చాలా మమకారమండి.

మీరు చెప్పిన ఆడియో ఫైల్స్ గురించి మాకు అసలు తెలియదండి. తెలిసుంటే బాగుండేది.

వ్యాఖ్యకి ధన్యవాదములండి :-)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

మానస, అవును. తరువాయి భాగంలో నీ పేరుకూడా రాసున్నాను - ఎం రాశానని ఇప్పుడు చెప్పను ;-)

Thanks.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

అజ్ఞాత గారూ,
:-)
Thanks for you blessings.

అజ్ఞాత చెప్పారు...

లలిత పేరు పెట్టుకున్నవాళ్ళంతా చాలా మంచోళ్ళండీ :))
అవునూ సినిమాల్లో నెల తప్పగానే కళ్ళు తిరిగి పడిపోయినట్టూ నిజంగా జరగడం నేనెక్కడా చూళ్ళేదు.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

లలిత గారూ, :-)))
ఉండచ్చేమోనండి...

సిరిసిరిమువ్వ చెప్పారు...

మీ అనుభవాలని ఇలా అక్షరబద్దం చెయ్యటం బాగుంది.

స్త్రీకి పురుడు మరో జన్మ అంటారు..ఇప్పటి కాలంలో పురుషులకి కూడా అనాలేమో!

కష్టం వస్తేనే కద గుండెబలం తెలిసేది?
దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది?..good quote.

అప్పటివరకు పడ్డ కష్టాలు..ఆందోళనలు..పుట్టిన పాపాయిని మొదటిసారి చూసుకున్న క్షణం ఉఫ్ మని మాయమైపోతాయి! ఆ క్షణం ఉంది చూసారూ..ఎవరికి వారు అనుభవించాల్సిందే!

Convey my wishes to Asha garu and blessings to the baby.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

సిరిసిరిమువ్వ గారూ,

__స్త్రీకి పురుడు మరో జన్మ అంటారు..ఇప్పటి కాలంలో పురుషులకి కూడా అనాలేమో!__
ఏకీభవిస్తానండి.

__అప్పటివరకు పడ్డ కష్టాలు..ఆందోళనలు..పుట్టిన పాపాయిని మొదటిసారి చూసుకున్న క్షణం ఉఫ్ మని మాయమైపోతాయి!___
Exactly :-)

__Convey my wishes to Asha garu and blessings to the baby.___
Sure, will pass on your blessings.
Thank you :-)

ఆ.సౌమ్య చెప్పారు...

:(( ఇంత కష్టమా!
మీ అనుభవాలు ఇలా పంచుకోవడం చాలామందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండీ. మంచి పని చేస్తున్నారు మీరు.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

మీ అనుభవాలను ఇలా రాయడం చాలా మంచి ఆలోచన భాస్కర్. చదువుతుంటేనే దిగులుగా ఉంది. ఈ టపాల సిరీస్ చాలామందికి మార్గదర్శకం కాగలదని భావిస్తున్నాను.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఒక జన్మ నివ్వడానికి .. స్త్రీ పడే అవస్థని.. అఆమేని కంటి పాపలా చూసుకున్న తీరుని .. వైద్య పరమైన విషయాలని వివరంగా చెప్పారు. ఒకరికి ఒకరు..తోడుంటే.. ఎన్ని చికాకులు అయినా..ఎన్ని సమస్యలైనా తట్టుకోవచ్చు అనే.. స్ఫూర్తి కరం గా ఉన్న విషయాన్ని.. ఆష పట్ల మీకున్న శ్రద్దని మరింత చెప్పింది. భాస్కర్.
మీలా అందరు భర్తలు భాద్యత అనడం కన్నా ప్రేమగా చూసుకోవడం అనుకుంటే.. స్త్రీకి.. బిడ్డకి జన్మ నివ్వడం అంటే అసలు భయం లేశ మాత్రం అయినా ఉండదు.
భార్య భర్త ఇద్దరు ఒకటయ్యాక..ఎవరు ఎవరో మర్చిపోయినంత బాగా ఉన్న మీ అన్యోన్యత కి గుర్తు.. చిన్ని కన్నయ్య.
అందరు సంతోషంగా ఉండాలని దీవిస్తూ..

శేఖర్ (Sekhar) చెప్పారు...

అవినేని గారు మీకు అభినందనలు అండి
మీరు కేర్ చేసిన విధానం ఎంతో బాగుంది

శేఖర్ (Sekhar) చెప్పారు...

అవినేని గారు మీకు అభినందనలు అండి
మీరు కేర్ చేసిన విధానం ఎంతో బాగుంది

మాలా కుమార్ చెప్పారు...

భాస్కర్ గారు ,
మీ అనుభవాలు, భయాలు బాగా వివరిస్తున్నారండి.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

@ ఆ.సౌమ్య :
థ్యాంక్స్.

@ వేణూ :
ఈ టపాల సీరీస్ ఎవరకైనా ఉపయోగపడుతుందేమోనన్న ఉద్దేశంతోనే రాయాలనుకున్నాము. మీ అభిప్రాయానికి ధన్యవాదములు.

@ వనసజవనమాలి గారూ :
ధన్యవాదాలు.

@ శేఖర్ :
థ్యాంక్స్ :-)

@ మాలా కుమార్ గారూ :
ధన్యవాదాలండి.

కొత్తావకాయ చెప్పారు...

భాస్కర్ గారూ, మంచి ప్రయత్నం. అమ్మ తపనని, నాన్న మనసుని భవిష్యత్తులో మీ అబ్బాయి చదువుకునేందుకు చక్కని అవకాశం కూడా..! చాలా చక్కగా రాస్తున్నారు. అభినందనలు.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

కొత్తావకాయ గారూ,
భవిష్యత్తులో మా అబ్బాయి చదువుకోవాలన్న ఐడియా మాకు రాలేదు. ఈ యాంగిల్ లో కూడా ఉపయోగపడుతుంది కదా ఈ బ్లాగ్!

వ్యాఖ్యకు ధన్యవాదములు.

Sree చెప్పారు...

usually childbirth stuff ammailu cheptaaru kada... feels good to see guy's perspective.. keep it coming! Happy Parenting!!! God bless the kid..

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

Thanks for the blessings, Sree gaaru :-)

మధురవాణి చెప్పారు...

ఇప్పుడంతా మంచిగా జరిగిపోయింది. అవన్నీ దాటి వచ్చి పండంటి బాబుని ఎత్తుకున్నాక ఇవన్నీ వింటున్నాం కాబట్టి పర్లేదనిపిస్తుంది గానీ అప్పటి మీ పరిస్థితి ఊహించుకుంటే మాత్రం నిజంగా చాలా భయమేస్తోంది. :(
మీ బుజ్జాయి రాకతో ఈ కష్టాలన్నీ క్షణాల్లో మరిపించేసి ఉంటాడు కదూ! :)
Will wait to hear more from you.. :)