17 అక్టోబర్ 2012

మారాకు వేసిన జీవితం

మా ఊళ్ళో ఉన్నవి రెండు వీధులే; ఎగవీధి, దిగవీధి. బస్సు రోడ్డు నుండి ఊరు ఒక ఫర్లాంగు దూరం లోపలికి ఉంటుంది. దక్షణంగా ఒక మైలూ, పడమటి దిశలో రెండుమైళ్ళ వరకు పొలాలు! పొలాలకానుకుని కొండలు. కొండలు ఆంధ్ర రాష్ట్రానికి చెందినవి. అవే ఊరికి పొలిమేరలయ్యాయి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనుకునున్న మా జిల్లాలో చాలా ఊళ్ళు తెలుగు వారివే! కొన్ని ఊళ్ళలో తెలుగువారూ తమిళవారూ కూడా ఉన్నారు. మా ఊళ్ళో మొత్తం ముప్పై ఇళ్ళున్నాయి. అందరూ తెలుగువారే. ఒకప్పుడు "గోగినేనివారిపల్లె" గా ఉన్న ఊరు ప్రస్తుతం "గోగినపల్లి" అయిపోయింది.

అందరికీ సమృద్ధిగా పొలాలున్నందువల్లనో ఏమో నిన్నటి తరంలో ఐదుగురు తప్ప మిగిలినవారెవరూ ఉద్యోగాలు చెయ్యలేదు. అందరూ వ్యవసాయం చేసుకుండిపోయారు. ఇప్పటి తరంవాళ్ళలో ఒకరిద్దరు మాత్రమే సేద్యం చేసుకుంటున్నారు. మిగిలినవారందరూ ఏ ప్రభుత్వ ఉద్యోగమో, మెడ్రాస్, బంగుళూరు పట్టణాలలోనో, విదేశాల్లోనో ఉద్యోగాలు చేస్తున్నారు. నేను పుట్టిపెరిగింది ఇక్కడే. ప్లస్ టూ వరకు ఇక్కడే ఉండి చదువుకున్నాను. ఊళ్ళో అందరూ అందరికీ బంధువులే. అందర్నీ వరసలుపెట్టి పలకరించుకుంటారు.

ఊరికి ఆగ్నేయంగా కొంత దూరంలో పొలాల మధ్య ఏటిగట్టుకానుకుని ఒక ఇల్లుంది. కొబ్బరి, మావిడి, చింత, సీమతంగేడు, బాదం, సీమచింత, కానుగ, వేప మాన్ల మధ్యనుంటుందాయిల్లు. ఆ ఇంట్లో సుశీలత్త ఒక్కత్తే ఉంటుంది. సుశీలత్త కొడుకూ, కూతురూ హాస్టల్ లో చదువుకుంటున్నారు. ఊళ్ళో ఎవరూ ఆ ఇంటికెళ్ళరు. ఎవరూ ఆమెతో మాట్లాడరు. అత్త అక్కడికి వచ్చిన కొత్తలో ఊళ్ళో జనం "కొంపలు కూల్చిన ముండ" అని గుసగుసలాడుకునేవారు. క్రమేణా అదే ఆమె పేరుగా మారిపోయింది.

సుశీలత్త గురించి తెలుసుకోవాలంటే ఇరవైయేళ్ళు వెనక్కెళ్ళాలి.

***

అప్పుడు నాకు ఆరేళ్ళు. తిరుమల నెల మూడో శనివారం తళిగ కోసం అమ్మా, పిన్నమ్మా పూజకు వంటలు తయారు చేస్తున్నారు. తెల్లవార్నుండి ఒకపొద్దుండటంవల్ల అందరికీ ఆకలి. తాత స్నానానికి మంగమ్మవ్వ నీళ్ళు తోడిపెట్టింది. ఎగవీధినుండి జనాలు అరుస్తున్న కేకలు వినబడ్డాయి. స్నానానికి వెళ్ళకుండ తాత పెరటి దారిలో ఎగవీధివైపు పరుగుతీశాడు. వెనకనే నేను పరుగెత్తుకుంటూ వెళ్ళాను. జగడం ఎక్కడో కాదు అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందే! ఎవరో కొత్తవాళ్ళు కొందరు కట్టెలు పట్టుకుని కనబడినవాళ్ళందర్నీ కొడుతున్నారు. అప్పటికే నాన్న మరోవైపునుండి వచ్చి వాళ్ళను అడ్డుకుని వెనక్కి తోశాడు. వచ్చినవాళ్ళలో ఒక పెద్దాయన గట్టిగా బూతులు తిడుతున్నాడు. తాతయ్యా, నేనూ వెళ్ళేసరికి నాన్న వచ్చిన వారి చేతి కర్రలు పీకి పడేశాడు.

వచ్చినవాళ్ళలోని పెద్దాయన తాత దగ్గరికి వేగంగా వచ్చి, "వెంకటప్పా, నీ అల్లుడు ఏం ఘనకార్యం చేసినాడో అడుగు? మా ఇంటి పరువు తీసినాడు. పెళ్ళయింది, పిల్లాజల్లున్నారు, బంగారంలా భార్యుంది; సరిపోదని నా కోడలు కావలసొచ్చిందా వీడికి?" అని అరిచాడు. 

అక్కడ ఏం జరుగుతుందో అర్థమయ్యే సరికి కొంత సమయం పట్టింది తాతకి. అప్పటికే ఊళ్ళో జనమంతా పోగయ్యారు. అమ్మా, పిన్నమ్మ కూడా వచ్చేశారు; వాళ్ళు నేరుగా ఇంట్లోపలికెళ్ళిపోయారు. అమ్మమ్మా, అత్తా గట్టిగా ఏడుస్తున్నారు. అమ్మ వాళ్ళను ఓదారుస్తూ, "ఇంతకీ రమేషెక్కడ?" అని అడిగింది. "చదువుకున్నోడు ఉద్యోగానికి పోతున్నాడనుకుంటే ఇలా ఉంపుడుగత్తెను చూసుకుంటాడని ఎవరికి తెలుసు? ఈ మనిషికి ఏం తక్కువ చేశాను నేను?" అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది రేవతత్త.

కొద్దిసేపట్లో జీప్ లో ఇద్దరు పోలీసు వాళ్ళూ, రమేష్ మామా దిగారు. పోలీసులను చూడగానే వచ్చినవాళ్ళు కొంచం భయంగా నిల్చున్నారు. "కొడుకూ కొడుకూ అని నెత్తిమీద పెట్టుకుని పెంచి చదివించి పెద్ద చేస్తే నువ్వు చేసే యవ్వారం ఇదారా?" అని కోపంగా అరుస్తూ లోపల్నుండి పొరక్కట్ట తీసుకుని అమ్మమ్మ బయటికొచ్చి మామని కొట్టింది. అమ్మా, తాతా అడ్డుకున్నారమ్మమ్మని. మామ ఏమీ మాట్లాడలేదు. గమ్మున నిల్చున్నాడు. రేవతత్త మామని బూతులు తిట్టడం మొదలుపెట్టింది.

పోలీసు వాళ్ళు వచ్చినవారితో ఏదో పంచాయితీ చేస్తున్నారు. తాత, ఊళ్ళోని మిగిలిన మగాళ్ళూ అందరూ చేరి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. తాతా, అమ్మా, నాన్నా అమ్మమ్మ వాళ్ళింటి అరుగుమీదే కూర్చున్నారు. అక్కనీ, నన్నూ పిన్ని ఇంటికి తీసుకొచ్చేసింది. తళిగ వేసి పూజలేవి చెయ్యకనే మాకు అన్నంపెట్టి తానూ తిని మమ్ముల్ని మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండమంది. సాయంత్రం చిన్నాన్న వచ్చాడు. ఆయనతో జరిగినదంతా గుసగుసా చెప్పింది. కాసేపట్లో చిన్నాన్నకూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారేమో. రాత్రి భోజనాల సమయానికి అందరూ తిరిగొచ్చారు. ఎవరూ ఏం మాట్లాడలేదు. ఇల్లు నిశబ్ధంగా ఉంది.

కొన్నిరోజులకి ఆ విషయం పాతబడిపోయింది. ఒకరోజు సాయంత్రం అందరం భోజనాలు చేసి తాత రోజూ చెప్పే భారతం కథ వినడానికి సిద్ధమవుతున్నాము. రమేష్ మామ కొడుకు, సతీష్ ఇంటికొచ్చి, "తాతా! మా నాన్నమ్మ నిన్ను తీసుకు రమ్మంది" అన్నాడు. "ఎందుకట్రా?" అని అమ్మవాణ్ణి అడిగితే "నాకు తెలియదత్తా. నాన్న ఎవరినో తీసుకొచ్చాడు. అమ్మా, నాన్నమ్మా ఏడుస్తున్నారు" అన్నాడు. వెంటనే తాతా, అమ్మా, నాన్నా వెళ్ళారు. పిన్ని సతీష్ ని పట్టుకుని, "ఏమైనా తిన్నావారా?" అనడిగింది. వాడు అడ్డంగా తలూపాడు. "సరె, తినిక్కడే పడుకో" అని అన్నం పెట్టింది. చిన్నాన్న నేనూ వెళ్తానన్నాడు. పిన్ని వెళ్ళద్దు అని గట్టిగా చెప్పేసింది. మంగమ్మవ్వ అరుగుమీద కూర్చుని తనలోతానే ఏవో మాట్లాడుకుంటోంది. మేము నిద్రపోయాము. వెళ్ళినవాళ్ళు ఎప్పుడొచ్చారో తెలియదు.

మర్నాడు సతీష్‌తోపాటు అమ్మమ్మవాళ్ళ ఇంటికెళ్తే కొత్తగా ఒకావిడున్నారు. అక్కడ వాతావరణమంతా నిశబ్ధంగా ఉంది. రేవతత్త ఎప్పట్లా కాకుండ ఏడుపుముఖంతో కనబడింది. ఎప్పుడూ అలా చూళ్ళేదు రేవతత్తని. పల్లెటూర్లో మనిషిలా ఉండదస్లు. ఏ సినిమా నటో అన్నంత అందంగా ఉండేది. చెదిరిన జుట్టు, ఉబ్బిన కళ్ళతో ఏదోలా ఉంది. ఎవర్నో తిడుతూ సతీష్ ని గుండేలకేసి హత్తుకుంది. అక్కడుండలేక కాసేపటికి సతీష్ ని తీసుకుని ఇంటికి వచ్చేశాను.

అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కొత్తగా వచ్చినామెగురించి ఊర్లో ఏవేవో అంటున్నారు. ఒకరోజు "ఆ మొగుణ్ణి విడిచిపెట్టిన దాన్ని  తరిమేయకుండా, ఇక్కడే కొంపేసి మా తమ్ముడితో కాపురంపెట్టిస్తారా?" అని మా అమ్మ నాన్నతో గొడవపడింది. నాన్న ఏవో చెప్పి సమాధానపరుస్తున్నాడు. "మీరు బయటెళ్ళి ఆడుకోండి" అని పిన్ని మమ్ముల్ని అక్కణ్ణుండి పంపించేసింది. కొన్ని రోజుల్లో రమేష్ మామ ఊరికి అవతలున్న పొలంలో గుడిసె వేసి కొత్తామెను అక్కడ పెట్టాడు. మా పొలానికి వెళ్ళాలంటే ఆ గుడిసె దాటెళ్ళాలి. వెళ్ళేప్పుడు నేను ఆ గుడిసె వైపు చూస్తూ వెళ్ళేవాణ్ణి. ఒక్కోసారి ఆ కొత్తామె ఏవో పనులు చేస్తూ గుడిసె బయట కనిపించేది. దూరంనుండి ఆమెను చూస్తూ వెళ్ళేవాణ్ణి. ఒకవేళ ఆమె నన్ను చూస్తే నేను తల తిప్పుకుని వెళ్ళిపోయేవాణ్ణి. 

దసరా సెలవులప్పుడు ఒక రోజు బోర్‍వెల్ వేస్తున్నారు ఆ గుడిసె దగ్గర. పిల్లలందరూ ఆ బోర్‌వెల్ లారి దగ్గర చేరారు; నేనూ టిఫిన్ తిని వెళ్ళాను. అక్కడ నాన్నా, రమేష్ మామ నిల్చుని మాట్లాడుకుంటున్నారు. నేను అక్కడికి వెళ్ళాను. మామ నన్ను పిలిచి ఆ గుడిసె వైపు చెయిచూపి తాగు నీరు తీసుకురమ్మన్నాడు. నాకు ఆశ్చర్యం! వెళ్ళాలో వద్దో తెలియక జంకుతున్నాను. నాన్న, "పో, నీళ్ళు తీసుకురా" అన్నాడు. వెళ్ళి ఆ గుడిసె ముందు ఆవిడని చూసి బెరుకుగా నిలబడ్డాను, 

"రా! కూర్చో" అని బల్ల వైపు చూపించింది.

"మామ నీళ్ళు తెమ్మన్నాడు" అన్నాను. లోనికెళ్ళి నీళ్ళచెంబుపట్టుకొచ్చి చేతికిచ్చింది. మామకి నీళ్ళిచ్చి ఖాళీ చెంబు పట్టుకుని మళ్ళీ గుడిసెదగ్గరకెళ్ళాను. ఈ సారి లోనికి రమ్మంది.

"నీ పేరు సూర్య కదూ? ఏం చదువుతున్నావు" అని వంగి నన్ను హత్తుకుని ముద్దుపెట్టుకుంది. బుగ్గలు తుడుచుకున్నాను. ఏవో ఇంటి పనులవి చేస్తూ నన్ను మాట్లాడిస్తూనే ఉంది. "బోర్ కొడితే ఇవి చదువు" అని కొన్ని చందమామ పుస్తకాలు తెచ్చి ఇచ్చింది. తీసుకుని "నాకు తెలుగు రాదు; బొమ్మలు చూస్తాను. 'అంబులిమామ' చదువుతాను" అన్నాను. (అంబులిమామ అరవ చందమామ). 

"కుమార్రాజుపేట స్కూలే కదా? మరెందుకు తెలుగు రాదు?"

"అవును! తెలుగు సెక్షన్ కాదు; నేను అరవ సెక్షన్ లో చదువుతాను. అక్క తెలుగు సెక్షన్" అన్నాను.

"తెలుగు నేర్పలేదా మీ తాత?"

"తాతే చదివి వినిపిస్తాడు; అర్థం అవుతుంది నాకు" 

"నేర్చుకోవా?"

"నువ్వు నేర్పుతావా?"

"నన్ను 'సుశీలత్త' అని పిలువు నేర్పుతాను"

"సరే"

కాసేపటికి అక్కణ్ణుండి బోర్‌వెల్ లారీ దగ్గరకొచ్చాను. బోర్‌వెల్ లో నీళ్ళు వస్తున్నాయి. మధ్యాహ్న వేళకు నాన్న వేలుపట్టుకుని ఇంటికొచ్చాను. అమ్మ కోపంగా ఉంది! రమేష్ మామ కి నాన్నవల్లే ఇంత ధైర్యం అనీ; బోర్‌వెల్ వేయడంలో నాన్న సపోర్ట్ చేస్తున్నారని నాన్నతో గొడవేసుకుంది. నాన్న ఏవో చెప్పాడు. అమ్మ సణుగుడు ఆపలేదు.

