24 జనవరి 2023

వెంబడించిన కారు - అనువాద కథ - రచన: సుజాత

రచన: సుజాత

రచనా కాలం: 1992

  

ఏ బుద్ధుడో, యేసో పుట్టిన రోజు అయితే మానవాళి పోకడనే మార్చేసింది కాబట్టి పండగలా జరుపుకోవచ్చు. నాలాంటి వాడు పుట్టినరోజుపండుగ జరుపుకోవడంలో ప్రయోజనమేముంది? కాబట్టి, ఆ రోజు పుట్టినరోజు అని గుర్తొస్తే గుడికి వెళ్తాను. ఆరోజున వెంకటేశ్వరస్వామి పేరిట అర్చన చేయిస్తుంది నా ఇల్లాలు. అంతే. ఇంతకంటే ఏ ఊళ్ళోనూ ఏ వయసులోనూ పుట్టినరోజంటూ ప్రత్యేకంగా చేసింది ఏమీలేదు. కారణం, ఒక సంవత్సరం పాటు చావకుండా మనగడ సాగించడమన్నది అన్ని రకాల వైజ్ఞానిక వైద్య సదుపాయాలూ అందుబాటులో ఉండే ఈ ఆధునిక యుగంలో అంత గొప్ప విషయం అని నాకు అనిపించడంలేదు. వ్యాధుల్ని మనసులో దాచుకోకుండా వ్యక్తపరచగలిగితే పరిహారాలు కోకొల్లలుగా అలోపథిలో ఉన్నాయి. 

 

ఆదిమానవుడిగా ఉంటే అ‍డవి మృగాలకు బలికాకుండా,  మరో గణం మనుషులతో వచ్చే తగాదాల్లో తల పగలగొట్టుకోకుండా ఒక యేడు ప్రాణంతో ఉండటం అన్నది పెద్ద సాధనే అని చెప్పొచ్చు. మనం చేసిందేముందనీ! ఆఫీసుకు వెళ్తాం, సినిమా చూస్తాం, రాస్తాం, చదువుతాం, వీపు గొక్కుంటాం, మాట్లాడుతాం, స్నేహం చేస్తాం, జాగ్రత్తగా వారగా ఫుట్‍పాత్ మీద నడుస్తాం. అంతేగా? ఇందులో ఏమి గొప్ప ఉందని? దీన్ని అదేదో ప్రపంచాన్ని తల్లకిందులుగా మార్చేసిన రోజులా ఊహించుకుని నానా గొప్పలు పోవడం అన్నది చాలా అబద్ధంగా అనిపిస్తుంది. పుట్టినరోజు అన్నది మిగిలిన అన్ని రోజుల్లా మరొక రోజు అంతే. 


తిన్నదే తిని కట్టినదే కట్టి 

మళ్లీ మళ్లీ పలికినదే పలికి 

చూచినదే చూచి గడిచిపోయె

యెన్నో అపురూపమైన రోజులు…‌

 

బెంగళూరులో ఒకే ఒక పుట్టినరోజు మాత్రం నాకు స్పష్టంగా గుర్తుంది. ఆరోజు కమర్షియల్ స్ట్రీట్‍లో కారు పార్క్ చేసి, కొంచెం దూరం నడిచి, నేను, భార్య, కొడుకులు వుడ్‍ల్యాండ్స్ హోటల్‍కి వెళ్ళాం. అక్కడ అడై అనబడే అరవ అట్టు మహాద్భుతంగా ఉంటుంది. తినే కార్యక్రమం ముగించాక వాళ్లని హోటల్ వాకిటే ఉండమని చెప్పి నేను మాత్రం కారు తీసుకొద్దామని కారు నిలిపి ఉన్న చోటికి మెల్లగా నడిచాను. 


నా వెనక ఒక కారు నన్నే వెంబడిస్తూ మెల్లగా వచ్చింది. నేను ఆగితే ఆగింది. నడిస్తే పెళ్ళి ఊరేగింపులా అనుసరించింది. నాకు ఏమీ అర్థం కాలేదు. ఏదైనా నేరం చేశానా... ఏం తప్పు చేశాను? ఒక అట్టు మాత్రమే తిన్నాను. ఆ కారు మఫ్టీలో ఉన్న పోలీసు వాళ్ళదా అంటూ ఏవేవో ఆలోచించాను. వేగంగా నడిచాను. వేగంగా వెంబడించింది.


‘ఏంటిది? బెంగళూరు ఎప్పుడు హాలీవుడ్ అయింది?’ అని ఆశ్చర్యపోతూ ఆగాను. ఆ కారు కూడా ఆగింది. ధైర్యాన్ని కూడబలుక్కుని దగ్గరికి వెళ్లి ‘ఎక్స్యూజ్మీ’ అని ఆ నల్లటి కారు కిటికీ గ్లాస్‍ని మణికట్టుతో తట్టాను. కిటికీ అద్దం కిందకు దిగింది.  అతను నల్ల గాగుల్స్ పెట్టుకుని నల్ల చొక్కా వేసుకున్నాడు. 


‘ఎందుకు ఇంత పెద్ద కార్ పెట్టుకుని నడిచి వెళ్లే నన్ను వెంబడిస్తున్నారు?’ అని అడిగేశాను. 


అతను తన జేబులో చేయి పెట్టి ఒక ఒక గన్ తీస్తాడు అనుకున్నాను. సిగరెట్ తీసి ముట్టించుకున్నాడు. ‘మీరు కార్ తీసిన వెంటనే అక్కడ పార్క్ చేయాలని!’ జవాబు ఇచ్చాడు.


బెంగళూరులో ముఖ్యంగా కమర్షియల్ స్ట్రీట్‍లో పార్కింగ్ దొరకడం అంత కష్టం మరి!


