30 జులై 2022

ఎల్లాయి, వెల్లావి, వెళ్ళావి!

 

ఎల్లాయి, వెల్లావి, వెళ్ళావి!

కాలక్రమంలో కొన్ని వస్తువులు, పనులు పాతబడి(Outdated) అనవసరాలుగా మారిపోతాయి. కొన్ని వస్తువల స్థానంలో మరో ఆధునికమైన వస్తువో, పనో, పద్ధతో వచ్చేస్తుంది. అలాంటప్పుడు వాటిని సూచించే మాటలుకూడా కొన్ని కాలక్రమంలో కనుమరుగైపోతాయి. తర్వాత తరాల వాళ్ళకి అవి తెలియకుండాపోతాయి. ఏం చేసినా దీన్ని పెద్దగా ఆపడమో, మార్చడమో వీలు కాదు.

దూర్దర్శన్‍వారి హేమా, రేఖా, జయా, సుష్మాలు రావడానికి మునుపు తెల్ల దోవతులు, దుప్పట్లూ, కోకలు వంటి గుడ్డలు తెల్లగా ఉతకడానికి కెమికల్స్‌తో చేయబడిన డిటెర్జెంట్ పౌడులు అంత విరివిగా వాడేవాళ్ళు కారు. ముఖ్యంగా పల్లెటూళ్ళలో. బట్టలుతికేందుకనే ప్రత్యేకించి కొన్ని కుటుంబాలు ప్రతి ఊళ్ళోనూ ఉండేవాళ్ళు. ఆ మాటకొస్తే పెద్ద పట్టణాల్లోకూడా ఉండేవాళ్ళు - ఇప్పటికీ వాళ్ళు అక్కడ ఉండినందుకు, బట్టలు ఉతికినందుకూ ఆనవాళ్ళుగా ఆ ఏరియా పేర్లనుబట్టి తెలుసుకోవచ్చు - చాకలిపేట, వణ్ణారపేట, మడివాలా ఇలాంటివి.

ఊర్లో అందరి ఇళ్ళల్లోనూ మాసిన బట్టలూ తీసుకుని ఊరి బయున్న చెరువుకో, కాలువకో వెళ్ళి తెల్లగా ఉతికి తెచ్చిచ్చేవాళ్ళు. వాళ్ళు రసాయనలతో చెయ్యబడిని డిటెర్జెంట్లూ వాడేవాళ్ళు కారు - అప్పట్లో అవి లేవు కూడా. చవుడు (చౌడు) మట్టే మొట్ట మొదట వాడబడిన డిటెర్జెంట్ - దీన్ని జీరో పొల్యూటింగ్ డిటెర్జెంట్ అనొచ్చు. చవుడుమట్టిలో సహజంగానే కొన్ని లవణాలుుంటాయి - అందుకే ఆ మట్టి ఉప్పంగా, కారంగా ఉంటుంది.

మాసిన బట్టలను తడిపి చవుడుమట్టిలో పొర్లించి వాటిని కింది భాగంలో చిల్లులున్న పెద్ద బానలో(కుండ) వేసి మూతపెట్టి బిగించాలి. మరో పెద్ద బానలో సగంవరకు నీళ్ళు పోసి దాన్ని ప్రత్యేకంగా అమర్చబడిని పొయ్యిమీద పెట్టి మంట వెయ్యాలి. ఆ నీటి బాన మీద బట్టలు కుక్కిన చిల్లు బానను దొంతిలా పెట్టాలి. ఇప్పుడు నీటి కుండనుండి వెలువడే వేడివేడి నీటి ఆవిరంతా చిల్లుకుండలోనున్న చవుడు మట్టి పులుమిన బట్టలకు ఆవిరిచూరుకుంటుంది. ముప్పావు గంటదాకా అలా ఉండనిచ్చివ్వాలి. ఆ వేడి ఆవిరి కారమట్టిని తాకినప్పుడు రసాయనపరమై అభిక్రియ, ప్రతిక్రయలు జరిగి బట్టల్లోని మురికిని వీడకొట్టేస్తుంది. అందులోనుండి బట్టలను బయటకు తీసి అవసరమైనంత మేరకు బండకేసి బాది, నీళ్ళల్ళో జాడించి ఎండలో అరబెట్టాలి.

