Claustrophobia - ఇరుకుస్థలవెరపు - సొంత డప్పు - మానసిక, శారీరక ఆరోగ్యం!
కొన్ని రోజలు క్రితం కుడి చేతిని కొన్ని కోణాల్లోకి తిప్పినప్పుడు భుజం గూటిలో బుడతంత నొప్పి అనిపించింది. మొదట్లో నొప్పి ఓర్చుకునేంత మేరకే ఉండటంతో పట్టించుకోలేదు. మరో పది పదిహేను రోజులకే చెయ్యి ఎటు కదపినా నొప్పేసింది. ఇక లాభం లేదని వీలైనంతవరకు పనులు తగ్గించుకుని, ఎముకల వైద్యుడి దగ్గరకు వెళ్ళాను. అతను శ్రద్ధగా నా చేతిని కదిపి, కదిలించమని, భుజాన్ని తడిమి, నొక్కి చూసి, కొన్ని ప్రశ్నలు వేశారు. నా వృత్తి, ఇటీవల రోజుల్లో ఏదైనా బరువులెత్తడం, పడిపోవటం వంటివి ఏమైనా జరిగాయా అని అడిగాకు. నాకు గుర్తున్నంతవరకు అలాంటివేమీ చెయ్యలేదు అని అన్నాను. సరేనని ఐదు రోజులకు మందులు రాసి, ఐదారు రోజులు కుడి చేతిమీద భారం, ఒత్తిడి పడకుండా చూసుకోమన్నారు.
మందులు మింగినా నొప్పి మాత్రం అలానే ఉంది. మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ ముందులానేిచ పరిశీలించారు. నొప్పి తగ్గక పోవడంతో MRI (అయస్కాంతానునాద ప్రతిబింబం) తీసుకురమ్మని చెప్పారు.
వైద్య, ఔషధ విషయాల్లో నేను పరమ శుంఠని. పడిశం పట్టినా, జ్వరం వచ్చినా బిళ్ళలు మింగను - అందుకని సైన్సుని నమ్మనని కాదు, బాగానే నమ్ముతాను. వైద్య శాస్త్రం గత వందేళ్ళుగా ఎంత వేగంగా పరిణామం చెందిందో, ఎన్ని అద్భుతాలను చేస్తోందో! ఒకప్పడు కొన్ని రకాల రోగాలకు, పుళ్ళకు, దెబ్బలకూ డయగ్నోసిస్సు, మందులు, చికిత్సలే లేవు. నొప్పితోనో, రోగాన్నో భరించుతూనో, భరించలేకనో మరణించేవాళ్ళు! కోట్లాదిమంది ప్రాణాలు అర్ధాంతరంగా పోకుండా వాళ్ళ జీవితాలను అర్థవంతం చేసింది ఆధునికి వైద్య విజ్ఞానం. సైన్సుని ఎంత నమ్ముతానో సృష్టిని కూడా అంతే నమ్ముతాను. చాలావరుకు మన ఒళ్ళు తనను తాను బాగు (Self healing) చేసుకుంటుంది - తగినంత విశ్రాంతి, వ్యవధి ఇవ్వాలంతే. అదే సృష్టి గొప్పతనం అన్నది నా నమ్మకం. అయితే ఇది ప్రతి జబ్బుకూ వర్తించదు. అత్యవసరం అనిపిస్తే మందులు వేసుకుంటాను.
MRI గురించి, దాని విధానం గురించి పాఠ్యాంశంగా చదువుకున్నాను కాబట్టి బాగా తెలుసు. MRI చేయించుకుని రేపు సాయంత్రం వచ్చి చూపిస్తానని చెప్పి వచ్చేశాను. అపాయింట్మెంట్ తీసుకుని మరుసటి రోజు MRI కోసం వెళ్ళాను.