 

*  *  *


రచయిత సుజాత గురించి:

సుజాత అన్న కలం పేరుతొ తమిళ సాహిత్య, సినిమా రంగాల్లో ప్రసిద్ధులైన శ్రీ ఎస్ రంగరాజన్ 1935, మే 3న మదరాసులో జన్మించారు. బడి చదువు శ్రీరంగంలోనూ, భౌతిక శాస్త్రం డిగ్రీ తిరుచ్చిలోనూ చదివారు. డిగ్రీలో అబ్దుల్ కలాం, ఈయన సహాధ్యాయుడు. ఆపైన మదరాసు ఎమ్‍ఐటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజినియరింగ్ చదివాక  పద్నాలుగేళ్ళు ఢిల్లీలో కేంద్రప్రభుత్వ ఉద్యోగిగా పని చేశారు. ఆ త్రవాత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో చేరి పలుపదవులు వహించి జెన్రల్ మేనజర్‍గా ఎదిగారు. అక్కడ ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల (ఇవియంల) రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించారు. 

 

కథలు, నవలలు, వ్యాసాలు, సినిమాలు, నాటకాలు, డిటెక్టివ్, సైన్స్-ఫిక్షన్ కథలు, నవలలు అంటూ రెండువందలుకు పైగా పుస్తకాలు రాశారు. తొలినాళ్ళలో కంప్యూటర్‍ జ్ఞాన్ని ప్రజల్లోకి తన రచనల ద్వారా తీసుకెళ్ళారు.  2008, ఫిబ్రవరి 27న కాలం చేశారు. 



 

 

 

11 ఆగస్టు 2022

సొంత డప్పు - మానసిక, శారీరక ఆరోగ్యం!

 Claustrophobia - ఇరుకుస్థలవెరపు - సొంత డప్పు - మానసిక, శారీరక ఆరోగ్యం! 



కొన్ని రోజలు క్రితం కుడి చేతిని కొన్ని కోణాల్లోకి తిప్పినప్పుడు భుజం గూటిలో బుడతంత నొప్పి అనిపించింది. మొదట్లో నొప్పి ఓర్చుకునేంత మేరకే ఉండటంతో పట్టించుకోలేదు. మరో పది పదిహేను రోజులకే చెయ్యి ఎటు కదపినా నొప్పేసింది. ఇక లాభం లేదని వీలైనంతవరకు పనులు తగ్గించుకుని, ఎముకల వైద్యుడి దగ్గరకు వెళ్ళాను. అతను శ్రద్ధగా నా చేతిని కదిపి, కదిలించమని, భుజాన్ని తడిమి, నొక్కి చూసి, కొన్ని ప్రశ్నలు వేశారు. నా వృత్తి, ఇటీవల రోజుల్లో ఏదైనా బరువులెత్తడం, పడిపోవటం వంటివి ఏమైనా జరిగాయా అని అడిగాకు. నాకు గుర్తున్నంతవరకు అలాంటివేమీ చెయ్యలేదు అని అన్నాను. సరేనని ఐదు రోజులకు మందులు రాసి, ఐదారు రోజులు కుడి చేతిమీద భారం, ఒత్తిడి పడకుండా చూసుకోమన్నారు.
మందులు మింగినా నొప్పి మాత్రం అలానే ఉంది. మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ ముందులానేిచ పరిశీలించారు. నొప్పి తగ్గక పోవడంతో MRI (అయస్కాంతానునాద ప్రతిబింబం) తీసుకురమ్మని చెప్పారు.

వైద్య, ఔషధ విషయాల్లో నేను పరమ శుంఠని. పడిశం పట్టినా, జ్వరం వచ్చినా బిళ్ళలు మింగను - అందుకని సైన్సుని నమ్మనని కాదు, బాగానే నమ్ముతాను.  వైద్య శాస్త్రం గత వందేళ్ళుగా ఎంత వేగంగా పరిణామం చెందిందో, ఎన్ని అద్భుతాలను చేస్తోందో! ఒకప్పడు కొన్ని రకాల రోగాలకు, పుళ్ళకు, దెబ్బలకూ డయగ్నోసిస్సు, మందులు, చికిత్సలే లేవు. నొప్పితోనో, రోగాన్నో భరించుతూనో, భరించలేకనో మరణించేవాళ్ళు! కోట్లాదిమంది ప్రాణాలు అర్ధాంతరంగా పోకుండా వాళ్ళ జీవితాలను అర్థవంతం చేసింది ఆధునికి వైద్య విజ్ఞానం.  సైన్సుని ఎంత నమ్ముతానో సృష్టిని కూడా అంతే నమ్ముతాను. చాలావరుకు మన ఒళ్ళు తనను తాను బాగు (Self healing) చేసుకుంటుంది - తగినంత విశ్రాంతి, వ్యవధి ఇవ్వాలంతే. అదే సృష్టి గొప్పతనం అన్నది నా నమ్మకం. అయితే ఇది ప్రతి జబ్బుకూ వర్తించదు. అత్యవసరం అనిపిస్తే మందులు వేసుకుంటాను.

MRI గురించి, దాని విధానం గురించి పాఠ్యాంశంగా చదువుకున్నాను కాబట్టి బాగా తెలుసు. MRI చేయించుకుని రేపు సాయంత్రం వచ్చి చూపిస్తానని చెప్పి వచ్చేశాను. అపాయింట్మెంట్ తీసుకుని మరుసటి రోజు MRI కోసం వెళ్ళాను.  

ప్రాథమిక ప్రశ్నా పత్రం నింపాక, కొన్ని MRI గురించిన వివరాలు చెప్పాడు టెక్నీషియన్. అక్కడ ఇచ్చిన వస్త్రం వేసుకుని యంత్రం ఉన్న గదిలోపలికి వెళ్ళాను. ఒక తుళు భాష సోదరి(నర్స్?) స్ట్రెచ్చర్ పలకం మీద పడుకోమని చెప్పింది. బెల్టులు వేసి గట్టిగా బిగించి, కదలకుండా ఉండండి అని కన్నడంలో చెప్పి ఆ తెల్లటి గొట్టంలోకి (Tunnel) ఆ స్ట్రెచ్చర్ వెళ్ళేందుకు మీట నొక్కింది. నెమ్మదిగా నేను లోపలికి వెళ్తున్నాను.