అలా ఉతికి ఆరబెట్టిన తెల్ల దోవతులు ఎంత తెల్లగా ఉంటాయంటే కొంగలు, బాతులుకూడా ఆ తెలుపును చూసి సిగ్గుపడిపోతాయంట - ఇది చాకలి వారి నైపుణ్యాన్ని ౘాటి చెప్పే పాటలో మెరిసే కవిత్వం.

ఈ విధంగా బట్టలుతికే పద్ధతిని ఎల్లాయి లేదా వెల్లావి ఉంటారు.
వెల్ల + ఆవి(రి) = వెల్లావి.
వెల్లావి --> ఎల్లాయి
వెల్ల అంటే తెలుపు అని అర్థం ఉంది కదా! పెయింట్లు రాకుమునుపు ఇంటి గోడలకు తెల్ల సున్నపు రాళ్ళను తెచ్చి వెల్ల వేసేవాళ్ళం కదా? ఇళ్ళ గోళ్ళకి వేసేది సున్నమే అయినా రంగు తెలుపు కాబట్టి వెల్లవెయ్యడం అన్న మాటొచ్చింది.

దీన్ని అరవలోకూడా వెళ్ళావి అనే అంటారు - ఇటీవల వచ్చిన ఒక సినిమా పాటలో కూడా తెల్లగా ఉన్న నాయికి తెలుపును నాయకుడు పొగుడుతున్నట్టు ఒక సినీకవి ఇలా రాశాడు “అరే, నిన్ను వెల్లావి పెట్టి తెల్లగా చేశారా, ఎండకన్నే సోకనివ్వకుండా పెంచారా...” (పాట లింకు మొదటి కమెంట్‍లో).

డిటెర్జెంట్‍లు, బట్టలుతికే మిషిన్‍లు, కార్పరేట్ లాండ్రీ సర్వీసులు వచ్చాక చాకలి వృత్తి, చాకలి కులం లేకపోవడం లాంటి మంచే జరిగింది. దాంతోబాటుగా వెల్లావి అన్న మాట, ఆ ప్రక్రియలు మరుగయ్యాయి.

ఊళ్ళో అందరి బట్టలూ ఒక్కటిగా కలిపేసి తీసుకెళ్ళినా ఉతికాక తిరిగి ఇచ్చేప్పుడు ఎవరింటి బట్టలు వాళ్ళకు సరిగ్గా ఇచ్చేవాళ్ళు. పొరపాటే జరగదు. నేడు కార్ప్రేట్ లాండ్రీ సర్వీసుల్లో మాదిరిగా బట్టలకు TAG లు అవి ఏమీ వేసేవాళ్ళు కారు. అయినా వాళ్ళకి తెలుసు ఏ బట్ట ఎవరింట్లోనిదో. ఈ సామెత అందుకే పుట్టుకొచ్చి ఉంటుంది - “చదువుకున్నోడికంటే చాకలో‍డు మేలు” అని!
ఇంతా చదివాక పనికి రాని చెత్తంతా చదివించావురా బాబూ అనుకుని నిట్టూర్చే వాళ్ళకోసం - తెల్ల దోవతులను ప్రస్తావించి రాయలువారు, పెద్దన రాసిన పద్యాలు చదివి పుణ్యం, పరమార్థం అనిపించుకోండి. 

మత్తేభము:
తలఁ బక్షచ్ఛట గ్రుచ్చి బాతువులు కేదారంపుఁ గుల్యాంతర
స్థలి నిద్రింపఁగఁ జూచి యారెకు లుష స్స్నాతప్రయాతద్విజా
వలి పిండీకృత శాటిక ల్సవి దదావాసంబుఁ జేర్పంగ రే
వుల డిగ్గ న్వెసఁ బాఱు వానిఁ గని నవ్వు నాలిగోప్యోఘముల్.
[ఆముక్తమాల్యద, ప్రథమాశ్వాసము, 65‍‍]
సీ… … …
తేటగీతి:
ఫల సమిత్కుశ కుసుమాది బహుపదార్థ
తతియును, ‘ఉతికిన మడుఁగుదోవతులున్’ గొంచు
బ్రహ్మచారులు వెంటరా, బ్రాహ్మణుండు
వచ్చు నింటికిఁ బ్రజ తన్ను మెచ్చి చూడ!
[మనుచరిత్ర, ప్రథమాశ్వాసము, 54]