కొన్ని రోజుల్లో ఆ గుడిసె పక్కన మిద్దె ఇల్లు కట్టేపనులు మొదలుపెట్టాడు రమేష్ మామ. నేను ఖాళీ సమయాల్లో అక్కడికెళ్ళేవాణ్ణి. ఇల్లు కట్టేపనులవి చూస్తూ సుశీలత్తతో మాట్లాడుతు ఉండేవాణ్ణి. ఇల్లు పూర్తయింది. మా ఊళ్ళో ఎవ్వరికీ అంత కొత్త, అందమైన ఇల్లు లేదు. రమేష్ మామ అంత అందంగా కట్టాడు. ఆ ఇంట్లో అత్త ఒక్కత్తే ఉండేది. అప్పుడప్పుడు రమేష్ మామ వచ్చేవాడు. చదువుకోడానికి ప్రత్యేకంగా మేడపైన గది కట్టించాడు. రూమ్ మధ్యలో చెక్క ఉయ్యాల. అప్పుడర్థమయింది అత్త ఎన్ని పుస్తకాలు చదువుతుందో. ఇంగ్లీషు, తెలుగు, అరవ.. వందలకొద్ది పుస్తకాలు.

"అత్తా, నువ్వేం చదివావు?"

"బీ.ఎస్సీ అగ్రీకల్చర్ చదివాన్రా; కోయంబత్తూర్లో."

అత్త పనివాళ్ళ చేత మామిడి మొక్కలు అంట్లు కట్టించేది. మామిడి అంటు కోసం ఎక్కడెక్కడి నుంచో ట్రాక్టర్లలో వచ్చి కొనుక్కువెళ్ళేవారు. ఎప్పుడూ సందడిగా ఉండే ఆ ఇంటి పరిసరాల్లో నాకు పొద్దు తెలిసేది కాదు.

సెలవు రోజుల్లో సుశీలత్తతో కబుర్లు చెప్తూ, వింటూ మధ్యాహ్న భోజనం వాళ్ళ ఇంట్లోనే తినేసేవాణ్ణి. అత్త చేతి వంట నాకు బాగా నచ్చేది. పత్రికల్లో వచ్చే వివిధరకాల కొత్త వంటకాలు చేసేది అత్త. ఒక రోజు సాయంత్రం ఇంటికి రాగానే "మరోసారి అక్కడకి వెళ్ళినా, భోంచేసినా చంపేస్తాన్రా" అని అమ్మ తిట్టింది. ఏడుస్తూ తాత దగ్గరకి వెళ్ళి చెప్పాను. 

"ఎందుకెళ్తావు అక్కడికి? ఊర్లో ఇంతమంది పిల్లలున్నారుకదరా; వాళ్ళతో ఆడుకోవచ్చుకదా?" అనడిగాడు.

"నాకు ఆటలిష్టంలేదు, తాతా! అత్త బోలెడు కథలు చెప్తుంది." అని మొరాయించాను.

"అమ్మ మాట వినాలి నాన్నా. అమ్మ వద్దన్నపనులు చేయకూడదు కదా?"

"నాకు ఈ అమ్మ నచ్చలేదు తాతా. ఎప్పుడూ నన్ను తిడుతూ ఉంటుంది." అని పరుగుతీశాను.

అప్పట్నుండి అమ్మకు తెలియకుండ వెళ్ళేవాణ్ణి. భోజనం సమయానికి ఇంటికి వచ్చేసేవాణ్ణి. సుశీలత్త తినమంటే వద్దనేసేవాణ్ణి. అత్త ఒకరోజు బలవంతంగా తినమని అడిగితే "మా అమ్మ ఇక్కడకి రాకూడదు, తినకూడదు అంది. తాతకూడా అమ్మ మాట వినమన్నాడు" అన్నాను.

"అవునా... నీకేమనిపిస్తుంది?"

"నాకు ఇక్కడికి రావాలనిపిస్తుంది"

"నీకనిపించినది నువ్వు చెయ్. ఇప్పుడే కాదు నీ జీవితమంతా అలానే ఉండు. నీకు చెడేది మంచేదని తెలుసుకాబట్టి నీకు నచ్చిన మంచిపనులే చెయ్; ఎవరికి నచ్చినా నచ్చకపోయినా! సరేనా?"

"అలాగే అత్తా" అని ఆ రోజు భోజనం అత్తతోనే తిన్నాను. సాయంత్రం ఇంటికొచ్చేసరికి రేవతత్త అమ్మతో ఏవో చెప్పి ఏడుస్తోంది. అమ్మ ఎవరినో గట్టిగా తిడుతూ అత్తని ఓదారుస్తోంది. నన్ను చూడగానే కోపంగా పిలిచింది. చెవ్వు పట్టుకుని పిండేస్తూ "చెప్పానా? అక్కడికి వెళ్ళకూడదని? ఎన్నిసార్లు చెప్పినా వినవా? అన్నీ మేనమామ బుద్ధులొచ్చాయ్ నీకు" అని తిట్టింది. నాకు బాధేసింది. ఈ రేవతత్తమీద చాలా కోపంవచ్చింది; ఈమేవచ్చి అమ్మతో ఏదేదో చెప్పుంటుందని. అమ్మదగ్గర్నుండి నన్ను బలవంతంగా విడిపించుకుని రేవతత్తవైపు ఎర్రగా చూసి "నువ్వు మా ఇంటికి రాకు; నీ వల్ల నేను దెబ్బలుతింటున్నాను" అన్నాను. నేను రేవతత్తపైన అరవడంవల్ల అమ్మకింకా కోపమెక్కువైందేమో "పెద్దంతరం చిన్నంతరం లేకుండ మాట్లాడ్తావా?" అని చెంపమీద గట్టిగా కొట్టింది. నాన్నా, తాతా ఇంట్లో లేరు. పిన్ని అక్క చేత హోమ్వర్క్ చేయిస్తుంది. ఇదంతా వంటగదిలోనుండి చూస్తున్న మంగమ్మవ్వ పరుగుపరుగునొచ్చి ఏడుస్తున్న నన్ను తిసుకెళ్ళిపోయింది. ఆరాత్రి తినలేదు. నాకింట్లో ఉండాలని లేదు. తాత రాగానే జరిగిందంతా చెప్పాను. వీధిచివరవరకు తాతచెయిపట్టుకుని వెళ్ళాను. రమేష్ మామ కనబడ్డారు. తాతకి చెప్పి మామతోబాటు సుశీలత్తవాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. రాత్రక్కడే తిని కథలు వింటూ నిద్రపోయాను.

మరుసటి రోజు పొద్దున నిద్రలేచేసరికి అత్తతో మాట్లాడుతున్న మంగమ్మవ్వ గొంతు వినిపించింది. నన్ను తీసుకెళ్ళడానికి వచ్చింటుంది. నిన్న మా ఇంట జరిగిన గొడవగురించి మాట్లాడుకుంటున్నారు.

"తాళికట్టించుకున్న నేనే ఒకపిల్లాడితో ఆపుకున్నాను ఉంచుకున్నది కడుపుచేసుకుంటుందా? సమచ్చరానికొకర్ని కని ఆస్తంతా దోచుకుంటుందేమో సిగ్గులేంది అని ఆడిపోసుకుంటుంది నిన్ను" అని చెప్పింది మంగమ్మవ్వ.

అత్త ఏం మాట్లాడలేదు. "సుశీలమ్మా, నీకు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే రేపు ఇవే మాటలు వేరేవాళ్ళెవరివల్లయినా నీ చెవిలోపడితే ఏడుస్తావేమోనని. ఇలాంటి మాటలేవీ నువ్వు పట్టించుకోకు. ఆ రేవతి గడ్డివాము దగ్గర కుక్కలాంటిది తాను తినదు; ఎవరినీ తిననీదు. మంచిగా కాపురంచేసుకుని పిల్లల్ని కంటే ఎవరొద్దన్నారు దాన్ని? మగాణ్ణి మగాడుగా చూసెరగదెప్పుడూ ఆ గయ్యాళి. ఎప్పుడూ పుట్టింటి గొప్పలు చెప్పుకోడమేగానీ తిన్నగా కాపురంచేసుకుందా?" అని మంగమ్మవ్వ రేవతత్తని తిడుతూనే "ఇవేవీ పట్టించుకోకుండ నువ్వు వేళకి మంచిగా తిని ఆరోగ్యంగా ఉండాలిప్పుడు" అని చెప్పింది. 

అప్పట్నుండి మంగమ్మవ్వకూడా తరచూ సుశీలత్తవాళ్ళింటికి వచ్చి పనులవి చేయడానికి అత్తకి సాయం చేసేది. మంగమ్మవ్వ మాకేం బంధువు కాదు. ఒంటరిది. తాతకి తోబుట్టువులాంటిది. మాయింటే ఉండిపోయింది.

రమేష్ మామ ఎక్కువ సమయం సుశీలత్త వాళ్ళ ఇంట్లోనే గడిపేవాడు. సుశీలత్తకి పురుటిరోజులని మంగమ్మవ్వ సుశీలత్తతోనే ఉండిపోయింది. సుశీలత్తకి పాప పుట్టింది. చిన్న చిన్న చేతులు, కాళ్ళతో ఆ పాప ఎంత అందంగా ఉందో! నాకు తెగ నచ్చేసింది. ఎప్పుడూ కాళ్ళు, చేతులు గాల్లోకి ఎగరవేస్తున్నట్టుగా అలా ఆకాశానికేసి చూసేది. పాపని ఎత్తుకోవాలని తెగ ఆరాటపడిపోయేవాణ్ణి. నన్ను కాళ్ళు చాపమని పాపని టవల్లో చుట్టి నా ఒడిలో కొన్ని నిముషాలు ఉంచేది.

ఇంటికి వచ్చి పాపముచ్చట్లు అక్కతో చెప్తే తనకీ పాపని చూడాలనిపించి మొట్ట మొదటిసారిగా నాతో సుశీలత్తవాళ్ళ ఇంటికి వచ్చింది. అక్కకి కూడా పాపా, సుశీలత్త ఇద్దరూ నచ్చేశారు. ఆతర్వాత తనుకూడా వస్తూ ఉండేది. మరోరోజు సతీష్ ని కూడా తిసుకొచ్చాము. వాడికీ పాప బాగా నచ్చేసింది. పాపకి నామకరణం చేసిన రోజు నాన్న, తాత, పిన్ని మాత్రం వచ్చారు. అమ్మ రాలేదు. ఇంటికి వచ్చాక అమ్మ అడిగింది పిన్నిని "పాపెలా ఉంది, ఎవరి పోలికలొచ్చాయి, రంగెలా ఉంది" లాంటివి! ఆమెకీ పాపని చూడాలనిపించుండచ్చు.

పాపని ఐదో తరగతి వరకు పక్కూర్లో స్కూల్లో చదివించారు. ఆ పైన తననికూడా రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చేశారు. అన్నా-చెల్లీ సెలవులకి ఇంటికి వచ్చేవారు. వాళ్ళతో నాకు చాలా సరదాగా గడిచేది.  పాఠ్యపుస్తకాలేకాకుండ సాహిత్యం, సైన్సు పుస్తకాలుకూడా చదవమని అత్త ప్రోత్సహించేది. ఆవిడ కలెక్షన్ లో ఉన్న అరవ, ఇంగ్లీషు, తెలుగు పుస్తకాలు నాచేత చదివించేది. శ్వాసించడం ఎలాగైతే ప్రాణమున్నంతకాలం మానమో; పుస్తకపఠనమూ అలా మానకూడదు అని అత్త చెప్పేది. శని, ఆదివారాల్లో పల్లిపట్టు టౌన్ లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం. అత్తకున్న అపార జ్ఞానంతోనూ, పుస్తకాలతోనూ నా ప్రపంచం విశాలమైంది. ప్లస్ టూ అయ్యాక నేను కాలేజీ చదువుకి మెడ్రాస్ వెళ్ళిప్పుడు ప్రతి వారమూ ఉత్తరాల్లో అత్తా నేనూ చాలా విషయాలే మాట్లాడుకునేవాళ్ళం. మాస్టర్స్ కోసం నేను విదేశాల్లో ఉన్నప్పుడు అత్త కంప్యూటర్ కొనుక్కుని ఇంటర్నెట్ వాడకం కూడా నేర్చుకుని ఈ-మెయిల్ రాస్తే నేను ఆశ్చర్యపోయాను. కొత్తవిషయాలు నేర్చుకోవడంలో ఆమెకున్న ఆసక్తి ఇంకా బాగా అర్థమయింది.

 ***

"సూర్యా, చదువులైపోయాయి. ఉద్యోగంచేస్తున్నావు; పెళ్ళి గురించేమైనా ఆలోచించావా?"

"అప్పుడే నాకు పెళ్ళేంటత్తా? పాతికేళ్ళేగా?"

"సరైన వ్యక్తిని నువ్వు చూసుకునియుంటే చేసేసుకోవచ్చు. మీ అమ్మ నీకు సంబంధాలు చూస్తూ ఉందట. మామ చెప్పాడు."

"నిజమా? నాకు చెప్పకుండానే? నన్నడగకుండానే?" నేను ఆశ్చర్యపోయాను.

"హాహాహా... పిచ్చోడా... గొర్రెనడిగి గొంతుకోస్తారా? చెరుకూరి మునస్వామి నాయుడు తరచూ మీ ఇంటికి వస్తున్నాడట. ఒకే కూతురు; బోలెడాస్తి."

"ఆస్తికోసం, అమ్మకోసం పెళ్ళిచేసుకోవాలా? నాకు పెళ్ళొద్దత్తా"

"పెళ్ళేవద్దా? మునస్వామి కూతురొద్దా?"

"రెండూ వద్దు"

"పెళ్ళొద్దనకు. ఇలా వాళ్ళూ, వీళ్ళూ చూసిన అమ్మాయినికాకుండ నీ యంతట నువ్వే చూసి చేసుకో. ఎవరినైనా ఇష్టపడుతున్నావా?"

"ఇంజినీరింగ్లో ఉండగా ఓ అమ్మాయిని ఇష్టపడ్డానుకానీ మాకిద్దరికీ సరిపడదని విడిపోయాం. ఆ తర్వాత ప్రేమ, పెళ్ళి గురించి ఆలోచించలేదు; నన్ను అటువైపులాగేంత సరైన ఆడపిల్లని కలవలేదు."

"గుడ్. కీప్ యువర్ హార్ట్ ఓపెన్. అప్పుడు కలుస్తావు ఆ ఆడపిల్లని. మనకులమమ్మాయిమాత్రమే అనో, తెలుగమ్మాయి మాత్రమే అనో నిర్బంధాలు పెట్టుకోకు. దొరికితే దొరసానిని చూసుకో" అని నవ్వింది.

"అప్పటిక్కానీ మా అమ్మ నన్ను చంపి పాతరెయ్యదు... అయినా, ఇలాంటి విప్లవాలు చదివే సాహిత్యంకొరకే కానీ; నిజజీవితంలో కూడా అన్వయించాలంటావా అత్తా?"