ముఖానికి పైన ఐదాఱు అంగులాల దూరంలో తెలుపు గొట్టం, తెల్ల వెలుగు తప్ప మరేదీ కనిపించడంలేదు. నరకంలోకి ఆత్మ మాత్రమే ప్రవేశించగలదు అని తెలుసుగానీ పార్థివదేహంతో వెళ్ళడం నాకెలా సాధ్యం! ఏంటీ వింత వింత తెలుపు వర్ణం! ఈ గొట్టంలో ఇలా ఇరుక్కుపోయానేంటి! కదలటానికైనా అవకాశంలేనంత ఇరుకు గొట్టం. లోనికి వెళ్ళానో లేదో నాకు కళ్ళు తిరిగినట్టు, ఊపిరాడనట్టు అనిపించింది. ఎడం చేతికిచ్చిన ఎమర్జెన్సీ బజర్ నొక్కాలన్నది కూడా మరిచిపోయి గట్టిగా కేక పెట్టాను. ‘Mr.Bhaskar, Are you okay?’ అని గాజుగోడకు అవతలినుండి అడిగిన టెక్నీషియన్ గొంతు ఆ ఇరుకు గొట్టం లోపలున్న స్పీకర్‍లో డాల్బీ సౌండ్ సిస్టంలా ఫుల్ వాల్యూంలో ధ్వనించింది. అతనికి జవాబు చెప్తే రెండు సెకండ్లు ఆలస్యం కావచ్చు అన్నట్టు కాళ్ళు చేతులు కదుపుతున్నాను. నన్ను వెనక్కి లాగేయమని గట్టిగానే అరిచాను. సామజభయరక్షణలో విష్ణుమూర్తి చూపినంత వేగంతో మీట నొక్కింది నర్సు. ఐరావతమంలాంటి ఆ యంత్రం మాత్రం సామజ ‘గమనా’న్ని అనుసరిస్తున్నట్టు మెల్లగా నన్ను బయటకు తోసింది.

ఇంత వయసొచ్చిన మనిషిని చిన్న పిల్లవాడిలా భయపడితే పరువుపోతుందన్న స్పృహకూడా లేకపోయింది. ప్రాణంమీద నాకింత తీపుందా అనిపించింది.

MRI ఎలా పని చేస్తుందన్నది తెలుసు, అయితే అందులోకి వెళ్తే భయం కలుగుతుందని అసలు ఊహించలేదు. టెక్నీషియన్ వచ్చి ఓదార్చే రీతిలో నాలుగు మాటలు చెప్పాడు. 'వందమందిలో ఐదుగురికి ఇలాంటి ఇబ్బంది ఉంటుంది సార్. దీన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు. మరేం పరవాలేదు, ఇవాళ వెళ్ళి మైండ్ ని బాగా ప్రిపేర్ చేసుకుని రేపు రండి’ అని అన్నాడు. ప్రాథమిక ప్రశ్నా పత్రంలో క్లాస్ట్రోఫోబియా గురించిన ప్రశ్న ఉంది. నాకు అది లేదు అని టిక్ చేశాను. ఇప్పుడు అది నాకు ఉందని తెలుసుకున్నాను.  

ఒక చిన్న MRI చేయించుకోలేకపోతున్నానా అన్న బాధ మొదలైంది. భుజం నొప్పికంటే ఈ బాధ ఎక్కువగా పీడించ సాగింది. ఈ సమస్య తీవ్రంగా ఉన్నవాళ్ళకి మత్తు మందు ఇచ్చి MRI చేస్తాం అని కూడా చెప్పాడు టెక్నీషియన్. నాకు మత్తు మందులు, పెయిన్ కిల్లర్స్ పడవు - అంటే అవి తీసుకున్నాక నా శారీరక, మానసిక ఆరోగ్యంమీద, ఆలోచనలమీద ప్రభావం చూపిస్తాయి. కొన్నేళ్ళ క్రితం చిన్న శస్త్ర చికిత్సకోసం మత్తు మందిచ్చారు. దాని ప్రభావంనుండి తేరుకోడానికి చాలా కాలమే పట్టింది.

ఆలోచిస్తూ అర్ధగంట అక్కడే కూర్చున్నాను. చెప్పలేనంత బాధతో ఇంటికొచ్చి జరిగింది చెప్తే ఆష నవ్వింది - నమ్మడంలేదు ఇలా జరిగింది అంటే! కాసేపటికి నమ్మింది. ధైర్యం ఇవ్వడానికంటూ తనకు తెలిసిన మాటలు చెప్పంది.  తొలిసారిగా MRI యంత్రం కనుగొన్న రోజునుండి నేను పరాజయంతో వెనుతిరిగి వచ్చిన ఈ క్షణం వరకు ప్రపంచంలో ఎంతమంది MRI లు చేయించుకున్నారన్న లెక్క గూగుల్ చెయ్యకుండానే సరిగ్గా చెప్పి, 'రేపు నీతోపాటు నేనూ వస్తాను తోడుగా' అని అంది. ఈ లోపు మా డాక్టర్ బావ ఫోన్ చేసి, 'పోతే పోన్లే! బోడి భుజం నొప్పికి MRI ఏటికట!  నువ్వు వెళ్ళి physiotherapy చేయించుకో, పదిరోజులు రెస్ట్ తీసుకో' అన్నాడు.

మా అన్నకు, అమ్మకు చెప్పాను. వాళ్ళు వివిధ సందర్భాల్లో  MRI చేయించుకున్నాం అని, అది నేను భయపడుతున్నంత కష్టమేమీ కాదని, మళ్ళీ వెళ్ళమని ధైర్యం చెప్పారు.