ప్రాథమిక ప్రశ్నా పత్రం నింపాక, కొన్ని MRI గురించిన వివరాలు చెప్పాడు టెక్నీషియన్. అక్కడ ఇచ్చిన వస్త్రం వేసుకుని యంత్రం ఉన్న గదిలోపలికి వెళ్ళాను. ఒక తుళు భాష సోదరి(నర్స్?) స్ట్రెచ్చర్ పలకం మీద పడుకోమని చెప్పింది. బెల్టులు వేసి గట్టిగా బిగించి, కదలకుండా ఉండండి అని కన్నడంలో చెప్పి ఆ తెల్లటి గొట్టంలోకి (Tunnel) ఆ స్ట్రెచ్చర్ వెళ్ళేందుకు మీట నొక్కింది. నెమ్మదిగా నేను లోపలికి వెళ్తున్నాను.
ముఖానికి పైన ఐదాఱు అంగులాల దూరంలో తెలుపు గొట్టం, తెల్ల వెలుగు తప్ప మరేదీ కనిపించడంలేదు. నరకంలోకి ఆత్మ మాత్రమే ప్రవేశించగలదు అని తెలుసుగానీ పార్థివదేహంతో వెళ్ళడం నాకెలా సాధ్యం! ఏంటీ వింత వింత తెలుపు వర్ణం! ఈ గొట్టంలో ఇలా ఇరుక్కుపోయానేంటి! కదలటానికైనా అవకాశంలేనంత ఇరుకు గొట్టం. లోనికి వెళ్ళానో లేదో నాకు కళ్ళు తిరిగినట్టు, ఊపిరాడనట్టు అనిపించింది. ఎడం చేతికిచ్చిన ఎమర్జెన్సీ బజర్ నొక్కాలన్నది కూడా మరిచిపోయి గట్టిగా కేక పెట్టాను. ‘Mr.Bhaskar, Are you okay?’ అని గాజుగోడకు అవతలినుండి అడిగిన టెక్నీషియన్ గొంతు ఆ ఇరుకు గొట్టం లోపలున్న స్పీకర్లో డాల్బీ సౌండ్ సిస్టంలా ఫుల్ వాల్యూంలో ధ్వనించింది. అతనికి జవాబు చెప్తే రెండు సెకండ్లు ఆలస్యం కావచ్చు అన్నట్టు కాళ్ళు చేతులు కదుపుతున్నాను. నన్ను వెనక్కి లాగేయమని గట్టిగానే అరిచాను. సామజభయరక్షణలో విష్ణుమూర్తి చూపినంత వేగంతో మీట నొక్కింది నర్సు. ఐరావతమంలాంటి ఆ యంత్రం మాత్రం సామజ ‘గమనా’న్ని అనుసరిస్తున్నట్టు మెల్లగా నన్ను బయటకు తోసింది.
ఇంత వయసొచ్చిన మనిషిని చిన్న పిల్లవాడిలా భయపడితే పరువుపోతుందన్న స్పృహకూడా లేకపోయింది. ప్రాణంమీద నాకింత తీపుందా అనిపించింది.
MRI ఎలా పని చేస్తుందన్నది తెలుసు, అయితే అందులోకి వెళ్తే భయం కలుగుతుందని అసలు ఊహించలేదు. టెక్నీషియన్ వచ్చి ఓదార్చే రీతిలో నాలుగు మాటలు చెప్పాడు. 'వందమందిలో ఐదుగురికి ఇలాంటి ఇబ్బంది ఉంటుంది సార్. దీన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు. మరేం పరవాలేదు, ఇవాళ వెళ్ళి మైండ్ ని బాగా ప్రిపేర్ చేసుకుని రేపు రండి’ అని అన్నాడు. ప్రాథమిక ప్రశ్నా పత్రంలో క్లాస్ట్రోఫోబియా గురించిన ప్రశ్న ఉంది. నాకు అది లేదు అని టిక్ చేశాను. ఇప్పుడు అది నాకు ఉందని తెలుసుకున్నాను.