"కాదురా! విప్లవం అసలు కాదు. సైన్స్ బాబూ సైన్స్! కొన్ని వందల సంవత్సరాల నుండీ ఇదే కులంలో మళ్ళీ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని అదే రక్తంతో ఒకేలాంటి గుణగణాలు, ఆలోచనలు గల మనుషులని తయారు చేస్తున్నాము. పండించే పయిరులో ఎక్కువ దిగుబడులు ఇచ్చే విత్తనాలెన్నుకుంటాం. కొత్తకొత్త రుచులిచ్చే పళ్ళుకోసం మొక్కల్ని అంటుకట్టుకుంటాం. ప్రకృతి సహజసిద్ధంగా పూయించే పూలరంగులూ, ఆకారాలుకూడా మనకళ్ళకి బోరుకొట్టేసి క్రాస్-బ్రీడ్ చేసి కొత్త రంగుల పూలు పూయిస్తున్నాం. రవాణాకి సౌకర్యంగా ఉండాలని పుచ్చకాయల్నికూడా స్క్వేర్ షేప్ లో పండించుకుంటున్నారట. మనుషుల దగ్గరకొచ్చేసరికి మనకులంలోనే, బంధువుల్లోనే పెళ్ళిచేసుకుంటే మేలైన పిల్లలెలా పుడతార్రా? ఈ వింత మన దేశంలో మాత్రమే. వేరే దేశాల్లో కులాలులేవు. ఎంచక్కా వేరే రేస్ వాళ్ళనికూడా పెళ్ళి చేసుకుంటారు. మనం రేస్ కాదు కదా కులం, ప్రాంతంనుండికూడా బయటికి రావట్లేదు"

"వేల సంవత్సరాలుగా మనదేశంలో వివాహాలిలానే జరుగుతున్నాయ్ అత్తా"

"నిజమే వేల సంవత్సరాలుగా ఇలా జరుగుతున్నాయ్.  వేల సంవత్సరాలుగా ఇలా ఉందికాబట్టి ఇప్పుడూ అలానే ఉండనివ్వాలా? మిగిలినవాటిల్లో మార్పునంగీకరించిన మనం మనువులో ఎందుకు పాటించకూడదు? ఆస్తికాపాడుకోడానికి అయినవారిమధ్య పెళ్ళిళ్ళు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అలాంటి అవసరాలేం లేవుకదా? కనీసం నీవరకు!"

"నువ్వు చెప్పేవి వినడానికి బానే ఉన్నాయి కానీ అమలుపరచడం సాధ్యమా? ఇంత కచ్చితమైన ఆలోచనలూ, సిద్ధాంతాలూ ఉన్న నీకే ఏటికెదురీదటం ఎంత కష్టమైందో నాకు తెలుసు. నావల్ల అవుతుందా? పైగా మా తాతైనా లేరిప్పుడు"

"..."

"ఇంతకీ అత్తా ఎప్పట్నుండో అడగాలనకుంటున్నాను. ఏం జరిగిందసలు? ఊరంతా నీ గురించి చెడుగానే మాట్లాడుతారు. ఊళ్ళో ఎవరూ నీతో మాట్లాడరు; ఎవరూ మీ ఇంటికైనా రారు. నీకు కష్టంగా అనిపించలేదా?"

"ఎప్పుడో చెప్పుండాలి నీకు; సందర్భం రాలేదు"

***

పెరుమాళ్‌రాజుకుప్పం తక్కిలపాటి కుటుంబంలో పుట్టాను. ఆడపిల్లనైనా చదువు బాగా వస్తుందని పై చదువులకుకూడా అడ్డు చెప్పలేదు. వ్యవసాయ కుటుంబం కావడంవల్ల స్వతహాగానే నాకు అగ్రికల్చర్ మీద ఆసక్తి కలిగి అగ్రికల్చర్ బీ.ఎస్సీ చదువుకున్నాను. డాక్టరేట్ చెయ్యాలని ఉండేది. మూడేళ్ళు చదువైపోగానే బలవంతాన మా మేనబావకిచ్చి పెళ్ళి చేసిపెట్టారు. ఆ పెళ్ళొద్దని పెద్ద యుద్ధమే చేశాను; నెగ్గలేకపోయాను. పెళ్ళికి ముందే నాకు తెలుసు చంద్రశేఖర్ లాంటి మనిషి నాకు సరికాడు అని. చెడ్డవాడుకాదు; అలా అని నా అభిరుచికి తగినవాడు కాదు అంతే. నాకున్నట్లు ఆయనకి సాహిత్యం పిచ్చిలేదు; వ్యవసాయమంటే మక్కువలేదు. దేశంలో జరిగే పెళ్ళిళ్ళన్నీ అభిరుచులు కలిసినవారిమధ్యే జరగట్లేదుకదా అని సర్దుకుపోవడానికి ప్రయత్నించాను.

ఎప్పుడైనా చదువుతు కూర్చుంటే ఓర్వలేడు. పొలానికి కూడా వెళ్ళడసలు. పొద్దస్తమానం ఏవో గాలి తిరుగుళ్ళు. పిల్లాడు పుట్టాక రెండేళ్ళకి పల్లిపట్టు టౌన్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టి కాపురం అక్కడికి తరలించాడు. పల్లిపట్టు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వెనకవైపున్న బంగళాలో ఉండేవాళ్ళం. రమేష్ ఆ ఆఫీసులో చేసేవాడు. రమేష్ చంద్రశేఖర్ కి బంధువుకూడా. మేము అక్కడే ఉన్నాం కాబట్టి మధ్యాహ్న భోజనం రోజూ మా ఇంట్లోనే తినమన్నాడు. అప్పుడే తెలిసింది మేము చదువుకున్నది ఒకే కాలేజీ అనీ. ఆయనా నాలాగే కోయంబత్తూర్ కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్ అని. సాహిత్యం అంటే అభిమానం అనీ. సమయం దొరికినప్పుడు సాహిత్యం గూర్చీ వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల గురించీ మాట్లాడుకునేవాళ్ళం. మా ఇద్దరి మధ్య ఏ కల్మషంలేని స్నేహం ఏర్పడింది. 

ఫ్రెండ్స్ తో నడిరేయి వరకు కాలక్షేపం చేసి వచ్చినా నేను చంద్రశేఖర్ ని ఏమీ అడగకూడదుకానీ రమేష్ తో నేను సాహిత్యం గురించి మాట్లాడితే మాత్రం ముఖమెర్రచేసుకునేవాడు. చంద్రశేఖర్ తన ఫ్రెండ్స్ తో ఇంట్లో కూర్చుని తాగుతుంటే ఇలాంటి వాతావరణంలో కొడుకుని పెంచడం ఇష్టంలేక మా అమ్మదగ్గర వదిలిపెట్టాను. రమేష్‌తో నేను చనువుగా ఉండటం ఓర్వలేక ఎన్నెన్నో మాటలనేవాడు. ఇవన్నీ నాతో అనేవాడుకానీ రమేష్ తో బానే మాట్లాడేవాడు. భార్యని అనుమానిస్తున్నాని మరో మగాడితో ఎలా చెప్తాడు. అప్పుడు రమేష్ కి తిరుత్తణి ఆఫీస్ కి ట్రాన్స్‌ఫర్ అయి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకి అర్థమైందేంటంటే సమస్య రమేష్ రావడం కాదు; చంద్రశేఖర్ కి ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని. అన్నిటికీ సర్దుకుపోతూ కాపురం చేస్తూ వచ్చాను.

అప్పట్లో నాకు నచ్చిన తెలుగు రచయిత్రి మెడ్రాస్ తెలుగు అకాడెమీకి వస్తున్నారు ఆ సభకి వెళ్ళాలని అడిగితే అవసరంలేదన్నాడు. ఆ రచయిత్రిని కలవాలన్నది చిరకాలంగా నా కోరిక. అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలో అర్థం కాలేదు. అందుకని ఎదిరించయినా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. శనివారం ఉదయం బస్ స్టాండ్ లో మెడ్రాస్ బస్ కోసం కూర్చున్నాను. అటుగా వచ్చిన రమేష్ పలకరించాడు. ఇంతలో నన్ను వెతుక్కుంటూ వచ్చిన చంద్రశేఖర్ మమ్ముల్ని అపార్థం చేసుకున్నాడు. అక్కడికక్కడే నన్ను కొట్టబోతే రమేష్ అడ్డుకున్నాడు. అప్పటివరకు అతనికి నా కాపురం గురించీ, చంద్రశేఖర్ అనుమానాలగురించీ ఏమీ చెప్పలేదు. రమేష్ ని బజార్ లో అవమానించాడు చంద్రశేఖర్. నన్ను ఇంటికి లాక్కొచ్చి వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాడు. ఆయన మనుషులూ, కర్రలతో మీ ఊరొచ్చిందారోజే.

ఏమీలేని మా మధ్య అక్రమసంబంధం అంటగట్టారు. అప్పటివరకు నా కాపురం గురించి నేనెలా బయటపడలేదో అలాగే రమేష్ కూడా ఏవీ చెప్పలేదని తెలిసింది. నేనొక మగవాడిచేత వేదింపడుతున్నట్టు రమేష్ ఒక ఆడదాని చేత వేదింపబడుతున్నాడన్నది తెలిసింది. ఆ తర్వాత మాకర్థమైందేంటంటే మేమిద్దరం సోల్మేట్ ని వెతుక్కోగల స్వాతంత్రమున్న సమాజంలో జీవించుంటే పెర్ఫెక్ట్ కపుల్ అయుంటాం అని.

ఇంతదాకా వచ్చాక ఈ పెళ్ళితో కాంప్రమైజ్ అయి, వ్యక్తిత్వం కోల్పోయి కాపురం చేసి సమాజాన్ని మెప్పించడంకంటే సమాజాన్ని పక్కనపెట్టి మేం కలిసి జీవించడం మంచిదని నిర్ణయించుకున్నాం. అప్పుడు మీ తాతతో ఈ విషయమంతా చెప్పాడు రమేష్. ఆ తర్వాత జరిగినవన్నీ ఆయన సమ్మతంతోనే.

***

"చాలా సాహసమే చేశావత్తా! నీకు ఎప్పుడైనా గిల్టీ ఫీలింగ్ కలిగిందా?"

"దేనికి గిల్టీ ఫీలింగ్?"

"రేవతత్తకి సొంతమైన మనిషిని నువ్వు తీసేసుకున్నావని? వాళ్ళ కాపురం ఇలా అయిందనీ"

"నిజంగా మీ రేవతత్త ఆ మనిషి విలువతెలిసుకుని కాపురం చేసుకుంటూ ఉండుంటే నేను మంచి స్నేహితురాలుగానే మిగిలుండేదాన్ని. రమేష్ జీవితంలోకి ఇలా వచ్చుండేదాన్నే కాదు"

"అంత కచ్చితంగా ఎలా చెప్పగలవత్తా?"

"వాళ్ళ మధ్య అంత అన్యోన్యతే ఉండుంటే నేను పరిచయం అయిన తొలిరోజునుండే నాగురించి రేవతత్తతో చెప్పుండేవాడు. నాకు సమస్య వచ్చినప్పుడు నాకొచ్చిన సమస్య గూర్చికూడా చెప్పుండేవాడు. అప్పుడు ఇద్దరు కలిసి నాకు సాయపడేందుకు ముందుకొచ్చుంటారు కదా? ఎవరో వచ్చి గొడవ చేశారనగానే తన భర్త ఎలాంటివాడు అన్న ఆలోచనేమీ లేకుండ అరిచేసి చెప్పుతో కొట్టేస్తుందా?"

"ఊ"

"నేను రమేష్ మామ లైఫ్ లోకి రాకుముందు విషయాలు నీకేమయినా గుర్తున్నాయా?"

"నేను అప్పుడు చాలా చిన్నపిల్లాణ్ణి! అయినా నాకు రేవతత్త ఎందుకో నచ్చేది కాదు. ఎప్పుడూ ఎవర్నో తిడుతూ, చిటపటలాడుతూనే ఉండేది. అంత అందానికి కాస్త సున్నితత్వం ఉంటే బాగుండని అనిపించేది. నాకు ఇంకెవరైనా అత్తగా ఉండచ్చుకదా అనిపించేది. మా అమ్మమ్మని బాగ చూసుకునేది కాదు. పాపం అమ్మమ్మ వేరేగా వంట చేసుకుని తినేది. నిజానికి నువ్వొచ్చాకే వాళ్ళిద్దరు కొంత ఐక్యతగా ఉన్నారు అని అమ్మ అప్పుడప్పుడూ అనేది కూడా!"

"అవును; రమేష్ అప్పుడప్పుడూ చెప్పి నవ్వుకునేవాడు నువ్వొచ్చి ఇంట్లో ఆత్తా-కోడలు గొడవల్ని నిర్మూలించావు అని."

"మరి నీకు బాధనిపించదా అత్తా? మామ నీతో ఎక్కువ సమయం ఉండడనీ, రేవతత్త ఉన్న ఇంట్లో ఎక్కువ సమయం ఉండాడనీ? రమేష్ మామని నువ్వు మరో స్త్రీతో పంచుకోవాలనీ?"

"నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఆమె ఉన్న ఇంట్లో ఉంటాడంతే"

"నీది నిజంగానే ప్రత్యేకమైన వ్యక్తిత్వం అత్తా! ఎన్ని సర్దుబాట్లు చేసుకోవలసి వచ్చినా మామా, నువ్వు జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడానికి రెండో అవకాశం వెతుక్కోగలిగారు; అదృష్టవంతులు." మనస్పూర్తిగా చెప్పాను.

"ఇలాంటి రెండో అవకాశం అందరికీ రాదు; వచ్చినా సాహసించలేరు కూడా! ప్రతి మోడూ మారాకు వేస్తుందని చెప్పలేంకదా! నువ్వు ఆ అవసరంలేకుండా తొలియడుగే జాగ్రత్తగా వేయమని నా సలహా. అర్థమవుతుంది కదూ!"

సుశీలత్త నా కళ్ళకి ఇంకా స్పష్టంగా కనబడింది.

27 ఆగస్టు 2012

మగవారింతే.. మారరు!

కొన్ని వేల సంవత్సరాలుగా మకరితో పోరు సాగిస్తున్నాడు కరి రాజు. ఇక తనవల్ల కాదు అనుకున్న క్షణంలో మైండ్ మెసేజింగ్ సర్వీస్(MMS) ద్వారా ఒక్కమారు వేడుకున్నాడు విష్ణుమూర్తిని.
 
మగవారు బయట ఉన్నప్పుడు కొంత సావకాశంగా, తీరిగ్గా ఉంటారేమో గానీ ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా కూర్చుని ఉంటారాండీ? ఉండాలనుకున్నా ఉండనిస్తారా? ఎన్నిపనులంటగడతారో కదా? పోరాడుతున్న కరికేం తెలుసు ఈ వేళ విష్ణుమూర్తి ఇంట్లో ఏ పనిలో తలమునకలై ఉన్నాడో? తెలియక ఎంఎంఎస్ పంపేశాడు కరి. అందుకోగానే క్షణమైనా ఆలస్యం చెయ్యలేదు హరి. వెంటనే పరుగుతీశాడు కరిని ఆదుకోడానికి.
సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం జేదోయ సంధింపఁ డే
పరివారంబును జీరఁ డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తరధమ్మిల్లుముఁ జక్కనొత్తుఁడు వివాదప్రోత్థిత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై!
సిరికి చెప్పడు, శంఖమందుకోడు, చక్రం వేలికి తొడగడు, గరుత్మంతుని పిలవడు. విల్లంబులందుకోడు. ఇవన్నీ చెయ్యడానికి ఒక్క క్షణంపడుతుందా? కరి-మకరి యుద్ధం వేలసంవత్సరాలుగా జరుగుతోంది. ఒక్క క్షణం ఆలస్యంగా వెళితే వచ్చే నష్టం ఏంలేదని అతివివేకవంతుడైన విష్ణుమూర్తికి ఎందుకు తోచదు? అట్‌లీస్ట్ శ్రీదేవితో ఒక్కమాట చెప్పి వెళ్ళొచ్చుగా? పైగా తన చేతిలో ఉన్న ఆమె చేలాంచలమైనా వీడకుండా లాక్కుపోయాడట!  కరిరాజును ఆదుకోవడం ముఖ్యమైన పనే. కాదని ఎవరన్నారు? ఎంత ముఖ్యమైన పనైనా సరే, మనసులో కొలువున్న మహరాణికన్నా ఎక్కువా ఆ పని? కాదు.. కానే కాదు. అయినా ఎందుకిలా చేశాడు? అది మగవాడి making లో ఉన్న defect! వాళ్ళ బుర్రలోకి ఏదైనా emergency పని occupy అయితే ఆ పని పూర్తయ్యేవరకు వివేకానికి విరామం ఇచ్చేస్తారు... విల్లునుండి విడువడిన అంబులా ప్రవర్తిస్తారు మగవారు.