ఆరోజంతా ఈ బెంగతోనే గడిచింది. రాత్రి పడుకుంటే కంటికి నిద్రపట్టలేదు. కళ్ళు మూసుకుంటే రెప్పలవెనుక తెల్లటి రంగు. ఇరుకైన తెల్లరాతి గుహలో ఉన్నట్టు, నేను ఊపిరాడక కొట్టుకుంటున్నట్టు విలవిలాడిపోతున్నాను. ఇంటి సీలీంగ్ నా మీద పడిపోయి సఫకేషన్ అనిపిస్తూనే ఉంది. రాత్రి ఎన్ని గంటలు గడిచిపోతున్నా నిద్ర పట్టలేదు. అయితే ఈ విపరీతమైన ఆలోచనలతో నిద్రపోకుండా ఊరకే పడుకుని ఉండటం అసాధ్యం. ఊపిరాడని ఫీలింగ్! పుస్తకం పట్టుకున్నా, పాటలు పెట్టుకున్నా మనసు దేని మీదకీ పోవడంలేదు. మేడమీదకి వెళ్ళి కాసేపు చల్ల గాలి పీల్చుకున్నాను. ఈ ఆకాశం, పాలపుంతలు ఎంత విశాలం! వైశాల్యమే సహజత్వం, స్వాతంత్రం! పరిధిలో ఇరిక్కోవడం కృత్రిమం, నిర్బంధం! భీతి ఆవరించిన ఈ బాధలో అనుకూలమైన తత్వభావాలను అన్వయించుకుని తనను తాను ఓదార్చుకునే పని చేస్తోంది మనసు!

మరుసటి రోజు సతీ సమేతంగా వెళ్ళాము. ఆ స్ట్రెచ్చర్ మీద కట్లేమీ లేకుండా గొట్టంలోకి ఒక సారి వెళ్ళి వస్తాను. నాకు ఆ గొట్టం వాతావరణం కొంచం అలవాటు అవుతుంది అని అడిగితే వాళ్ళు సరేనన్నారు. ఈ సారి మరీ దారుణం - అసలు తల భాగం లోపలికి వెళ్ళిందో లేదో నా వల్ల కాదు అని అపజయాన్ని అంగీకరించుకుని బయటకి వచ్చేశాను.

ఎంత హేతుబద్ధంగా ఆలోచించినా ఎమ్మారై ఎందుకు చేయించుకోలేకపోతున్నానో నాకు జవాబు దొరకడంలేదు. ఇందులో భయపడటానికి ఏమీలేదు. సూది గుచ్చడమో, కొట్టటమో కొయ్యడమే, చేదు మందులు మింగించడమో ఏమీలేదు. సురక్షితమైన వాతావరణం. ఆ మెషిన్ highly computerised, precise to the core. చీకటి గది కూడా కాదు, పక్కనే మాట్లాడిస్తూ మనుషులున్నారు. ఇవన్నీ నా బుర్రకు  బాగా తెలుస్తూనే ఉన్నాయి. మరి తెలిసినా ఎందుకు ఊపిరాడనంతగా భయం కలుగుతోంది? వాటికి సమాధానాలు లేవు అని కాదు! స్ఫష్టంగా అర్థం కాని అన్ని చర్యలకు కూడా విజ్ఞానపరమై కారణాలుంటాయి.  అవి మన జ్ఞానపరిదికి ఇంకా అందలేదంతే.

ఇంటికొచ్చాము. క్లాస్ట్రోఫోబియా పీడనం నా భుజం నొప్పిని చాలా చిన్న గీతగా మార్చేసింది.  నా రాత ఇక ఇంతేనా! నేను ఎప్పటికీ MRI చేయించుకోలేనా! ఓపెన్ MRIలు ఉంటాయని చదివాను. బెంగుళూర్ లో ఉన్న అన్ని ల్యాబులకూ, పెద్ద ఆసుపత్రులకూ ఫోన్లు చేసి అడిగాను. ఎక్కాడా లేవన్నారు. మణిపాల్ ఆస్పత్రి వాళ్ళు మాత్రం కనుక్కుని మళ్ళీ ఫోన్ చేస్తాం అని పెట్టేశారు. కాసేపట్లో ఒకతను ఫోన్ చేసి మా దగ్గరుంది రండి అని అన్నాడు. నేను యంత్రాన్ని చూడందే MRI చేసుకోలేను అని అంటే అలాగేనన్నాడు.

సాయంత్రం వెళ్ళాను. ఆ టెక్నీషియన్ పేరు కళ్యాణ్. చిన్న వయసువాడే, పాతికేళ్ళుంటాయి. బిజీగా MRIలు చేస్తున్నాడు.  ఇది ఓపెన్ MRI యంత్రం కాదు. రెండు సార్లు ప్రయత్నించిన గొట్టపు యంత్రమే. నన్ను తన పక్కనున్న కుర్చీలో కూర్చోమన్నాడు. గాజుగోడకు అవతలున్న MRI గొట్టంలో ఎవరో ఒక చిన్న బాబుకు MRI చేస్తున్నాడు. కళ్యాణ్ కంప్యూటర్ ఆపరేట్ చేస్తూ MRI గురించి వివరిస్తూ, స్క్రీన్ మీద ఇలా ఉంటుంది అని చూపించాడు. ఆ పిల్లాడి స్పైన్ స్క్రీన్ మీద కనబడుతోంది. అయ్యాక మరో బెంగాలీ వృద్ధుడికి MRI చేశాడు.

తర్వాత నన్ను ఆ గరదిలోకి తీసుకెళ్ళి ఆ యంత్రం వెనక, కడి, ఎడమ పక్కల ఎలా ఉందో చూపించాడు. 'మీరు ఇక్కడే చూస్తు ఉండండి. నేను వేడిగా ఒక టీ తాగి వస్తాను' అని పది నిముషాలు తర్వాత వచ్చాడు. పదినిముషాల్లో ఆ వాతావరణానికి కొంచం అలవాటుపడ్డాను. క్లాస్ట్రోఫోబియా గురించి ఎందుకు భయపడనక్కర్లేదో చెప్పడంచేత నాకు ఇప్పడు భయం అనిపించలేదు. ధైర్యం వచ్చింది. నన్ను ఆ స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి, మాట్లాడిస్తూ లోపలికి పంపించి, దగ్గరే ఉంటూ మాట్లాడించాడు. పైకి చూడకుండా, దిండు పెట్టి తలను ముప్పై డిగ్రీలు చాతీ పైపుకు వంచుకోమని, కళ్ళు మరో ముప్పై డిగ్రీలు కిందకి పెట్టుకుని ముందున్న తనకేసి చూడమన్నాడు. మ్యూజిక్ ప్లే చేస్తాను వింటూ ఆహ్లాదకరమైనవి ఆలోచించండి అని చెప్పి తన కంప్యూటర్ దగ్గరకు వెళ్ళిపోయాడు.