ఒక చిన్న MRI చేయించుకోలేకపోతున్నానా అన్న బాధ మొదలైంది. భుజం నొప్పికంటే ఈ బాధ ఎక్కువగా పీడించ సాగింది. ఈ సమస్య తీవ్రంగా ఉన్నవాళ్ళకి మత్తు మందు ఇచ్చి MRI చేస్తాం అని కూడా చెప్పాడు టెక్నీషియన్. నాకు మత్తు మందులు, పెయిన్ కిల్లర్స్ పడవు - అంటే అవి తీసుకున్నాక నా శారీరక, మానసిక ఆరోగ్యంమీద, ఆలోచనలమీద ప్రభావం చూపిస్తాయి. కొన్నేళ్ళ క్రితం చిన్న శస్త్ర చికిత్సకోసం మత్తు మందిచ్చారు. దాని ప్రభావంనుండి తేరుకోడానికి చాలా కాలమే పట్టింది.
ఆలోచిస్తూ అర్ధగంట అక్కడే కూర్చున్నాను. చెప్పలేనంత బాధతో ఇంటికొచ్చి జరిగింది చెప్తే ఆష నవ్వింది - నమ్మడంలేదు ఇలా జరిగింది అంటే! కాసేపటికి నమ్మింది. ధైర్యం ఇవ్వడానికంటూ తనకు తెలిసిన మాటలు చెప్పంది. తొలిసారిగా MRI యంత్రం కనుగొన్న రోజునుండి నేను పరాజయంతో వెనుతిరిగి వచ్చిన ఈ క్షణం వరకు ప్రపంచంలో ఎంతమంది MRI లు చేయించుకున్నారన్న లెక్క గూగుల్ చెయ్యకుండానే సరిగ్గా చెప్పి, 'రేపు నీతోపాటు నేనూ వస్తాను తోడుగా' అని అంది. ఈ లోపు మా డాక్టర్ బావ ఫోన్ చేసి, 'పోతే పోన్లే! బోడి భుజం నొప్పికి MRI ఏటికట! నువ్వు వెళ్ళి physiotherapy చేయించుకో, పదిరోజులు రెస్ట్ తీసుకో' అన్నాడు.
మా అన్నకు, అమ్మకు చెప్పాను. వాళ్ళు వివిధ సందర్భాల్లో MRI చేయించుకున్నాం అని, అది నేను భయపడుతున్నంత కష్టమేమీ కాదని, మళ్ళీ వెళ్ళమని ధైర్యం చెప్పారు.
ఆరోజంతా ఈ బెంగతోనే గడిచింది. రాత్రి పడుకుంటే కంటికి నిద్రపట్టలేదు. కళ్ళు మూసుకుంటే రెప్పలవెనుక తెల్లటి రంగు. ఇరుకైన తెల్లరాతి గుహలో ఉన్నట్టు, నేను ఊపిరాడక కొట్టుకుంటున్నట్టు విలవిలాడిపోతున్నాను. ఇంటి సీలీంగ్ నా మీద పడిపోయి సఫకేషన్ అనిపిస్తూనే ఉంది. రాత్రి ఎన్ని గంటలు గడిచిపోతున్నా నిద్ర పట్టలేదు. అయితే ఈ విపరీతమైన ఆలోచనలతో నిద్రపోకుండా ఊరకే పడుకుని ఉండటం అసాధ్యం. ఊపిరాడని ఫీలింగ్! పుస్తకం పట్టుకున్నా, పాటలు పెట్టుకున్నా మనసు దేని మీదకీ పోవడంలేదు. మేడమీదకి వెళ్ళి కాసేపు చల్ల గాలి పీల్చుకున్నాను. ఈ ఆకాశం, పాలపుంతలు ఎంత విశాలం! వైశాల్యమే సహజత్వం, స్వాతంత్రం! పరిధిలో ఇరిక్కోవడం కృత్రిమం, నిర్బంధం! భీతి ఆవరించిన ఈ బాధలో అనుకూలమైన తత్వభావాలను అన్వయించుకుని తనను తాను ఓదార్చుకునే పని చేస్తోంది మనసు!