పోతన ఎందుకు ఈ మత్తేభాన్ని "సిరికిం జెప్పడు" అని ఆమెతో ఎందుకు మొదలుపెట్టాడూ? మనసిచ్చిన మగువకన్నా ప్రధానమైనది మరొకటిలేదు వివేకమున్న మగవాడికి! అలాంటిది ఆమెకు కూడా చెప్పకుండ(లెక్క చెయ్యకుండ?!) పరుగుతీశాడంటే అది ఏదో ఒక అత్యవసర పరిస్థితి అయ్యుంటుందన్నది గ్రహించండి అని లోకానికీ, మహిళాలోకానికీ.. గట్టిగా చెప్తున్నాడు పోతన.


ఆఫీసునుండి అర్జంట్ అని ఫోన్ వస్తే షర్ట్ బటన్ పెట్టుకున్నాడో లేడో, లేప్టాప్ ఛార్జర్ బేగ్ లో వేసుకున్నాడో లేదో, ఇవన్నీ చేసినా చేయకపోయినా ముఖ్యాతిముఖ్యమైన ఇల్లాలికి "వెళ్ళొస్తానోయ్" అని చెప్పనైనా చెప్పాడో లేదో..  పరుగోపరుగున వెళ్ళిపోతాడు; అది వాడి మేకింగ్ డిఫెక్ట్! ఈ మాత్రం దానికి మీరే కోపశిఖరాలూ ఎక్కకండి. ఆ ఎమర్జెన్సీ అయిపోగానే మొట్టమొదట గుర్తొచ్చేది మీరే గనుక కాస్త సహనం పాటించడం ఉత్తమం అని ఆడువారికి గట్టిగా చెప్పదలచుకున్నాడు కాబట్టే "సిరికిం జెప్పడు.." అని మొదలుపెట్టాడు పద్యాన్ని. విష్ణుమూర్తే అలా చేసినప్పుడు మామూలు మగవాడేం మినహాయింపు కాడు గదా!


"నీ చేలమైనా వీడక పరిగెట్టాను సుమా, అయినా నువ్వు కోపం తెచ్చుకోనే లేదేం!" తాను చేసిన పనికి నొచ్చుకుని శ్రీదేవిని మన్నింపడిగాడు. మగమహరాజులూ వింటున్నారా? సహనం వహించిన సతికి మెచ్చుకోలివ్వడం మరువకూడదన్నమాట. ఆ పై ఆమె దేవర యడుగులు అనుసరించడం తన విధి అని నవ్వుముఖంతో చెప్పనే చెప్పింది. సాదరసరససల్లాప మందహాసపూర్వక ఆలింగనమూ పొందిందట. మగువలూ.. వింటున్నారా? 

 

15 మే 2012

Chrysanthemum...

కొత్త క్లాసుని కొత్త స్టేషనరీతో మొదలుపెడదామని అంగటికెళ్ళి పెన్నులు పెన్సిళ్ళు కొనుక్కుని వచ్చి గేట్ తీసి సైకిల్ని లోపలపెట్టి స్టాండ్ వేశాను. ఈ ఇనుప గేట్ చప్పుడు వినగానే అమ్మ ఇంటి లోపల్నుండి వచ్చి, 

"నాన్నా, కృష్ణాంతిమం ఫ్లవర్ అంటే ఏంట్రా?"

"ఎక్కడ విన్నావమ్మా? అంతిమక్రియలకి పువ్వులు వాడుతారుగానీ అంతిమాలనీ, ఆరంభాలనీ పువ్వులకు పేర్లుండవు. ఈ మెడ్రాస్ లో ఏ నర్సరీలోనూ లేనన్ని పువ్వులు మన ఇంట్లో ఉన్నాయి. ఉన్న పువ్వుల మొక్కలతో తృప్తిపడమ్మా. కొత్త కొత్త పువ్వుల పేర్లు చెప్పి నర్సరీల చుట్టూ తిప్పకు! ఇదివరకులా కాదు +1, +2 చాలా కష్టపడి చదవాలి. ఈ రెండేళ్ళు నీ పువ్వుల మొక్కలకు సాయపడమని అడక్కు" ఏ మాత్రమూ దయా దాక్షిణ్యమూ లేకుండా, భయంతో కూడిన కోపంతో అన్నాను.

నా బుజ్జి మేనల్లుణ్ణి చూసుకోవడానికని గత నెలలో ఓ ఇరవై రోజులు అక్క వాళ్ళ ఇంటికెళ్ళింది అమ్మ. ఆ ఇరవై రోజులూ  మొక్కలన్నింటికీ నీళ్ళుపోసే పని నాకప్పగించింది. సెలవులే కదా అని ఒప్పుకున్నాను. అన్ని మొక్కలకీ నీళ్ళు పట్టాలంటే దాదాపు మూడుగంటలుపడుతుంది. ఈ మండే వేసవిలో ఇరవైరోజులు నీళ్ళు పోసే సరికి నాకు నిజంగా చుక్కలు కనబడ్డాయి. ఇప్పుడేదో కొత్త పేరు చెప్తోంది. మరో పాదు చేసి ఈ కృష్ణాంతిమం మొక్కలెక్కడ నాటేస్తుందోనన్న భయం వల్ల కలిగిన కోపం నాది.

ఈ పట్నంలో ఇంత పెద్ద ఇంటి స్థలం ఎందుకు సంపాదించాడో అని వైకుంఠానున్న మా తాతని తిట్టుకుంటూ నీళ్ళు పోశాను. ఖాళీ స్థలం ఉండబట్టేగా అమ్మ ఇన్ని రకాల పూల మొక్కలు పెంచుతోంది? ఇంటి చుట్టూ ఖాళీలేకుండా పాదులు కట్టేసి రకరకాల పూలచెట్లు నాటేసింది అమ్మ. అవి సరిపోవని, మెట్లమీద, మిద్దెపైన, మిద్దె పిట్టగోడమీదకూడా తొట్లలో మొక్కలు. ఏంటమ్మా నీకీ మొక్కల పిచ్చి అనడిగితే "పట్నంలో పుట్టిన మీ నాన్నకీ, నీకూ వీటి విలువ తెలియదు! మొక్కలు పెంచుకోడంలో ఉన్న ఆనందమూ అర్థం కాదు. నాలా రైతు కుటుంబమైయుంటే మీకూ అర్థమయ్యేది మట్టి గొప్పతనం" అని నిష్ఠూరాలాడేది.

"అదికాదురా, మొన్న మన ఇంటికి వచ్చారు కదా ఎదిరింటిలో కొత్తగా వచ్చిన ఆంటీ? వాళ్ళ అమ్మాయి ఇవాళ వచ్చిందిరా. పువ్వులను చూస్తూ కృష్ణాంతిమం ఫ్లవర్స్ ఎంతబాగా పెంచానో అని మెచ్చుకుంది. ఆ పిల్ల పేరులానే ఆ పిల్ల మెచ్చిన పూల పేర్లు కూడా వింతగా ఉన్నాయి!" అని ఆశ్చర్య పోయింది అమ్మ.

"నిన్న సాయంత్రం చూశాను; వాళ్ళ డాబాపైన బట్టలారేస్తోంది. ఇంతకీ ఆ పిల్ల పేరేంటి?"

"నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఏదో మర్సి అట!"

"మర్సి నా? అదేం పేరమ్మా!  సరే ఏ మొక్కల్ని చూసి చెప్పింది?"

ఈశాన్యంలో ఉన్న పాదులు చూపించి "వీటిని చూస్తూ అందిరా".

అటు చూస్తే రెండుపాదులున్నాయి; కనకాంబరం, టేబుల్ రోజ్, మరో మూల గోడ పక్కనేమో పెద్ద మందారం చెట్లు. పాదుల చుట్టూ నిండుగా పూచిన వివిధ రంగుల చామంతి, తురకచామంతి(బంతిపూలు), డెయ్సీ పూల మొక్కలు. నాకేమీ అర్థం కాలేదు!

"ఆ పేరేంటో పోల్చుడం నా వల్ల కావడం లేదమ్మా! ఆ పిల్లనే అడగాల్సింది కదా?" అన్నాను.
 
"ఆ పిల్లనేం అడగుతాంలే; నువ్వొస్తే కనుక్కుందాం అని ఊరుకున్నా రా"

"ఈ సారి వస్తే నేనడిగి కనుక్కుంటాన్లే" అన్నాను.

"వద్దులేరా, నేను మీను కి ఫోన్ చేసి కనుక్కుంటాను"

మా అమ్మకు ఈగో ఎక్కువ; పరాయి వారిముందు అసలు తగ్గాలనుకోదు. అన్నీ తెలిసినట్టే భలే నటించేస్తుంది.  మా అక్కయ్యకి ఫోన్ చేసి కనుక్కుంటుందట. మా అక్కయ్య బాటనిస్ట్, బాటనీలో పీహెచ్‌డి.

* * *

సాయంత్రమయింది. అమ్మేదో వంట చేస్తోంది. గేట్ చప్పుడు విని బయటికొచ్చి చూశాను. ఎదురింటమ్మాయి! నన్ను కంగారుగా చూసి,

"ఆంటీ లేరా?"

"ఉన్నారు, రా" అని అక్కడే నిలబడ్డాను.

ఇరువైపులూ ఉన్న పూలమొక్కలకేసి చూస్తూ నడిచి వచ్చింది. దగ్గరికొచ్చాక,

"హలో, నా పేరు సూర్యా. పొద్దున వచ్చావట కదా? అమ్మ చెప్పింది!"

"అవును. మీ గార్డెన్ భలే వుంది. నాకు క్రిశాంతిమం ఫ్లవర్సంటే చాలా చాలా ఇష్టం. ఇన్ని రకాల క్రిశాంతిమం ఫ్లవర్స్ ఇదివరకెక్కడా చూళ్ళేదు. పొద్దున వచ్చి చూస్తూ ఉంటే మా అమ్మ పిలిచారని సరిగ్గా చూడకుండానే వెళ్ళిపోయాను, అందుకే మళ్ళీ వచ్చా" అంటూ వంగి పెద్దగా పూచిన ఓ బంతి పువ్వుని మునివేళ్ళతో తాకింది.

ఈ అమ్మాయి Chrysanthemum అంటే అమ్మ 'కృష్ణాంతిమం' అని విన్నదా అని నవ్వొచ్చింది. నవ్వుని ఆపుకుంటూ,

"Marie Gold ఫ్లవర్స్ ని క్రిశాంతిమం అంటావేంటి? క్రిశాంతిమం అంటే చామంతి పువ్వులు కదా?" అని అడిగాను.

"Daisy, Marie Gold, చామంతి అన్నిటినీ Chrysanthemum అనే అంటారు; ఒక ఫ్యామిలీకి చెందినవే. ఈ ఫ్యామిలీలోని అన్ని రకాల పువ్వులూ బాగుంటాయి. ఒత్తుగా ఇన్నేసి రేకులు వేరే ఏ పువ్వుల్లోనూ ఉండవు; అందుకే ఇవంటే నాకు ఇష్టం" అని మరో చేత్తో ఇంకో పువ్వును పట్టుకోబోయింది.

"అవునా? నువ్వేం చదువుతావు?" అడిగాను.

"+1. సోమవారంనుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. వివేకానందా స్కూల్."

"ఓ! నువ్వూ +1 ఆ? నేనుకూడా! డాన్ బోస్కో స్కూల్; మీ స్కూల్ కి వెళ్ళే దార్లోనే"

"దట్స్ నైస్. నేను మెడ్రాస్ కి కొత్త. పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా శ్రీరంగంలో. మా నాన్నకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చింది. నువ్వు ఏ గ్రూప్? నేను మ్యాత్స్, ఫిజిక్స్, కెమిస్ట్రి, బయాలజి."

"నేనూ సేమ్ గ్రూప్. డాక్టర్ అయిపోదామనా?"

"అలా ఏం ఫిక్స్ అవ్వలేదు. మెడిసిన్ దొరికితే డాక్టర్, ఇంజనీరింగ్ దొరికితే ఇంజనీర్. అందుకే ఈ గ్రూప్ తీసుకున్నాను" అంది.

మళ్ళీ గేట్ చప్పుడు వినబడింది. పువ్వులను చూస్తూ మాట్లాడుకుంటున్న మేము తలెత్తి చూశాము. ఈ సారి చప్పుడు మా గేట్ ది కాదు. ఎదిరింటి గేట్ ది.

"నాన్న ఆఫీసునుండి వచ్చారు. నేను మళ్ళీ వస్తాను" అని వేగంగా మా గేట్ కి చిలుకైనా వెయ్యకుండా వెళ్ళిపోయింది. నేనెళ్ళి  గేట్ ని దగ్గరికి లాగి చిలుకుపెట్టాను. ఈ సారి చప్పుడు విని అమ్మ బయటకు వచ్చింది.

"ఎవరొచ్చార్రా"

"ఆ కృష్ణాంతిమం పువ్వు వచ్చెళ్ళింది" అని ఇందాకాపుకున్న నవ్వుని ఇప్పుడు కంటిన్యూ చేశాను.

"ఆ పువ్వు ఏంటో కనుక్కున్నావ్రా?"

నేను నవ్వుతూనే, "అది కృష్ణాంతిమం కాదమ్మా. క్రిశాంతిమం! అంటే చామంతి, బంతి, డెయ్సీ పూవులట" అన్నాను.

"అవునా?" మా అమ్మ ముఖంలో ఓ పెద్ద అసంతృప్తి. "ఆ అమ్మాయి పేరేమిటట?"

"అడగలేదు! క్రిశాంతిమం గురించే మాట్లాడాము. పేరు తనూ చెప్పలేదు; నేనూ అడగలేదు. ఏముందిలే! ఆ పిల్లకి క్రిశాంతిమం అన్న పేరే బాగా నప్పుతుంది; దానికే ఫిక్స్ అయిపోదాం" అన్నాను.

* * *

మరుసటి రోజు పొద్దున వచ్చింది.

"నీ పేరేంటి"

"సారీ! నిన్న ఉన్నట్టుండి వెళ్ళిపోయాను. నా పేరు మెర్సి"

"Mercy! క్రిష్టీయన్ పేర్లా ఉందే? మీరు క్రిష్టియన్సా?"

"కాదు, హిందువులమే. మా నాన్నకి ఆ పేరంటే ఇష్టమని నాకు పెట్టారు"

"మెర్సి - నైస్ నేమ్" అన్నాను.

"నీకు గార్డెనింగ్ ఇష్టమా?"

"మా అమ్మకు ఇష్టం" అన్నాను.

"ఎన్ని వెరైటీస్ ఉన్నాయో!"

"ఇంకా ఉన్నాయి చూద్దువురా" అని ఇంటికి దక్షిణంలో ఉన్న పూల మొక్కల్ని చూపించాను.

"రియల్లీ నైస్" అంది.

"ఇంటి వెనుకాల ఇంకా ఉన్నాయి. ఇలా దాటగలవా? లేకుంటే అటువైపునుండి వెళ్దాం" కాంపుండ్ గోడకీ ఇంటి గోడకీ మధ్య గుబురుగా వాలిపోయున్న కాగితపుపూల(బోగన్-విల్లా) చెట్టు కొమ్మలను చూపించి అడిగాను.

"ఓ యెస్; దాటేయగలను" అంది.

కింద వంగి అటువైపుకెళ్ళి "ఈ కొమ్మల్లో ముళ్ళుంటాయి జాగ్రత్తగా వంగి రా" అని తన చేయి పట్టి దాటించాను.