ఈ సారి ఆ గొట్టంలో భయం అనిపించలేదు. బాగానే ఊపిరాడింది. సిద్ శ్రీరామ్ పాటలు ప్లే చేశాడు. అవి ఎక్కడంలేదు - కళ్యాణ్ అనే ఈ టెక్నీషియన్ చేసిందేంటి? నా భయం ఏమైంది? అని ఆలోచిస్తూ, ఇంక వేటినో నెమరు వేసుకుంటూ ఉండగానే ఇరవై నిముషాల్లో MRI పూర్తయింది.

కళ్యాణ్‍కు శతవిధాలా కృజ్ఞతలు చెప్పి విజయగర్వంతో బయటకు వచ్చాను. MRI రిపోర్ట్ తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్తే దీర్ఘకాలంగా భుజం మీద పడిన ఒత్తిడివల్ల వచ్చిందన్నారు - కీబోర్డు, మౌసు వాడకం వల్ల. కొన్నాళ్ళు పనులవి తగ్గించుకుని, వారం రోజులు ఫిజియోథెరపీ చేయించుకుని, వీలైనంత విశ్రాంతి తీసుకోమన్నారు.

శారీరక నొప్పులకీ, రోగాలకీ మందులు, మాత్రలు, చికిత్సలు అవసరమైనట్టే మానసిక రోగాలకు కూడా మందులుంటాయి. అవి చాలా వరకు మాటలే. నాకుండిన క్లాస్ట్రోఫోబియా మానసికరోగాన్ని కళ్యాణ్ అనే టెక్నీషియన్ మాటలతో నయం చేశాడు.

అదీ మాటలకున్న పవర్.

ఒక మాట - ముద్దు పెట్టగలదు
ఒక మాట - యుద్ధానికి నాంది పలకగలదు
ఒక మాట - శాంతిమంత్రమవగలదు
ఒక మాట - రోగాన్నివ్వగలదు
ఒక మాట - ఔషధంకాగలదు
ఒక మాట - ఆయుధంకాగలదు
ఒక మాట - డాలుకాగలదు
ఒక మాట - పువ్వులా ఆహ్లాదపరచగలదు
ఒక మాట - ప్రేరణకాగలదు
ఒక మాట - మంత్రమవగలదు
ఒక మాట - దైవంకాగలదు
ఒక మాట - అగ్నిశకలంకాగలదు
ఒక మాట - ప్రేమకాగలదు
ఒక మాట - విషంకాగలదు
ఒక మాట - అమృతంకాగలదు

-----* * * -----


30 జులై 2022

ఎల్లాయి, వెల్లావి, వెళ్ళావి!

 

ఎల్లాయి, వెల్లావి, వెళ్ళావి!

కాలక్రమంలో కొన్ని వస్తువులు, పనులు పాతబడి(Outdated) అనవసరాలుగా మారిపోతాయి. కొన్ని వస్తువల స్థానంలో మరో ఆధునికమైన వస్తువో, పనో, పద్ధతో వచ్చేస్తుంది. అలాంటప్పుడు వాటిని సూచించే మాటలుకూడా కొన్ని కాలక్రమంలో కనుమరుగైపోతాయి. తర్వాత తరాల వాళ్ళకి అవి తెలియకుండాపోతాయి. ఏం చేసినా దీన్ని పెద్దగా ఆపడమో, మార్చడమో వీలు కాదు.

దూర్దర్శన్‍వారి హేమా, రేఖా, జయా, సుష్మాలు రావడానికి మునుపు తెల్ల దోవతులు, దుప్పట్లూ, కోకలు వంటి గుడ్డలు తెల్లగా ఉతకడానికి కెమికల్స్‌తో చేయబడిన డిటెర్జెంట్ పౌడులు అంత విరివిగా వాడేవాళ్ళు కారు. ముఖ్యంగా పల్లెటూళ్ళలో. బట్టలుతికేందుకనే ప్రత్యేకించి కొన్ని కుటుంబాలు ప్రతి ఊళ్ళోనూ ఉండేవాళ్ళు. ఆ మాటకొస్తే పెద్ద పట్టణాల్లోకూడా ఉండేవాళ్ళు - ఇప్పటికీ వాళ్ళు అక్కడ ఉండినందుకు, బట్టలు ఉతికినందుకూ ఆనవాళ్ళుగా ఆ ఏరియా పేర్లనుబట్టి తెలుసుకోవచ్చు - చాకలిపేట, వణ్ణారపేట, మడివాలా ఇలాంటివి.

ఊర్లో అందరి ఇళ్ళల్లోనూ మాసిన బట్టలూ తీసుకుని ఊరి బయున్న చెరువుకో, కాలువకో వెళ్ళి తెల్లగా ఉతికి తెచ్చిచ్చేవాళ్ళు. వాళ్ళు రసాయనలతో చెయ్యబడిని డిటెర్జెంట్లూ వాడేవాళ్ళు కారు - అప్పట్లో అవి లేవు కూడా. చవుడు (చౌడు) మట్టే మొట్ట మొదట వాడబడిన డిటెర్జెంట్ - దీన్ని జీరో పొల్యూటింగ్ డిటెర్జెంట్ అనొచ్చు. చవుడుమట్టిలో సహజంగానే కొన్ని లవణాలుుంటాయి - అందుకే ఆ మట్టి ఉప్పంగా, కారంగా ఉంటుంది.