మరుసటి రోజు సతీ సమేతంగా వెళ్ళాము. ఆ స్ట్రెచ్చర్ మీద కట్లేమీ లేకుండా గొట్టంలోకి ఒక సారి వెళ్ళి వస్తాను. నాకు ఆ గొట్టం వాతావరణం కొంచం అలవాటు అవుతుంది అని అడిగితే వాళ్ళు సరేనన్నారు. ఈ సారి మరీ దారుణం - అసలు తల భాగం లోపలికి వెళ్ళిందో లేదో నా వల్ల కాదు అని అపజయాన్ని అంగీకరించుకుని బయటకి వచ్చేశాను.
ఎంత హేతుబద్ధంగా ఆలోచించినా ఎమ్మారై ఎందుకు చేయించుకోలేకపోతున్నానో నాకు జవాబు దొరకడంలేదు. ఇందులో భయపడటానికి ఏమీలేదు. సూది గుచ్చడమో, కొట్టటమో కొయ్యడమే, చేదు మందులు మింగించడమో ఏమీలేదు. సురక్షితమైన వాతావరణం. ఆ మెషిన్ highly computerised, precise to the core. చీకటి గది కూడా కాదు, పక్కనే మాట్లాడిస్తూ మనుషులున్నారు. ఇవన్నీ నా బుర్రకు బాగా తెలుస్తూనే ఉన్నాయి. మరి తెలిసినా ఎందుకు ఊపిరాడనంతగా భయం కలుగుతోంది? వాటికి సమాధానాలు లేవు అని కాదు! స్ఫష్టంగా అర్థం కాని అన్ని చర్యలకు కూడా విజ్ఞానపరమై కారణాలుంటాయి. అవి మన జ్ఞానపరిదికి ఇంకా అందలేదంతే.
ఇంటికొచ్చాము. క్లాస్ట్రోఫోబియా పీడనం నా భుజం నొప్పిని చాలా చిన్న గీతగా మార్చేసింది. నా రాత ఇక ఇంతేనా! నేను ఎప్పటికీ MRI చేయించుకోలేనా! ఓపెన్ MRIలు ఉంటాయని చదివాను. బెంగుళూర్ లో ఉన్న అన్ని ల్యాబులకూ, పెద్ద ఆసుపత్రులకూ ఫోన్లు చేసి అడిగాను. ఎక్కాడా లేవన్నారు. మణిపాల్ ఆస్పత్రి వాళ్ళు మాత్రం కనుక్కుని మళ్ళీ ఫోన్ చేస్తాం అని పెట్టేశారు. కాసేపట్లో ఒకతను ఫోన్ చేసి మా దగ్గరుంది రండి అని అన్నాడు. నేను యంత్రాన్ని చూడందే MRI చేసుకోలేను అని అంటే అలాగేనన్నాడు.
సాయంత్రం వెళ్ళాను. ఆ టెక్నీషియన్ పేరు కళ్యాణ్. చిన్న వయసువాడే, పాతికేళ్ళుంటాయి. బిజీగా MRIలు చేస్తున్నాడు. ఇది ఓపెన్ MRI యంత్రం కాదు. రెండు సార్లు ప్రయత్నించిన గొట్టపు యంత్రమే. నన్ను తన పక్కనున్న కుర్చీలో కూర్చోమన్నాడు. గాజుగోడకు అవతలున్న MRI గొట్టంలో ఎవరో ఒక చిన్న బాబుకు MRI చేస్తున్నాడు. కళ్యాణ్ కంప్యూటర్ ఆపరేట్ చేస్తూ MRI గురించి వివరిస్తూ, స్క్రీన్ మీద ఇలా ఉంటుంది అని చూపించాడు. ఆ పిల్లాడి స్పైన్ స్క్రీన్ మీద కనబడుతోంది. అయ్యాక మరో బెంగాలీ వృద్ధుడికి MRI చేశాడు.