యింటి వెనకనున్న కూరగాయల మొక్కల్నీ, గోడపక్కనున్న కొబ్బరి మాన్లనీ, జామ చెట్లనీ, మామిడి మాన్లనీ, మునగ చెట్లూ చూసి

"మీ ఇంటి వెనుక కూడా ఇంత పెద్ద గార్డనుందా? ఎంత బాగుందో!" అని మరోసారి ఆశ్చర్యంగా ముఖం పెట్టింది.

"చూసేవాళ్ళకు బానే ఉంటుంది; నీళ్ళు పట్టే వాళ్ళకు కదా కష్టాలు!" అన్నాను.

"ఈ సారి నీళ్ళు పట్టేప్పుడు నాకు చెప్పు; నేను వచ్చి హెల్ప్ చేస్తా" అంటూ మావిడి మాను కొమ్మకు కట్టియున్న పీట ఊయలలో కూర్చోబోయింది.

"ఉయ్యాలూగకు. మామిడి కాయలు రాలిపోతాయు" అని ఆపాను. పైకి చూసింది. చివరి విడత కాయలు ఇంకా మాన్లోనే ఉన్నాయి.

"అర్రే! నాకది కోసివ్వవా?" అంది.

గోడకు ఆనించున్న దోటందుకుని తను చూపించిన మావిడి కాయని కోసాను. కిందపడిపోకుండా మామిడి కాయని పట్టుకుంది.

మావిడికాయ తింటూ అన్ని చెట్లూ చూసుకుంటూ ఇంటిముందుకొచ్చేశాము.

"ఇంటి వెనక్కు మనం ఇటువైపునుండి వెళ్ళుండాల్సింది కదా?" మోచేయి తడుముకుంటూ. ఇందాక కాగితాలపూల కొమ్మ గీసుకుందేమో!

"అరే ముల్లేమైనా తగిలిందా? సారీ...  నీకు కొత్తకదా...! అసలైతే అందరూ ఇలానే వెళ్తారు. నేను మాత్రమే అదో అడ్వెంచర్ లాగా కాగితపుపూల కొమ్మల్ని దాటెళ్తాను" అన్నాను.

ఇంతలో వాకిట్లోకి ఆటో వచ్చాగింది. సావిత్రవ్వకి ఆరోగ్యం బాగలేదని చూడ్టానికి అమ్మా నాన్న వెళ్ళారు. అమ్మని ఆటో ఎక్కించి నాన్న ఆఫీసుకెళ్ళినట్టున్నారు. రెండు బ్యాగులు తీసుకుని అమ్మ ఆటో దిగింది. వెళ్ళి పెద్ద బ్యాగ్ తీసుకున్నాను. మెర్సి అమ్మను పలకరించింది.

వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వంట గదిలోకెళ్ళిపోయారు. నేను డాబా మీదుండే నా స్టడీ రూంకెళ్ళి లైబ్రరీకి రిటర్న్ ఇవ్వాల్సిన పుస్తకాలు తీసుకుని సైకిలెక్కి లైబ్రరీ దారి పట్టాను.

* * *

స్కూల్ కి సైకిల్ వేసుకుని  వెళ్ళేవాణ్ణి. మెర్సీ కూడా అంతే. స్కూల్స్ వేరే అయినా క్లాసూ, గ్రూపు ఒకటే కావడంతో మాకు మాట్లాడుకోవడానికి బోలెడు విషయాలుండేవి. ఒకోసారి ఇద్దరమూ ఒకే సమయంలో బయల్దేరేవాళ్ళం స్కూల్ కి. మాట్లాడుకుంటూ వెళ్ళి, మా స్కూల్ రాగానే నేను సెలవు తీసుకునేవాణ్ణి. సాయంత్రాల్లోనూ తను వచ్చేంతవరకు మా స్కూల్ గేట్ దగ్గరే వెయిట్ చేసేవాణ్ణి. తనొచ్చాక ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇంటికొచ్చేవాళ్ళం. ఒక రోజు స్కూల్ కి వెళ్తుండగా మా స్కూల్ దగ్గర్లో తన సైకిల్ పంక్చర్ అయిపోయింది. తన సైకిల్ మా స్కూల్లో పెట్టేసి నా సైకిల్లో తనని వదిలిపెట్టి మళ్ళీ సాయంత్రం స్కూల్ అయిపోగానే వెళ్ళి తనని సైకిల్ మీద తీసుకొచ్చి, సైకిల్ కి పంచర్ సరిచేయించుకుని వచ్చాము. ఇద్దరం బాగా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం.

సాయంత్రం వచ్చి చామంతి, తురకచామంతి, డెయ్సీ మొక్కల్లో ఉన్న పువ్వులను మునివేళ్ళతో స్పృశించేది. "అంత ఆశగా ఉంటే ఆ పువ్వులు కోసుకోవచ్చుగా?" అని ఎంత చెప్పినా ఒక బంతిపూవునైనా కోసుకునేది కాదు. "ఏ పువ్వునైనా కోసుకుంటానుగానీ క్రిశాంతిమాల్ని మాత్రం కోయను. వీటిని మొక్కల్లోనే ఆస్వాదించాలి. కోస్తే మొక్క ఎంత బోడిగా కనుబడుతుందో" అని అంటూండేది. అమ్మ కూడా ఈ పిల్ల మాటలకు ప్రభావితురాలై ఈ పువ్వులను మినహాయించి మిగిలిన పువ్వులతో మాత్రమే మాలలుకట్టేది.

క్రిశాంతిమం ఆస్వాదించడమయ్యాక కొంతసేపు డాబాపైన కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. పాఠాల్లో ఏవైనా సందేహాలుంటే పరస్పరం క్లారిఫై చేసుకునేవాళ్ళం. తను మా ఊరికి కొత్తకాబట్టి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏమైనా పుస్తకాలవీ కొనుక్కోవాలన్నా నేను తోడుగా వెళ్ళేవాణ్ణి.

నేను శని, ఆదివారాల్లోనూ, సెలవురోజుల్లోనూ మొక్కలకి నీళ్ళు పట్టేవాణ్ణి. మొక్కలకి నీళ్ళు పట్టేంతసేపూ నాతోనే ఉండి నీళ్ళు పడుతూ, హోస్-పైప్ లాగుతూ, మోటర్ ఆన్ చేస్తూ అని ఇలా ఏదో ఒకరకంగా సాయం చేస్తూ ఉండేది. తనవల్ల నాక్కూడా కొంత గార్డెనింగ్ ఇంట్రస్ట్ కలిగిందన్నదే నిజం. ఖాళీ సమయాల్లో అమ్మకు సాయంగా మేమిద్దరం పాదులు తవ్వడం, ఎరువు పెట్టడం వంటివి కూడా చేసేవాళ్ళం.

నేను అబ్బాయి, తను అమ్మాయి అన్న భేదం అసలు ఉండేదికాదు మా స్నేహంలో.  అంత చక్కని స్నేహం! వాళ్ళ అమ్మా మా అమ్మా కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు.

మా మీనాక్షక్కతో కూడా బాగా కలిసిపోయింది మెర్సి! అక్క యింటికొచ్చినప్పుడు మెర్సీ ఎక్కువ సమయం మా యింట్లోనే గడిపేది. నా మేనల్లుడు, కార్తీక్‌ను ఆడిస్తూ, స్నానం చేయిస్తూ బాగా కాలక్షేపం అయ్యేది తనకి. అక్కా, మెర్సీ కలిసి సాయంత్రంపూట పువ్వుల మాలలు కట్టేవాళ్ళు. ఒకటిరెండు సార్లు పువ్వులు కట్టడం నాకు నేర్పించే ప్రయత్నాలుకూడా చేశారు; అదేంటో పువ్వులు కట్టడం నాకు అబ్బలేదు.

ఇద్దరూ కలిసి చదువుకోవడంవల్లనో ఏమో మాకు పరీక్షల్లో మార్కులుకూడా ఇంచుమించు ఒకేలా వచ్చేవి. అందువల్ల ఎవరు ఎక్కవ, ఎవరు తక్కువ అన్న పోటీకూడా ఉండేది కాదు. +1 పూర్తయింది; విడిగా సబ్జెక్ట్‌లలో ఒకట్రెండు మార్కులు తేడా వచ్చాయి కానీ ఇద్దరికీ టోటల్ మార్కులు ఒకటే.

పై చదువులకు +2 మార్కులే ముఖ్యం గనుక మరింత శ్రద్ధగా చదువుకోవాలని నిర్ణయించుకున్నాము. సాయంత్రాల్లో ఎక్కువసేపు కలిసి చదువుకునేవాళ్ళం. నాకు బొమ్మలుగీయడం అంత చక్కగా రాదు. నా రికార్డు నోట్స్‌లలో బొమ్మలన్నీ తనచేత గీయించుకునేవాణ్ణి. పరీక్షలవ్వగానే ఎంట్రన్స్ టెస్ట్ కోచింగ్ కి ఎక్కడ జాయిన్ అవ్వాలో అని రిసర్చ్ చేసి ఒక ఇన్స్‌టిట్యూట్ లో జాయిన్ అయ్యాము. ఈ ఇన్స్‌టిట్యూట్ సైకిల్లో వెళ్ళేంత దగ్గర కాదు; లోకల్ ట్రైన్ లో 20 నిముషాలు వెళ్ళాలి. ఇద్దరం కలిసి వెళ్ళొచ్చాము. ప్రవేశ పరీక్షలు కూడా పూర్తయ్యాయి.

ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న రోజులవి. వాళ్ళింటికెవరో బంధువులొచ్చారు. మధ్యాహ్న సమయాన నేను ఎప్పట్లాగానే మిద్దె మీదున్న పూల మొక్కలకి హోస్-పైప్ తో నీళ్ళు పడుతున్నాను. కిందనుండి "సూర్యా" అన్న పిలుపు వినబడగానే పిట్టగోడదగ్గరకొచ్చి కిందకి చూశాను. చేతిలో ఉన్న హోస్-పైప్ లో నీళ్ళు మెట్ల మీద వస్తున్న మెర్సీ మీద పడ్డాయి. నేను తేఱుకునేలోపే మెర్సీ సగం తడిసిపోయింది పాపం. పైపు వదిలేసి కొలాయి కట్టేశాను. తను పైకి రాగానే,

"సారీ, మెర్సీ! చూళ్ళేదు. ఐయాం ఎక్స్‌ట్రీమ్లీ సారీ" అని చెప్తూనే టవల్ కొరకు వెళ్ళాను.

"పరవాలేదు, సూర్యా! ఐ అండర్‌స్టేండ్. నువ్వు కావాలని పొయ్యలేదుగా" అంది.

నేను టవల్ తెచ్చి కంగారు కంగారుగా తడిచిన తనని తుడవడం మొదలుపెట్టాను. ఒకటి రెండు క్షణాలు పట్టింది నేను ఇలా తుడవకూడదని తెలుసుకోడానికి! తనలా నిలిచిపోయింది. నేను టవల్ తన చేతికిచ్చి దూరంగా వచ్చేశాను.

కాసేపటికి శుభ్రంగా తుడుచుకుని నా దగ్గరకొచ్చింది. బాధగా సారీ ఫీలింగ్‌తో తలవంచుకు కూర్చున్న నా చుబుకం పట్టుకుని, "ఇప్పుడేం కొంపలంటుకున్నాయని ఇలా కూర్చున్నావు?"

"ఐయాం సారీ, మెర్సీ"

"సూర్యా, సారీలు చెప్పడం ఆపు. నేను వెళ్తున్నాను. మళ్ళీ సాయంత్రం వస్తాను. మామూలుగా ఉండు" అని వెళ్ళిపోయింది.

* * *

ఆ రోజు రాలేదు. మరుసటి రోజొచ్చింది. బంధువులు ఉన్నారు కాబట్టి నిన్న రాలేదని చెప్పింది. బంధువులు వెళ్ళిపోయాక ఎప్పట్లాగే వచ్చేది మా యింటికి. వచ్చినా మా ఇద్దరి మధ్య ముందున్న ఆ క్లోజ్‌నెస్ లేదు. ఏదో ఒక అడ్డుగోడపడిందన్నట్టు అనిపించింది. బయటికి బానే ఉన్నట్టున్నా లోపల మదిలో ఏదో మార్పులొచ్చాయన్నది ఇద్దరికీ తెలుస్తూనే ఉంది. ఒకరితో ఒకరం ముందులా అలమరికలు లేకుండా మాట్లాడుకోలేకున్నాము; నేను అబ్బాయి, తను అమ్మాయి అన్న తేడా బహుశా మాకు అర్థమైందనుకుంటా! అలాగని ఒకరినొకరు అవాయిడ్ చేసుకోవాలనీ అనుకోలేదు. ముందులానే ఉండే ప్రయత్నాలు చేస్తున్నాము. 

పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఇంచుమించు ఇద్దరికీ మార్కులు ఒకేలా వచ్చాయి. ప్రవేశ పరీక్షల ఫలితాలూ వచ్చాయి. 

మార్కులు చూస్తే ఎంబీబీఎస్ కి తక్కువ ఇంజినీరింగ్ కి ఎక్కవ అన్నట్టు వచ్చాయి. బీ.ఫార్మసి సీట్ కూడా వస్తుంది. లాంగ్ టర్మ్ తీసుకుని ఇంకో ఏడు వెయిట్ చేస్తే నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తుందనిపించింది. అయితే నాన్న ఇంజినీరింగ్ అని నిర్ణయించారు.

నాన్నతోబాటు ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ సెంటర్‌కు  వెళ్ళాను. మెడ్రాస్‌లోనే మంచి కాలేజీలో ఇంజినీరింగ్ సీట్ వస్తుంది నా మార్కులకి. మా నాన్నకి ఏమనిపించిందో ఏమో కోయంబత్తూర్ లోని టాప్ కాలేజ్ లో సీట్ ఎన్నుకోమన్నారు. "మెడ్రాస్ కాలేజీలోనే చేరతానని" కౌన్సిలింగ్ సెన్టర్ లో అక్కడికక్కడ నాన్నతో వాదించి నెగ్గలేనని అర్థమైంది. ఆయన చెప్తే దానికి మారుమాట్లాడకూడదు అంతే. ఇదివరకెప్పుడూ కూడా మాట్లాడలేదు. కోయంబత్తూర్ కాలేజీకొరకు అడ్మిషన్ లెటర్ తీసుకున్నాము. 

ఇంటికొచ్చేప్పుడు కార్లో ముందు సీట్లో ఆయన పక్కన కూర్చోవాలనిపించలేదు. వెనక సీట్లో కూర్చుని ఏడుస్తూ వచ్చాను. ఇంటికొచ్చాక అమ్మ సపోర్ట్ తో నాన్నతో గొడవపడాలనిపించింది! నన్ను మెడ్రాస్ నుండి ప్లాన్ చేసి కోయంబత్తూర్‌లో జాయిన్ చేయించారని అమ్మతో చెప్పి ఏడ్చాను. ఇప్పుడున్నంతగా సెల్‌ఫోన్ లూ, వీడీయో చాటింగ్‌లూ లేని రోజులవి. ఇంతవరకు ఎప్పుడూ ఇల్లు వదిలి దూరంగా వారం రోజులైనా ఉండలేదు. అలాంటిది నెలలు తరబడి దూరంగా ఉండి చదువుకోవాలంటే ఎలా? అమ్మ ఏమాత్రమూ బాధపడుతున్నట్టు అనిపించడంలేదు. "నీ చదువు కోసమే కదా నాన్నా? నాలుగేళ్ళే కదా? మధ్యలో సెలవులకి వస్తూనే ఉంటావు కదా?" అంటుంది అమ్మ. అమ్మకూడా నాకు సపోర్టివ్ గా లేదని అర్థమైంది. రెండురోజులు ఏమీ తోచలేదు.