మాసిన బట్టలను తడిపి చవుడుమట్టిలో పొర్లించి వాటిని కింది భాగంలో చిల్లులున్న పెద్ద బానలో(కుండ) వేసి మూతపెట్టి బిగించాలి. మరో పెద్ద బానలో సగంవరకు నీళ్ళు పోసి దాన్ని ప్రత్యేకంగా అమర్చబడిని పొయ్యిమీద పెట్టి మంట వెయ్యాలి. ఆ నీటి బాన మీద బట్టలు కుక్కిన చిల్లు బానను దొంతిలా పెట్టాలి. ఇప్పుడు నీటి కుండనుండి వెలువడే వేడివేడి నీటి ఆవిరంతా చిల్లుకుండలోనున్న చవుడు మట్టి పులుమిన బట్టలకు ఆవిరిచూరుకుంటుంది. ముప్పావు గంటదాకా అలా ఉండనిచ్చివ్వాలి. ఆ వేడి ఆవిరి కారమట్టిని తాకినప్పుడు రసాయనపరమై అభిక్రియ, ప్రతిక్రయలు జరిగి బట్టల్లోని మురికిని వీడకొట్టేస్తుంది. అందులోనుండి బట్టలను బయటకు తీసి అవసరమైనంత మేరకు బండకేసి బాది, నీళ్ళల్ళో జాడించి ఎండలో అరబెట్టాలి.

అలా ఉతికి ఆరబెట్టిన తెల్ల దోవతులు ఎంత తెల్లగా ఉంటాయంటే కొంగలు, బాతులుకూడా ఆ తెలుపును చూసి సిగ్గుపడిపోతాయంట - ఇది చాకలి వారి నైపుణ్యాన్ని ౘాటి చెప్పే పాటలో మెరిసే కవిత్వం.

ఈ విధంగా బట్టలుతికే పద్ధతిని ఎల్లాయి లేదా వెల్లావి ఉంటారు.
వెల్ల + ఆవి(రి) = వెల్లావి.
వెల్లావి --> ఎల్లాయి
వెల్ల అంటే తెలుపు అని అర్థం ఉంది కదా! పెయింట్లు రాకుమునుపు ఇంటి గోడలకు తెల్ల సున్నపు రాళ్ళను తెచ్చి వెల్ల వేసేవాళ్ళం కదా? ఇళ్ళ గోళ్ళకి వేసేది సున్నమే అయినా రంగు తెలుపు కాబట్టి వెల్లవెయ్యడం అన్న మాటొచ్చింది.

దీన్ని అరవలోకూడా వెళ్ళావి అనే అంటారు - ఇటీవల వచ్చిన ఒక సినిమా పాటలో కూడా తెల్లగా ఉన్న నాయికి తెలుపును నాయకుడు పొగుడుతున్నట్టు ఒక సినీకవి ఇలా రాశాడు “అరే, నిన్ను వెల్లావి పెట్టి తెల్లగా చేశారా, ఎండకన్నే సోకనివ్వకుండా పెంచారా...” (పాట లింకు మొదటి కమెంట్‍లో).

డిటెర్జెంట్‍లు, బట్టలుతికే మిషిన్‍లు, కార్పరేట్ లాండ్రీ సర్వీసులు వచ్చాక చాకలి వృత్తి, చాకలి కులం లేకపోవడం లాంటి మంచే జరిగింది. దాంతోబాటుగా వెల్లావి అన్న మాట, ఆ ప్రక్రియలు మరుగయ్యాయి.

ఊళ్ళో అందరి బట్టలూ ఒక్కటిగా కలిపేసి తీసుకెళ్ళినా ఉతికాక తిరిగి ఇచ్చేప్పుడు ఎవరింటి బట్టలు వాళ్ళకు సరిగ్గా ఇచ్చేవాళ్ళు. పొరపాటే జరగదు. నేడు కార్ప్రేట్ లాండ్రీ సర్వీసుల్లో మాదిరిగా బట్టలకు TAG లు అవి ఏమీ వేసేవాళ్ళు కారు. అయినా వాళ్ళకి తెలుసు ఏ బట్ట ఎవరింట్లోనిదో. ఈ సామెత అందుకే పుట్టుకొచ్చి ఉంటుంది - “చదువుకున్నోడికంటే చాకలో‍డు మేలు” అని!
ఇంతా చదివాక పనికి రాని చెత్తంతా చదివించావురా బాబూ అనుకుని నిట్టూర్చే వాళ్ళకోసం - తెల్ల దోవతులను ప్రస్తావించి రాయలువారు, పెద్దన రాసిన పద్యాలు చదివి పుణ్యం, పరమార్థం అనిపించుకోండి. 

మత్తేభము:
తలఁ బక్షచ్ఛట గ్రుచ్చి బాతువులు కేదారంపుఁ గుల్యాంతర
స్థలి నిద్రింపఁగఁ జూచి యారెకు లుష స్స్నాతప్రయాతద్విజా
వలి పిండీకృత శాటిక ల్సవి దదావాసంబుఁ జేర్పంగ రే
వుల డిగ్గ న్వెసఁ బాఱు వానిఁ గని నవ్వు నాలిగోప్యోఘముల్.
[ఆముక్తమాల్యద, ప్రథమాశ్వాసము, 65‍‍]
సీ… … …
తేటగీతి:
ఫల సమిత్కుశ కుసుమాది బహుపదార్థ
తతియును, ‘ఉతికిన మడుఁగుదోవతులున్’ గొంచు
బ్రహ్మచారులు వెంటరా, బ్రాహ్మణుండు
వచ్చు నింటికిఁ బ్రజ తన్ను మెచ్చి చూడ!
[మనుచరిత్ర, ప్రథమాశ్వాసము, 54]

23 ఏప్రిల్ 2014

ప్రేమ డైరీ - 005

డియర్ చెల్లం,

"నీ పలుకుల తొలి కిరణాలు సోకకుంటే  మనసుకి పొద్దు పొడవదు." - ఫోటో వెనుక నువ్వు రాసిన మాటల్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ నిన్ను చూస్తూ ఉన్నాను.

నా చీకటి జీవితాన్ని వెలుగులతో నింపేసినవి ఈ కళ్ళేనా? ఈ చిన్ని పెదాలేనా నా ప్రాణాన్ని తాగేయాలని తహతహలాడేవి? ఆ చూపులు చూడు! నాకంటూ నన్ను మిగల్చకుండ దోచుకెళ్ళాలనే ఆత్రం! హృదయాన్ని తాడుకట్టి "భావ"సాగరం చిలికేస్తున్నది నీవేనా? 

పూర్వ కవులెందరో రాసిన ప్రణయ భావాలన్నీ వట్టి మాటలుకావని నేర్పావు. లేని నా రాకుమారికై ఏకాంతంలో నేను అల్లుకున్న కలలహారాలు నీకెలా దొరికాయి? హారాలకు మరింత అందం చేకూరేలా అలంకరించుకుని నా వలపు వాకిట ఎదురొచ్చావు!

మనం పరిచయం అయిన తొలి రోజులు - అలా అలా మాయమాటలేవో చెప్తూ కంటికి కనబడే దూరంలోనే ఆగిపోతావు. అచ్చంగా బయటపడనేపడవు! చున్నీతో ఎదను కప్పేసినంత సులువుగా మొండితనంతో మనసుని కప్పేసుకుంటావు. ఇంత ఆత్మనియంత్రణనెలా అలవరుచుకున్నావో! ఇలాంటప్పుడే అనిపిస్తుంది.. నువ్వు చెప్పినవాటివల్లకన్నా, దాచిన వాటివల్లే నీ మనసునెక్కువగా అర్థంచేసుకున్నాను. నీ మాటలకంటే నీ మౌనాలే ఎక్కువ చెప్తాయి నీ భావాలేంటో అని! 

మంచుముద్ద అమ్మాయిరూపందాల్చినట్టు ఉంటావు. గాఢనిద్రసమయం మినహాయించి మిగిలిన అన్ని క్షణాల్లోనూ ఏదో ఒకరకంగా నిండిపోయుంటావు. ఏకాంతంలో చిలిపితలపులుగా, ప్రేమపొంగినపుడు భావాల తరంగాలపై ఉయ్యాలూపే చిరుగాలిగా, మనోవికార సమయాల్లో జోలలుపాడే తల్లిగా!  

పవలూ, రేయీ తేడా లేదు నీ మాయలో. కళ్ళు తెరుచున్నంతసేపూ చుట్టూ కాంతే తప్ప చీకటికి తావేలేదు.

నడిచే దారుల్లో ఊగే కొమ్మల్లోని లేత ఆకులన్నీ నీ బుగ్గల్ని గుర్తుచేస్తాయి. పువ్వులమ్మే ముసలావిడ తట్టనెత్తినబెట్టుకుని వస్తుంటే తొంగి చూసేమల్లెపూలు నీ కురులను తలపిస్తాయి. తొలిచినుకులు నేలతాకగానే వచ్చే మట్టివాసన నీ చేతులుపట్టుకున్న జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. నీ నవ్వులు విన్నప్పుడల్లా అప్పటికప్పుడు నా చుట్టూ రోజావనం! రంగురంగుల గులాబీలు.

నా పాలిట వరానివా? శాపానివా?

వరాలుగా ఎన్నో తీయని క్షణాలున్నాయి, అలరించే జ్ఞాపకాలున్నాయి.

కొన్ని శాపాలు తప్పవా? ఇన్నీ ఉన్నా... దగ్గరగా తీసుకుని నీ పెదాలలో నా ప్రాణంపోసి, పులకించిపోయే క్షణం రాదు. ఒడిజేర్చుకుని నీ ఏడుపుని నా కళ్ళతో ఏడ్చి నీ వేళ్ళతో ఓదార్పుని అందుకోవడం కుదరదు. నా చేతి రేఖలు నీ వంపుల్లో ముద్రలుగా నిలిచిపోయే తారీఖెప్పుడూ?


* * * * * * * * * * * * * * * * * * * * * * * 

11 ఏప్రిల్ 2014

ప్రేమ డైరీ - 004

నల్లోడా,

వస్తూ వస్తూ ఏం తీసుకొచ్చావని 

వెళ్తూ ప్రతిసారీ నా ప్రాణాలు తీసుకెళ్తావ్?
ఈ కొండంత విషాదం కన్నీళ్ళుగా కరిగేదెప్పుడో!
తిరిగి నే మనిషినయ్యేదెపుడో!
 

రెండురోజులింత తొందరగా గడిచి పోతాయి అనుకోలేదు. ఈ కొన్ని జ్ఞాపకాలను మళ్ళీ నువ్వు వచ్చేంతవరకు పదిలపరుచుకోవాలి. 

సోమేశ్వరుడు గుళ్ళో దణ్ణం పెట్టుకున్నప్పుడు నీ పక్కన నిల్చున్నాను. బొట్టుపెట్టాలని చేయి తెగ ఆరాటపడిపోయింది. ప్రదక్షిణం చేసేప్పుడైనా నిన్ను దాటుకునే వంకతో అలా తాకించి వెళ్ళిపోవాలనుకున్నాను. కుదర్లేదు... నువ్వూ కుదుర్చుకోవాలనుకోవు... మొద్దు రాచ్చిప్పవి... కొండదిగేప్పుడు పిలవని చుట్టంలా వచ్చిన వాన చినుకుల్లో తడిసిపోయాము. వర్షని గుండెలకు హత్తుకుని వాళ్ళమ్మ దాని తల తుడుస్తుంటే నిన్ను కూడా అలా లాక్కుని నీ తల తుడవాలనిపించింది. నువ్వు వేళ్ళతో తల తుడుచుకుంటుంటే నేను చున్నీ చేతబట్టుకుని మౌనంగా చూస్తూ ఉండిపోయాను. నీ తలనుండి చెదిరిన చుక్కలు నా మొహంమీద పడ్డాయి. నువ్వే తాకినంత పులకింత! 

తెలుసా వర్షకి అన్నీ నీ పోలికలే. మేనమావ పోలికలెక్కడికి పోతాయిలే! రంగు మాత్రమే వాళ్ళ నాన్నది. కళ్ళూ, ముక్కూ, నుదురు, పొడవాటి వేళ్ళూ, బుగ్గలూ, పెదవులూ... దానికి ఎన్ని ముద్దులు పెట్టేశానో! నిన్నెప్పుడు ముద్దు పెట్టుకుంటాను?


* * * 

07 ఏప్రిల్ 2014

పాత సూత్రంలో కొత్త ముడులు పడవా?

"జీవితం వృత్తంలాంటిది, మరి ముగిసినచోట మళ్ళీ మొదలయ్యేనా?"
అభిప్రాయభేదాలతో విడిపోయాయి ఆ జంట పక్షులు. ఒంటరితనాన్ని మోసుకుంటూ ఆలోచనల ఆకాశంలో ఎగురుతున్నారు. వియోగంలోని బాధ భేదాలను క్షమించమని బ్రతిమాలుతుంది. "శహన"లో ఈ అందమైన అరవ సాహిత్యాన్ని ఆస్వాదించండి.


https://www.youtube.com/watch?v=eZa4H7EUF5Y - Tamil Version (Vairamuthu Lyrics)
https://www.youtube.com/watch?v=5aP2cjg-9FQ -  Telugu version (AM Ratnam Lyrics)

సాహిత్యం : వైరముత్తు  
Here is my loose translation of original lyrics
అతడు :
ప్రియా కుశలమా
నీ కోపాలు కుశలమా
కంటిపాప కుశలమా
కంటనీరు కుశలమా

బుగ్గలు రెండూ కుశలమా
వాటిపై నా చివరి ముద్దులు కుశలమా
నీ పానుపు కుశలమా
(పరుపైన) ఒక్క తలగడా కుశలమా
ఆమె :
ప్రియా కుశలమా
నీ తాపాలు కుశలమా
సఖుడా కుశలమా
నీ ఒంటరితనం కుశలమా
ఇల్లు వాకిలి కుశలమా
ఇంటితోట కుశలమా
పువ్వులన్నీ కుశలమా
నీ అబద్ధాలు కుశలమా
కిటికీ చువ్వలకంటుకున్న
నా కన్నీటిచుక్కలు కుశలమా
నీ ఇంటి మండువాలో వినిపించే
నా పట్టీల సవ్వడి కుశలమా

అతడు :
ప్రియా నిన్ను విడాను
నా చిత్తం చెడిపోయాను
వెలుగులో ఏడిస్తే నామోషీయని
దీపాలు ఆపేసి ఏడ్చాను

ఆమె :
ప్రియా నిన్ను ద్వేషించి
నా తెలివితేటలను తగలబెట్టాను
బంధం విలువ వియోగంలో గుర్తించి
సగంప్రాణం అయ్యాను
అతడు :
పాత దండల్లో కొత్తపువ్వులు పూయవా?

ఆమె :
పాత సూత్రంలో కొత్త ముడులు పడవా?
అతడు :
జీవితం వృత్తంలాంటిదైతే
ముగిసినచోట మళ్ళీ మొదలవ్వదా?

------------------
గాయకులు : శ్రీనివాస్, సాధనా సర్గం
సంగీతం : AR Rahman (రహ్మాన్)
చిత్రం : పార్తాలే పరవశం ( తెలుగులో : పరవశం)
డైరెక్టర్ : K.Balachander

--------------------
Tag Words : Tamil Lyrics - Telugu translation, anbe sugama song, cheliyA kuSalamA, చెలియా కుశలమా, పరవశం, పార్తాలే పరవశం, parthale paravasam

20 మార్చి 2014

ప్రేమ డైరీ - 003

చిన్నా,

నువ్వు కేవలం ఒక గొంతువా?
 
నాకు నేను కల్పించుకున్న భ్రమవా, మాయవా?

అచ్చం నిజంలా అనిపించే ఒకట్రొండు రోజుల కలల్లో మాత్రం సరిగా చూసేలోపే కనుమరుగయ్యే రూపానివా?

నేన్నిన్ను చూడటం, నేరుగా మాట్లాడ్డం అన్నీ కల్పనలు, ఊహలు కదా?
 
ఏ లోకం నుండో నన్ను రోజూ పలకరించే ఆకాశవాణివా? ఇంతకీ నువ్వు అబద్ధమా, నేనా?


నీ ఫోటోని పదే పదే చూసుకుంటూ ఉన్నాను. జలజల రాలిపోయే కన్నీళ్ళనేం చేసుకోను? నీ వేళ్ళెక్కడ?

ఈ ఫోన్ స్క్రీన్ ఏం పుణ్యం చేసుకుందో? నీకివ్వాల్సిన వాటా అంతా నా పెదవులు అప్రయత్నంగా ఈ ఫోన్ స్క్రీన్ మీద కుమ్మరించేస్తున్నాయి.

నిన్నెప్పుడు చూస్తాను? నిన్నెప్పుడు దగ్గరకి తీసుకుంటాను?

* * *
 
తంగమ్మా,
నువ్వూ అబద్ధం కాదు, నేనూ అబద్ధం కాదు. భౌతికమైన దూరం అలాంటొక భ్రమని, మాయనీ కలిగిస్తుంది. ఈ వీకెండ్ మేము ఊరికి వస్తున్నాము. ఈ శనివారం నీ స్కూల్ కి సెలవుంటే బాగుండు. ఇక్కణ్ణుండి నీకు ఏం తీసుకురమ్మంటావు? 

* * * 


చిన్నా
నిజమా? నువ్వొస్తున్నావా? వచ్చినా ఏంలాభం? మనకి ఏకాంతం దొరకదుగా? అందుకే అంటాను నిజమైన నువ్వు నాకు అబద్ధం అని. నీ అబద్ధమే నాకు నిజం. నువ్వు నిజంగా ఇక్కడికొస్తే I miss your అబద్ధాలు which are relatively true and permanent for me. అందుకే భయం అన్నాను నిన్న.

నువ్వు రావడంకంటే నాకేం కావాలి? అయినా ఒకటి కావాలి నాకు... మొన్న మెరినా బీచ్ లో ఆడుకుంటూ వర్ష నీ ఒడిలో పోసిన ఇసుక తీసుకురా దాచుకుంటాను.

* * *