తర్వాత నన్ను ఆ గరదిలోకి తీసుకెళ్ళి ఆ యంత్రం వెనక, కడి, ఎడమ పక్కల ఎలా ఉందో చూపించాడు. 'మీరు ఇక్కడే చూస్తు ఉండండి. నేను వేడిగా ఒక టీ తాగి వస్తాను' అని పది నిముషాలు తర్వాత వచ్చాడు. పదినిముషాల్లో ఆ వాతావరణానికి కొంచం అలవాటుపడ్డాను. క్లాస్ట్రోఫోబియా గురించి ఎందుకు భయపడనక్కర్లేదో చెప్పడంచేత నాకు ఇప్పడు భయం అనిపించలేదు. ధైర్యం వచ్చింది. నన్ను ఆ స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి, మాట్లాడిస్తూ లోపలికి పంపించి, దగ్గరే ఉంటూ మాట్లాడించాడు. పైకి చూడకుండా, దిండు పెట్టి తలను ముప్పై డిగ్రీలు చాతీ పైపుకు వంచుకోమని, కళ్ళు మరో ముప్పై డిగ్రీలు కిందకి పెట్టుకుని ముందున్న తనకేసి చూడమన్నాడు. మ్యూజిక్ ప్లే చేస్తాను వింటూ ఆహ్లాదకరమైనవి ఆలోచించండి అని చెప్పి తన కంప్యూటర్ దగ్గరకు వెళ్ళిపోయాడు.
ఈ సారి ఆ గొట్టంలో భయం అనిపించలేదు. బాగానే ఊపిరాడింది. సిద్ శ్రీరామ్ పాటలు ప్లే చేశాడు. అవి ఎక్కడంలేదు - కళ్యాణ్ అనే ఈ టెక్నీషియన్ చేసిందేంటి? నా భయం ఏమైంది? అని ఆలోచిస్తూ, ఇంక వేటినో నెమరు వేసుకుంటూ ఉండగానే ఇరవై నిముషాల్లో MRI పూర్తయింది.
కళ్యాణ్‌కు శతవిధాలా కృజ్ఞతలు చెప్పి విజయగర్వంతో బయటకు వచ్చాను. MRI రిపోర్ట్ తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్తే దీర్ఘకాలంగా భుజం మీద పడిన ఒత్తిడివల్ల వచ్చిందన్నారు - కీబోర్డు, మౌసు వాడకం వల్ల. కొన్నాళ్ళు పనులవి తగ్గించుకుని, వారం రోజులు ఫిజియోథెరపీ చేయించుకుని, వీలైనంత విశ్రాంతి తీసుకోమన్నారు.
శారీరక నొప్పులకీ, రోగాలకీ మందులు, మాత్రలు, చికిత్సలు అవసరమైనట్టే మానసిక రోగాలకు కూడా మందులుంటాయి. అవి చాలా వరకు మాటలే. నాకుండిన క్లాస్ట్రోఫోబియా మానసికరోగాన్ని కళ్యాణ్ అనే టెక్నీషియన్ మాటలతో నయం చేశాడు.
అదీ మాటలకున్న పవర్.
ఒక మాట - ముద్దు పెట్టగలదు
ఒక మాట - యుద్ధానికి నాంది పలకగలదు
ఒక మాట - శాంతిమంత్రమవగలదు
ఒక మాట - రోగాన్నివ్వగలదు
ఒక మాట - ఔషధంకాగలదు
ఒక మాట - ఆయుధంకాగలదు
ఒక మాట - డాలుకాగలదు
ఒక మాట - పువ్వులా ఆహ్లాదపరచగలదు
ఒక మాట - ప్రేరణకాగలదు
ఒక మాట - మంత్రమవగలదు
ఒక మాట - దైవంకాగలదు
ఒక మాట - అగ్నిశకలంకాగలదు
ఒక మాట - ప్రేమకాగలదు
ఒక మాట - విషంకాగలదు
ఒక మాట - అమృతంకాగలదు
-----* * * -----
1 కామెంట్:
కళ్యాణ్ కి థాంక్స్ ఎన్ని చెప్పుకున్నా సరిపోవు.
అలాంటి సాంకేతిక జ్ఞానం తో పాటు అస్వస్థులకు మానసిక ధైర్యం చెప్పే వాళ్ళు తక్కువే. చిన్న వాడైనా నీ భయాన్ని పోగొట్టినవాడు. All said and done you are better now. That's what matters most. Take rest like your doctor advised. Be well. :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి