24 జనవరి 2023

వెంబడించిన కారు - అనువాద కథ - రచన: సుజాత

రచన: సుజాత

రచనా కాలం: 1992

  

ఏ బుద్ధుడో, యేసో పుట్టిన రోజు అయితే మానవాళి పోకడనే మార్చేసింది కాబట్టి పండగలా జరుపుకోవచ్చు. నాలాంటి వాడు పుట్టినరోజుపండుగ జరుపుకోవడంలో ప్రయోజనమేముంది? కాబట్టి, ఆ రోజు పుట్టినరోజు అని గుర్తొస్తే గుడికి వెళ్తాను. ఆరోజున వెంకటేశ్వరస్వామి పేరిట అర్చన చేయిస్తుంది నా ఇల్లాలు. అంతే. ఇంతకంటే ఏ ఊళ్ళోనూ ఏ వయసులోనూ పుట్టినరోజంటూ ప్రత్యేకంగా చేసింది ఏమీలేదు. కారణం, ఒక సంవత్సరం పాటు చావకుండా మనగడ సాగించడమన్నది అన్ని రకాల వైజ్ఞానిక వైద్య సదుపాయాలూ అందుబాటులో ఉండే ఈ ఆధునిక యుగంలో అంత గొప్ప విషయం అని నాకు అనిపించడంలేదు. వ్యాధుల్ని మనసులో దాచుకోకుండా వ్యక్తపరచగలిగితే పరిహారాలు కోకొల్లలుగా అలోపథిలో ఉన్నాయి. 

 

ఆదిమానవుడిగా ఉంటే అ‍డవి మృగాలకు బలికాకుండా,  మరో గణం మనుషులతో వచ్చే తగాదాల్లో తల పగలగొట్టుకోకుండా ఒక యేడు ప్రాణంతో ఉండటం అన్నది పెద్ద సాధనే అని చెప్పొచ్చు. మనం చేసిందేముందనీ! ఆఫీసుకు వెళ్తాం, సినిమా చూస్తాం, రాస్తాం, చదువుతాం, వీపు గొక్కుంటాం, మాట్లాడుతాం, స్నేహం చేస్తాం, జాగ్రత్తగా వారగా ఫుట్‍పాత్ మీద నడుస్తాం. అంతేగా? ఇందులో ఏమి గొప్ప ఉందని? దీన్ని అదేదో ప్రపంచాన్ని తల్లకిందులుగా మార్చేసిన రోజులా ఊహించుకుని నానా గొప్పలు పోవడం అన్నది చాలా అబద్ధంగా అనిపిస్తుంది. పుట్టినరోజు అన్నది మిగిలిన అన్ని రోజుల్లా మరొక రోజు అంతే. 


తిన్నదే తిని కట్టినదే కట్టి 

మళ్లీ మళ్లీ పలికినదే పలికి 

చూచినదే చూచి గడిచిపోయె

యెన్నో అపురూపమైన రోజులు…‌

 

బెంగళూరులో ఒకే ఒక పుట్టినరోజు మాత్రం నాకు స్పష్టంగా గుర్తుంది. ఆరోజు కమర్షియల్ స్ట్రీట్‍లో కారు పార్క్ చేసి, కొంచెం దూరం నడిచి, నేను, భార్య, కొడుకులు వుడ్‍ల్యాండ్స్ హోటల్‍కి వెళ్ళాం. అక్కడ అడై అనబడే అరవ అట్టు మహాద్భుతంగా ఉంటుంది. తినే కార్యక్రమం ముగించాక వాళ్లని హోటల్ వాకిటే ఉండమని చెప్పి నేను మాత్రం కారు తీసుకొద్దామని కారు నిలిపి ఉన్న చోటికి మెల్లగా నడిచాను. 


నా వెనక ఒక కారు నన్నే వెంబడిస్తూ మెల్లగా వచ్చింది. నేను ఆగితే ఆగింది. నడిస్తే పెళ్ళి ఊరేగింపులా అనుసరించింది. నాకు ఏమీ అర్థం కాలేదు. ఏదైనా నేరం చేశానా... ఏం తప్పు చేశాను? ఒక అట్టు మాత్రమే తిన్నాను. ఆ కారు మఫ్టీలో ఉన్న పోలీసు వాళ్ళదా అంటూ ఏవేవో ఆలోచించాను. వేగంగా నడిచాను. వేగంగా వెంబడించింది.


‘ఏంటిది? బెంగళూరు ఎప్పుడు హాలీవుడ్ అయింది?’ అని ఆశ్చర్యపోతూ ఆగాను. ఆ కారు కూడా ఆగింది. ధైర్యాన్ని కూడబలుక్కుని దగ్గరికి వెళ్లి ‘ఎక్స్యూజ్మీ’ అని ఆ నల్లటి కారు కిటికీ గ్లాస్‍ని మణికట్టుతో తట్టాను. కిటికీ అద్దం కిందకు దిగింది.  అతను నల్ల గాగుల్స్ పెట్టుకుని నల్ల చొక్కా వేసుకున్నాడు. 


‘ఎందుకు ఇంత పెద్ద కార్ పెట్టుకుని నడిచి వెళ్లే నన్ను వెంబడిస్తున్నారు?’ అని అడిగేశాను. 


అతను తన జేబులో చేయి పెట్టి ఒక ఒక గన్ తీస్తాడు అనుకున్నాను. సిగరెట్ తీసి ముట్టించుకున్నాడు. ‘మీరు కార్ తీసిన వెంటనే అక్కడ పార్క్ చేయాలని!’ జవాబు ఇచ్చాడు.


బెంగళూరులో ముఖ్యంగా కమర్షియల్ స్ట్రీట్‍లో పార్కింగ్ దొరకడం అంత కష్టం మరి!


 

*  *  *


రచయిత సుజాత గురించి:

సుజాత అన్న కలం పేరుతొ తమిళ సాహిత్య, సినిమా రంగాల్లో ప్రసిద్ధులైన శ్రీ ఎస్ రంగరాజన్ 1935, మే 3న మదరాసులో జన్మించారు. బడి చదువు శ్రీరంగంలోనూ, భౌతిక శాస్త్రం డిగ్రీ తిరుచ్చిలోనూ చదివారు. డిగ్రీలో అబ్దుల్ కలాం, ఈయన సహాధ్యాయుడు. ఆపైన మదరాసు ఎమ్‍ఐటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజినియరింగ్ చదివాక  పద్నాలుగేళ్ళు ఢిల్లీలో కేంద్రప్రభుత్వ ఉద్యోగిగా పని చేశారు. ఆ త్రవాత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో చేరి పలుపదవులు వహించి జెన్రల్ మేనజర్‍గా ఎదిగారు. అక్కడ ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల (ఇవియంల) రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించారు. 

 

కథలు, నవలలు, వ్యాసాలు, సినిమాలు, నాటకాలు, డిటెక్టివ్, సైన్స్-ఫిక్షన్ కథలు, నవలలు అంటూ రెండువందలుకు పైగా పుస్తకాలు రాశారు. తొలినాళ్ళలో కంప్యూటర్‍ జ్ఞాన్ని ప్రజల్లోకి తన రచనల ద్వారా తీసుకెళ్ళారు.  2008, ఫిబ్రవరి 27న కాలం చేశారు.