మెర్సీ వాళ్ళ ఇంటికెళ్ళాను. కౌన్సిలింగ్‌లో మెర్సీ వాళ్ళ నాన్న మేడ్రాస్ లోనే బీ.ఫార్మసి సీట్ ఎన్నుకున్నారట; తనకి బీ.ఫార్మసి ఇష్టమే అని చెప్పింది.

నేను కోయంబత్తూర్ బయలుదేరేరోజు మెర్సీ, మెర్సీ వాళ్ళ అమ్మా, నాన్నా వచ్చి బాగా చదువుకోమన్నారు. అక్కా, బావా రైల్వే స్టేషన్ వరకూ వచ్చి సాగనంపారు. నాన్న ఎందుకిలా చేశారని అక్కనడిగాను. తనకి కూడా అంతుచిక్కలేదన్న విషయం అర్థమైంది. అడిగి కనుక్కోమన్నాను. కనుక్కుంటానంది.

సెలవులకి మెడ్రాస్ వచ్చినప్పుడు ఎప్పట్లాగే నేనున్నన్ని రోజులు మెర్సీ మా ఇంటికి వచ్చేది. నా కాలేజీ కబుర్లూ, తన కాలేజీ కబుర్లతో సెలవురోజులు వేగంగా గడిచిపోయేవి! 

ఒక సారి ఫైనల్-యియర్ లో సెలవులకొచ్చినప్పుడు అక్క నాతో

"నాకెందుకో ఈ మెర్సీ క్రిశాంతిమం పువ్వుల కోసం రావట్లేదనిపిస్తుంది రా"

నేను వినిపించుకోనట్టు మాటమార్చేశాను.

ఆ రోజు సాయంత్రం మెర్సీ ఇంటికి వచ్చినప్పుడు అడిగాను, "మెర్సీ, నేను లేనప్పుడు నువ్వు క్రిశాంతిమం పువ్వులకోసం రావట్లేదా మా యింటికి?"

"మొదట్లో ఇక్కడికొచ్చినప్పుడు క్రిశాంతిమం పువ్వులకోసమే వచ్చేదాన్ని మీ ఇంటికి. ఇప్పుడు మాత్రం నీకోసమే వస్తున్నాను. నువ్వులేనప్పుడు రోజూ ఇక్కడికి రావాలనిపించడంలేదు, సూర్యా. నువ్వున్నప్పుడే ఆ పువ్వులను చూడాలనిపిస్తుంది."  మెల్లిగా చెప్పింది మెర్సి.

రెండురోజుల్లో మళ్ళీ కోయంబత్తూర్ ప్రయాణం. మొదటిసారి కోయంబత్తూర్ వెళ్ళినప్పటికన్నా ఎక్కువ బాధగా ఉంది ఇప్పుడు. రైల్వే స్టేషన్ లో బావ అడిగారు. 

"సూర్యా, ఎందుకు డల్ గా ఉన్నావు? వాట్స్ గొయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్?"

"ఏమీ లేదు, బావా"

"ఏమీ లేకపోతే ఆల్‌రైట్. ఏమైనా ఉంటే మాత్రం మేము హెల్ప్ చెయ్యగలమనిపిస్తే చెప్పు. చెప్పకుంటే ఎవరికి మాత్రం ఎలా తెలుస్తుంది నీ బాధ?"


నేనేమీ మాట్లాడలేదు. ట్రైన్ కదిలింది.

* * *

[ పదేళ్ళ తర్వాత ]

"నాన్నా, నిద్రలే!! నీకో సర్ప్‌రైజ్ చూపించాలి" 

"ఏంటమ్మా? ఆదివారంపూటకూడా తొందరగా లేవాలా? కాసేపు పడుకోనివ్వు."

"నా సర్ప్‌రైజ్ ఏంటో చూసొచ్చి మళ్ళీ నిద్రపోదువు రా నాన్నా" 

లేచి వెళ్తే బాల్కనీలో చిన్న ప్లాస్టిక్ పూల కుండీలో పూచిన ఓ డెయ్సీ పూల మొక్కని తన మొహానికి దగ్గరగా పెట్టుకుని,

"నాన్నా, ఎలా ఉంది?"

"క్రిశాంతిమంలా ఉంది"

"అయ్యో నాన్నా నీకేం తెలియదు! ఎలా ఉందంటే బాగుందనో, నచ్చిందనో, థ్యాంక్యూ అనో అనాలికానీ; క్రిశాంతిమాన్ని క్రిశాంతిమంలా  ఉందంటారా ఎవరైనా?"

"పూవు పూసిన రోజు నాన్నకి గిఫ్ట్ గా ఇవ్వాలని నెల రోజులుగా ఆ మొక్కని నీ కంటపడకుండా పెంచింది నీ కూతురు" అని వెనకనుండి వచ్చి నా భుజం మీద తలవాల్చి నన్ను హత్తుకుంది మెర్సి.

"నాన్నా, మనం ఇండియా వెళ్ళిపోదాం. అక్కడ నాన్నమ్మ గార్డెన్ లో బోలెడన్ని క్రిశాంతిమాలున్నాయి. ముందులా నాన్నమ్మ ఇప్పుడు గార్డెనింగ్ చెయ్యలేకపోతుందట. నిన్న చాటింగ్ లో చెప్పింది. పాపం కదా నాన్నమ్మ! మనం ఇండియా వెళ్ళిపోతే నేను నాన్నమ్మ కి హెల్ప్ చేస్తాను"  అంటూ నా చిన్నారి తల్లి క్రిశాంతిమం కుండీ నాకందించింది.


-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

  చామంతి / Chrysanthemum indicum
డెయ్సీ పూలు / Daisy Flowers
తురకచామంతి / బంతి

కాగితపు పూలు / Bougan villa

27 మార్చి 2012

What to Expect "నవ మాసాల కష్టాలు" - భర్త కోణంలో... - భాగం 2

ఏ తల్లి తండ్రయినా తమకు పుట్టబోయే శిశువుమీద 2-3 నెలలనుండే అనుబంధం పెంచుకుంటూ, కలలుకంటూ ఉంటారు. తీక్ష్ణమైన వాంతులతో(Hyperemesis gravidarum) బాధపడుతున్న మేము మొదట నాలుగు నెలలవరకు (16-17 వారాలు)  శిశువుతో పెద్దగా కనెక్ట్ అవ్వలేదు! కన్నీళ్ళ నడుమ కలలేం కంటాం? 


వాంతులు తగ్గకపోయినా వాటికి అలవాటు పడటంమూలంగా అప్పుడప్పుడే మెల్లగా మా శిశువుతో అనుబంధం పెంచుకోడం మొదలుపెట్టాము. Anomaly scanning చేసిన రేడియాలజిస్ట్, అన్ని అవయవాలనూ స్కాన్ చేసి అన్ని బాగున్నాయని చెప్తూ, హృదయంలో చిన్న ఇష్యూ ఉందన్నారు. Ventricular Septal Defect (VSD)అన్నారు. వినగానే కలవరపడిపోయాము. ఇది చాలా సహజం అనీ, మరో రెండు వారాల్లో Fetal Echo (స్కాన్) చేసి చూస్తే ఈ హోల్ ఉండకపోయే అవకాశాలూ ఉన్నాయనీ చెప్పారు. ఒకవేళ Fetal Echo లో కూడా హోల్ ఉందని చెప్పినా భయపడనక్కర్లేదనీ, ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ సహాయంతో వాటికి సులభమైన చికిత్సలు ఉన్నాయనీ అవసరమైనంత counselling ఇచ్చారు. 


బాధపడనక్కర్లేదన్నప్పుడు ఆ విషయం రేడియాలజిస్ట్ మాకు చెప్పకుండా ఉండియుండచ్చుగా అన్న మీ సందేహం మాకూ కలిగింది. మేము అడగకముందే, VSD విషయం ఎందుకు చెప్తున్నారో, ఎందుకు counselling ఇస్తున్నారోకూడా చెప్పారు. "ఈ రిపోర్ట్ మీరు ఇంటికి తీసుకెళ్తారు; రిపోర్ట్ చదువుతారు. అందులో VSD డీటెయిల్స్ చూసి ఇంటర్నెట్లో వెతికి సగంసగం జ్ఞానంతో మథనపడతారు. అందుకే నేనే అన్నీ చెప్పేస్తున్నాను. విషయంతో పాటు అవసరమైనంత counselling కూడా ఇస్తున్నాని" క్లియర్ గా తేల్చారు. ఇలా చెప్పడం నాకు బాగా నచ్చింది. మరుసటి రోజు ఆ రిపోర్ట్ తో గైనక్ ని కలిస్తే సరైన సలహాలిస్తారు, నిశ్చింతగా వెళ్ళిరమ్మన్నారు. ఆ క్షణాల్లో కొంత సంతృప్తికరంగానే అనిపించినా, గైనకి ని కలిసేందుకు ఇంకా దాదాపు పదహారు గంటల సమయం ఉంది. ఆ రోజు మాకిద్దరికీ అసలు ఏమీ తోచలేదు! అన్నం తినబుద్ధిపుట్టలేదు; నిద్రపోలేదు.


మరుసటి రోజు అందరికన్నా ముందెళ్ళిపోయాము. గైనకాలజిస్ట్ ని కలిశాము. VSD గురించి బొమ్మలు అవి గీసి మాకు ఎక్స్‌ప్లేన్ చేశారు - రెండు వారాలు ఆగి Fetal Echography చేయిస్తే అది నిజంగా సమస్యో కాదో తెలుస్తుందిట. ప్రస్తుతం ఉన్న రిపోర్ట్ ప్రకారం అసలు అది సమస్యే కాకపోవచ్చు - రెండు వారాల్లో అదే కన్‌ఫార్మ్ అవ్వచ్చన్నారు. ఒకవేళ సమస్య అయినా, నిశ్చింతగా ఉండమన్నారు. చికిత్సలు సులువైయ్యాయి, అందుబాటులోనే experts ఉన్నారని కూడా ధైర్యం చెప్పారు. 


ఇంటికి వచ్చాక ఈ విషయమే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేది ఆష. ఇప్పుడు VSD మీద రిసర్చ్ మొదలుపెట్టింది. నాకు మాత్రం ఎటువంటి భయమూ, బాధా లేక ధైర్యంగానే ఉన్నాను. అయినా తను బాధపడుతుండటంవల్ల కొంత కలవరపడుతూనే ఉన్నాను. నేను ధైర్యం చెప్పినప్పుడు బాగనే ఉండేదీ! మళ్ళీ తను ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చేది. 


"మనకే ఎందుకు ఇలా?" అని వాపోయేది ఆష.
"మనకెందుకు జరగకూడదు? మనమేంటి గొప్ప? ప్రతిసారి కష్టమొచ్చినప్పుడూ మనం ఇంకా కాస్త ధర్యవంతులవుతాము; మెచ్యూరిటి వస్తుంది. మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని ఇలా జరుగుతుంది అనుకో. ఇలాంటివాటికి చికిత్సలు లభించే టెక్నాలజీ యుగంలో ఉన్నందుకూ, ఆ చికిత్సలను భరించే ఆర్ధికస్తోమతా కలిగుయున్నందుకు ఆనందించు", అని నేను ధైర్యం చెప్పేవాణ్ణి.

"మనం అందర్లా దేవుణ్ణి పూజించం కదా? అందుకే దేవుడు ఇలా పాఠం నేర్పుతున్నాడేమో!" అనేది మళ్ళీ.

"ఏ దేవుడూ నన్ను నిత్యం పూజిస్తూ ఉండు. నాకు అది చేయి; నీకు ఈ మేలు చేస్తానని చెప్పడు. మనమేంటో ఆయనకు తెలుసు. తెలిసి ఎవరికీ ఎటువంటి హానీ చెయ్యలేదు; వీలైనప్పుడల్లా మంచే చేస్తున్నాం - ప్రతిఫలం గూర్చి ఆలోచించకుండనే! నువ్వు నిశ్చింతగా ఉండు." అని చెప్పేవాణ్ణి.
"అందరి పిల్లలూ బాగా హ్యాపీగా ఆడుతూ, పాడుతూ ఉంటే మన బిడ్డ మాత్రం అలా మూలకూర్చోవాలేమో కదా?" అని విలపించేది.
ఇలా బాధపడుతున్న ఆష ని చూసి మాత్రం నాకు కొంత కంగారు కలిగేది. ఈ విషయం మా ఇంట్లోగానీ, వాళ్ళ ఇంట్లోగానీ ఎవరికీ చెప్పలేదు; చెప్పి వాళ్ళను కూడా బాధపెట్టడం ఇష్టంలేక ఊరుకున్నాము.

రెండు వారాల తర్వాత Fetal Echo చేస్తే అన్నీ నార్మల్ గా ఉంటాయని నాకు బాగా అనిపించేది. అయితే ఈ రెండు వారాలు ఆష ని ఎలా ధైర్యంగా ఉండమని చెప్పాలో తెలియక తికమకపడ్డాను. మరో హాస్పిటల్ కి తీసుకెళ్ళి ఇంకో డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ చెప్పిద్దాం అనుకుంటుండగానే బ్లాగర్ మానస చామర్తి వాళ్ళ అక్కయ్య గారు రేడియాలొజిస్ట్ అని తెలిసింది. అక్కయ్యతో మాట్లాడటం కుదురుతుందా అని అడిగితే ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడమన్నారు (మానస కి విషయం చెప్పలేదు)

డాక్టర్ మాధవి చామర్తి గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆమె చాలా నెమ్మదిగా, ఆప్యాయతగా, ఒక కుటుంబ సభ్యురాలిలా మా రేడియాలజిస్టూ, గైనకాలజిస్టూ చెప్పిన విషయాన్నే చెప్పారు. మాకు కొంత ధైర్యం కలిగింది. 

రేపు  Fetal Echo కి వెళ్ళాలనగా ఇవాళ రాత్రి ఆష కి పొట్టలో విపరీతమైన నొప్పి మొదలైంది; లైట్ గా ఫీవర్ వచ్చింది. రాత్రంతా ఏదోలా మేనేజ్ చేసి, ఉదయం గైనిక్ దగ్గరకెళ్ళాము. ఆమె యూరిన్ ఇన్‌ఫెక్షన్ అయుండచ్చని యూరిన్ సాంపిల్స్ తీసుకుని టెంప్రరీ రిలీఫ్ కోసం ట్యాప్లెట్స్ ఇచ్చి Fetal Echo సెంటర్కి వెళ్ళి రమ్మన్నారు(మేము ఎంచుకున్న సెంటర్లో అపాయింట్మెంట్ అంత ఈజీగా దొరకదు అందువల్ల తీసుకున్న అపాయింట్మెంట్ సమయానికి వెళ్ళక తప్పలేదు). దారిలో రెండుమూడు సార్లు వాంతులయ్యాయి. కార్లో ఎప్పుడూ ప్లాస్టిక్ కవర్లు రెడిగా పెట్టుకునేవాళ్ళం. కవర్ తీసుకునేలోపే వామిట్ వచ్చేసింది. కార్ పక్కకి ఆపి వెనక సీట్లో కూర్చోమని; ముందర సీట్ క్లీన్ చేసి ఎలాగోలా Bangalore Fetal Medicine సెంటర్ చేరుకున్నాము. 

డాక్టర్ వీణ ఆచార్య గారు రిపోర్ట్‌లవి చూసి, Echo మొదలుపెట్టారు. మాలాంటి వారిని ఎంతోమందిని చూసుంటారు కదా? శిశువు బాగా కదులుతూ ఉంది, very active baby అన్నారు. శిశువు హార్ట్‌ని స్కాన్ చేసి 100% Alright అన్నారు :-) మాకు మిక్కిలి సంతోషం. శిశువుయొక్క మిగిలిన అవయవాలు, తల ఎంత పరిమాణంలో ఉంది, లివర్, లంగ్స్ ఫార్మేషన్ ఎలా ఉంది వంటివి స్కానింగ్ స్క్రీన్ లో చూపించారు. "చూడండి, మీ బేబి 'హాయ్' చెప్తోంది" అని చేతుల కదలికనూ, ఎన్ని వేళ్ళున్నాయనీ కవుంట్ చేయమంటూ, ఇలా బాగా ఇంట్రాక్టివ్గా ముగించారు స్కానింగ్. మేము ఫుల్ హ్యాపీ :-)
పొట్ట నొప్పి మళ్ళీ మొదలైంది. సాయంత్రం Fetal Echo రిపోర్ట్‌లు అవి పట్టుకుని మా డాక్టర్ దగ్గరకెళ్ళాము. చూసి సంతోషించారు. యూరిన్ ఇన్ఫెక్షన్ వల్లవచ్చిన పొట్టనొప్పికి ట్రీట్మెంట్ మెదలుపెట్టారు. మళ్ళీ అడ్మిట్ అయ్యాము. రెండు రోజులు హాస్పిటల్ లో ఉండి వచ్చాము.

మనిషి ఆరోగ్యానికి గాలీ, నీరూ, ఆహారమూ ముఖ్యం కదా? ఇందులో ఏది తగ్గినా సమస్యే. ఈ VSD గురించి తప్ప మరో ద్యాసలేక అవసరమైనంత నీళ్ళు తాగకపోవడంవల్లో లేక Fibroid వల్లో నొప్పి వచ్చింది! సో, కారణాలేమున్నా ప్రెగ్నెన్సీ టైంలో మామూలుగా తాగడంకంటే ఎక్కువ నీళ్ళు తాగాలి.

ఆరోనెల మొదలైనా వాంతులైతే తగ్గలేదు. రెగ్యులర్ చెకప్పులకు వెళ్ళొస్తూ ఉన్నాము. ప్రతి స్కానింగ్లోనూ Expected Delivery Date predict చేస్తారు. March మొదటవారమో, లేకుంటే ఫెబ్రవరి చివరి వారమో డెలివెరి కావచ్చు అని డేట్ ప్రెడిక్ట్ చేశారు. డెలివెరికి ఆషని  వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పారు మా అత్త-మామలు. ఆషకి వెళ్ళడం ఇష్టంలేదు; నాకూ పంపించడం ఇష్టంలేదు. పైగా హెల్త్ కూడా అలాగే ఉండేది. డెలివెరి రోజు వరకు వాంతులయ్యాయి. పెరగాల్సినంత వెయిట్ పెరగలేదు. అందుకని ఏదేమైనా వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాము.

ఏడో నెలనుండి పొట్టలో పెరుగుతున్న పాపకి రోజూ ఒక పంచతంత్రం కథో, పిట్ట కథో చెప్పేవణ్ణి. అదో సరదా. ఇద్దరికీ పాపే కావాలన్న కాంక్షవలనేమో మాకు పాపే పుడుతుందని డిసైడ్ అయిపోయాము. "మీను" అని పేరుపెట్టుకున్నాము.  మా సాయంత్రాలంతా మీను కబుర్లే, మీను కలలే, మీను ఊహలే!
ఏడో నెల చివర్లో పొట్టమీదా చేతులమీదా Rash లాగా వచ్చింది. ఇదికూడా కొందరికే వస్తుందట. దీన్ని PUPPP అంటారట. ఈ ర్యాషస్ విపరీతమైన దురద కలుగజేస్తుంది! 
 
ఉన్న కష్టాలు సరిపోదనక, మరో ప్రషర్ కూడా యాడ్ అయింది.  బంధువులు శ్రీమంతం చెయ్యాలన్నారు. కాదని స్ట్రిక్ట్‌గా చెప్పేశాము. రోజూ ఏదో ఒక సమస్య ఉంటుంటే సంబరాలు చేసుకునే మైండ్‌సెట్ ఉండదు కదా? 

డెలివెరికీ వాళ్ళ ఇంటికి రాలేదనికూడా వాళ్ళ నాన్నా, బాబాయ్ లు కొంత unhappy!

మనపనులు మనమే చేసుకోవాలి, పనులుచేయించుకోడానికోసం తల్లి-తండ్రులను వాడుకోకూడదన్నది మా పాలిసి. వాళ్ళంతట వాళ్ళేవచ్చి మనతో ఉంటే పరవాలేదుగానీ, మనకు అవసరంగనుక వాళ్ళని రమ్మని పిలవడంకూడా సరికాదనేది మా ఉద్దేశం. 

ఇల్లు తుడవడానికి మాత్రం పనిమనిషి ఉండేది మాకు. మిగిలినవన్నీ మేమే చేసుకునేవాళ్ళం. పనిమనిషిచేత గిన్నెలవి కడిగించడం, వంటలు చేయించడం ఇష్టం ఉండేది కాదు మాకు. అప్పుడనంగానే మా ఆఫీసులో కొంత రిసోర్స్ షార్టేజ్ వచ్చింది. నేను ఆఫీసులో మరింత ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోక తప్పలేదు. చాలా సమయం ఆఫీసులోనే సరిపోయేది. ఇంట్లో పనీ, ఆఫీసులో పనీ! నేను ఇంట్లో ఉండే టైం తక్కువైంది! తనొక్కత్తే ఇంట్లో ఉండటం నన్ను కలవరపెట్టేది. అయినా తప్పలేదు. ఫుల్ టైం(ఉదయం తొమ్మిదినుండి సాయంత్రం ఐదు వరకు) పనిమనిషిని పెట్టుకుంటే పగలంతా ఇంట్లో ఒక మనిషి తోడుంటుంది కదా అని పని మనిషిని చేర్చుకున్నాము. 

మా అదృష్టంకొద్ది ఆ పనామె వంటలవి బ్రహ్మాండంగా చేసేది. ఆ అదృష్టం నెల్రోజులే! సడన్గా ఒకరోజు పనికి రాలేదు; ఆరోగ్యం బాలేదని. పదిరోజులైనా ఆ పనామె ఆరోగ్యం కుదటపడలేదట. సంక్రాంతి పండుగ వస్తుందని తమ్ముళ్ళ సాయంతో ఇల్లు క్లీనింగ్, మాపింగ్ చేసింది. అలవాటు తప్పాక ఈ పనులు చెయ్యడంవల్లో, డస్ట్ వల్లో జ్వరం, జలుబు, దగ్గు వచ్చింది. ప్రతిపూటా వంటలవి చేసేందుకు కుదరక బయటనుండి భోజనం తెచ్చేవాణ్ణి. పనులెక్కువయ్యేసరికి నాకు బాగా frustaration అనిపించింది. పండగ తర్వాత రావలన్న ప్లాన్ లో ఉన్న మా అత్తయ్యని వెంటనే పంపించారు మా మావయ్య.

ప్రెగ్నెన్సీ టైంలో స్ట్రాంగ్ మందులులివ్వలేరుకదా?. డాక్టరిచ్చిన మైల్డ్ ట్యాబ్లెట్స్ తో జ్వరం, జలుబు తగ్గిందిగానీ, దగ్గు తగ్గలేదు. మామూలుగానే దగ్గు నరకం. ఇక ప్రెగ్నెంట్ గా ఉన్నవారి పరిస్థితి చెప్పాలా? వాంతులూ+దగ్గు. ఎప్పుడు మార్చ్ వస్తుందా అని రోజులు లెక్కపెట్టేవాళ్ళం. అత్తయ్యగారున్నారు కదా అని ఇంటి పనంతా ఆమెతో చెయించలేం కదా?  ఆ పాత పనామె రాలేనని చెప్పి వేరే వాళ్ళను చూసుకోమన్నారు. మరో పదిరోజులకు కొత్త పనామె దొరికారు. 

జనవరి గడిచిపోయింది! హమ్మయ్యా ఇంక ఒక నెలేలే అనుకుని ఆనందించాము. ఈ శుక్రవారం షాపింగ్ కి వెళ్ళి పుట్టబోయే బిడ్డకు కావలసినవి, హాస్పిటల్ కి తీసుకెళ్ళవలసిన బట్టలు, టవల్లు అవి కొని ప్యాక్ చేసి బ్యాగ్ లో రెడీగా పెట్టుకుందాం అనుకున్నాము. గురువారం రాత్రి రోజూలా మీనుకి కథలు, మీనూ కబుర్లూ చెప్పుకుంటుండగా, "మనమేమో ఇలా అమ్మాయని ఫిక్స్ అయిపోయాము! ఒక వేళ అబ్బాయి పుడితే ఎలా రిసీవ్ చేసుకుంటాం? అలా ఫిక్స్ అవ్వడం కరెక్ట్ కాదు" అని డిస్కస్ చేసుకునాము.

మరుసటి రోజు(ఫెబ్రవరి 3) ఉదయం ఏడింటికి వాటర్ బ్యాగ్(ఉమ్మ నీరు) బ్రేక్ అయ్యి ఉంటుందని అనుమానం కలిగి, డాక్టర్ కి ఫోన్ చేస్తే వెంటనే హాస్పిటల్ కి వెళ్ళండి నేనూ వస్తానని చెప్పారు. 40 వారాలకు వాటర్ బ్రేక్ అయితే పరవాలేదుకానీ, 36 వారలకు బ్రేక్ అయితే ఏమవుతుంది?  కంగారు కంగారుగా హాస్పిటల్ కి వెళ్ళాము, డ్యూటీ డాక్టర్ పరిక్షించి ఏం ప్రాబ్లం లేదన్నారు. మా డాక్టర్ లలిత సుధ గారొచ్చి చెక్-అప్ చేసి వాటర్ బ్రేక్ అయిందని కన్ఫర్మ్ చేశారు. స్కానింగ్ చేసి చూశారు. అమినో ఫ్లూయిడ్ లెవల్ తగ్గుతున్నట్టు తెలిసింది. "హెడ్ పొసిషన్ కరెక్ట్ గా ఉంది,  pains induce చేసి సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం నార్మల్ డెలివెరి అయితే వెల్ అండ్ గుడ్ లేకుంటే సిసేరియన్ చెయ్యాల్సుంటుంది" అన్నారు.

ఈ లోపు ఆష వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి రమ్మన్నాను. మెడ్రాస్ కీ, తిరుపతికీ ఫోన్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన విషయం చెప్పాను. మా కజిన్ సుజాత కి ఫోన్ చేసి హాస్పిటల్ కి రమ్మన్నాను - తనొచ్చాక షాపుకెళ్ళి కావలసినవి కొనుక్కొచ్చాము. 

రాత్రి 8 వరకు అన్ని రకాలుగానూ మానిటర్ చేస్తూ వచ్చారు ఆష ని. పెయిన్స్ రాకపోవడంతో ఆపెరేషన్ కి సిద్ధం చేశారు. 8:20 కి ఆపెరేషన్ థియేటర్ కి తీసుకెళ్ళారు. కరెక్ట్ గా పదిహేను నిముషాల్లో ఆపరేషన్ ముగించి బిడ్డను మాత్రం బయటికి తీసుకొచ్చారు.బాబు! మరో పదిహేను నిమిషాల్లో ఆషని తీసుకొచ్చారు. డాక్టర్ లలిత గారూ, ఆమె ఫ్రెండ్ డాక్టర్ కవిత గారూ ఆపెరేషన్ చేశారు.


ఇక పైన  విశేషాలను కిందటి లింక్ లో (కొన్నాళ్ళ తరువాత చదవగలరు).
http://avinenichinnu.blogspot.in/


Our sincere thanks to -
Dr. Lalitha Sudha Alaparthi
Dr. Kavitha Kovi
Dr. Ravikiran S
Dr. Koutilya Chowdary Maddineni
Dr. Veena Acharya
Dr. Madhavi Chamarthi
And
All our friends and family members who helped us during the tough times.

22 ఫిబ్రవరి 2012

What to Expect "నవ మాసాల కష్టాలు" - భర్త కోణంలో...

భాగం -  1

ముఖ్య గమనిక / Disclaimer :ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యలకు వైద్యసలహాలివ్వడం కాదు ఈ టపా ఉద్దేశం. ప్రెగ్నెన్సీలో సమస్యలు సహజమే అనీ; వాటిని ఎదుర్కొనండి అనీ ధైర్యం చెప్పడం మాత్రమే.

దైవంకన్నా తల్లే గొప్ప అని ఎందుకంటారో అర్థం కావాలంటే తొమ్మిది నెలలు మోసి బిడ్డను కనాలి; లేకుంటే నవమాసాలు మోస్తున్న ఓ తల్లిని దగ్గరుండి చూడాలి. మా ఆవిడ గత తెమ్మిది నెలలుగా మోసింది; నేను దగ్గరుండి నావల్ల అయినంతవరకు తనని చూసుకున్నాను. ఆ అనుభవాలే యీ పోస్ట్. దీనివల్ల ఎవరికి ఉపయోగం అంటారా? మేము ఎదుర్కొన్న కొన్ని సమస్యలు మాకు కొత్త; అయితే, అవన్నీ గర్భకాలంలో సహజం అన్న విషయం స్వయంగా అనుభవించి తెలుసుకున్నాము. మీరు భవిష్యత్తులో ఇలాంటివి ఎదుర్కిన్నప్పుడు ఉపయోగపడచ్ని రాస్తున్నాను.

ప్రెగ్నెన్సి కన్ఫర్మ్ అవ్వగానే ఎంచుకోవలసినవి రెండు 
అ) డాక్టర్ (గైనకాలజిస్ట్ - Gynecologist) - పోస్ట్‌లో ముందుముందు "గైనక్" అని రాస్తాను
ఆ) హాస్పిటల్

మాకు ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే హాస్పిటల్ దగ్గరగా ఉండాలి; గైనక్ మంచి పేరుగలవారయ్యుండాలి. దగ్గరగా ఉన్న మంచి హాస్పిటల్ ని వెతికి ఎంచుకున్నాము - యషోమతి హాస్పిటల్ (Yashomati Hospitals). అందులో గైనకాలజిస్ట్‌లు ఎవరున్నారో, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమిటో అని హాస్పిటల్ వెబ్‌సైట్ లో చూశాము. లిస్ట్‌లో ఉన్నవారిలో ఇద్దరు ఇన్-హౌస్ డాక్టర్స్ మిగిలినవారు కన్సల్టింగ్. ఇద్దరిలో మేము "డాక్టర్ లలిత సుధ" [Dr. Lalitha Sudha A, MBBS, MS, MRCOG (UK)] గారిని ఎంచుకున్నాము. లలిత అన్న పేరు మాకు బాగా నచ్చింది. సాక్షాత్తు అమ్మవారి పేరు కదా? ఇంత గుడ్డిగా ఎవరూ డాక్టర్ని ఎంచుకోరనుకోండి! అయినా మేం చేశాము.

విషయం తెలియగానే మా కజిన్(cousin) సుజాత "What To Expect" అన్న పుస్తకం పంపించి చదువుకోమంది. వీలున్నప్పుడూ, అవసరమైనప్పుడూ చదువుకున్నాము. ప్రెగ్నెన్సీ సమయంలో ఉపయోగకరమైన పుస్తకం ఇది.

మొదటిసారి గైనక్ దగ్గరికి వెళ్ళాం. గైనక్ తో మొదటి కన్సల్టింగ్ అవ్వగానే ఆవిడ మీద మాకు కలిగిన అభిప్రాయం....
  • బాగా స్ట్రిక్ట్ గా ఉంటారు
  • చదువుకునే రోజుల్లో ఈవిడ క్లాస్ ఫస్ట్ అమ్మాయయ్యుంటారు
  • సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ
  • అనవసరంగా మాట్లాడరు
మొదటి పాయింట్ తప్ప మిగిలినవన్నీ కరెక్టే అని కొన్నాళ్ళకే తెలిసిపోయింది. అనవసరమైన భయాలేవీ కల్పించలేదు; ఏ స్టేజ్‌లో ఎంత నాలెడ్జ్ అవసరమో అంతే చెప్పారు. మా ప్రశ్నలకి సమాధానాలవి క్రిస్ప్‌గా చెప్పారు. కొన్ని ట్యాబ్లెట్స్ రాసిచ్చారు. ఏడో వారంలో స్కానింగ్(scanning) తీసుకుని రమ్మన్నారు.

రెండువారాలాగి స్కానింగ్ చెయించుకుని రిపోర్ట్ తీసుకెళ్ళాం. రిపోర్ట్స్ చూసి పొట్టలోని శిశువు నార్మల్గా ఉన్నట్టు చెప్పారు - మొదటి స్కాన్ లో ముఖ్యంగా చూసేది హార్ట్-బీట్, ఒక శిశువా, ట్విన్సా, ట్రిప్లెట్సా లాంటివి. ఒక షాకింగ్ విషయం కూడా  చెప్పారు - గర్భసంచిలో ఫైబ్రాయ్డ్(Fibroid) ఉందని. ఫైబ్రాయ్డ్ వల్ల ఏమీ ఇబ్బందులు లేవని ధైర్యం చెప్పారు - అయితే కొంతమందికి ప్రెగ్నన్సీతోబాటు ఈ ఫైబ్రాయ్డ్ కూడా పెరుగుతుందట. అలా పెరిగితే పొట్టలో నొప్పి కలగవచ్చట - ఫైబ్రాయ్డ్ పెరుగుతుందో, ఇప్పుడున్నంతే ఉంటుందో తరువాయి స్కానింగ్లో తెలుస్తుందని చెప్పారు. అదో సమస్య కాదన్నప్పటికీ ఆష కి కొంత భయంగానే ఉండేది ఫైబ్రాయ్డ్ గురించి - ఎంత చెప్పినా వినకుండ బోలెడన్ని ఆర్టికల్స్ చదివేసేది ఫైబ్రాయ్డ్ మీద. [ఈ విసిట్లో తెలిసిన మరో విషయం డాక్టర్ తెలుగు వారేనని; చక్కగా తెలుగులోనే మాట్లాడారు. అఫ్‌కోర్స్ భాష ఒక ఇదే కాకపోయినా - అనారోగ్యమొచ్చినప్పుడు డాక్టర్లు మన మాతృభాషలో ధైర్యం చెప్తే ఎంతబలం వస్తుందో చెప్పలేం! అదో సౌకర్యం, అంతే]

వాంతులు అవ్వచ్చు అని హెచ్చరించారు; మార్నింగ్ సిక్నెస్(morning sickness & Nausea) ఉంటుంది Doxinate వేసుకోమని చెప్పారు. వాంతులెక్కువ వస్తే Emeset వేసుకోమని చెప్పారు. గైనక్ సూచించినట్టు వామిట్స్ ఏమీలేదుకదా అని మేము Emeset ట్యాబ్లెట్ కొనుక్కోలేదు. పట్టించుకోలేదు; అది ఎంత తప్పో తర్వాత రెండ్రోజులకే అర్థమైంది. 

ఆ రోజు సాయంత్రం నేనొక పార్టీకి వెళ్ళాను; పార్టీ ముగించుకుని నడిరేయిదాటి ఇంటికొచ్చేసరికి సాయంత్రం ఎనిమిదినుండి నాలుగైదుసార్లు వాంతులుచేసి నీరసపడి పడుకుంది ఆష. ఫోనైనా చెయ్యలేదు - నేను పార్టీనుండి త్వరగా  వచ్చేస్తానని. అదృష్టం బాగుండి అప్పుడు అష వాళ్ళ పెద్దమ్మ మా ఇంట్లోనే ఉన్నారు. ఆమెకు తెలిసిన కొన్ని ఇంటి వైద్యాలు చేశారు వామిట్ తగ్గించేందుకు; ఏంలాభంలేదు! అప్పటికప్పుడు మెడికల్ షాపులెతుక్కుంటూ వెళ్ళాను. గైనక్ ఫోన్ నెంబర్ కూడా లేదు. ఉన్నా ఆ సమయంలో చెయ్యొచ్చో కూడదో... మన డాక్టర్ కౌటిల్య (పాకవేదం బ్లాగర్) కి ఫోన్ చేస్తే తనుకూడా ఎమిసెట్(Emeset) నాలుగు ఎంజి ట్యాబ్లెట్ వేసుకోమన్నాడు. గంటలో వాంతులు, కడుపులో తిప్పడాలు అవి తగ్గి ప్రశాంతంగా పవళించింది. 

మరుసటి రోజు గైనక్ దగ్గరకెళ్ళి జరిగిన విషయం కంగారు కంగారుగా చెప్పాము. ఆమె ఏ మాత్రమూ ముఖకవళికలు మార్చుకోకుండా వామిటింగ్ ఎక్కువగా ఉంటేమాత్రం "Emeset" వేసుకోవచ్చు; ఏం పర్వాలేదన్నారు. మిగితాప్పుడు రోజూ ఉదయమూ, సాయంత్రమూ డాక్సినేట్(మార్నింగ్ సిక్నెస్) ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పారు. 

తర్వాత ఒకవారం రోజులు, రోజుకు ఒకసారో రెండు సార్లో వామిట్ అయ్యేది.  ఒకరోజు మాత్రం ఎక్కువ సార్లు వామిటింగ్స్ అయ్యాయి; Emeset వేసుకున్నా తగ్గలేదు. పైగా తిన్న ఆహారమంతా వామిట్ అయిపోగా చివరికి రక్తం వస్తోంది వాంతి చేస్తుంటే. ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇంటర్నెట్లో వెతికాను ఎందుకిలా ఉందో అని; బోలెడు డేటా ఉంది. ఏ డేటా మనకు ఉపయోగకరమో ఎలా తెలుసుతుంది? కౌటిల్యకి ఫోన్ చేశాను. Retching  వల్ల ఇలా వామిట్లో ఎర్రగా రక్తం రావడం మామూలే అన్నాడు. మామూలైనా ఎలా ఊరుకోగలం? ఇక లాభంలేదనుకుని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. కార్నుండి లిఫ్ట్ వరకు కూడా నడవలేకపోయింది! వీల్‌ఛెయిర్ పిలిచి తీసుకెళ్ళాను. ఏం భయపడకండి నేను చూసుకుంటానుగా అనే ఎక్స్‌ప్రెషన్‌ తో మా గైనక్ ప్రసన్నమయ్యారు. వాంతుల ప్రభావంతో నీరసపడియున్న ఆష పల్స్ అవి చూసి నాలుగు మాటలు మాట్లాడేసరికి అష కి కొంత ధైర్యం వచ్చింది. వంట్లో అసలు శక్తిలేదుగనుక అడ్మిట్ చేయమన్నారు. ఇరవైనాలుగు గంటలు సలైన్ అవి ఇచ్చి అబ్జర్వేషన్లో పెట్టారు.

హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిన విషయం వాళ్ళ ఇంటికి గానీ, మా ఇంటికిగానీ చెప్పలేదు; చెప్తే భయపడిపోతారని. అంత దూరంనుండి ఊరికే కంగారుపడుతూ వెంటనే టిక్కెట్లు దొరక్క ఇబ్బందులు పడిపోయి వచ్చేస్తారని ఊరుకున్నాను. బెంగుళూరిలోనే ఉన్న మా బావమరిదికి(ఆష వాళ్ళ తమ్ముడికి) మాత్రం రమ్మని ఫోన్ చేశాను. 

ప్రెగ్నెన్సీలో వాంతులు సహజమే అయినా అతికొందరికి మాత్రం తీక్ష్ణమైన రీతిలో(సివియర్గా) వాంతులవుతాయని గైనిక్ వివరణలిచ్చారు. దీన్ని మెడికల్ టెర్మ్స్ లో Hyperemesis gravidarum అంటారట. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండ ఉండాలని సలైన్ ఇస్తే సరిపోతుందట. మూడోనెల దాటాక తగ్గిపోతాయనీ అంతవరకు ఆహార విషయాల్లో జగ్రత్తలు తీసుకోమన్నారు. బాగుంది అని నమ్మకం కలిగాక డిస్చార్జ్ అయ్యాము.

నిజానికి ఈ వాంతులు/వేవిళ్ళు సినిమాలో చూపించేంత ఆనందకరమైన విషయాలు కావు. ఒక్కోసారి వామిట్ అయినప్పుడూ ఎంత హైడ్రోక్లోరిక్ యాసిడ్ (HCL) ఫుడ్ పైప్(గొట్టం) ద్వారా వస్తుందో; ఫుడ్ పైప్, గొంతూ అంతా మంట కలిగిస్తుంది ఈ యాసిడ్. వామిట్ చేస్తున్నప్పుడు తనని చూస్తే నాకు కళ్ళలో నీళ్ళు తిరిగేవి; నేను బాధ పడటం చూస్తే తనింకా నీరసపడిపోతుందేమో అని కంట్రేల్ చేసుకునేవాణ్ణి! రోజుకు రెండుమూడు సార్లు క్రమం తప్పక వామిట్స్ చేసేది. ఈ వాంతుల ప్రభావంవల్ల ఆ మూణ్ణెల్లలో దాదాపు ఆఱేడు కేజీల తగ్గిపోయింది :-( ఇలా చిక్కిపోతే పొట్టలో శిశువుకు ఏమవుతుందో అని ఆందోళనపడేవాళ్ళం. మొదట మూణ్ణెల్లు బరువు తగ్గడంవల్ల ఏమీ నష్టంలేదని గైనక్ ధైర్యం చెప్పారు.

మామూలుగా ప్రెగ్నెన్సీ సమయంలో ఏవైనా పుల్లగా తినాలని ఇష్టపడతారు. తనకెందుకో ఏదీ తినేందుకే ఇష్టం ఉండేదికాదు. పుల్లనివి అసలు నచ్చలేదు. వంటలవి చెయ్యలేకపోయేది. అన్నం ఉడికే వాసనవస్తేనే కడుపులో తిప్పేసేది! ఉదయం ఆఫీసుకు వెళ్ళేలోపు కూరలవి చేసేవాణ్ణి. పదకొండుగంటలకు బియ్యం కడిగి నానబెట్టమని, పన్నిండు గంటలకళ్ళా ఆఫీసునుండొచ్చి కుక్కర్లో అన్నం పెట్టి కూరలు వేడి చేసేవాణ్ణి. ఫోన్ చేరువలోనే పెట్టుకోమని చెప్పి ఆఫీస్కి వెళ్ళేవాణ్ణి. నాకు ఆఫీసు ఐదు నిముషాల దూరం కావడంవల్ల అవసరమైనప్పుడు ఇంటికి వచ్చేసౌకర్యం ఉండేది. మధ్యమధ్యలో ఫోన్ చేసేవణ్ణి ఎలా ఉంది అని; ఒక్కోసారి ఫోన్ తీయకుంటే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవాణ్ణి. వచ్చే ఈ ఐదునిముషాల్లో ఏవోవో ఊహించుకుంటూ - అయినా నా భయాలేమీ తనకి చేప్పేవాణ్ణి కాదనుకోండి. నా రూంలో చిందవందరగా ఉన్న పుస్తకాలను సర్దేందుకో, బట్టలు మడిచిపెట్టేందుకో పైకేమైనా వెళ్ళి మెట్లమీదనో; వామిట్ ఎక్కువయ్యి నీరసపడి వాష్బేసిస్ దగ్గరో కళ్ళుతిరిగేమైనా పడిపోయిందా? అని రకరకాలుగా ఆలోచించుకుంటూ వచ్చి హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న తనని చూస్తే ప్రాణం వచ్చేది. ఫోన్ తీయనందుకు కొంచం సన్నగా కోపపడేవాణ్ణి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను లేనప్పుడు పైన రూమ్స్ కి వెళ్ళొద్దు అని గట్టిగానే చెప్పేవాణ్ణి. వీలున్నప్పుడెల్లా ఆఫీసుకెళ్ళకుండా ఇంటినుండే వర్క్ చేసేవాణ్ణి.

మూణ్ణెళ్ళు గడిచినా వామిట్స్ మాత్రం తగ్గడంలేదు. వెయిట్ తగ్గిపోతూ ఉంది. నిజంగా ఈ ప్రెగ్నెన్సీ అవసరమా మనకి అని కూడా చాలాసార్లు ఆవేదనపడ్డాం. అయినా నేను మాత్రం "This too shall pass" అని ధైర్యం చెప్తుండేవాణ్ణి. నిజానికి అదేకదా జరుగుతుంది? ఏ సమస్యా శాశ్వతం కాదు కదా? "ఈ వాంతులు తగ్గిపోతే చాలు; గండం గట్టెక్కినట్టే" అంటుండేది ఆష.

డిస్చార్జ్ అయి వచ్చిన వారంలో మరోసారి వాంతుల ఉగ్రత ఎక్కువయింది. అప్పుడు వాళ్ళ అమ్మ ఉన్నారు మాయింట్లో. మళ్ళీ హాస్పిటల్‌ లో అడ్మిట్ అవ్వవలసివచ్చింది. మా అమ్మా, వదినా వచ్చారు. ఈ సారి నాలుగురోజులుకు పైగానే ఉన్నాము. నాలుగు రోజులున్నా హాస్పిటల్లో ఉంటున్నామన్న ఫీలింగే కలగలేదు. హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్లు అందరుకూడా బాగా చూసుకున్నారు. 

మా అమ్మ ఒక నెల రోజులు మాతోనే ఉన్నారు, అష ని చూసుకోడానికి. 20 వారలప్పుడు ఒక స్కానింగ్ ఉంటుంది. ఈ స్కానింగ్‌లో శిశువు పెరుగుదల, మిగిలిన ఆర్గన్స్ యొక్క పెరుగుదల వంటివి కొన్ని తెలుస్తాయి. ఈ స్కానింగ్ మొదలుపెట్టగానే రేడియాలజిస్ట్ ఒక శుభవార్త చెప్పాడు, కిందటి స్కానింగ్‌లో చెప్పిన ఫైబ్రాయ్డ్(Fibroid) పెరగలేదు అదే పరిమాణంలో ఉంది అని. స్కానింగ్ అయ్యాక మరొక షాకింగ్ విషయంకూడా చెప్పాడు శిశువుకి Ventricular Septal Defect (VSD) సస్పెక్ట్ చేస్తున్నట్టు - అంటే హృదయంలో ఓ చిన్న రంధ్రం ఉండచ్చేమోనని!

హార్ట్‌లో హోల్  ముందు వామిట్ సమస్య అసలు సమస్యగానే తోచలేదు మాకు. మథనపడటానికి మరో పెద్ద సమస్య వచ్చేసిందిగా? ఈ సమయంలో మా మనసుల్లో ఎంత బాధ ఉండియుంటుందో కదా?
కష్టం వస్తేనే కద గుండెబలం తెలిసేది?
దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది?  
అన్న 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి గారి మాటలే మాకు ఓదార్పునిచ్చాయి.

-- తరువాయు భాగం ఇక్కడ చదవండి
http://paravallu.blogspot.in/2012/03/what-to-expect-2.html

=====================================================
Search Words : Pregnancy,  Hyperemesis gravidarum, Ventricular Septal Defect, Dr.Lalitha Sudha Alaparthi